ఎవరు చేసిన మోసం?
వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌తో మహాత్మాగాంధి మంతనాలు 1931 ఫిబ్రవరి 17న మొదలై మార్చి 5న ముగిశాయి. ఇరువురూ 8సార్లు సమావేశమై మొత్తం మీద 24 గంటలపాటు రహస్యంగా చర్చించారు. మార్చి 4 అర్ధరాత్రి దాటాక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులోని ముఖ్యాంశాలివి:
1.శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయాలి.
2.రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సులో చర్చించిన భారత భావి రాజ్యాంగ పథకాన్ని పరిశీలించడానికి రానున్న కాలంలో చర్చలను కొనసాగించాలి.
3.ప్రధానమంత్రి ఇటీవలి ప్రకటనను పురస్కరించుకుని సమాఖ్య, రక్షణల ప్రాతిపదికన రాజ్యాంగ సంస్కరణల పథకంపై మునుముందు జరగబోయే చర్చల్లో కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొనాలి.
4.శాసనోల్లంఘన ఉద్యమ సందర్భంలో అరెస్టయిన రాజకీయ ఖైదీలలో హింసాత్మక అభియోగాలు లేనివారిని విడుదల చేయాలి.
మొదటిసారి ఒప్పందం వివరాలను గాంధి నోటి నుంచి విని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవాహర్‌లాల్ నెహ్రు దిగ్భ్రాంతి చెందాడు. ‘మార్చి 4 అర్ధరాత్రిదాకా వర్కింగ్ కమిటీ సభ్యులమందరమూ వైస్రాయ్ హౌస్ నుంచి గాంధి రాక కోసం ఎదురుచూస్తూ కూచున్నాము. ఆయన 2 గంటలకు వచ్చి, మమ్మల్ని లేపి, ఒప్పందం కుదిరిందని చెప్పాడు. మేము ముసాయిదాను చూశాము. అందులో 2వ నెంబరు క్లాజును చూసి నేను షాకయ్యాను. మా ప్రకటిత ధ్యేయమైన స్వాతంత్య్రం కూడా ఆ క్లాజుతో ప్రమాదంలో పడింది. దీని కోసమా మన ప్రజలు సంవత్సరంపాటు అంత గొప్పగా పోరాడుతున్నది? మరునాడు ఉదయం గాంధీజీ ఆ క్లాజుపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కానీ నాకు నమ్మకం చిక్కలేదు’ అని తన ‘ఆత్మకథ’లో నెహ్రు రాశాడు.
ఒప్పందంలో పేర్కొన్న అంశం జవాహర్‌లాల్‌ను అంత బాధిస్తే, అందులో పేర్కొనని అంశం యావద్దేశాన్ని నివ్వెరపరచింది. కోట్లాది ప్రజలు ఎంతగానో ఆశ పెట్టుకున్న విప్లవ వీరుల ఉరి ఎత్తివేత గురిచి ఒప్పందంలో ఊసేలేదు!
వర్కింగ్ కమిటీ చేత లాంఛనంగా మమ అనిపించి, ఒప్పందం మీద సంతకాలు జరిగిన మరునాడు మార్చి 6న అన్సారీహౌస్‌లో గాంధీగారు ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టాడు. ఢిల్లీలోని దేశీయ, విదేశీ పత్రికల సీనియర్ విలేఖరులందరూ హాజరయ్యారు.
‘్భగత్‌సింగ్‌కీ, ఇతరులకూ విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చబోతున్నారా?’ అని ఒక జర్నలిస్టు అడిగాడు.
‘ఆ ప్రశ్న నన్ను అడగకపోవటం మంచిది. దీని గురించి పత్రికల్లో కావలసినంత సమాచారం ఉంది. జర్నలిస్టులు ఎవరికి తోచిన ఊహాగానం వారు చేసుకోవచ్చు. ఇంతకు మించి నేనేమీ చెప్పను’ అని బదులిచ్చాడు మహాత్ముడు.
