వనితా... వందనం
యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా...అని వేదాలు ఘోషించాయి.. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు ఉంటారనికదా అర్థం. ఔను చాలామందికి ఈ విషయం తెలుసు.
*** ఇంట్లో ఇల్లాలు చదువుకున్నట్లయితే పిల్లలు విద్యాబుద్ధులతో ఎదుగుతారని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతారు. ఈ విషయం కూడా చాలామందికి తెలుసు.
*** సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తే ఆ సమాజం ప్రగతిపథంలో దూసుకుపోతుందని అంటారు. దీనినీ అందరూ అంగీకరిస్తారు..
*** ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. మనవాళ్లూ ఈ విషయాన్ని ఒప్పుకుంటారు.
*** ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు భారత రిపబ్లిక్ దినోత్సవాన మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నొక్కిచెబుతూ తన విషయంలో సతీమణి మిషెల్లీ ఎలా బాధ్యతగా వ్యవహరిస్తుందో, తన ఎదుగుదల వెనుక ఆమె ఎంత కృషి ఉందో చెప్పారు. ఆ విషయం విన్న ఆహూతులు చప్పట్లతో ఆయనను ప్రోత్సహించారు...ఇదికూడా చాలామంది చూశారు. విన్నారు.
*** మన ప్రధాని నరేంద్రమోదీ మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి వివిధ రంగాల్లో కల్పించాల్సిన అవకాశాలను వల్లెవేశారు. ఆడపిల్లల్లి చదివించాలని కొత్తకొత్త పథకాలు తీసుకొచ్చారు. నిజమేకదా.. తన విజయం వెనుక సతీమణి సునీత త్యాగం ఉందని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. జనం జేజేలు పలికారు. వినడానికి ఇదంతా బాగానే ఉన్నా సమాజంలో మహిళలకు అంత గౌరవం దక్కుతోందా, అంత భద్రత లభిస్తోందా, అన్ని అవకాశాలు దక్కుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. నిర్భయ సంఘటనలే అందుకు ఉదాహరణ. పచౌరీలు, తివారీల తిక్కచేష్టలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రాని అలాంటి సవాలక్షమంది దురాగతాలను వౌనంగా భరిస్తున్న అతివలు ఎందరో ఉన్నారు. మహిళల బలవన్మరణాలే అందుకు నిదర్శనం. విసిగివేసారిపోయిన అతివల ఆక్రందనలే అందుకు ఉదాహరణ. అందుకే హక్కులకోసం, అవకాశాలకోసం, సాధికారతకోసం, స్వావలంబనకోసం ఎలుగెత్తి నినదించిన మహిళల పోరాటనికి ఓ గుర్తుగా ప్రారంభమైంది...ఈ ప్రపంచ మహిళా దినోత్సవం. సమాజంలో మగవారికి దీటుగా మహిళలకు సమాన అవకాశాలు, హక్కులు, వేతనాలు, కనీసం మాటామంతీ విషయంలోనైనా లభిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుచేత. అక్షరాస్యత లేకపోవడం, చదివించాలన్న ఆసక్తి, అవసరం లేదని తల్లిదండ్రుల్లో లోపించడం, పెళ్లిచేసి పంపేస్తే బాధ్యత తీరిపోతుందన్న ఆలోచనా విధానం, కట్లుబాట్లు, సంప్రదాయాలు మనదేశంలో మహిళలు ముందడుగు వేయడానికి అవరోధంగా మారిపోయాయి. అయితే గత పదేళ్లలో సమాజంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, మానసిక పరిపక్వత, పోరాటంవల్ల కొన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. పల్లె అయినా, పట్టణమైనా అవకాశం వస్తే చాలు మగవారికి తామేమీ తీసుకుపోమని చాటి చెబుతున్నారు. వారి విజయం మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇది గ్రహించిన మహిళలు పోరాటంతోనే హక్కులు లభిస్తాయని ఉద్యమించారు. 