Breaking News

జాతికి స్ఫూర్తి


హుతాత్ముడవటానికి ముందు రోజు భగత్‌సింగ్ తన సెల్‌లో ఏదో పుస్తకం చదువుకుంటూండగా బయటి నుంచి ఎవరో ‘సర్దార్జీ’ అని మెల్లిగా పిలిచారు. లేచి తలుపు దగ్గరికి వెళితే ‘మీకో సందేశం తెచ్చాను. జవాబివ్వండి’ అన్నాడొకడు రహస్యంగా.
‘సర్దార్జీ! నిజమైన విప్లవకారుడిలా మీరు బయటపడదలిస్తే ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీరు సరే అంటే ఏదో ఒకటి చేయగలం’ అన్నది 14వ వార్డులోని విప్లవ ఖైదీల నుంచి అందిన సందేశం. భగత్‌సింగ్ అప్పటికప్పుడే ఇలా జవాబు రాసి రహస్య దూత చేతిలో పెట్టాడు:

కామ్రేడ్స్! ఒక మనిషిగా నాకూ ప్రాణం మీద తీపి ఉంది. కాని ఖైదులోనో, ఆంక్షల మధ్యో బతికి ఉండటం నాకు అక్కర్లేదు. నా పేరు భారత విప్లవ పక్షానికి ప్రతీక అయింది. విప్లవ సహచరుల ఆదర్శాలు, త్యాగాలు నన్ను ఎంత ఎత్తులో నిలబెట్టాయంటే.. బతికి ఉండటం ద్వారా అంతకంటే ఎక్కువ ఎత్తుకు నేను వెళ్లలేను.
నన్ను ఉరికంబం నుంచి కాపాడితే నా బలహీనతలు పోనుపోను బయటపడతాయి. ఉప్పొంగిన విప్లవ కెరటాలు వెనక్కి తగ్గుతాయి. బహుశా అణగారీపోతాయి. కాని - నేను నవ్వుతూ నిర్భయంగా ఉరికంబమెక్కితే మన దేశంలోని తల్లులు భగత్‌సింగ్‌ను ఆదర్శంగా చూపించి, అతడిలా ఉండమని తమ బిడ్డలకు చెబుతారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసేవారి సంఖ్య ఎంతగా పెరుగుతుందంటే - సామ్రాజ్యవాద పైశాచిక శక్తి విప్లవ పురోగతిని అడ్డుకొనజాలదు.
దేశానికి, మానవాళికి నేను చెయ్యాలనుకున్న దానిలో వెయ్యో వంతును కూడా చేయలేకపోయాను. ఇంకొంతకాలం బతకగలిగితే నా ఆశయ సాధనకు అదనపు సమయాన్ని వినియోగించుకో గలిగేవాడిని. ఇది మినహా నాకు ఏ కోరికా లేదు. నాకన్నా అదృష్టవంతుడెవరు? పరీక్ష కోసం నేను ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.
[Bhagat Singh, The Prince of Martyrs,
L.P.Mathur, P.162]

బలపీఠమెక్కే ముంథు భగత్‌సింగ్ అంతరంగానికి ఈ ఉత్తరం అద్దం పడుతుంది. సాధారణంగా అందరూ బతుకు మీద ఆశలు పెట్టుకుంటారు. భగత్‌సింగ్ తన మరణం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. బతికుండి చేయగలిగిన దానికంటే మరణించి సాధించేదే ఎక్కువ అనుకున్నాడు. తన త్యాగం ఎందరికో ఆదర్శం అయి వేలకొద్దీ భగత్‌సింగ్‌లు తయారవుతారని ఆశించాడు. తన బలిదానంతో అంటుకునే మహా విస్ఫోటనం సామ్రాజ్యవాదుల పీచమణచి, సిసలైన స్వాతంత్య్రాన్ని అతి త్వరగా సాధించి పెడుతుందని గాఢంగా నమ్మాడు.
