Breaking News

నేను అదే! నా లోపలా అదే!నా బయటా అదే!


నేను అదే! నా లోపలా అదే!నా బయటా అదే!
-బ్రహ్మశ్రీ డా చాగంటి కోటేశ్వరరావు గారు..
(విద్య - విలువలు)

ఈ పని చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అందుకని ఈ పని చేయను. శక్తి లేక కాదు. ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాను. ఏది చేస్తే మా నాన్నగారు బాధపడతారో అది చేయను. ఏది చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారో అది చేస్తాను. వశవర్తి అంటే అదీ. అదే ఆధ్యాత్మికత. అది క్రమ క్రమంగా పరిణతి చెందాలి. మీరు రేపు ఓ గొప్ప ఉన్నతాధికారో, జిల్లా అధికారో అయినప్పుడు- పుష్కరాలొస్తున్నాయి ఏంచేయాలని ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాబోటి వాళ్ల చుట్టూ తిరిగే పరిస్థితిలో మీరుండకూడదు. పుస్తక పఠనం అలవాటైతే మీకు ఆ అవసరం రాదు. మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా, భగవంతుడి కోసం, పదిమందిని సంతోష పెట్టడం కోసం బతకడం రావాలి. అదీ ఆధ్యాత్మిక పరిణతి అంటే..!

పరమేశ్వరుడు తప్ప మరొకటి లేదు. భూమి ఆయనే, గాలి ఆయనే, నీరు ఆయనే, నిప్పు ఆయనే. ఆయనే సూర్యుడు, చంద్రుడు, జీవుడు. ఆయన కానిదేముంది? నా ఎదురుగుండా ఉన్నదదే, నేను అదే, నాలో ఉన్నదదే. నాకు బయట ఉన్నదదే. ఉన్నది ఒక్కటే అన్న భావనతో జీవితం పూర్తయిపోతే... ఆ పరిణతికి ముగింపు.

ఇలా ఇప్పటివరకు మనం వ్యక్తిత్వ వికసనంలో చెప్పుకున్న ఐదింటిని నిరంతరం పరిశీలన చేసుకుంటూ ఉంటే... ఆగిపోవడమన్నది ఉండదు. వీటిలో మొదటిది ఆరోగ్యం. నాకు ఎన్నేళ్లు వచ్చాయన్నది ప్రశ్న కాదు. ఆరోగ్య పరిరక్షణ కోసం వయసుకు తగిన వ్యాయామం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. రెండవది అధ్యవసాయం (మెంటల్లీ అలర్ట్)- నాకు 90 ఏళ్లు అనుకోండి. ఆ వయసులో సమాజానికి ఏం చేయవచ్చో నాకో స్పష్టత ఉండాలి. మూడవది సునిశిత ప్రజ్ఞ-నా అనుభవాన్ని, నా చదువును దృష్టిలో పెట్టుకుని సునిశిత ప్రజ్ఞతో ప్రకాశించాలి. నాలుగవది ఆవేశంలో సమతౌల్యత. దీనివల్ల నా వృద్ధిని, సమాజాభివృద్ధిని నేను సమన్వయం చేసుకోవాలి. చివరిది - ఆధ్యాత్మికత. దీనిలో నిరంతరం పురోభివృద్ధి పొందుతూ ఉండాలి.

ఈ ఐదూ ఉంటేనే వ్యక్తిత్వ వికసనం అంటారు. ఇసుక, ఇటుక, సిమెంట్, నీరు... ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పుడు కాలితో, వేలితో కదిపినా చెరిగిపోతాయి. కానీ అవన్నీ కలిపి కట్టే గోడను నేనొక్కడినే కాదు, మనందరం కలిసి నెట్టినా పడిపోదు, గట్టిగా ఉంటుంది. ఈ విధమైన స్థిరమైన స్థితి పొందితే వికసనం పొంది ఉన్నాడని అర్థం. అటువంటి వ్యక్తి ఎక్కడున్నా సమాజ అభ్యున్నతికి, తన అభివృద్ధికి, తన కుటుంబ అభివృద్ధికీ కారణమౌతాడు.