[The History of the Indian National Congress,
B.P.Sitaramayya, p.757]
మరునాడు (మార్చి 7న) ఢిల్లీలో గాంథీజీ పెద్ద బహిరంగ సభలో మాట్లాడాడు. అక్కడ ఆయనకి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తూ ఎవరో ఒక ఎర్ర కాగితం ఆయనకిచ్చారు. వాటిలో ఒక ప్రశ్న భగత్‌సింగ్, అతడి కామ్రేడ్ల సంగతి ఏమి చేశారన్నది. దానికి మహాత్ముడు ఇలా జవాబిచ్చాడు:
‘బహుశా నేను కాకుండా మీరు వైస్రాయ్‌తో మాట్లాడి ఉంటే, ఇంతకంటే మంచి ఒప్పందాన్ని ఆయన నుంచి రాబట్టేవారేమో! మాకైతే ఇంతకు మించి సాధించడం చేతకాలేదు. ఒక విషయం మాత్రం చెబుతాను. ఈ మొత్తం చర్చల్లో నాకు నేనుగా స్వతంత్రించి వ్యవహరించలేదు. మొత్తం కాంగ్రెసు వర్కింగు కమిటీ నా వెనుక ఉన్నది. మేము మాకు చేతనైనంత ఒత్తిడిని పెట్టాము. ఒప్పందంలో పొందగలిగిన న్యాయానికి సంతృప్తి చెందాము. సత్యానికి, అహింసకు, న్యాయ పరిమితులకు మా నిబద్ధతను మరచిపోకుండా శాంతి చర్చలను కొనసాగించాము. కాని - మీరు పేర్కొన్న వారందరిని ఇప్పుడైనా విడిపించగలం. అది ఈ ఒప్పందాన్ని మీరందరూ అమలుపరిచినప్పుడే సాధ్యమవుతుంది.
"Let Young India stand by the settlement and fulfil all its conditions, and if God willing, Bhagat Singh and others are alive when we have arrived at the proper stage, they would not only be saved from the gallows but released.'
[Mahatma, D.G.Tendulkar, Vol.III, p.62]
(యువ భారతథేశం ఈ ఒప్పందాన్ని బలపరిచి, అందులోని షరతు లన్నిటినీ నెరవేర్చనివ్వండి. దేవుడి దయ వల్ల మనం సరైన దశకు చేరేసరికి భగత్‌సింగూ, ఇతరులు సజీవంగా ఉంటారు. ఉరికంబం నుంచి తప్పించడం ఒకటే కాదు, వారిని విడిచిపెడతారు కూడా.)
"... If you want the release of the prisoners, change your methods, accept the settlement, and then come and ask me about Bhagat Singh. Come to me six months hence after you have implemented the settlement and ask me the question you are asking today and I promise to satisfy you.'
[Mahatma, D.G.Tendulkar, Vol.III, p.63]
(ఖైథీలు విడుదల కావాలంటే మీ పద్ధతులు మార్చుకోండి. ఒప్పందాన్ని అంగీకరించాక నా దగ్గరికి వచ్చి భగత్‌సింగ్ సంగతి అడగండి. ఒప్పందాన్ని అమలుపరిచి, ఆరు నెలల తరవాత నా దగ్గరికి వచ్చి ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నను అడగండి. మిమ్మల్ని తృప్తిపరుస్తానని మాట ఇస్తున్నాను.)
దీన్నిబట్టి ఏమనుకోవాలి?
గాంధిగారు, వర్కింగ్ కమిటీ అన్నీ ఆలోచించే వైస్రాయ్‌తో చర్చల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భగత్‌సింగు, అతడి సహచరుల ఉరి తప్పించే విషయాన్ని చర్చల్లో ఒక షరతుగా కావాలనే చేర్చలేదు. (ఆ సంగతి 1931 ఏప్రిల్ 2న ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధిగారే స్పష్టంగా చెప్పారు.) కాంగ్రెసు అహింసకు కట్టుబడిన పార్టీ కనుక హింసాత్మక అభియోగాల్లో శిక్షపడ్డ విప్లవకారుల శిక్ష తగ్గింపును శాంతి చర్చల్లో ఒక కండిషనుగా చేర్చటం బాగుండదన్న ఉద్దేశంతోటే బహుశా అలా నిర్ణయించారు. చర్చనీయాంశాల్లో వాచ్యంగా చేర్చకపోయినా, లోపాయకారీగా విప్లవకారులను కాపాడటానికి గాంధీజీ వైస్రాయ్ మీద శాయశక్తులా ఒత్తిడి తెచ్చి ఉంటారు. అది వైస్రాయ్ మీద బాగా పని చేసిందని సంతృప్తి చెందారు. పొందగలిగిన న్యాయానికి సంతోషిస్తున్నాము అని మహాత్ముడు అన్నాడంటే ముగ్గురు విప్లవకారులను ఉరి తీయబోమని వైస్రాయ్ నుంచి జనాంతికంగా గట్టి హామీయే ఆయనకి వచ్చి ఉండాలి.
