గురు తేగ్ బహదూర్ - Guru Tej Bahadur Biography in Telugu
పండిత్ కృపారామ్ రెండు చేతులు జోడించి గురువు వైపే భక్తి శ్రద్ధలతో చూస్తున్నాడు. ఆయన వెంట వచ్చిన వారంతా కన్నీటితో గురువు వైపే చూస్తున్నారు.
‘గురుదేవా.. మా పరిస్థితి దయనీయంగా ఉంది. బతుకు దుర్భరమై పోయింది. మా ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నాం. మమ్మల్ని ఇస్లాంలో చేరమని బలవంతపెడుతున్నారు. నానా అత్యాచారాలకు గురిచేస్తున్నారు’
వేదికపై గురువు కూర్చున్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానముద్రలో ఉన్నారా గురువు. పండిత్ కృపారామ్ మాటలు విని కళ్లు తెరిచారు. కహ్లూర్ లోని చక్‌నన్కీలో సాయం సంధ్యావేళ అది. చుట్టూ ఔరంగజేబ్ మతమౌఢ్యంల చీకట్లు అలుము కుంటున్నాయి. గురువు దీర్ఘాలోచనలో పడిపోయారు.
‘ఏమైంది నాన్నా?’ గురువుగారి తొమ్మిదేళ్ల కుమారుడు ప్రశ్నించాడు.
‘ఈయన పండిత్ కృపారామ్. ఈయన కశ్మీరీ హిందువుల నాయకుడు. వీరిపై ఔరంగజేబు అత్యాచారాలు హద్దు మీరాయి. వీరిని మతం మారమని బలవంతం చేస్తున్నాడు’ అన్నారు గురువు.
‘ఈ పరిస్థితిని మార్చాలంటే ఏం చేయాలి నాన్నా?’
‘పరమోత్కృష్టుడైన ఒక తపోధనుడు, ఒక ధర్మవీరుడు తన బలిదానం ద్వారా కశ్మీరీ హిందువులను కాపాడాలి’
‘మీ కన్నా పరమోత్కృష్టుడైన తపోధనులు ఇంకెవరున్నారు నాన్నా?’ అన్నాడు ఆ కుమారుడు. కుమారుడు అన్న మాటకు గురువు ఒక్క నిమిషం కళ్లు మూసుకున్నారు. తర్వాత నెమ్మదిగా కళ్లు తెరిచారు. ‘పండిత్ కృపారామ్ ! ఔరంగజేబ్‌కు చెప్పండి… ముందు నన్ను మతం మార్చమనండి. నన్ను మార్చిన తరువాత కశ్మీరీ హిందువులు మతం మారతారని చెప్పండి’ మేఘ నిర్ఘోషలా వినిపించింది గురువు స్వరం.
అది మే 25, 1675.
ఆ గురువు పేరు సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేగ్ బహదూర్. ఆయన తొమ్మిదేళ్ల కుమారుడే పదవ గురువు దశమేశ్ శ్రీ గురు గోవిందులు. జూలై 11న గురువు తన ప్రియ శిష్యులు భాయిమతి దాస్, భాయిసతి దాస్, భాయి దయాల్ దాస్‌లను తోడు తీసుకుని ఢిల్లీకి బయలుదేరతారు.
గురుగోవిందులు విచిత్ర నాటక్ (బిచిత్తర్ నాటక్) లో గురు తేగ్ బహదూర్ ఢిల్లీ యాత్రను ఇలా వర్ణిస్తారు.
‘ఠీకర్ ఫోడే దలీస్ పర్ ప్రభు పార్ కియో పయాన్
తేగ్ బహదూర్ సీ క్రియా కరీ న కిన్హూ ఆన్
తేగ్ బహదూర్ కే చలత్ భయో జగత్ మే సోక్
హాయ్ హాయ్ హాయ్ సబ్ జగ్ భయో జైజైజై సుర్ లోక్
(భవ బంధాలను తెంచుకుంటూ గురు తేగ్ బహదూర్ బయలుదేరారు. ఆయన వంటి సాహసం ఎవరూ చేయలేరు. ఆయన బయల్దేరగానే శోకం కట్టలు తెంచుకుంది. ప్రజలు హాహాకారాలు చేశారు. కానీ దేవతలు జయకారాలు చేశారు.)
సిక్కు గురువులకూ, కశ్మీర్‌కు విడదీయరాని బంధం. పండిత్ కృపారామ్ గురు గోవింద్ సింగ్‌కి సంస్కృతాన్ని బోధించారు. కృపారామ్ పూర్వజుడు పండిత్ బహ్మ రామ్ గురునానక్‌తో కలిసి ఆధ్యాత్మికాంశాలపై చర్చిస్తారు. గురు తేగ్ బహదూర్ తండ్రి, ఎనిమిదవ గురువు హరగోబింద్ శ్రీనగర్‌లోని రైనావారీకి వెళ్లి కశ్మీరీ శైవ సన్యాసిని మాతా బాగ్ బారీని కలిసి ఆమెతో ఆధ్యాత్మికాంశాలపై చర్చించారు. ఈ చర్చలు శ్రీ గురు గ్రంథ్ సాహెబ్‌లో పొందుపరచి ఉన్నాయి. అదీ సిక్కు గురువులకు, కశ్మీర్‌తో ఉన్న నాభి నాళ సంబంధం.
