నేతాజీ జయంతి - About Netaji Subash Chandrabose in Telugu
జనవరి 23 నేతాజీ జయంతి
‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛనిస్తాను..’ భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్రంలా వినిపించిన సమర నినాదం ఇది. ‘చలో ఢిల్లీ’, ‘జైహింద్’ అంటూ ఆ మహానాయకుడు ఇచ్చిన నినాదాలు ఈనాటికీ సజీవంగా ఉన్నాయి. భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి విదేశీనేలపై తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని, తొలి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోధుడాయన. జననమే తప్ప మరణం లేని మహానేత. భారతదేశ ప్రజల హృదయాల్లో ‘నేతాజీ’గా చిరస్థాయిగా నిలిచిన అమరుడు. అతికొద్ది సంవత్సరాల ప్రజాజీవితంలో ఎన్నటికీ మరచిపోలేనంతటి అభిమానాన్ని చూరగొన్న మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
‘స్వాతంత్య్రం అంటే అడిగి తీసుకునే భిక్ష కాదు. పోరాడి సాధించుకునే హక్కు..’ భారత స్వాతంత్రోద్యమంలో ఒక రకమైన స్తబ్ధత ఏర్పడిన సమయమది. రవి అస్తమించని సామ్రాజ్యం నిర్మించిన బ్రిటిష్‌వారితో గట్టిగా పోరాడితే ఫలితం లేదని, శాంతియుత మార్గంలో నిరసనలు తెలియజేస్తూ సంప్రదింపులు జరిపితే వారే అర్థం చేసుకొని దేశం విడిచిపోతారనే భావనను భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఏర్పరిచారు. అహింస, సత్యాగ్రహం మాత్రమే బ్రిటిష్ వారి మనసును కరిగిస్తాయని చెప్పేవారు. వాస్తవానికి ఇవి బెడిసికొట్టాయి. స్వాతంత్రోద్యమాన్ని వారు మరింత కఠినంగా అణిచివేశారు. అహింస బ్రిటిష్ వారికి అర్థంకాని భాష అని భావించాడు బోస్. ప్రాధేయపడటం కంటే పోరాడి సాధించుకున్న స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికే విలువ ఎక్కువని స్పష్టంగా చాటి చెప్పాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా ఆచరణలో చూపించాడు. సుభాస్ చంద్రబోస్ చేపట్టిన సాయుధ పోరాటమార్గం బ్రిటిష్ వారిని వణికించింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంకన్నా, కేవలం కొన్ని సంవత్సరాల పాటు సాగిన నేతాజీ పోరాటమే గొప్ప ప్రభావం చూపిందని స్పష్టంగా చెప్పవచ్చు.
ఐసీఎస్ వదిలి పోరాటంలోకి..
1897లో జనవరి 23వ తేదీన కటక్ పట్టణంలో ప్రభావతి దేవి, జానకీనాధ్ బోస్ దంపతులకు జన్మించారు సుభాష్ చంద్రబోస్. చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉండే సుభాష్ చంద్రబోస్ 1920లో ఇండియన్ సివిల్ సర్వీసు (ఐసీఎస్) పరీక్షకు హాజరై నాలుగో ర్యాంకు సాధించారు. అదే సమయంలో బ్రిటిష్ పాలనలో ఆనాటి దేశ పరిస్థితులు ఆయనను ఎంతో కలిచివేశాయి. వారి ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పని చేయడం సరికాదని భావించారు. ఐసీఎస్ నుండి 1921లో వైదొలిగి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగారు సుభాష్ బాబు.