‘నన్ను ఉరితీయనివ్వండి. ఆ తరవాత వారం రోజుల్లో దేశానికి స్వాతంత్య్రం వస్తుంది’ అని భగత్‌సింగ్ మరణానికి కొద్ది రోజుల ముందు తండ్రి కిషన్‌సింగ్‌కి చెప్పాడు. తన ప్రేరక శక్తి మీద, తన ప్రజల మీద అతడికున్న ప్రగాఢ విశ్వాసం అటువంటిది. అది వెర్రి నమ్మకం అనలేము. తన తాహతును అతిగా ఊహించుకుని చేసిన ఊహాలోక విహారమని తీసిపారేయలేము.
'It is no exaggeration to say that at that moment, Bhagat Singh's name was as widely known all over India and as popular as Gandhi's' (ఆ సమయాన దేశమంతటా భగత్‌సింగ్ పేరు, ప్రఖ్యాతి గాంధీకి సరిపోలుతాయి) అని కాంగ్రెసు ఆధికారిక చరిత్రకారుడు, గాంధీ అనుంగు శిష్యుడు భోగరాజు పట్ట్భా సీతారామయ్యే ఒప్పుకున్నాడు. [The History of the Congress, p.767].

భగత్‌సింగ్ ఉరి విషయంలో గాంథీ కపట నాటకం బయటపడటంతో దేశమంతటా గాంధీ మీద ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ‘గాంధీ ముర్దాబాద్’ ‘్భగత్‌సింగ్ జిందాబాద్’ నినాదాలు ఎక్కడ చూసినా మిన్నుముట్టాయి. కాంగ్రెసు సభల కోసం ఢిల్లీ నుంచి కరాచీకి రైల్లో బయలుదేరిన మహాత్మాజీకి దారిపొడవునా బండి ఆగిన చోటల్లా నల్లజెండాలు, ‘ముర్దాబాద్’ నినాదాలు మరవలేని స్వాగతం పలికాయి. కరాచీ స్టేషనులో ఆయన దిగగానే వేలాది ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలిపారు. ‘వాళ్ల ఆవేశం చూస్తే నన్ను కొట్టినా కొట్టవచ్చు అనిపించింది; ఇంకా నయం అంత పనీ చేయలేదు’ అని సంతోషపడ్డాడాయన. కరాచీలో కాంగ్రెసు వార్షిక మహాసభలోనూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది ప్రతినిధులు నిరసన సూచకంగా మణికట్టుకు నల్లపట్టీ వేసుకున్నారు.
"An Indian carrying a flag rushed at Gandhi and struck his head with the flag pole" (జంఢా పట్టిన ఒక భారతీయుడు గాంధీపైకి ఉరికి జండా కర్రతో ఆయన తల మీద కొట్టాడు.) అని కాంగ్రెసు సభకు ప్రత్యక్ష సాక్షి అయిన విఖ్యాత బ్రిటిషు జర్నలిస్టు రాబర్ట్ బెర్నేస్"Naked Faquir" గ్రంథంలో రాశాడు. [Quoted by Harish Dhillon in
"Shaheed Bhagat Singh" p.237]

భాథిత ప్రజల్లో ఉప్పొంగిన ఆగ్రహావేశాలు ప్రజాకంటక ప్రభుత్వాల పునాదులను కూల్చేసిన దృష్టాంతాలు ప్రపంచ చఠిత్రలో కావలసినన్ని. ప్రపంచమంతటా సంఘర్షణల చరిత్రలను, విప్లవ పోరాటాల గమనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు కనుక జాతి అభిమతాన్ని, సెంటిమెంటును కాలరాచి, తనను అడ్డగోలుగా ఉరితీయటం జాతి జనుల గుండెలను మండించి, బ్రిటిషు దుష్టపాలనను దావానలంలా దహిస్తుందని ఆశించడం భగత్‌సింగ్ అర్థం చేసుకోదగ్గదే. నిజంగానే అతడి మరణంతో ప్రజల ఆగ్రహం పెల్లుబికింది. హర్తాళ్లు, ఊరేగింపులు, నిరసన సభలతో ఊరూరూ ఊగిపోయింది. బ్రిటిష్ అధికారులు, యూరోపియన్లు వీధుల్లోకి రావటానికే భయపడ్డారు. ప్రజల ఉద్విగ్నతను, ఉద్రేకాన్ని పాలపొంగులా చల్లారకుండా ఒడిసిపట్టి, సంఘటితపరచి క్రమపద్ధతిన వ్యూహాత్మకంగా పోరాటం నడిపించటానికి సమర్థుడైన నాయకుడుగాని, సమర్థమైన పోరాట సంస్థగాని, నిజాయతీ, జాతీయ నిబద్ధతగల రాజకీయ శక్తిగాని ఆ సమయాన దేశంలో ఉండి ఉంటే చరిత్రగతి ఎలా ఉండేదో? బహుశా భగత్‌సింగ్ కల నిజమయ్యేదేమో!
