సంకటంలో సర్కారు
ఆ రోజు 1929 అక్టోబర్ 21. అప్రూవర్‌గా మారిన జైగోపాల్ కోర్టులో సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. అతగాడు విట్నెస్ బాక్సు ఎక్కుతూనే పొగరుగా మీసం మెలివేశాడు. సాక్ష్యం మొదలుపెడుతూనే భగత్‌సింగ్‌నూ, అతడి సహచరులనూ దుర్భాషలాడసాగాడు. చూస్తున్న జనం సిగ్గు సిగ్గు అని అరిచారు.
నిందితులు అందరిలోకి చిన్నవాడు ప్రేమ్‌దత్ వర్మ. తెగబడిన ద్రోహి ఆగడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. కాలి చెప్పు తీసి జైగోపాల్ మీదికి విసిరాడు.
అందరూ అవాక్కయ్యారు. కోర్టు ప్రొసీడింగ్సు ఆగిపోయాయి. చెప్పు విసిరిన వర్మకు అక్కడికక్కడే మూడు నెలల ఒంటరి నిర్బంధం శిక్ష విధించారు. ‘ఈ దౌర్జన్యకారులు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియకుండా ఉంది. కోర్టులోని అందరి ప్రాణాలకు ముప్పు ఉంది. విచారణ వాయిదా వేయండి’ అని అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటరు.
దానికి మేజిస్ట్రేటు స్పందించేలోపే భగత్‌సింగ్ కలగజేసుకుని, ‘ఇక్కడ జరిగిన దుస్సంఘటనకు మేము విచారిస్తున్నాం. నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. దీనితో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి స్పష్టం చేస్తూ మేము స్టేట్‌మెంటు ఇవ్వాలనుకుంటున్నాం’ అన్నాడు. మేజిస్ట్రేటు అవకాశం ఇవ్వలేదు. వారు చెప్పదలచుకున్న దాన్ని మేజిస్ట్రేటు రికార్డు చేయనప్పుడు నిందితులకు ఉన్నది ఒకటే దారి. ఒక వ్యక్తి చేసిన పనితో తమకు ఎలాంటి ప్రమేయం లేదు, అటువంటి దుశ్చర్యను తాము సమర్థించడం లేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం - అంటూ రాతపూర్వకంగా స్టేట్‌మెంటు కోర్టు ముందు ఉంచారు.
అంత స్పష్టంగా వారు తమ వైఖరిని ప్రకటించాక, జరిగిన తప్పిదానికి వారిని దండించటంలో అర్థం లేదు. మేజిస్ట్రేటు అలా అనుకోలేదు. ‘ఇవాళ ఇక విచారణ లేదు. వీళ్లను జైలుకు తీసుకుపోండి. రేపు అందరి చేతులకు సంకెళ్లు వేసే కోర్టులో హాజరుపరచండి - అని ఉత్తర్వు వేశాడు.
‘ఇది అన్యాయం. ఈ ఆర్డరును వెనక్కి తీసుకునేంతవరకూ మేము కోర్టుకు హాజరయ్యేది లేదు’ అని కోర్టులోనే ప్రకటించాడు భగత్‌సింగ్.
కోర్టు విచారణ జరిగేది భగత్, దత్‌లను బంధించిన సెంట్రల్ జైల్‌లోనే కాబట్టి అప్పటి దాకా వారిని సంకెళ్లు లేకుండానే కోర్టుకు తీసుకెళ్లేవారు. బోర్‌స్టల్ జైలులోని మిగతా నిందితులను సంకెళ్లు వేసి సెంట్రల్ జైలుకు తెచ్చినా, కోర్టు హాలు చేరగానే వాటిని తీసేసేవారు. మరునాడు (అక్టోబర్ 22న) కోర్టు వేళ కాగానే భగత్, బటుకేశ్వర్ దత్‌లకు సంకెళ్లు వేయబోయారు. వారు కోర్టుకు వెళ్లటానికి నిరాకరించారు. బోర్‌స్టల్ జైలులోని 16 మంది నిందితులూ అలాగే చేశారు. పోలీసులు దౌర్జన్యంగా ఐదుగురిని వానులోకి ఎక్కించి పట్టుకెళ్లారు. కాని వారు గమ్యం చేరాక వాను దిగడానికి నిరాకరించారు. పోలీసులు వారిని బూతులు తిడుతూ చుట్టూ జనం చూస్తూండగానే లాఠీలతో బాదారు. గుంపు ఎక్కువ అవుతూండటంతో చేసేది లేక అదే వానులో ముద్దాయిలను వెనక్కి తీసుకెళ్లారు. నిందితులు హాజరుకానందువల్ల విచారణ వాయిదా పడింది. పోలీసు దౌర్జన్యం అంతా మరునాడు పత్రికలకెక్కింది. ప్రజల రక్తం మండింది.
