Breaking News

అపర విష్ణువు...అమ్మ


అమ్మ... బ్రహ్మ అని చెప్పుకుంటూ, సృష్టికర్త అయిన బ్రహ్మ అంశ అమ్మలో ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం కదా! ప్రముఖ వైద్యులొకరు ‘మాతృదేవోభవ’ అని పుస్తకం రచించారు. వైద్యశాస్త్రపరంగా తనకున్న పరిజ్ఞానాన్నంతటినీ ఉపనిషత్‌ జ్ఞానంతో కలిపి రచన చేశారు. అమ్మ కడుపులో బ్రహ్మస్థానం ఎలా ఉంటుంది, సృష్టి చేయడానికి అవకాశం ఎలా ఉంటుందో విశ్లేషించారు.

అమ్మ కడుపులో ఒక రకమైన ద్రవం ఊరుతుంది. అలా ఊరి, అది కడుపులో చేరుతుంది. దానిలో శిశువుంటుంది. అలా ఉన్న కారణం వల్ల అమ్మ వంగినా, జారి పడినా.. లోపల ఉన్న పిండానికి దెబ్బతగలకుండా, అలా అది అంగవైకల్యం పొందకుండా... ఆ ద్రవంలో తేలుతూ ఉంటుంది. అలా ఉన్నస్థితిలోనే బయట వైద్యుడు ఆ పిండం ఎదుగుదల క్రమాన్నీ, ఆరోగ్య పరిస్థితినీ అంచనా వేయడానికి అవకాశం కలుగుతుంది. ఒక స్త్రీ తల్లి అయినప్పుడు సృష్టికర్త అంశంగా తల్లిలో మాత్రమే అలాంటి ద్రవం ఉత్పన్నమవుతుందని రాశారు. అమ్మలో... సృష్టికర్త అంశతో పాటు, స్థితికర్త అంశా ఉంటుంది. స్థితికర్త అంటే... పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు అని అర్థం. ఇది విష్ణుతత్త్వం. సృష్టి, స్థితి, లయ – అనే మూడింటిలో స్థితి... అంటే రక్షణ భారాన్ని స్వీకరించి, త్రిమూర్తి త్రయంలోని విష్ణుస్వరూపం స్థితికారకమై ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఒక ధర్మం ఉంటుంది. ఏ పేరుపెట్టి పిలవకపోయినా, ఆపదలో మన రక్షణ కోసం పలికేది విష్ణువే. అది ఆయన కర్తవ్యం.

‘గజేంద్ర మోక్షం’లో ప్రమాదంలో చిక్కుకున్న గజేంద్రుడు ఒక పేరు పెట్టి ఎవరినీ తన రక్షణ కోసం పిలవలేదు. ఓ బ్రహ్మ రావాలనో, ఓ శివుడు రావాలనో, నాలుగు తలకాయలవాడు రావాలనో, తామరపూవులో నుంచి పుట్టినవాడు రావాలనో, నాగభూషణుడు రావాలనో వర్ణన చేయలేదు. ‘‘తస్మై నమః పరేశాయ బ్రహ్మణో అనంత శక్తయే అరూపా యోరు రూపాయ నమః ఆశ్చర్యకర్మణే... విదూరాయ, కైవల్యనాథాయ, శాంతాయ, ఘోరాయ, మూఢాయ, నిర్విశేషాయ, సామ్యాయ, జ్ఞానధనాయ’’ – ఇలా కీర్తిస్తూ అలాంటివాడు వచ్చి నన్ను కాపాడాలన్నాడు. అటువంటి వాడెవరు విష్ణువా? శివుడా? బ్రహ్మా? రక్షణకి పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరుగెత్తుకొచ్చాడు. ఆయననే ఉద్దేశించి రక్షించమని ప్రత్యేకించి అడగక్కర్లేదు. అటువంటి విష్ణుతత్త్వం అమ్మలో ఉంటుంది. అమ్మ.. అమ్మగా రక్షకతత్త్వంతో ఉంటుంది.