మహాత్ముడి మాటలను అందరూ అలాగే అర్థం చేసుకున్నారు.
పాపులను క్షమించటంలో గాంధీ మహాత్ముడు బహు ఉదారుడు. అప్పటికి నాలుగేళ్ల కింద (1926 డిసెంబరు 22న) మహాత్మా శ్రద్ధానందను క్రూరంగా కాల్చి చంపిన అబ్దుల్ రషీద్‌నే ‘బ్రదర్’ అని సంబోధించి, హత్యానేరంలో అతడు దోషి కానే కాడని పబ్లిగ్గా ప్రకటించిన దయామయుడాయన. (అబ్దుల్ రషీద్‌కి ఉరి తప్పించాలనీ ఆయన గుంభనంగా తంటాలు పడ్డాడని లోకులు చెప్పుకుంటారు. నిజమెంతో తెలియదు.) జీవితాంతం అహింసకు అంకితమై, దళిత జనోద్ధరణకు గాంధీ కంటే మిన్నగా పాటుపడి, హిందూ - ముస్లిం సఖ్యత కోసం పరితపించిన స్వామి శ్రద్ధానంద వంటి మహాపురుషుడిని, తీవ్ర జ్వరంతో జబ్బు పడి మంచం నుంచి కదలలేని స్థితిలో పైశాచికంగా కాల్చి చంపిన పాపాత్ముడినే పల్లెత్తు మాట అనకుండా క్షమించి అక్కున చేర్చుకున్న మహాత్మాజీ-
పంజాబ్ కేసరి లాలా లాజపత్‌రాయ్ అంతటి జాతీయ నాయకుడిని వేల జనం చూస్తూండగా, నిష్కారణంగా గొడ్డును బాదినట్టు చావబాదిన సాండర్స్ అనే తెల్ల పోలీసు రాకాసిని మాటువేసి చంపి, జాతి జనుల కసి తీరా ప్రతీకారం తీర్చుకున్న భగత్‌సింగ్ అనే జాతీయ వీరుడిని క్షమించలేడా? అలాగే 1921లో ఖిలాఫత్ తిమ్మిరిలో 1500 మంది మలబార్ హిందువులను నరికి పోగులు పెట్టి, భర్తల ముందే భార్యలను చెరిచి, గర్భవతుల పొట్టలు కోసి, బతికుండగానే చర్మాలు ఒలిచిన మాప్లాల రాక్షస కృత్యాలను సైతం క్షమించి-
‘మాప్లాల సాహసాన్ని మనం మెచ్చుకోవాలి. ఈ మలబారీలు తాము మతం అనుకున్న దాని కోసం మతబద్ధమని తాము అనుకున్న పద్ధతిలో పోరాడుతున్నారు’ అని 1.12.1921 ‘యంగ్ ఇండియా’ పత్రికలో యోగ్యతా పత్రం ఇచ్చిన మహాత్ముడు-
బదిరాంధక ప్రభుత్వానికి వినపడేంత బిగ్గరగా చప్పుడు చేయటం కోసం ఎవరికీ హాని జరగని రీతిలో దీపావళి టపాసు లాంటి తేలిక రకం బాంబులను గురి చూసి జాగ్రత్తగా విసిరిన దేశభక్తుడు భగత్‌సింగ్‌ని మాత్రం క్షమించలేడా? విప్లవకారులు చేసింది హింసా, అయితే ఏ మోతాదు హింస అన్న మీమాంస ఎలా ఉన్నా వారు చేసిన దానిలో స్వార్థంగాని, వ్యక్తిగత ద్వేషంగాని ఈషణ్మాత్రం లేవని, మాతృదేశ విముక్తి కోసమే వారు బలిపీఠం ఎక్కారని మహాత్ముడికి తెలియదా?