భారత జాతీయ కాంగ్రెస్‌లో బోస్ క్రియాశీల
పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ సూచన మేరకు చిత్తరంజన్‌దాస్‌తో కలసి
బెంగాల్‌లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. 11 మార్లు జైలుకు
వెళ్లడంతో పాటు ఎన్నోసార్లు గృహ నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
సుభాష్ చంద్రబోస్ తనదైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో అందరి మన్ననలను
పొందారు. రెండుసార్లు కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు. మహాత్మాగాంధీపై
బోస్‌కు అపారమైన గౌరవం ఉండేది. భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఆయన్ని
మహానాయకునిగా అంగీకరించేవారు. అయితే గాంధీజీ సూచించిన అహింసా మార్గంతోనే
స్వరాజ్యం వస్తుందనే వాదనతో విబేధించారు బోస్. బ్రిటిష్‌వారిని దేశం
నుండి తరిమికొట్టడానికి సాయుధ పోరాటం అవసరమని వాదించేవారు. కాలక్రమంలో
గాంధీజీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ బేధాలు, వర్గపోరు కారణంగా కాంగ్రెస్
పార్టీలో ఇమడలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు సుభాష్ చంద్రబోస్.
ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది.
1939లో మన నాయకులతో సంప్రదించకుండానే భారత్‌ను యుద్ధరంగంలోకి దింపారు
బ్రిటిష్‌వారు. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు
సుభాష్ చంద్రబోస్. ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత
విడుదల చేసి గృహ నిర్బంధంలో పెట్టింది. శాంతియుత పోరాటాలతో ఫలితం ఉండదని
గ్రహించిన బోస్ దేశం వదిలి వెళ్లి బయటి నుండి పోరాటం చేయాలని నిర్ణయానికి
వచ్చారు.
శత్రువు శత్రువు మిత్రుడు అవుతాడంటారు. బ్రిటిష్ వారిని దేశం నుండి
తరిమికొట్టాలంటే వారి శత్రువుల సహకారం అవససరమని విశ్వసించారు సుభాష్
బాబు. రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న రోజులవి. స్వాతంత్య్ర
పోరాటాన్ని మరో మలుపుతిప్పింది బోస్ అజ్ఞాతవాసం. 1941 జనవరి 19న బ్రిటిష్
ప్రభుత్వ వేగుల కన్నుగప్పి పఠాన్ వేషంలో తన ఇంటి నుండి బయట పడ్డారు
సుభాష్‌బాబు. మాస్కో, ఇటలీ మీదుగా జర్మన్ రాజధాని బెర్లిన్ వెళ్లారు.
అక్కడ హిట్లర్‌ను కలుసుకున్నారు. తన పోరాటానికి బ్రిటిష్‌కి శత్రువులు
జర్మనీ, జపాన్‌ల సహకారం తీసుకోవడమే బోస్ లక్ష్యం.
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌వారి తరఫున పోరాడి పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలందరినీ సమీకరించారు సుభాష్ చంద్రబోస్. పరాయి పాలకుల తరఫున పోరాడి ఇలా విదేశీ జైళ్లలో మగ్గడం కన్నా దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించాలనే ప్రేరణ వారిలో కలిగించారు. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటానికి వారిని సమాయత్తం చేశారు.
యూరప్‌లో ఫ్రీ ఇండియా సెంటర్‌ను బోస్ ప్రారంభిం చారు. దీని ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ రేడియో ప్రారంభిం చారు. ప్రవాసంలోని భారతీయుల్లో స్వాతంత్య్ర ఆకాంక్షను నెలకొల్పడంలో ఇది ఎంతో దోహదం చేసింది. సుభాష్ చంద్రబోస్ తన తదుపరి కార్యాచరణలో భాగంగా జలాంతర్గామి ద్వారా సాహసోపేతంగా ప్రయాణం చేసి జపాన్ వెళ్లారు. అక్కడ రాస్‌బిహారీబోస్‌తో కలిసి సమాలోచనలు జరిపారు. భారతదేశ విముక్తి కోసం జపాన్ సహకారంతో తదుపరి కార్యాచరణ ప్రారంభించారు.