1911నాటికి అది ఓ రూపంలోకి వచ్చింది. ఇప్పుడది ప్రపంచ మహిళల దినోత్సవంగా మారింది. మార్పు మొదలైంది.. గత పదేళ్లతో పోలిస్తే ప్రపంచంలో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అంతరిక్షంలోను, భూగోళంపైనా వారు తిరుగులేని విజయాలు సాధిస్తున్నారు. రాజకీయంగాను, ఆర్థిక రంగాల్లోనూ వారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే రక్షణ రంగంలోనూ వారు తమ పాత్రను పోషిస్తున్నారు. మహిళంటే కేవలం ఇంటిపని చేసుకునే యంత్రాల్లా మిగిలిపోకుండా వారిలో దాగి ఉన్న ప్రతిభకు పట్టంకట్టే రోజులు మొదలయ్యాయి. అలా విజయాలు సాధిస్తున్న మహిళలగురించి చెప్పుకోవాలంటే ఓ చందాకొచ్చర్, ఓ అరుంధతీ భట్టాచార్య, హంపి, పి.వి.సింధుల ప్రస్తావనే అక్కర్లేదు.. ఓ సైనా నెహ్వాల్ పేరే చెప్పుకోనక్కర్లేదు. ఓ సానియామీర్జా పేరే తెలిసుండక్కర్లేదు. ఓ మారుమూల పల్లెలో, ఓనమాలు నేర్వని, బయటి ప్రపంచానికి తెలియని మహిళలు, సామూహికంగా సాధిస్తున్న ప్రగతి, ప్రయోగాలు బహిర్గతం కాకపోవడంవల్ల పదిమందికీ తెలియడం లేదు. కానీ వారు సాధిస్తున్న ఫలితాలు చూస్తే ఈ సమాజంలోని మగధీరులు నివ్వెరపోవలసిందే. కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు సహకార పాల సొసైటీ సాధించిన విజయాలు స్ఫూర్తికలిగించేవే. ఆ సొసైటీలో 90శాతం మంది మహిళలే. పనివారూ వాళ్లే. ఇప్పుడక్కడికి దేశవిదేశాలనుంచి ఎంతోమంది ఔత్సాహికులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చి వారి విజయగాధను తెలుసుకుంటూంటారు. రెండుమూడేళ్లక్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లా, పాపశానిపల్లె, కోతులగుట్ట, గోవిందాపురం ప్రాంతాల్లో పర్యటించిన నోబుల్ బహుమతి విజేత, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూకి ఆశ్చర్యపోయారు. పొదుపుపథకాలు, ప్రభుత్వ పథకాల అమల్లో వారు చూపిన చొరవ, సాధించిన ఫలితాలు విని ఆనందపరవశులయ్యారు. ఇక మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ సాధిస్తున్న ఫలితాలూ తక్కువేంకాదు. ఈ సంస్థలన్నీ మహిళల భాగస్వామ్యంతో ఏర్పడ్డాయి. వారే పనిచేస్తారు. వారే ఫలితాలు సాధిస్తారు. వారే లాభాన్ని పంచుకుంటారు. చదువురానివాళ్లు చదువునేర్చుకుని వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నవారు ఇతర రంగాలపై దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల తెలిసేదేమిటి. అవకాశం ఇవ్వాలిగానీ మహిళలు సాధించలేనిదేంలేదు. అందుకే అంటారుకదా..ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్.. అని. అయితే ఇవన్నీ స్ఫూర్తిదాయక కథనాలు. అన్నిచోట్లా పరిస్తితులు ఇలాగే ఉన్నాయని చెప్పలేం. ఇంకా ఎంతో మార్పు రావలసి ఉంది. మరిన్ని అవకాశాలకోసం మహిళలు ఇప్పుడు పోరాడుతున్నారు. కనీసం నోరువిప్పి తమకు జరిగిన అన్యాయాన్ని వారు బహిరంగంగా చెప్పుకునే ధైర్యం కూడదీసుకున్నారు. నిర్భయ సంఘటనలు, వరకట్న వేధింపులు, మహిళలకోసం తెచ్చిన చట్టాల అమల్లో జాప్యం వంటి జాడ్యాలు ఉన్నా, వాటిని ఎదుర్కొని, అధిగమించి చాలామంది ముందడగు వేస్తున్నారు. పల్లెపట్లుల్లో అవకాశాలు దొరకబుచ్చుకుని అద్భుత విజయాలు సాధిస్తున్నవారూ ఉన్నారు. అక్షరాస్యత పెరగడం, అండగా నిలిచే సంస్థలు రావడం, తామూ విజయాలు సాధించగలమని, అది నిరూపించాలన్న తపన మహిళల్లో పెరగడం, సమాజంలో వస్తున్న మార్పులు వారిని ప్రోత్సహిస్తున్నాయి. 1911లో తొలిసారిగా... మగవారికి దీటుగా సమాన హక్కులు, వేతనాలు కావాలని మహిళలు బహిరంగంగా అడగడం అమెరికాలో మొదలైంది. 1908లో ఈ ఉద్యమం నెమ్మదిగా ప్రారంభమైంది. అదే సమయంలో గ్రేట్‌బ్రిటన్‌లో విమెన్స్ సోల్ అండ్ పొలిటికల్ యూనియన్ ఆరంభమైంది. 1909 ఫిబ్రవరి 28న్యూయార్క్‌లో వారు మహిళలు సమ్మె చేసి తమకు సాధికారత కావాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత 1910లో కోపెన్‌హెగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సు తమ హక్కులకోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని తీర్మానించింది. 1911 మార్చి 19న 12 దేశాలనుంచి వచ్చిన వందమంది మహిళా ప్రతినిధులు మహిళాదినోత్సవం ప్రతిపాదన చేశారు. ఆ తరువాత ఐక్యరాజ్య సమితి దీనిని గుర్తించింది. అప్పటివరకు వేర్వేరు తేదీల్లో మహిళా దినోత్సవం నిర్వహించేవారు. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల అంగీకారంతో మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా ప్రకటించారు. మహిళల సాధికారిత, సంపూర్ణ అధికారం, ఆర్థిక,రాజకీయ, సామాజిక రంగాల్లో సరైన ప్రాతినిథ్యం కల్పించడం, భద్రత, హక్కులు, వేతనాల విషయంలో వివక్ష లేకుండా చూడటం లక్ష్యంగా ఆయా సభ్యదేశాలు విస్తృత ప్రచారం చేయడం ప్రారంభమైంది. యూరోప్‌లో మహిళా దినోత్సవంనాడు అధికారిక సెలవుగా పరిగణిస్తారు. విద్యారంగంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. వంకాయరంగు..పరమార్థం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వాడే లోగోలు, ప్రచార సామాగ్రి, కరపత్రాలు, పోస్టర్లలో పర్పల్ కలర్ (వంకాయరంగునే) వాడతారు. మహిళలకు సమానత్వం, సమన్యాయానికి గుర్తుగా ఈ రంగును ఉపయోగిస్తున్నారు. ఈసారి లోగోల్లో పర్పల్‌కలర్ డామినేట్ చేస్తూ, దానిపై థీమ్‌స్లోగన్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ లోగోలను వాడుతూ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు మహిళా దినోత్సవాన్ని జరుపుతాయి. ర్యాలీలు, సదస్సులు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాయి. కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంస్థలు కూడా ఈ కార్యక్రమాలను చేపడతాయి. ఇవేవీ పట్టని పల్లెల్లో మహిళలు తమకు తాముగా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ఉదాహరణకు ఈ విజయగాథలు తెలుసుకుందాం. ముల్కనూరు సొసైటీ..