ఆయన తనదైన శైలిలో నేర్పుగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. పైకి ఏమీ తేలకుండానే గుంభనంగా కథ నడిపిస్తున్నాడు. ఒడుపుగా చక్రం అడ్డం వేసి వాళ్లకు ఉరి తప్పిస్తాడు - అని జనం ఆశ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే గాంధీజీ కూడా-
‘్భగత్‌సింగుకు, అతడి కామ్రేడ్లకు విధించిన ఉరిశిక్షను జైలుశిక్షగా తగ్గింపజేయడానికి లేచిన ఉద్యమంలో నేనూ ఆసక్తి చూపాను. నేను నా శక్తినంతా ఈ కార్యానికి వెచ్చించాను’ ("I had put my whole being into the task.")
‘వారి శిక్షను తగ్గింఛాలన్నది రాజీ చర్చల్లో ఒక కండిషన్‌గా పెట్టకూడదన్న విషయంలో వర్కింగ్ కమిటీ నాతో ఏకీభవించింది. కాబట్టి ఒప్పందంతో ముడి పెట్టకుండా విడిగానే దాన్ని ప్రస్తావించగలిగాను. ప్రభుత్వం నుంచి ఔదార్యాన్ని ఆశించాను. వైస్రాయ్‌కి శాయశక్తులా నచ్చచెప్పాను. . ("I pleaded with the Viceroy as best I could. I brought all the persuasion at my command to bear on him.")
-అన్న ధోరణిలో మాట్లాడటాన్నిబట్టి విప్లవకారుల ఉరి ఆపమని మహాత్ముడు వైస్రాయ్‌ని తన పద్ధతిలో గట్టిగా కోరే ఉంటాడు. ఆయనంతటి వాడు అంతలా చెప్పాక వైస్రాయ్ ఎలా కాదనగలడు? గాంధీ - ఇర్విన్ ఒప్పందాన్ని సవ్యంగా అమలుపరచగలిగితే భగత్‌సింగు, అతడి సహచరుల విడుదల సాధ్యమేననీ... దాన్ని అమలుపరిచి ఆర్నెల్ల తరవాత తన దగ్గరికి వచ్చి వారి సంగతి ఏమైందని అడిగితే సంతృప్తికరమైన సమాధానం ఇవ్వగలననీ.. సరైన దశకు చేరేసరికి భగత్‌సింగు, ఇతరులు సజీవంగా ఉంటారనీ.. ఉరి తప్పించటమే కాదు - వారిని జైళ్ల నుంచి విడిచిపెడతారు చూస్తూ ఉండండి అనీ-
ఒప్పందం కుదిరిన మూడోనాడు ఢిల్లీ సభలో గాంధీజీ అలా మాట ఇచ్చాడంటే - కనీసం ఆరు నెలల వరకూ భగత్‌సింగును, ఇతరులను ఉరి తీయబోమని, ఆలోగా ఒప్పందం సజావుగా అమలైతే ఉరిశిక్షను రద్దు చేసి వారిని జైలు నుంచి విడిచిపెడతామని వైస్రాయ్ నుంచి ఆయనకు విస్పష్టమైన హామీ అందే ఉంటుంది. సత్యసంధుడైన ఆ మహాత్ముడే అంత భరోసా ఇచ్చాక దిగులెందుకు? ఒప్పందంలో ఉరిశిక్షలు ఆపే సంగతి పేర్కొనకపోతే ఏమైంది? మహాత్ముడే భరోసా ఇచ్చాక ఉరి ఆగినట్టే. ఆర్నెల్లు ఓపికపడితే విప్లవవీరులు మళ్లీ మన మధ్యకు రావటం ఖాయమే - అని ప్రజలు నమ్మారు.
ఘోరంగా మోసపోయారు.
మహాత్ముడు మాట ఇచ్చిన పక్షం రోజులకే (1931 మార్చి 23న) భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరి తీశారు!