కాని నాటి రాజకీయ భారతం ఊసరవెల్లుల ఊసరక్షేత్రం. గదర్ తిరుగుబాటు, లాహోర్ కుట్ర కేసుల్లో సర్కారుకు చిక్కిన సింహాల్లాంటి పోరాట యోధులు అందరూ జైళ్లలో ఉన్నారు. వారు బయటికి వచ్చే ప్రమాదం ఎంత మాత్రం లేకుండా గాంధీ, ఇర్విన్ ఒప్పందం రాజకీయ ఖైదీల విడుదల అంశాన్ని కేవలం కాంగ్రెసు శాల్తీలకే పరిమితం చేసింది. నిస్పృహ చెంది కాడికింద పారెయ్యకుండా దేశంలో అక్కడక్కడ ఇంకా మిగిలిన విప్లవకారులను సాధ్యమైనంత కూడగట్టి కాస్తోకూస్తో కదలిక తెచ్చిన ఏకైక సంస్థ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషను! అసెంబ్లీ బాంబు కేసు దరిమిలా వాసన పట్టి బ్రిటిషు సర్కారు దాని మీద రాక్షసంగా విరుచుకు పడింది. దాని స్థావరాలను, ఆయుధాగారాలను స్వాధీనపరచుకుని దాని ముఖ్యులందరినీ లాహోర్ కుట్ర కేసులో ఇరికించి జైళ్లలో కుక్కింది. చిక్కకుండా మిగిలినవాడు చంద్రశేఖర్ ఆజాద్ ఒక్కడే. తెల్లవాళ్ల గుండెల్లో నిదురపోయిన ఆ మహావీరుడు కూడా భగత్‌సింగ్ ఉరికి నాలుగు వారాల ముందు (1931 ఫిబ్రవరి 27 ఉదయం) ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల అలహాబాద్‌లోని ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో పోలీసుల బారిన పడ్డాడు. తొడలో, కుడిచేతిలో బుల్లెట్లు దిగబడ్డా ఒక్కడు 80 మంది సాయుధ పోలీసులతో 32 నిమిషాలపాటు హోరాహోరీగా పోరాడి నేలకొరిగాడు. (పోలీసులకు చిక్కడం ఇష్టంలేక ఆఖరి బుల్లెట్‌తో ఆజాద్ తనను తానే కాల్చుకున్నాడని చాలామంది చెబుతారు. అది నిజం కాదు. అతడి తలకు తగిలింది పోలీసు బులెట్టేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. మరణించే సమయానికి ఆజాద్ దగ్గర ఇంకా 16 బులెట్లు ఉన్నాయి.)