మహిళలకు ఏరీ సాటి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఒకప్పుడు కరవు ప్రాంతం. అక్కడ పంటలు పండేవికావు. చివరకు విశ్వనాథరెడ్డి అనే ఆయన ఓ ఆలోచన చేసి పాల సేకరణకు నడుంకట్టారు. కేవలం మహిళలతోనే ఈ ఉద్యమం ప్రారంభించారు. 1997లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 2002నాటికి కార్యరూపందాల్చింది. ముల్కనారు సహకార పాలసొసైటీ ఆవిర్భవించింది. ప్రారంభంలో రోజుకు కేవలం రెండు వందల లీటర్ల పాలనే సేకరించగలిగేవారు. ఇప్పుడు 72 గ్రామాల నుంచి రోజుకు దాదాపుగా 20వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. పాలసేకరణ, పాల శీతలీకరణ, విక్రయం, పాడిపశువులకు దాణా పెట్టడం, పశుగ్రాసం సాగుచేయడం, గ్రామాల్లో తిరిగి పాలను తీసుకురావడం, వ్యాపార లావాదేవీలు నిర్వహించడం అంతా మహిళలే చేస్తారు. ఆ సొసైటీలో 5000మందికి పైగా సభ్యులున్నారు. అందరూ మహిళలే. ఆ సంస్థలో 32మంది ఉద్యోగులుంటే 22మంది మహిళలే. ఆ సొసైటీ చైర్మన్‌కూడా మహిళే. ఒకరితర్వాత ఒకరికి ఆ పదవి లభిస్తుంది. తరచూ సమావేశమై సంస్థను లాభాలబాటలోకి తీసుకురావడంపైన, సభ్యుల కష్టసుఖాలపైన చర్చ జరుగుతుంది. ఈ సంస్థ కార్యకలాపాలు, విజయాలను ప్రత్యక్షంగా చూసేందుకు దేశవిదేశాలనుంచి ప్రతినిధులు రావడం తరచూ జరిగేదే. సభ్యులకు రుణాలు ఇవ్వడం, పాల సొసైటీ లాభాల్లో వాటాలు ఇవ్వడం, ఉపాథి చూపడం బాధ్యతగా తీసుకుంటారు. ప్రస్తుతానికి సొసైటీ ప్రధాన కార్యాలయం ఉన్న ముల్కనూరుకు 32 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలనుంచి మాత్రమే పాలను సేకరిస్తున్నారు. కనీసం 30 వేల లీటర్ల పాలు సేకరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెబుతున్నారు అక్కడి మహిళాసభ్యులు. విజయానికి మారు పేరు డిడిఎస్ మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో 1983లో ఏర్పడిన దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ దళిత మహిళల్లో ఊహించని మార్పు తీసుకువచ్చింది. వారిని అభివృద్ధి పథాన నడుపుతోంది. పస్తాపూర్ సహా 75 గ్రామాల్లోని 5వేలమంది దళిత మహిళల సభ్యత్వంతో ఇది నడుస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, సేంద్రియ ఎరువుల తయారు చేయడం, సస్యరక్షణపై ప్రచారం చేయడం, సంప్రదాయ, ఆరోగ్యకరమైన చిరుధాన్యాల పెంపకంపై ప్రజలను జాగృతం చేయడం, నాణ్యమైన విత్తనాలను గుర్తించడం, వాటిని నిల్వచేయడంలో మెళకువలు నేర్పడం, వాటిని తమ సంస్థద్వారా రైతులకు అమ్మడం వంటి పనులను నేర్చుకున్నారు. కేఫె ఎత్నిక్ అనే హోటల్‌ను నడుపుతూ సంప్రదాయ తెలంగాణ వంటకాలను వండిపెట్టడం నేర్చుకున్నారు. కాలానికి తగ్గట్లు, వాతావరణానికి తగ్గట్లు వంటలు చేసి విక్రయిస్తారు. లాభనష్టాలన్నీ వారివే. సస్యరక్షణ, ప్రచారం, సంస్థ కార్యకలాపాల్లో భాగంగా వాటిని వీడియోలో చిత్రీకరించడం ఆనవాయితీ. అందుకని మహిళా సభ్యులందరికీ వీడియో చిత్రీకరణ నేర్పారు. చదువురాని మహిళలకోసం పచ్చసాలె పేరుతో ఓ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఒకటినుంచి ఐదు తరగతులవారికి, వంతులవారీగా ప్రత్యేక కోర్సులు చెబుతున్నారు. ఇవన్నీ ఒకఎత్తు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఒక సామాజిక రేడియోను నిర్వహిస్తున్నారు. ఝరాసంగం మండలం, మాచనూర్‌లో ఇది ఉంది. దీనినికూడా మహిళలే నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల నడవడిక, చదువు, సస్యరక్షణ, వార్తలు వంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. వీటి రూపకల్పన, నిర్వహణ అంతా మహిళలే చూస్తారు. చెరకుసాగు, బెల్లం తయారీ విధానాలను నేర్చుకున్నారు. వారు పండించిన చెరకును వారే బెల్లంగా తయారు చేస్తారు. శ్రమకు తగ్గ రాబడిని పొందుతున్నారు. తృణధాన్యాల సాగు, సేకరణ, విత్తనాల నిల్వ ప్రాధాన్యతలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఏటా పాతపంటల జాతర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎడ్లబళ్లలో వివిధ రకాల తృణధాన్యాలను పెట్టి ప్రచారం చేస్తారు. ఈ వేడుకకు ఊరూవాడా కదలివస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. అంతంత మాత్రం చదువులతో రాణించిన ఈ మహిళలు విదేశాలకు వెళ్లి అక్కడి మహిళలకు తమ విజయగాథలను వివరిస్తూంటారు. ఏటా ఉత్తమ మహిళ రైతులకు ఇచ్చే చీరె, ప్రశంసాపత్రంతో సత్కారం వారికి సరిపోతుందంటారా. చాలదు. అందుకే వీరి విజయగాథను చూసైనా కష్టాలను, నష్టాలను తలచి నిరాశానిస్పృహలకు తావివ్వకుండా మహిళలు ముందడుగు వేస్తారని ఆశిద్దాం. 2015 నినాదం... ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతిఏటా ఓ ధీమ్‌ను ఎంచుకుని, దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతారు. 2010నుంచి ఈ విధానాన్ని ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. ఎంపవర్‌మెంట్ విమెన్, ఎంపవర్‌మెంట్ హ్యుమానిటీ అనే థీమ్‌తో ఈసారి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికే మేక్ ఇట్ హేపెన్ అని అంటున్నారు. మహిళకు సాధికారత దక్కితే మానవత్వానికి సాధికారత దక్కినట్లేనన్నది దాని సారాంశం. మహిళల అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు, మహిళల ప్రాధాన్యాన్ని గుర్తించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఐక్యరాజ్యసమితి కోరింది. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో మగవారికి దీటుగా మహిళలు పనిచేయగలరు. ఆర్టీసీలో ఓపిక, సహనం, చాకచక్యంతో నిర్వహించే పనులను మహిళలమే చేస్తున్నాం. నేను కంట్రోలర్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నాను. నిజానికి మగవారు బాగా చేయగల పని ఇది. మహిళలకు కాస్త కష్టమైన విధి. అయినా సమర్థంగా నిర్వహిస్తున్నాం. మహిళలు ఈ పని చేయలేరేమో అనే భావనే ఎవరికీ రాకూడదు. అవకాశం ఇస్తే వారు తమ ప్రతిభను, సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. ఆర్టీసీలో కండక్టర్లుగా, కంట్రోలర్లుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న మహిళలు డ్రైవింగ్ విభాగంలోనూ భాగస్వాములవ్వాలని