మరునాడు జైలు సూపర్నెంటు ఓ బేరం పెట్టాడు. సంకెళ్లు వేసి తీసుకెళతాం. కోర్టుకు వెళ్లగానే వాటిని విప్పేస్తాం, ఒప్పుకోండి- అని బుజ్జగించాడు. విప్లవకారులు సరే అన్నారు. కాని పోలీసులు మాట తప్పారు. సంకెళ్లు వేసే కోర్టులో హాజరుపరిచారు. విప్లవకారులు ఎత్తుకు పైఎత్తు వేశారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో పోలీసులు నిందితుల చేతులకు బేడీలు తీసేశారు. అన్నం తిన్నాక మళ్లీ వేయబోయారు. నిందితులు ప్రతిఘటించారు. ఘర్షణ జరిగింది. ముద్దాయిలను లొంగతీయటానికి దుక్కల్లాంటి పఠాన్ పోలీసులను పిలిపించారు. వాళ్లొచ్చి ఎద్దుల్లా కుమ్మేశారు.
భగత్‌సింగ్ అంటే పోలీసులకు మహా కసి. అతడి మీద ప్రతాపమంతా చూపారు. ఎనిమిది మంది పఠాన్లు భగత్ మీద పడి లాఠీలతో గొడ్డును బాదినట్టు బాది, బూట్లతో తన్నారు. ఇదంతా అక్కడ ఉన్న జనం కళ్ల ముందే జరిగింది.
ఆకలి సమ్మె చేసిచేసి అసలే నీరసించి ఉన్న విప్లవకారులు పోలీసుల మూక దాడికి విలవిలలాడారు. శివవర్మ, అజయ్‌ఘోష్‌లు సొమ్మసిల్లారు. భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు తెగ రొప్పుతున్నారు. వారి బట్టల నిండా దుమ్ము. ఆ స్థితిలోనే పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి బోనులోకి నెట్టారు. నేల మీద పడుకున్న నిందితులను బరబర ఈడ్చుకెళ్లి, కొందరినైతే భుజాలపై ఎత్తుకుని మూటను విసిరినట్టు బెంచీల మీదుగా బోనులోకి విసిరేశారు - ఎముకలు విరుగుతాయేమోనని కూడా కానకుండా. నిందితులు ఒకరి మీద ఒకరు పడ్డారు. కొంతమంది స్పృహ కోల్పోయారు.
కోర్టు హాలులో ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని విప్లవకారులు అంత బాధలోనే నినాదాలు చేశారు. భగత్‌సింగ్ మేజిస్ట్రేటుని కోపంగా అడిగాడు. ‘మమ్మల్ని కొట్టమని పోలీసులకు మీరే ఆర్డరు వేశారా? లేక పోలీసుల మీద మీకే కంట్రోలు లేదా? మేము సాత్వికంగా నిరసన తెలుపుతూంటే వాళ్లు మమ్మల్ని తంతారా?’
మేజిస్ట్రేటు: మిమ్మల్ని ఎవరు తన్నారు?
భగత్‌సింగ్: ఇదిగో ఈ పోలీసులు ఒక్కొక్కడి మీద పెక్కుమంది కూచుని మా ఒళ్లంతా కుళ్లబొడిచారు.
బటుకేశ్వర్ దత్: మా మర్మావయవాల మీద కూడా తన్నారు. దీన్ని నాగరికత అంటారా మీరు?
విజయకుమార్ సిన్హా: నేను స్టేట్‌మెంటు ఇవ్వాలనుకుంటున్నా.
మేజిస్ట్రేటు: దానికి ఇంకా సమయం రాలేదు. కావాలనుకుంటే మీరు చెప్పదలిచింది రాసి ఇవ్వండి.