స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం
బ్రిటిష్‌వారిపై సాయుధ పోరాటం చేసేందుకు జపాన్ సహకారంతో మోహన్‌సింగ్‌దేవ్ భారత జాతీయ సైన్యం (ఆజాద్ హింద్ ఫౌజ్) ప్రారంభించారు. అయితే ఆ సంస్థ బాలారిష్టాల పాలైంది. అనంతరం దీని బాధ్యతలు రాస్‌బిహారీ బోస్ తీసుకున్నారు. నేతాజీ రాకతో ఆ పగ్గాలను ఆయనకు అప్పగించారు. 1943 అక్టోబర్ 21న సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఈ ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ, తపాళా బిళ్లలను జపాన్, జర్మనీ, ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిఫీన్స్ కూడా ఆమోదించడం విశేషం. అదే సంవత్సరం అక్టోబర్ 23న బ్రిటిష్‌వారిపై బోస్ బాబు యుద్ధాన్ని ప్రకటించారు.
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌వారిపై పోరాడుతున్న జపాన్ 1942 మార్చిలో అండమాన్, నికోబార్ దీవులను ఆక్రమించింది. ఆ తర్వాత వాటిని ఆజాద్ హింద్ ఫౌజ్‌కు అప్పగించింది. 1943 డిసెంబర్ 29న నేతాజీ ఈ దీవులను సందర్శించి మొదటిసారిగా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ద్వీపాలకు షహీద్, స్వరాజ్ అని నామకరణం కూడా చేశారు. 1944లో బర్మాలో ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్వహించిన ర్యాలీలో బోస్ చేసిన ‘మీ రక్తాన్ని ధారబోయండి. మీకు స్వాతం త్య్రాన్ని ఇస్తాను’ అనే నినాదం భారతీయు లను ఉత్తేజితులను చేసింది. బోస్ పిలుపుతో చాలా మంది యువకులు ఆయన సైన్యంలో చేరారు. ఎంతోమంది దేశభక్తులు ఆర్థిక సహాయం కూడా అందించారు.
చలో ఢిల్లీ నినాదం
1944 ఫిబ్రవరి 4న మాతృభూమిని ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి విడిపించడమే లక్ష్యంగా చారిత్రక ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు నేతాజీ. అరకాన్ యుద్ధరంగంలో తొలిసారిగా తుపాకీ పేల్చిన ఆజాద్ హింద్ ఫౌజ్ దళాలు భారత భూభాగం వైపు కదిలాయి. కల్నల్ ఎస్.ఎం మలిక్ నేతృత్వంలోని ఈ సైన్యం ఏప్రిల్ 18న బ్రిటిష్ సైన్యాలను మట్టికరిపించి మణిపూర్‌లోని మొయిరాంగ్ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. కదనో త్సహంతో ఉన్న ఫౌజ్ దళాలు భారత భూభాగంలోకి 250 మైళ్లు దూసుకువచ్చి ఇంఫాలా, కోహిమాల వైపు దృష్టి సారించాయి. అక్కడి నుంచి అస్సాంలోకి అడుగు పెట్టాలని ఆలోచన.. ఈ ప్రాంతాల మీద పట్టుకోసం ఇరు పక్షాల మధ్య సుమారు ఐదు మాసాలు భీకర సమరం సాగింది. ఇంతలో అకాల వర్షాలు మొదలై ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు జపాన్ నుంచి ఆహారం, ఆయుధాలు, వాహనాలు అందించడం కష్టంగా మారింది. ఇంతలో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి పాలైంది. అక్కడి నుంచి సహకారం ఆగిపోవడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ముందుకు సాగలేకపోయింది.
విమాన ప్రమాద మిస్టరీ
ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా బ్రిటిష్‌వారికి కంటిమీద నిద్ర లేకుండా చేసిన సుభాష్ చంద్రబోస్ 1945 జూలై 8న సింగపూర్‌లో ఐఎన్‌ఏ స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేశారు. జపాన్ లొంగుబాటు, బ్రిటిష్‌వారి ఆక్రమణతో నేతాజీ సింగపూర్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని తమ సైనిక దళాలకు రేడియో ద్వారా తెలియజేసిన నేతాజీ ‘ఈ తాత్కాలిక ఓటమితో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మనోధైర్యంతో ముందుకు నడవండి. భారతదేశం బానిసత్వం, ఏకాధిపత్యం నుంచి త్వరలో విముక్తి పొందుతుంది’ అని తెలిపారు.