భావిస్తున్నాను. విధుల నిర్వహణలో పురుష అధికారులనుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు. సంపూర్ణ సహకారం అందుతోంది. కాకపోతే విధులకు వచ్చేటపుడు, విధులు పూర్తయ్యాక ఇంటికి చేరుకునే మహిళా ఉద్యోగులకు కాస్త భద్రత మాత్రం అవసరమవుతోంది. అయితే మగవారికి దక్కే గౌరవం, ప్రాధాన్యం మహిళలకుకూడా అందాలి. అప్పుడే మహిళా దినోత్సవానికి అర్థం ఉంటుంది. కీలక ఉద్యోగాల్లో మహిళలను చేర్చుకుంటే అవినీతికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. -చల్లా నీలమణి -అసిస్టెంట్ మేనేజర్ (సి.ఐ) కుషాయిగూడ డిపో, ఆర్టీసి, హైదరాబాద్. రోజూ మహిళా దినోత్సవం జరగాలి ఏడాదికోసారి మొక్కుబడిగా మహిళా దినోత్సవం జరుపుకోవటం కాదు. రోజూ మహిళా దినోత్సవం జరగాలి. మహిళల హక్కులు, భద్రత, స్వేచ్ఛపై ప్రతిరోజు చర్చ జరగాలి. మహిళలు ఎక్కడైతే గౌరవించబడుతారో, పూజించబడుతారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. మహిళలపై చిన్నచూపు వారి పుట్టుకతోనే ప్రారంభమవుతోంది. పలు కుటుంబాల్లో నేటికీ ఆడపిల్ల అంటే చిన్నచూపు చూస్తున్నారు. ఆడ పిల్లలకు చదువుపై ఎంతో ఆసక్తి, శ్రద్ధ ఉన్నా, ఆమెను టెన్త్, ఇంటర్మీడియ్ వరకు చదివించి, ఆ తర్వాత పెళ్లి చేసి తమ బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటున్నారు. అలా కాకుండా ఆడపిల్లను కూడా మగ పిల్లాడితో సమానంగా చూడాలి. ఈ విషయంలో మార్పు కుటుంబంలోని తల్లిదండ్రుల నుంచే ప్రారంభం కావాలి. ఇక సమాజం మొత్తాన్ని ఈ విషయంలో చైతన్యం పర్చడమూ సాధ్యమే, కానీ అందుకు చాలా సమయం పడుతుంది. ఆడపిల్లలు మగ పిల్లలతో సమానమన్న విషయాన్ని పాఠశాల స్థాయిలో పాఠ్యాంశం కావాలి. మహిళా దినోత్సవం సందర్భంగా మాత్రమే మహిళల హక్కుల విషయం చర్చకు వస్తుంది. ఆ తర్వాత అంతా మామూలే అన్నట్టు మహిళలు కూడా వ్యవహరిస్తున్నారు. మొక్కుబడి కార్యక్రమాలు, ప్రయత్నాలతో మహిళా సాధికారత, భద్రత సాధించలేం. ఈ రెండు అంశాల విషయంలో గడిచిన పది సంవత్సరాల్లో మెరుగైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న అక్షరాస్యత, కొత్త చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం దీనికి కారణం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టేందుకు ప్రారంభించిన 100 డయల్, షీ టీం కార్యక్రమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. అక్టోబర్‌లో 100 డయల్‌ను ప్రారంభించినపుడు సుమారు 60 స్నాచింగ్ కేసులకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ సంఖ్య క్రమంగా తగ్గుతూ ఫిబ్రవరిలో పదికి తగ్గింది. అంటే మహిళలు, విద్యార్థినిలు, యువతుల భద్రత కోసం చేస్తున్న కృషి పలు రకాలుగా ఫలిస్తోందనే చెప్పవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని మహిళల భద్రతకోసం మున్ముందు మరిన్ని ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు సిద్ధమవుతున్నాం. స్వాతిలక్రా, హైదరాబాద్ పోలీసు జాయింట్ కమిషనర్
వనితా... వందనం
ReplyDeleteSalutes
ReplyDelete