అమ్మకు రక్షించడమొక్కటే తెలుసు! ఆ రక్షకతత్త్వం గురించి ప్రత్యేకంగా ఎవరూ బోధ చేయక్కర్లేదు. మనుష్య ప్రాణే కాదు, ఏ జీవి అయినా, ఏ ప్రాణి అయినా తీసుకోండి... తన బిడ్డ అనేటప్పటికి అప్పటి వరకు భయహేతువుగా ఉన్న వాటివల్ల తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినా సరే, బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. కోడిపెట్ట అనుక్షణం పైన ఉన్న గ్రద్ద నుండి, పక్కనున్న కుక్క వరకు దేని నుంచీ ఎలాంటి హానీ జరగకుండా తన పిల్లలను కనిపెట్టుకునే ఉంటుంది. ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు ‘కొక్కొక్కొక్కొ...’ అంటూ పిల్లలన్నిటినీ రెక్కల దగ్గరకు తీసేసుకుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. పిల్లల్ని తీసుకువెళ్ళి ఎక్కడో సురక్షిత స్థావరంలో పెట్టుకోవడం దానికి రాదు. గ్రద్ద కానీ, కుక్క కానీ వస్తే ముందు తనను కొట్టేయాలి తప్ప పిల్లలను ముట్టుకోనీయదు. తాను చచ్చిపోయాకే తప్ప తన కళ్ళ ముందు తన పిల్లలు చచ్చిపోకూడదు. ఎవరు నేర్పారు ఈ త్యాగభావన? ఎక్కడి నుంచి వచ్చిందీ రక్షణశక్తి? అంటే దర్శనం చేయగలిగిన నేత్రాలుండాలే గానీ... పిల్లలకు అడ్డుగా రక్షణ కవచంలా నిలబడి పోయిన ఆ తల్లి కోడే – శ్రీమహావిష్ణువు! ఆ తల్లి కోడే – జగన్మాత!!

అసలు ఈ ప్రపంచంలో అద్భుతమైన విషయం ఏమిటంటే ‘‘అమ్మ కడుపులోంచి బిడ్డ బయటకు రాగానే అపారమైన భయానికి లోనై, వాడికి ఊపిరితిత్తుల చలనం ఆగిపోతుంది. వాడు ప్రాణోత్క్రమణానికి సిద్ధపడిపోతాడు. ఆ భయానికి లోపల ఉన్న మలం నల్లగా రాయిలా అయిపోతుంది. ఈ దశలో ‘వీడు నా బిడ్డ’ అన్న భావనతో, సంతోషంతో వాడిని అమ్మ దగ్గరకు తీసుకుని స్తన్యమివ్వగానే, ఈ సృష్టిలో ఎక్కడా తయారుచేయడానికి సాధ్యపడని పసుపుపచ్చని పదార్థం ఒకటి విడుదలవుతుంది. దానిని బిడ్డ చప్పరించగానే వాడి ప్రేగులు, ఊపిరితిత్తులు పనిచేసి, గుండె మళ్ళీ సాధారణస్థాయిలో కొట్టుకుంటుంది. లోపల గడ్డ కట్టుకున్న నల్లటి మలం విసర్జింపబడుతుంది. అంతేకాక రుగ్మతల బారి నుండి వాడిని వాడు రక్షించుకోవడానికి అవసరమైన నిరోధకశక్తిని సమకూర్చుకొని స్వస్థతను పొందుతాడు.ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ‘నా బిడ్డ’ అన్న భావనతో అమ్మ ఇచ్చిన స్తన్యంలో నుంచి, స్థితికారకత్వమైన విష్ణుతత్త్వంలో నుంచి వచ్చింది. అందువల్ల అమ్మ సృష్టికర్తే కాదు, స్థితి కర్త కూడా! అందుకే మాతృదేవోభవ!

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.

1 comment:

  1. తస్మై నమః పరేశాయ బ్రహ్మణో అనంత శక్తయే అరూపా యోరు రూపాయ నమః ఆశ్చర్యకర్మణే... విదూరాయ, కైవల్యనాథాయ, శాంతాయ, ఘోరాయ, మూఢాయ, నిర్విశేషాయ, సామ్యాయ, జ్ఞానధనాయ’

    ReplyDelete