ఆజాద్ వీరమరణంతో విప్లవ పార్టీ వెన్ను విరిగింది. అక్కడక్కడ మిగిలిన విప్లవకారులకు కాలుచెయ్యి కూడదీసుకుని మహాపోరాటాన్ని నడిపించే చేవగాని వెసులుబాటుగాని లేవు. స్వామి శ్రద్ధానందను గాంధీగారి ‘ప్రియ సోదరుడు’ అబ్దుల్ రషీద్ కాల్చి చంపిన మీదట ఆర్యసమాజ్, హిందూ మహాసభ లాంటి జాతీయవాద సంస్థలూ నిస్తేజమయ్యాయి. మీరట్ కుట్ర కేసుల్లాంటివి మోపి కార్మికోద్యమ కమ్యూనిస్టు నాయకులనూ అందిన మేరకు జైళ్లలో కుక్కారు. ఎటు నుంచి ఎటు చూసినా దేశంలో చైతన్యవంతమైన జాతీయ రాజకీయ సంస్థ కాంగ్రెసు ఒక్కటే. దానికి పోరాట పటిమ ఉంది. గ్రామ స్థాయి నుంచి మెరికల్లాంటి కార్యకర్తలున్నారు. దేశం కోసం చదువులు కట్టిబెట్టి, బంగారం లాంటి వృత్తి వ్యాపారాలు మాని, ఆస్తులు త్యాగం చేసి స్వాతంత్య్రోద్యమ రంగంలోకి దూకిన యోధులు, విశిష్ట వ్యక్తిత్వంతో, త్యాగనిరతితో ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న పెద్దలు జాతీయ కాంగ్రెసులో వేల సంఖ్యలో ఉన్నారు. మహాత్ముడు నిప్పుల్లో దూకమంటే దూకటానికి వెనకాడక, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి, సత్యాగ్రహాలు చేసి, పోలీసు లాఠీలకు ఎముకలు విరిగి తలలు పగులుతున్నా వౌనంగా భరించి, జైళ్లకెళ్లి యమ యాతనలు పడుతూ భారతమాత దాస్య విముక్తికి త్రికరణ శుద్ధితో అంకితమైన స్ర్తిలు, పురుషులు కాంగ్రెసులో కోకొల్లలు. యువతరాన్ని ఉత్తేజపరిచి సమరానికి సమాయత్తపరచగల సేనానులూ, దీక్ష, దక్షత, వ్యూహ రచనా కౌశలం ఉన్న మహా నాయకులూ కావలసినంత మంది ఉన్నారు.
ఏం లాభం? అన్నీ, అందరూ ఉన్నా కాంగ్రెసు వాస్తవానికి ఏమీ, ఎవరూ లేనిది. గాంధీ మహాత్ముడే దానికి కర్త, కర్మ, క్రియ; మహా నియంత. ఆయనకు దేశభక్తి కంటే రాజభక్తి ఒకపాలు ఎక్కువ. బ్రిటిషు సామ్రాజ్య ప్రయోజనాలను కాపాడటం కోసం, దేశీయ జాతీయోద్యమం వల్ల తమ పెత్తనానికి

ప్రమాదం లేకుండా కంట్రోళ్లన్నీ తమ తైనాతీల చేతిలో ఉండేట్టు చేసుకోవడం కోసం బ్రిటిషు ప్రభువులు 1885లో పనిగట్టుకుని పుట్టించిన జాతీయ కాంగ్రెసును వారికి కావలసినట్టు అన్ని విధాల తీర్చిదిద్దిన వాడాయన. ప్రజల తప్పులను భూతద్దంలో చూసి, ప్రాణాంతక ప్రాయశ్చిత్తాలను విధించే అహింసా ప్రవక్తకు విదేశీ పాలకుల పాపిష్టి తప్పులు ఏదో కాస్త మందలించి ఉపేక్షించదగ్గవిగానే ఎప్పుడూ కనపడతాయి.
అందుకే - తాను లండన్‌లో బ్రిటిషు న్యాయశాస్త్రాన్ని పుక్కిట పట్టిన బారిస్టరు అయి ఉండీ గాంధీగారికి క్రిమినల్ న్యాయ ప్రాథమిక సూత్రాలను తుంగలో తొక్కి బూటకపు విచారణతో అక్రమ ట్రిబ్యునల్ జాతీయ వీరుడు భగత్‌సింగ్‌కి అడ్డగోలుగా ఉరిశిక్ష విధించటం బహిరంగంగా ఖండించవలసిన అన్యాయంగా కనపడలేదు. పోనీ ఆ విచారణ అక్రమం, న్యాయవిరుద్ధం అని గాంధీగారు భావించలేదేమో అనుకుందామా? స్పెషల్ ట్రిబ్యునల్‌ను వేయడాన్ని 1930 మే 4న వైస్రాయ్‌కి రాసిన లేఖలో స్వయానా గాంధీజీయే ఇలా అధిక్షేపించారు:
"You have found a short cut through the law's delay in the matter of the trial of Bhagat Singh and others by doing away with the ordinary procedure. Is it any wonder if I call all these activities a veiled form of Martial law?"