సిన్హా: నాకు 102 డిగ్రీల జ్వరం. రాసే స్థితిలో లేను.
భగత్‌సింగ్: మీరే మమ్మల్ని పోలీసుల చేత కొట్టించారు. ఇప్పుడు మా స్టేట్‌మెంటునీ రికార్డు చెయ్యరా? మా రెండు చేతులకూ సంకెళ్లు ఉన్నప్పుడు మేము ఎలా రాయగలం? అసలు మాకు సంకెళ్లు ఎందుకు వేయించారు?
మేజిస్ట్రేటు: మీ వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరికీ ప్రమాదం ఉంది కాబట్టి.
భగత్‌సింగ్: ఔనా? ఇప్పటికి మా వల్ల ఎంతమంది మరణించారు?
మేజిస్ట్రేటు: నాతో చర్చించాలనుకోకు. నేను నీతో వాదించను.
భగత్‌సింగ్: కొద్ది రోజుల కిందటే కదా మేము చక్కగా ప్రవర్తిస్తున్నామని మీరు మెచ్చుకున్నారు? ఒకడు చేసిన తప్పుకు మా అందరినీ ఎందుకు బాధ పెడుతున్నారు? నేను స్టేటుమెంటు రాసి ఇవ్వాలనుకుంటున్నాను. ఒక చేతి బేడీలైనా తీసేయిస్తారా?
మేజిస్ట్రేటు: ఇప్పుడు కుదరదు.
భగత్‌సింగ్: కంగ్రాచ్యులేషన్స్. మీరే దగ్గరుండి ఈ దౌర్జన్యమంతా మా మీద చేయిస్తున్నారు. శివవర్మ సొమ్మసిల్లాడు. అతడి ప్రాణం పోతే మీదే బాధ్యత.
నిండు కోర్టులో, మేజిస్ట్రేటు కళ్లెదుటే నీరసించిన ఖైదీల మీద పోలీసులు ఇంత కిరాతకంగా విరుచుకుపడటం అందరినీ నిర్ఘాంతపరచింది. కోర్టులో కలకలం రేగింది. ఆ దశలో పోలీసు సూపర్నెంటు పత్రికా విలేఖరులను బయటికి వెళ్లమన్నాడు. తరవాత విజిటర్లనూ అక్కడి నుంచి పంపేశారు.
[The Trial of Bhagat Singh, A.G.Noorani,
PP.109-112]
పత్రికల వారిని తరిమేసినంత మాత్రాన నిజం థాగలేదు. మరునాడు దేశంలోని అనేక ప్రధాన పత్రికల్లో కోర్టులో జరిగిన భాగోతం అచ్చయంది. మధ్యయుగాల బార్బేరియన్ల తరహాలో లాహోర్ ఖైదీల మీద అనాగరికంగా అఘాయిత్యాలు జరిగాయని ‘యంగ్ లిబరేటర్’ వంటి పత్రికలు సంపాదకీయ వ్యాఖ్యలు చేశాయి. కెనడా, జపాన్, పోలండ్, అమెరికా లాంటి దేశాల్లో కూడా లాహోర్ కోర్టులో పోలీసు కిరాతకం పట్ల నిరసన వ్యక్తమైంది. విప్లవకారుల పోరాట నిధికి ఆ దేశాల నుంచి విరివిగా విరాళాలందాయి. లండన్‌లోని పత్రికలు కూడా ఆగ్రహం వ్యక్తపరిచిన మీదట ప్రజా వ్యతిరేకతకు వెరచి, కోర్టులో సంకెళ్ల ఉత్తర్వును మేజిస్ట్రేటు ఉపసంహరించాడు.
ఇంకో రోజు విచారణ ముగిశాక కోర్టు ఆవరణలో పోలీసులు ఖైదీలను చితకబాదారు. కోర్టుకు హాజరు కాబోమని చెప్పినందుకు మరో రోజు జైల్లో భగత్‌సింగ్‌ను, ఇంకొందరిని బూట్లతో తన్నారు. కొట్టి, తన్ని వారికి చేతులు, కాళ్లు నెప్పి పెట్టాయేగాని విప్లవకారులను మాత్రం లొంగదీయలేక పోయారు. నిందితులను తాము ఎంతైనా కొట్టగలము, కావాలంటే చంపగలము: కాని వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారిని కోర్టులో హాజరుపెట్టటం మాత్రం తమ వల్ల కావటం లేదని పోలీసులు, జైలు అధికారులు ప్రభుత్వానికి చెప్పుకున్నారు. పశుబలాన్ని విప్లవకారుల సాత్విక నిరోధం జయించింది.