ఇది ఎలా జరిగింది? కాంగ్రెసు నాయకులు, కొంతమంది చరిత్రకారులు, గాంధి వీరాభిమానులు చెప్పేదేమంటే - గాంధీగారు విప్లవవీరులను కాపాడాలని సిన్సియర్‌గా ప్రయత్నించారు. తన దౌత్యప్రజ్ఞను, వాదనాపటిమను, తెలివితేటలను పూర్తిగా వినియోగించి వైస్రాయ్ మీద ఒత్తిడి తెచ్చారు. అత్యున్నత న్యాయస్థానమైన ప్రీవీ కౌన్సిలే కుదరదు పొమ్మన్నాక ఉరిశిక్షను ఎలా రద్దు చేయగలం.. యావజ్జీవ ఖైదీగా ఎలా మార్చగలం అని ప్రభుత్వం మడత పేచీ పెట్టే అవకాశం ఉంది. అది గ్రహించే మహాత్ముడు ‘శిక్షను మార్చడం కుదరదనుకుంటే కనీసం ఉరిశిక్షను సస్పెండ్ చేయండి’ అని వైస్రాయ్‌ని కోరారు. ఒకసారి శిక్షను నిలుపు చేశాక, మునుముందు దాన్ని అమలు చేయటం ప్రభుత్వానికి కష్టమవుతుంది, రాజీ ఒప్పందం అమలై, శాసనోల్లంఘన ఉద్యమం ఆగి, రౌండ్ టేబిల్ మలి సమావేశం జరిగి, సుహృద్భావ వాతావరణం నెలకొన్నాక, జాతీయ సెంటిమెంటుకు విరుద్ధంగా విప్లవ వీరులను ఉరి తీసేందుకు ప్రభుత్వం సాహసించలేదు. అలా ఆలోచించే గాంధీజీ ప్రస్తుతానికి ఉరి ఆపితే చాలని లౌక్యంగా అడిగారు. కాని వైస్రాయ్ ఇర్విన్ దానికి అంగీకరించినట్టే కనిపించి, ఉరిని నిలుపు చేస్తున్నట్టే మహాత్ముడికి నమ్మకం కలిగించి, మోసం చేశాడు. ఒప్పందం అయ్యేంతవరకూ మాయమాటలు చెప్పి, సంతకాలు కాస్తా అయ్యాక వైస్రాయ్ అడ్డం తిరుగుతాడని మహాత్మాగాంధీ ఊహించలేదు. కాబట్టి ఇందులో ఆయన తప్పు లేదు - అని!
ఇంకొందరు మేధావులు, చరిత్రకారులు అభిప్రాయం ప్రకారం - వైస్రాయ్ కూడా మంచివాడే. ఉరిశిక్షలు ఆపేస్తామని ఆయన గాంధీగారికి కడుపులో ఏ కుత్సితం లేకుండా మాట ఇచ్చాడు. ఆ సంగతి గాంధీజీ వర్కింగ్ కమిటీ సభ్యులకు తెలియపరిచాడు. అత్యుత్సాహవంతుడైన కాంగ్రెసు నాయకుడొకరి ద్వారా ఆ విషయం బయటికి పొక్కింది. దాని మీద బ్రిటిష్ సర్కారుకు ‘స్టీల్ ఫ్రేమ్’ (ఉక్కు చట్టం) అయిన ఉన్నత అధికార గణంలో కలకలం లేచింది. బ్రిటిషు ఆఫీసరును కాల్చి చంపిన వారి ఉరిశిక్షను నిలుపుచేస్తే తాము మూకుమ్మడిన రాజీనామా చేస్తామని యూరోపియన్ అధికారులు హెచ్చరించారు. వారి ప్రతిఘటన వల్లే వైస్రాయ్ మాట తప్పాడు. దీనికి గాంధీగారిని తప్పు పట్టటం అన్యాయమట! ఆయన వరకూ విప్లవకారుల ప్రాణాలు కాపాడటానికి నిజాయతీగా పాటుపడ్డారు-ట!
నిజమేనా? ఇంతకీ జరిగిందేమిటి? ఎవరు ఎవరిని మోసగించారు?
- మూలం: ఆంధ్రభూమి.
ఎవరు చేసిన మోసం?
ReplyDelete