Breaking News

దురాక్రమణ చైనా నైజం

 


రమారమి రెండునెలల నుంచే చైనా మన దేశం మీద దురాక్రమణ ఆరంభించింది. ‘ఆరంభించింది’ అని ఎందుకంటున్నానంటే, అది దురాక్రమణే అన్న విషయాన్ని ‘అంగీకరించడానికి’ మన ప్రభుత్వం గడచిన రెండు నెలల నుంచే సుముఖంగా ఉంది. చెప్పాలంటే ఈ దురాక్రమణ 10-12 సంవత్సరాల పూర్వం నుంచీ జరుగుతున్న వ్యవహారం. సాధారణ వ్యక్తినైన నేను భారత భూభాగాలలోకి చైనా ప్రవేశం గురించి, ఆక్రమిత భూభాగాలలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి సుమారు 10 సంవత్సరాల క్రితమే ప్రస్తావించాను. ఈ విషయం తెలిసిన చాలామంది కూడా హెచ్చరికలు చేశారు. మన ప్రభుత్వంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారు మాత్రం ఈ విషయం మీద దృష్టిపెట్టేందుకు అవకాశం లేనంతగా తమ విశ్వ సౌభాత్ర భావనలో ఉండిపోయారని చెప్పవచ్చు.

చైనా మనపట్ల ‘విశ్వాసఘాత’కానికి పాల్పడిందనీ, మనను ‘‘మోసం’’ చేసిందనీ వెల్లడించడం ఇప్పుడు జరుగుతోంది. కాని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ గత చరిత్రను పరిశీలిస్తే అది మన మీద దురాక్రమణ జరుపదన్న విశ్వాసాన్ని ఎప్పుడూ కలిగించలేదని స్పష్టమవుతుంది. ఎప్పుడూ దాని ప్రవర్తన విరుద్ధంగానే ఉంది.

ఎలాగంటే ‘టిబెట్‌ ‌స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించి వ్యవహరించాలి’ అని ఒకవైపున అంగీకరిస్తూనే, చైనా తన సైన్యాన్ని టిబెట్‌లో దింపి దానిని స్వాహా చెయ్యడం ఆరంభించింది. చైనా విశ్వాసద్రోహం చెయ్యడమంటూ జరిగితే అప్పుడే జరిగిపోయింది. ఈ తరువాత కూడా మనం పంచశీలలోని పవిత్ర సూత్రాల ఆధారంగా దానితో ఒక ఒప్పందం చేసుకుని శాంతిని నెలకొల్పుకునే ప్రయత్నం చేశాం. అయినా ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపించి ఆ శాంతిని భగ్నం చెయ్యడానికే చైనా ప్రయత్నిస్తూ వచ్చింది. తనకు ఏ కోశానా శాంతి ప్రయత్నం చేయాలని లేదనీ, ఒప్పందాన్ని మన్నించి దురాక్రమణకు పాల్పడకుండా కూర్చోవడం తన నైజం కాదనీ చైనా స్పష్టంగానే తెలియజేసింది. దాని చర్యలన్నీ చూసిన తరువాత కూడా మనపట్ల చైనాకు సహోదరభావం ఉందని, అందుచేత అది దురాక్రమణకు దిగదని ఎవరైనా విశ్వసించి ఉంటే, అది విశ్వసించిన వారి తప్పే. చైనా చేసిన విశ్వాస ఘాతుకం ఏమీలేదు. ఎందుకంటే అది ఎప్పుడూ విశ్వాసం కలిగించనే లేదు. మనం చైనా స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనేదే చెప్పుకోదగిన విషయం.

అసలే కాకరకాయ, దానిలో వేపకాయ కలిసింది

‘చైనా మొదటి నుంచీ దురాక్రమణకారి. విస్తరణవాది’ అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కొంతవరకు నిజం. దాని ప్రాచీన చరిత్రను చూస్తే ఛంగిజ్‌ఖాన్‌ ‌వంటి వారు అకారణంగా పొరుగు దేశాలపైన దురాక్రమణలు జరిపి వినాశనం సృష్టిస్తూ ఉండేవారని తెలుస్తుంది. అయితే అది ఇప్పుడు చేసిన దురాక్రమణకు ఈ స్వభావమొక్కటే కారణం కాదు. గత 12, 13 సంవత్సరాలుగా చైనా అవలంబిస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతం కూడా కారణం. ఈ 12, 13 ఏళ్లుగానే తమది కమ్యూనిస్టు రాజ్యమని అది చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు మొట్టమొదటి కమ్యూనిస్టు రాజ్యం రష్యాలో ఉన్న కమ్యూనిజం కన్నా తన కమ్యూనిజం ఎక్కువ స్వచ్ఛమైనదని చైనా చెప్పుకొంటున్నది. ప్రపంచమంతటా కమ్యూనిస్టు రాజ్యం స్థాపన తన లక్ష్యంగా భావిస్తోంది. అందుకొరకై అది విస్తరణవాదానికి పూనుకుంది. అనగా మొదటినుంచీ తన స్వభావంలో ఉన్న సామ్రాజ్యవాద కాంక్ష, దానికితోడు, ఇప్పుడు ప్రపంచ మంతటా కమ్యూనిస్టు రాజ్యాలను ఏర్పాటు చెయ్యాలని పుట్టిన సంకల్పం. ఈ రెండూ ఈనాటి చైనాలో మిళితమై ఉన్నాయి. అంటే ‘అసలే కాకరకాయ, దానిలో వేపకాయ కలిసింది’ అన్న రీతిలో పడిందన్నమాట.