వారాలు, నెలలు తిరుగుతున్నా విచారణ ముందుకు కదలడం లేదు. నిందితులు కొన్ని రోజులు కోర్టుకు రావడమే లేదు. వచ్చిన రోజుల్లో కూడా ప్రఖ్యాత విప్లవకారుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ మృతికి, హంగేరీలో ఆకలి సమ్మె చేస్తూ మరణించిన రాజకీయ ఖైదీ మృతికి సంతాపం తెలపడం, ‘లెనిన్ డే’, ‘మేడే’ , ‘కాకోరీ డే’, ‘లాజపత్‌రాయ్ డే’ వంటివి జరిపి వాటి ప్రాశస్త్యాన్ని ఉగ్గడించటం, విప్లవ సిద్ధాంతాలను, విధానాలను వివరించడం, నినాదాలు చేయడం వంటి వాటికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. కాలం గడిచేకొద్దీ ప్రజల్లో విప్లవకారుల పట్ల సానుభూతి పెరుగుతున్నది. జనం ఊరుకోరన్న భయంతో దొంగ సాక్షుల్లో చాలామంది జారుకుంటున్నారు. కొంతమంది అప్రూవర్లు కూడా అడ్డం తిరుగుతున్నారు. దొంగ సాక్షులను ఎందరిని లైన్లో పెట్టినా సాండర్స్‌ను కాల్చిన వాడిగా భగత్‌సింగ్‌ను గుర్తుపట్టించే పనే ఇంకా తెమలలేదు. ఇలాగైతే విచారణ ఎప్పటికి ముగిసేను?
అక్కడికీ ప్రభుత్వం సంకటం నుంచి బయటపడేందుకు తోచిన ఉపాయాలన్నీ ప్రయోగించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 540-ఎ సెక్షను ప్రకారం - నిందితులు కోర్టు ముందు నిలబడటానికి అశక్తులైన సందర్భాల్లో, బలమైన కారణాలుంటే, కోర్టు హాజరీ నుంచి వారికి ఎప్పుడైనా మినహాయింపు ఇవ్వొచ్చు. వారి తరఫు న్యాయవాది ద్వారా పని జరిపించవచ్చు. కాని - నిందితులు తాము కోర్టుకు రాము అని మొరాయించినప్పుడు, ఆకలి సమ్మె కారణంగా కోర్టుకు హాజరు కాలేని స్థితిలో ఉన్నప్పుడు వారు లేకున్నా సరే అని విచారణ కొనసాగించటానికి చట్టం ఒప్పుకోదు. లాహోర్ కుట్ర కేసు తెమలాలంటే చట్టాన్ని మార్చటం ఒకటే దారి. ఘనత వహించిన తెల్లదొరతనం ఆ ప్రయత్నం కూడా చేసింది.
‘ఏ నిందితుడైనా కోర్టు ముందు హాజరు కాలేని విధంగా తనను తాను అశక్తుడిగా చేసుకున్న సందర్భాల్లో జడ్జి లేక మేజిస్ట్రేటు సదరు నిందితుడి తరఫున ప్లీడరు ఉన్నాడా లేడా అన్న దానితో నిమిత్తం లేకుండా, అతడు హాజరు అయ్యాడా లేడా అన్నది పట్టించుకోకుండా, అతడు లేకున్నా సరే విచారణ కొనసాగించవచ్చు’ అంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 540-బి అనే సెక్షనును చొప్పిస్తూ 1929 సెప్టెంబరులో పార్లమెంటులో బిల్లు పెట్టారు. లాహోర్ ఖైదీల ఆకలి సమ్మె మూలంగా వచ్చిన అవాంతరాన్ని దాటేందుకు ఉద్దేశించింది కాబట్టి దానికి ‘హంగర్ స్ట్రైకు బిల్లు’గా పేరు పడింది.