[Quoted by Chander Pal Singh in
"Bhagat Singh Revisited", PP.224-225]

(్భగత్‌సింగు, ఇతఠుల విచారణకు సాథారణ ప్రొసిజరును విడనాడి మీరు షార్టుకట్టును కనుక్కున్నారు. ఈ పనులన్నీ మార్షల్ లాకు ప్రచ్ఛన్న రూపమని నేను అంటే తప్పా?)
కాని - మార్షల్ లాకు మరో రూపమని తానే ఆక్షేపించిన అపమార్గంలో న్యాయ నియమ నిబంధనల నడ్డి విరిచి తప్పుడు ట్రిబ్యునల్ భగత్‌సింగ్‌కి ఉరిశిక్ష వేస్తే గాంధీజీ కిమ్మనలేదు. ఆయన ఎంతసేపూ భగత్‌సింగ్‌లో హింసావాదినే చూశాడుగాని న్యాయపరంగా అతడికి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోలేదు. తాను గట్టిగా చేసిన మనవిని మన్నించి ఉరిశిక్షలను వైస్రాయ్ ఆపుతారనే ఆశిస్తున్నట్టు జనానికి చెప్పిన మహాత్ముడు -తీరా ఆ శిక్షలు అమలు జరిగాక ఎందుకిలా చేశారని వైస్రాయ్‌ని బహిరంగంగా నిలదీయలేదు. ఢిల్లీ ఒప్పందం స్పిరిటుకు విరుద్ధంగా భగత్‌సింగును ఉరి తీసినందుకు నిరసనగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సుభాష్ చంద్రబోస్ చెప్పినా గాంధీజీ ఆలకించలేదు.
ఢిల్లీ ఒప్పందంలో భగత్‌సింగ్ విషయం లేదేమని అడిగిన వారికేమో - ‘వైస్రాయ్‌తో చర్చలకు ఒక షరతుగా భగత్‌సింగ్ విషయాన్ని పెట్టకూడదని వర్కింగు కమిటీ చెప్పింది; కాబట్టి ఒప్పందంలో ఒక అంశంగా దీన్ని చేర్చలేదు; చేర్చకపోయినా ఇబ్బంది లేదు. ఒప్పందం అమలయేంతవరకూ భగత్‌సింగ్ క్షేమంగానే ఉంటాడు. ఆర్నెల్ల తరవాత విడుదల కూడా కావచ్చు’ అన్నాడు మహాత్మాజీ. తీరా భగత్‌సింగ్‌ను ఉరితీశాకేమో ‘్ఢల్లీ ఒప్పందంలో ఈ అంశం లేదు కాబట్టి మనమేమీ అనలేము. జాతి సెంటిమెంటుకు విరుద్ధంగా జాతీయ వీరులను ఉరి తీసినా సరే వైస్రాయ్‌తో నా ఒప్పందం అమలు కావలసిందే’ అని కొత్త పల్లవి నందుకున్నాడు.