జూలై 26న వారిని నూర్ మహమ్మద్ ఖాన్ మిరాజా సర్ హింద్‌కి తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి వారిని మతం మార్చేందుకు మిరాజా చేయని ప్రయత్నం లేదు.. భయపెట్టాడు.. బెదిరించాడు.. ప్రలోభపెట్టాడు.. బుజ్జగించాడు.. కానీ గురువు గురువే. శిష్యులు శిష్యులే. హరినామ స్మరణం తప్ప మరో పేరు నోటి నుంచి రాలేదు.
ఇక్కడ కశ్మీర్‌లో పండిత్ కృపారామ్, మిగతా హిందువులు గురువు కోసం గుండె గదుల్లో గుడికట్టి పూజించసాగారు. ఆయన మహత్తర నేతృత్వంతో ప్రభావితులై మరింత ధర్మదీక్షాదక్షులయ్యారు.
నవంబర్ 9, 1675.
భాయి దయాళ్ దాస్‌ను మరుగుతున్న నీళ్లున్న తొట్టిలోకి విసిరేయమని మిరాజా ఆదేశించాడు. మృత్యువు దగ్గరవుతున్నా భాయి దయాళ్ దాస్ నోట హరి స్మరణ తప్ప మరొక మాట లేదు. ఆయన దైవ ధ్యానంలోనే దివికేగాడు.
నవంబర్ 11, 1675.
భాయి మతిదాస్‌ను రంపంతో నిలువునా కోసేశారు. రంపం కోత, రక్త ధార మధ్య కూడా మతిదాస్ మది హరినే స్మరించింది. భాయి సతిదాస్‌ను నూనెలో తడిపిన గుడ్డల్లో చుట్టి, నిప్పంటించారు. సతిదాస్ కూడా బలిదానపు బాటను ఎంచుకున్నాడు తప్ప వెనకడుగు వేయలేదు. మతం మారేందుకు అంగీకరించలేదు.
చివరికి ఔరంగజేబ్ గురు తేగ్ బహదూర్‌ను ఢిల్లీలోని చాందినీ చౌక్‌కి తీసుకువచ్చి, ఆయన తలను తెగనరుకుతాడు. గురువు ఒక్క మాట కూడా మాట్లాడరు. ధ్యానముద్రలోనే ఉండిపోతారు. నిశ్చలతత్వంలో లీనమైపోతారు.
‘సిర్ దియా పర్ సీ న ఉచారీ’ (శిరస్సునర్పించారే తప్ప గురువు అమ్మా అని కూడా అనలేదని సిక్కు సాహిత్యం చెబుతుంది) తమ బలిదానంతో గురు తేగ్ బహదూర్ కశ్మీరీ హిందువుల మతమార్పిడిని అడ్డుకున్నారు. సిక్కులను ఒక పోరాట జాతిగా రూపాంతరం చెందేందుకు ప్రేరణనిస్తారు. గురు గోవిందుల నాయకత్వంలో సిక్కులు మొగలు పైశాచిక పర్వంపై పోరాటం చేస్తారు. ఈ అలుపెర గని పోరాటం ఫలితంగా మహారాజా రంజిత్ సింగ్ పాలనా కాలంలో కశ్మీర్, జమ్మూలు సిక్కుల పాలన లోకి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటాయి. కశ్మీర్‌లో అఫ్గన్ల అత్యాచారాల నుంచి పండిత్ బీర్ ధర్ అనే హిందూ నేత పారిపోయి వచ్చి, రంజిత్ సింగ్‌కి కశ్మీర్‌లోని అత్యంత భీతావహ పరిస్థితుల గురించి వివరిస్తాడు. అప్పడు కశ్మీరీ హిందువుల రక్షణ కోసం మహారాజా రంజిత్ సింగ్ రజౌరీ, పూంఛ్, షోపియాన్‌ల మీదుగా శ్రీనగర్‌లోకి ప్రవేశిస్తాడు. 1819 మే నెలలో సిక్కు సేనలు కశ్మీర్‌ని విముక్తం చేస్తాయి. ఈ సంఘటనలన్నిటికీ పునాది శ్రీ గురు తేగ్ బహదూర్ నిరుపమాన త్యాగం! అందుకే నేటికీ కశ్మీరీ హిందువులు గురు తేగ్ బహదూర్ బలిదాన దినాన్ని శ్రద్ధా భక్తులతో జరుపుకుంటారు. ఆయనను ‘హింద్ దీ చాదర్’ (హిందువుల రక్షకుడు) అని గౌరవంగా స్మరించుకుంటారు.
– ప్రభాత్
(జాగృతి సౌజన్యం తో)
About Guru Tej Bahadur in Telugu | Guru Tej Bahadur | Guru Tej Bahadur Life Story in Telugu | Guru Tej Bahadur Story in Telugu
కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు
ReplyDelete