ఇతర దేశాలతో స్నేహం

నేడున్న పరిస్థితిని అర్థం చేసుకొని మన రక్షణకు దృఢమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. సైనికుల సంఖ్యను పెంచడం, వాళ్లకు ఆయుధాలు, యుద్ధసామాగ్రి అందించే ఏర్పాటు చేయడం ప్రభుత్వం చెయ్యవలసిన పని. మన స్వశక్తితో ఉత్పత్తి చేసుకోగల వాటిని ఉత్పత్తి చేసుకోవలసిందే. కాని సుదీర్ఘకాలం జరిగే యుద్ధం కోసం మనం అన్యదేశాలతో స్నేహం చేసుకుని, వారి నుండి లభించగల సంపూర్ణ సహాయ సకారాలను పొందేటందుకు ప్రయత్నించాలి. ఏవో పనికిమాలిన ఊహలు పెట్టుకుని అవసరమైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవడాన్ని అలక్ష్యం చెయ్యకూడదు. అలా చేస్తే చిక్కుల్లో పడతాం.

పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండాలి

దేశంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. బయటి శత్రువుతో యుద్ధం జరుగుతున్న సమయంలో సొంత ఇంటిలోనే మరొక కలహం మొదలైతే చాలా చిక్కులొస్తాయి. పరస్పర విరుద్ధమైన అభిప్రాయ భేదాలను, కుల విభేదాలను, భాషా భేదాలను, రాజకీయ వైషమ్యాలను మనసులలోంచి తుడిచేయాలి. మన సమగ్ర దేశాన్నీ, ఎదుట నిలిచిన శత్రువునూ మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి. నేను ఇది మొదటినుంచీ గట్టిగా చెబుతూనే ఉన్నాను. సంకట స్థితిలో మనసుల్లోకి చీలికలక•, అభిప్రాయభేదాలక• ఆస్కారమిచ్చే ఏ ఆలోచనలను రానివ్వకూడదని సంఘ కార్యకర్తలందరూ భావిస్తారు. సమాజంలో అందరూ ఈ విధంగానే ఆలోచిస్తే చాలా మంచిది. పైకి అందరూ ఇలాంటి మాటలే చెబుతుంటారుగాని, ఆచరణలో మాత్రం తమ పార్టీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఢిల్లీలో కొందరు పెద్ద స్థాయి నేతలు ‘చూడండి! చైనాతో యుద్ధం వచ్చేసింది. మనం చైనా మీద విశ్వాసం ఉంచి ఇప్పటివరకు కొన్ని పొరపాట్లు చేశాం. వాటి ఆధారంగా ఇప్పుడు ఇతర పార్టీల వాళ్లు ఎక్కువ ప్రజాభిమానం పొందుతారు. అలా జరిగితే రాబోయే ఎన్నికలలో మన గతి ఏం కావాలి? కనుక ఈ ఇతర పార్టీ నోళ్లు మూయించడం అవసరం’ అనుకోవడం నాకు తెలుసు.

ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు

ఈ విశాల దేశంలో ప్రజాస్వామ్యం నీడలో తమ జీవితాలను హాయిగా, సుఖశాంతులతో వెళ్లబుచ్చవచ్చునని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అది మంచి భావనే, మన పరంపరకు అనుగుణమే. కాని ఇప్పుడు ఈ ఆశ, నమ్మకం దెబ్బతినే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది.