1929 సెప్టెంబర్ 12న సెంట్రల్ అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ జరిగినప్పుడు మోతీలాల్ నెహ్రూ తెల్లవారి దురాలోచనను ఎండగట్టాడు. ‘నిందితుడు లేకుండా విచారణ జరపడమంటే క్రిమినల్ లా ప్రాథమిక సూత్రాలనే తుంగలో తొక్కడమే. చట్టంలోని లొసుగును తొలగించాలనే నెపంతో మొత్తం క్రిమినల్ న్యాయం పునాదినే మీరు పెకలిస్తున్నారు’ అని ఆయన నిశితంగా ఖండించాడు. ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది మహమ్మదాలీ జిన్నా (అప్పటికి ఆయన పక్కా జాతీయవాది. పాకిస్తాన్ పిచ్చి ఇంకా పట్టలేదు) భగత్‌సింగ్ బృందాన్ని సమర్థిస్తూ చేసిన అద్భుత ప్రసంగాన్ని.
‘తనకు వ్యతిరేకంగా ఇస్తున్న సాక్ష్యాలేమిటో నిందితుడు ఆలకించకుండానే, క్రాస్ ఎగ్జామినేషనుకు అవకాశం ఇవ్వకుండా నిందితుడి పరోక్షంలో మేజిస్ట్రేటు ఎక్స్‌పార్టీ విచారణ చేస్తే అది న్యాయం కాదు - ప్రహసనం! నిందితులు కావాలనుకుంటే కోర్టుకు హాజరు కావచ్చు కదా అని మీరంటున్నారు. బాగానే ఉంది. ఆ రకంగా లాహోర్ కేసులో జరుగుతున్న ఆకలి సమ్మె నడ్డి విరగగొట్టాలని మీరు అనుకుంటున్నారా? మీకు బాగా తెలుసు. ఈ మనుషులు చావుకు సిద్ధపడ్డారు. ఇది తమాషా కాదు. ఎవడు పడితే వాడు ఆకలితో మాడి మరణాన్ని వరించలేడు. లా మెంబరుగారూ, కావాలనుకుంటే ఆకలి సమ్మె ఎలా ఉంటుందో కొంచెం ప్రయత్నించి చూడండి. మీకే తెలుస్తుంది. హంగర్ స్ట్రైక్ చేసేవాడికి ఒక అంతరాత్మ ఉంటుంది. దాని ప్రేరణనుబట్టే అతడు నడుస్తాడు. అతడిని మామూలు క్రిమినల్‌గా చూడకండి’ అని జిన్నా విప్లవకారుల అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ గొప్పగా మాట్లాడాడు. ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా సభ్యులు ప్రతిపాదించిన వాయిదా తీర్మానం ఎనిమిది ఓట్ల తేడాతో నెగ్గింది. సభ మూడ్‌ను, సభ్యుల ఆక్షేపణలోని పదునును, ప్రజాభిప్రాయ తీవ్రతను గమనించి ప్రభుత్వ పక్షం తోక ముడిచి బిల్లును పక్కన పెట్టింది. నత్తనడక నడుస్తున్న కేసు విచారణను త్వరితం చేయడానికి తెల్ల సర్కారు ఇంకో ఎత్తు వేసింది. సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మొత్తం సాక్షులందరినీ విచారణ చేయనక్కరలేదని మేజిస్ట్రేటును ఆదేశించి, కేసు త్వరగా తెమిలేట్టు చేయమని అభ్యర్థిస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 561 సెక్షను కింద ప్రభుత్వ లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. అది అయ్యే పని కాదంటూ డివిజను బెంచి కొట్టిపారేసింది.
సంకటంలో సర్కారు
ReplyDeleteదయచేసి స్క్రోలింగ్ లో టైపో లను క్రింది విధంగా సరి చేయండి.
ReplyDeleteమన చేతలపై ఆధారపడి ఉంది
పూర్వం కంటే దేదీప్యమానంగా
భారత మాతను చూడండి
ధన్యవాదాలు. సరిచేయటం జరిగినది. మీ పేరు?
Deleteపూర్వం
Deleteచూడండి
ఇంకా సరిచేయబడలేదు
చూడండి
సరిచేసాను. మీరు ఎవరో తెలుసుకోవచ్చా?
Deleteశ్రీ రంగ
Deleteవిజయవాడ
Thank you ranga garu.
Delete