‘‘నువ్వెవరు? నీది ఏ కులం? నీ తల్లిదండ్రులెవరు? నీకు ఐశ్వర్యమెంత ఉన్నది? ఎంత చదువుకున్నావు? అన్న విషయాల కన్నా నీ నడవడిక ఎలా ఉంటుంది? నీవు పెద్దల దగ్గరికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు? నీ కన్నా తక్కువవాడు కనబడితే ఎలా సమన్వయం చేసుకుంటావు? నీతో సమానులు కనబడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు? వీటిలో నీ ఆచరణను బట్టి నీ శీలాన్ని నిర్ణయం చేస్తారు - అంటుంది రామాయణం.

శీలం అంటే స్వభావమని అర్థం. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక స్వభావంతో ఉంటాడు. ఒక తల్లికి ఒకే సమయానికి పుట్టిన కవల పిల్లలు కూడా ఒకే స్వభావంతో ఉండరు. ఒకరు ఒకటి ఇష్టపడితే ఇంకొకరు వేరొకదానిని ఇష్టపడతారు. లోపల స్వభావం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనిషి నడవడిక కూడా ఉంటుంది. స్వభావం పుట్టుకతో వస్తుంది. కానీ పుట్టుకతో వచ్చిన స్వభావం సత్సంగం చేత, నీవు ఆచరించే మంచి పనుల చేత, మంచి గుణాల చేత, మంచి మాటలు వినడం చేత మారుతుంది.

‘‘నా చెవులు ఎప్పుడూ భద్రమైన మాటలు వినుగాక’’ అంటుంది శాస్త్రం. అంటే ‘‘ఏ మాటలు వినడం చేత నా స్వభావంలో మార్పు కలుగుతుందో, నా మనసును ప్రభావితం చేస్తాయో, ప్రభావితమైన మనసు ఆ సంకల్పం చేస్తుందో, ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తిస్తేనే నాకు కీర్తి కానీ, అపకీర్తి కానీ కలగడమనేది జరుగుతుంది. కనుక నా ప్రవర్తన పదిమంది చేత గౌరవం పొందడానికి యోగ్యమైన రీతిలో మనసును ప్రచోదితం చేయగల మంచి మాటలు మాత్రమే నా చెవులయందు పడుగాక !’’ అని.

‘‘ఒకవేళ నా చెవులు అన్నిటినీ విన్నప్పటికీ, నా మనసు మాత్రం సారవంతమైన మాటలను మాత్రమే పుచ్చుగొనుగాక! దానిచేత ప్రభావాన్ని పొందిన మనసు సత్సంకల్పాలను ఇచ్చి, బుద్ధి నిర్ణయం చేసి తదనుగుణమైన ప్రవర్తన చేత నేను శోభిల్లెదను గాక’’ అని దేవతలను మనం ప్రార్థన చేస్తాం. అందుచేత శీలం అనేది అత్యంత ప్రధానమైన విషయం. అది స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, శీలమే గొప్ప సంపద. ఎవరు శీలవంతులో వారి శరీరం వెళ్లిపోయినప్పటికీ కూడా వారి నడవడికను ఆదర్శంగా యుగాల తరువాత కూడా చెప్పుకుంటారు.

రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించాడు. దాని తరువాత ద్వాపరయుగం వచ్చింది. తరువాత కలియుగం వచ్చింది. అయినా మనుష్యుడు-ప్రవర్తన-నడవడిక-శీలం- జీవితం-ఆదర్శం వంటి విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు రాముడినే ఉదాహరణగా చెబుతారు. రాముడిలా బతకండి అని చెబుతారు.

1 comment:

  1. నేను అదే! నా లోపలా అదే!నా బయటా అదే!

    ReplyDelete