భగత్‌సింగ్‌ని ఉరితీయటంతో భగ్గుమన్న ప్రజాగ్రహాన్ని అలాగే వదిలేస్తే అది పోనుపోను మరింత తీవ్రమై మొత్తం బ్రిటిషు సామ్రాజ్య పీఠాలనే భస్మీపటలం చేయగలదని గాంధీజీకి తెలుసు. అటువంటి హింసాత్మక విప్లవాన్ని నివారించడానికి ఆదిలోనే నిప్పు కణికలను ఎలా చల్చార్చాలన్నదీ ఆయన బాగా ఎరుగును. తిరుగులేని తన వ్యూహాత్మక నైపుణ్యం, రాజకీయ చాతుర్యం అంతటినీ మహాత్ముడు ఉరి అనంతర ప్రతికూలతను ఎదుర్కోవటంలో చూపించారు. కరాచీ స్టేషనులో దిగినప్పుడు ఆందోళనకారులు తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నల్లబట్టతో చేసిన పుష్పాలు ప్రదర్శిస్తే నవ్వుతూ వాటిని స్వీకరించాడు. కాంగ్రెసు పందిట్లో చేతికి నల్లపట్టీలతో నిరసన తెలిపిన కాంగ్రెసు కుర్రకారును తెలివిగా సముదాయించాడు. కరాచీ మహాసభలో భగత్‌సింగ్ ఉరితీతను ఖండించి, అమరవీరుడికి ఘన నివాళి నర్పించడాన్ని మొట్టమొదటి తీర్మానంగా పెట్టించారు. ఆ తీర్మానం ముసాయిదాను స్వయానా తానే తయారుచేశాడు. భగత్‌సింగ్‌కి గౌరవపాత్రుడైన జవాహర్‌లాల్ నెహ్రూ చేత దాన్ని ప్రవేశపెట్టించాడు. (్భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ కాంగ్రెసు శ్లాఘిస్తున్నదంటూ మొదలుపెట్టిన తీర్మానానికి ముందు... ‘ఏ రూపంలోనైనా రాజకీయ హింసను కాంగ్రెసు సమర్థించకపోయినా’ అన్న షరాను చేర్చడం ఎందుకని లాల్‌బహదూర్ శాస్ర్తీ అభ్యంతరం లేవదీసి సవరణను ప్రతిపాదిస్తే పట్టుబట్టి ఆ సవరణ వీగిపోయేట్టు చేశాడు.) భగత్‌సింగ్ అభిమానుల కంటే బిగ్గరగా కాంగ్రెసు నాయకుల చేత శోకాలు పెట్టించాడు.
కొసమెరుపుగా - భగత్ తండ్రి కిషన్‌సింగ్‌నే పట్టుకొచ్చి ‘మీ నాయకుడు చెప్పినట్టే నడవండి. ఆయన చూపేదే భావికి బాట’ అని కాంగ్రెసు వారికి చెప్పించాడు. ఏది ఏమైనా గాంధీ మహాత్ముడి అహింసా మార్గమే దేశానికి శరణ్యం. భగత్‌సింగ్ కన్న కలలు పండాలంటే గాంధీగారి నాయకత్వాన్ని బలపరచాలి’ అన్న జవాహర్ పండితుడి వింత తర్కంతో కథ సుఖాంతమైంది. కాంగ్రెసు పవిత్ర ప్రాంగణం నుంచి భగత్ భూతోచ్ఛాటన జయప్రదంగా జరిగింది.
ఆపద్ధర్మంగా భగత్‌సింగ్ ధైర్యాన్ని, శౌర్యాన్ని మెచ్చుకోవలసి వచ్చినా, అతడిని గాంధీజీ మొదటి నుంచీ అవాంఛనీయ శక్తిగానే చూశాడు. ‘నాకు భగత్‌సింగ్‌ని కలిసే అవకాశం వచ్చి ఉంటే అతడి మార్గం తప్పని తెలియజెప్పేవాడిని’ అని జనం ముందు బాధపడ్డ మహాత్ముడు తన సత్యాగ్రహ సిద్ధాంతాన్ని తనకంటే బాగా అమలుపరిచి లాహోర్ జైల్లో సుదీర్ఘ నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో కూడా భగత్‌సింగ్‌ని పరామర్శించిన పాపాన పోలేదు. మరణించాక అతడిని గొప్పగా పొగిడినప్పటికీ, భగత్‌కి నివాళిగా స్మారక చిహ్నం నెలకొల్పాలన్న ప్రతిపాదనను గాంధీ గట్టిగా వ్యతిరేకించాడు.