1945 ఆగస్టు 18న సోవియట్ యూనియన్ వెళ్లేందుకు జపాన్ సైన్యం ఏర్పాటు చేసిన విమానంలో బయలుదేరారు సుభాష్ చంద్రబోస్. దురదృష్టవశాత్తు ఆ విమానం తైవాన్‌లో కుప్పకూలిందని వార్త లొచ్చాయి. ఈ ప్రమాదంలో బోస్ మరణించారని చెబుతున్నా, ఇంతవరకూ సరైన ఆధారాలు దొరకలేదు. స్వత్రంత్ర భారత ప్రభుత్వం దీనిపై ఎన్నో విచారణలు జరిపినా వాస్తవం తేలలేదు. ఆయనను సోవియట్ యూనియన్ బందీని చేసి సైబీరియా పంపగా అక్కడ మరణించారని మరో కథనం. ఇది కూడా నిర్ధారణ కాలేదు. జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో బోస్ చితాభస్మం ఉందని చెబుతారు. అది ఆయనది కాదని కూడా తేలిపోయింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని స్పష్టమైనా, ఆయన అదృశ్యం మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీకి సంబంధించిన పలు కీలక అజ్ఞాత పత్రాలను వారి కుటుంబసభ్యులకు అందజేశారు. అయితే అందులో ఏముందో పూర్తి స్థాయిలో స్పష్టం కాలేదు.
కమ్యూనిస్టుల విష ప్రచారం
చారిత్రక తప్పిదాలు చేయడం, ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తంచేయడం కమ్యూనిస్టులకు అలవాటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల కూడా వారు ఇదే రకంగా వ్యవహరించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యాకు సన్నిహితంగా ఉన్న బ్రిటిష్ వారిని సమర్థించారు భారత కమ్యూనిస్టులు. ఇందులో భాగంగా జపాన్ సహకారం తీసుకున్న నేతాజీని కించపరిచారు. నేతాజీని జపాన్ ప్రధాని టోజో పెంపుడు కుక్క అంటూ నోరు పారేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ‘పీపుల్స్ వార్’ పత్రిక బోస్‌ని గాడిదలా, ఆయనపై టోజో కూర్చొని స్వారీ చేస్తున్నట్లు కార్టూన్ ప్రచురించింది. కాలక్రమంలో నేతాజీని తాము తప్పుగా అర్థం చేసుకున్నామని వివరణ ఇచ్చుకున్నారు కమ్యూనిస్టులు. చేతులు కాలిన తరువాతే ఆకులు పట్టుకోవడం కమ్యూనిస్టులకు అలవాటే కదా.
నేతాజీపై నెహ్రూ నిఘా పెట్టారా?
1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఆ స్థానంలో ఉండాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో గూడు కట్టుకున్న బోస్ అదృశ్యం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నేతాజీ కారణంగా తమకు ఎప్పటికైనా ముప్పు ఉందని నెహ్రూ తదితర నేతలు నిరంతరం ఆందోళనతో ఉండేవారు. బోస్ కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టడం ఇందుకు బలం చేకూర్చింది. నెహ్రూ మరణానంతరం కూడా ఈ నిఘా కొనసాగింది. నేతాజీ విదేశాల్లో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. బ్రిటిష్ వారిపై పోరాటానికి జపాన్, జర్మనీల సహకారం తీసుకునే విషయంలో బోస్ నిర్ణయాన్ని కాంగ్రెస్‌తో పాటు చాలామంది తప్పు పట్టారు. కానీ బోస్ వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం భారతీయులందరి అభిమానాన్ని చూరగొంది. నేతాజీ అనే బిరుదును తెచ్చిపెట్టింది.