బ్రిటిషు సామ్రాజ్యం పగబట్టి మట్టుపెట్టిన మహావీరుడిని జాతీయ కాంగ్రెసు మహాసంస్థ సర్వాధికారే నిరాదరించటంతో స్వతంత్ర భారత కాంగ్రెసు ప్రభుత్వానికీ భగత్‌సింగ్ ఆదరణీయుడు కాలేకపోయాడు. అసెంబ్లీ బాంబు కేసులో భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లను ఐడెంటిఫికేషను పెరేడ్‌లో గుర్తుపట్టి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన బిల్డరు శోభాసింగ్ (సీనియర్ జర్నలిస్టు ఖుష్వంత్‌సింగ్ తండ్రి)కి బ్రిటిషు ప్రభుత్వం 1944లో ‘సర్’ బిరుదమిచ్చి ఘనంగా సత్కరించింది. భగత్‌సింగ్‌తో కలిసి దేశాన్ని విముక్తి చేయడానికి పోరాడి దీర్ఘకాలం జైలు పాలైన ఎందరో దేశభక్తులను స్వాతంత్య్రం వచ్చాకైనా ప్రభుత్వం సముచితంగా గౌరవిస్తే ఒట్టు. మొత్తం బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించి, జాతికి ఆరాధ్యుడైన భగత్‌సింగ్‌ను కన్నతల్లే కడదాకా పొలంలో పనిచేసి పొట్ట పోసుకోవలసి వచ్చినప్పుడు మిగతా వారి సంగతి చెప్పనే అక్కర్లేదు.
దేశ విభజనతో లాహోర్ పాకిస్తాన్‌లో చేరింది కాబట్టి భగత్‌సింగ్ పుట్టి పెరిగిన చోట్లు, కార్యస్థానాలు ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. బ్రిటిషు వాళ్లు అర్ధరాత్రి దొంగతనంగా ఖండిత శరీర భాగాలను సట్లెజ్ తీరాన తగులబెట్టిన చోట ముగ్గురు హుతాత్ములకు నివాళిగా వెలసిన స్మారక చిహ్నం ఒకటే ఇప్పటికి మిగిలి ఉంది. సగౌరవంగా మృతవీరులకు అంత్యక్రియలు జరిగిన రావీనదీ తీరాన సముచిత స్మారక చిహ్నం నెలకొల్పాలన్న ఆలోచన దేశ విభజనకు ముందు ఏ కాంగ్రెసు పెద్దకూ వచ్చినట్టు లేదు. లాహోర్ సెంట్రల్ జైలు శిథిలమై పాడుబడింది. భగత్‌సింగ్‌ను, అతడి సహచరులను నిర్బంధించిన ‘సెల్సు’ కూలిపోయాయి. వారు ఎక్కిన ఉరికంబం ఉన్నచోట ఇప్పుడు ట్రాఫిక్ రౌండ్ ఎబౌంట్ ఏర్పాటైంది. వాహనాలు పెద్ద రొదతో దాని చుట్టూ తిరుగుతూంటాయి.
ప్రభుత్వాలకు పట్టకపోయినా, అతడి జ్ఞాపకాలను తుడిచివేయాలని ఎన్ని దుష్ట యత్నాలు జరిగినా భారత స్వాతంత్య్ర మహాయోధుడు, విశిష్ట విప్లవకారుడు భగత్‌సింగ్‌ను భారత జాతి మరచిపోలేదు. గాంధీ అంత విరివిగా, ఎల్లెడలా కాకపోయినా ఇప్పటికీ భగత్‌సింగ్ విగ్రహం లేని పట్టణం భారతదేశంలో లేదు. నేతాజీ బోస్‌లాగే భగత్‌సింగ్ పేరిటా ఎన్నో యువజన సంఘాలు దేశంలో పని చేస్తున్నాయి. ఇప్పటికీ భగత్‌సింగ్ పేరు చెబితే యువత పిడికిళ్లు బిగుసుకుంటాయి. ప్రజల ఒళ్లు పులకరిస్తుంది. అతడి జీవితంపై వచ్చిన సినిమాలకు ఎప్పుడూ డిమాండే. భగత్‌సింగ్ ఎప్పటికీ చెదరని ఆదర్శమే! సర్వ జన హితాన్ని, సమసమాజ వ్యవస్థను కాంక్షించి, ఉజ్వల భవిత కోసం పోరాడే పౌరుషవంతులకు అతడు ఎప్పటికీ ఉత్తేజాన్నిచ్చే దివ్యస్మృతే! అద్భుత స్ఫూర్తే!! 
(అయిపోయింది)
మూలం - ఆంధ్రభూమి.

1 comment:

  1. అతడి జీవితంపై వచ్చిన సినిమాలకు ఎప్పుడూ డిమాండే.

    ReplyDelete