అండమాన్‌కు నేతాజీ పేరు..
సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవుల్లో జాతీయ జెండా ఎగురవేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2018లో జరిగిన ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 150 మీటర్ల ఎత్తైన జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడి రాస్ ఐలాండ్‌కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరుపెట్టారు. అలాగే నీల్ ఐలాండ్‌కు షహీద్ ద్వీప్, హేవ్ ఐలాండ్‌కు స్వరాజ్ ద్వీప్ అనే పేర్లు పెట్టారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 2021 జనవరి 23వ తేదీ నుండి ఏడాది పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.
చరిత్ర తిరిగేస్తే గొప్ప వ్యక్తులందరి
జనన, మరణాలు కనిపిస్తాయి. కానీ జననమే తప్ప మరణం నమోదు కాని వ్యక్తి ఒక్కరే.
ఆ అరుదైన గౌరవం సుభాష్ చంద్రబోస్ సొంతం. నేతాజీ అనే పేరు, జైహింద్
అనే నినాదం, చలో ఢిల్లీ పిలుపు ఈనాటికీ సుభాష్ చంద్రబోస్‌ను
గుర్తుచేస్తాయి. అయితే నేటి కాలంలో ప్రతి ఉద్యమానికీ చలో ఢిల్లీ అని
తగిలించడం కొందరికి రివాజుగా మారింది. నేతాజీ ఔన్నత్యాన్ని కాపాడాలంటే ఈ
పదం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే సుభాష్
చంద్రబోస్‌ను తప్ప ఇతరులెవరినీ నేతాజీ అని పిలవకపోవడం మంచిది.
ఇంతకీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమైనట్లు? ఆయన ఎక్కడికీ పోలేదు. కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో జీవించే ఉన్నారు..
ఆ నినాదం వెనుక హైదరాబాదీ
సుభాష్ చంద్రబోస్ అందించిన ‘జైహింద్’ నినాదం వెనుక హైదరాబాద్ వాసి ఉన్నారు. ఆయనే అబిద్ హసన్ సాఫ్రాని. ఈయన ఇంజనీరింగ్ చదువుకోసం జర్మనీ వెళ్లారు. అక్కడ సుభాష్ చంద్రబోస్ ప్రసంగం విని ప్రభావితుడయ్యారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక తాను కూడా పోరాటంలో భాగస్వామినవుతానని బోస్‌ని కోరారు. బోస్ వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా ఉద్యమంలో చేరిపోయారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో కీలకంగా పనిచేశారు. అప్పట్లో భారతీయ సైనికులంతా పరస్పరం పలకరించుకోడానికి ‘నమస్తే, నమస్కార్, రామ్ రామ్, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుం..’ అనే పదాలు వాడేవారు. వీటన్నిటికీ బదులు దేశభక్తిని చాటే ఒకే పదం ఉండాలని అందరూ భావించారు. అప్పుడు అబిద్ ‘జై హిందూస్తాన్’ అని సూచించారు. ఆ తర్వాత దాన్ని కుదించి ‘జై హింద్’గా మార్చారు. ‘జై హింద్’ నినాదం బోస్‌కు నచ్చడంతో వెంటనే ఆమోదించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అబిద్ హసన్ సాఫ్రాని భారత విదేశాంగ శాఖలో చేరారు. వివిధ దేశాల్లో సేవలు అందించిన తర్వాత 1669లో పదవీ విరమణ చేశారు. తిరిగి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 1984లో మరణించారు. అబిద్ హసన్ సాఫ్రాని పేరులో ‘సాఫ్రాని’కి ఒక ప్రత్యేకత ఉంది. హిందువులు విశ్వసించే త్యాగానికి చిహ్నమైన కాషాయం (సాఫ్రాని)ని తన పేరులో చేర్చుకున్నారు.
– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్
Source - Jagriti Weekly
నిప్పై జ్వలించిన నినాదం.. జైహింద్
ReplyDelete