ప్రజాస్వామ్య దేశాలలో యుద్ధం అనేది ఒక్క మనదేశానికే ఎదురుకాలేదు. మనం ప్రస్తుత ప్రజాస్వామ్యపు పాఠాలను ఎవరి వద్ద నేర్చుకున్నామో ఆ ఇంగ్లండు ఇప్పటికి అనేకసార్లు యుద్ధాలు చేసింది. అయినా అది ఎప్పుడూ తన ప్రజల గొంతులు నొక్కేందుకు ప్రయత్నించలేదు. ఎందుకంటే తమ దేశ ప్రజలు దేశరక్షణకు ఏది ఉచితమని తమకు అనిపిస్తుందో దానినే చెబుతారన్న నమ్మకం ఆ ప్రభుత్వానికి ఉంది. మన ప్రజలపై మన నాయకులకు అటువంటి నమ్మకం బహుశా లేదు. ఇంగ్లండు ప్రజానీకం కూడా తమ దేశాధిపతులు దేశభక్తితోనే వ్యవహరిస్తారన్న నమ్మకం కలిగి ఉండేది. ఆ పరస్పర విశ్వాసం కారణంగా అక్కడ ప్రభుత్వంలో ఉన్నవారు కొన్ని కటువైన వ్యాఖ్యలు వినవలసి వచ్చినా భయపడేవారు కాదు. పైగా ఆ వ్యాఖ్యల నుండి కాస్తో కూస్తో నేర్చుకునేందుకు శ్రద్ధ చూపేవారు.

కనుక ‘‘పరోపదేశే పాండిత్యం’’ అన్న ధోరణికి దిగకుండా స్వయంగా మన మనసుల్లో కూడా పార్టీ పరమైన సంకుచిత భావాలను తొలగించుకొని ‘దేశమంతా ఒక్కటి’ అని భావిస్తూ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నాకు అందిన మరొక సమాచారం ఏమిటంటే, ఒకచోట జిల్లా కలెక్టరు అధ్యక్షతన జాతీయ రక్షణ సమితి ఏర్పాటు చేసిన సభలో ఆ జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెసు నాయకుడు మాట్లాడుతూ ‘ఎక్కడైనా మా ప్రత్యర్థి పార్టీ వాళ్లు మాట్లాడుతూ కనిపిస్తే చాలు, వాళ్లని చితక గొట్టండి’ అన్నాడు. ఈ ధోరణి పరస్పర ప్రేమకు దోహదం చేస్తుందా, భేదభావాలను ఎగదోస్తుందా? ఇంతకూ ఆయనకి ఆ ప్రత్యర్థి పార్టీలతో విరోధమంటూ వస్తే అది కేవలం లోకసభకో, శాసనసభకో, మరొకదానికో జరిగే ఎన్నికలలో మాత్రమే కదా! దేశానికి వచ్చిన ఆపద విషయంలో వాళ్లూ తన తోటివారేగాని శత్రువులు కారు కదా! ఇటువంటి సమయంలో ఇతర పార్టీల వారందరూ విరోధులనుకోవడం, ఒకరినొకరు చితగ్గొట్టుకోవడం ఎంతవరకు గౌరవప్రదం? ఈ మహనీయ దేశపు రక్షణకై జరిగే ప్రయత్నం అంతా తమ ప్రయోజకత్వమే అయినట్లు ఏ సంస్థగాని, ఏ పార్టీగాని వ్యవహరించవలసిన అవసరం లేదని సంఘ స్వయంసేవకులమైన మేము భావిస్తాం.తమ షరతులు కొన్నిటిని అమోదిస్తే యుద్ధ ప్రయత్నాలకు సహాయపడతామని నాగాలు అన్నట్లు మీరు వినే ఉంటారు. ఇటువంటి బేరాలు అగౌరవకరమైనవి.

ఏకపక్ష యుద్ధ విరమణ – ఒక నాటకం

అశాంతిని రెచ్చగొట్టే కొన్ని విధ్వంసక శక్తులు మనచుట్టూ ఉన్నాయని మీకు తెలుసు. చైనా ఏకపక్షంగా యుద్ధాన్ని విరమించింది. ఒకదాని వెనుక ఒకటిగా మన చౌకీలను జయిస్తూ వస్తున్న చైనా ఒక్కసారి మంచిగా మారిపోయి వెనక్కు వెళ్లిపోవడానికి ఎలా సిద్ధమైందా అని అందరికీ ఆశ్చర్యం వేసింది. కాని ఇందులో ఆశ్చర్య పడవలసిందేమీ లేదు. తమ బలం పెంచుకోవడం వలెనే, ఎదుట పక్షపు బలం పెరగకండా చూడడం కూడా యుద్ధనీతిలో భాగమే. భారత ప్రజానీకం శాంతిప్రియులనీ, అంతకుమించి వారి నాయకులు శాంతిప్రియులనీ అందరికీ తెలిసిన విషయమే. నష్టం కలిగినా సరే యుద్ధాలు, పోరాటాలు జరగకుండా ఉంటే చాలుననుకొనే ప్రవృత్తి మనది. భారతమాతను విభజించే ప్రసక్తి వచ్చినప్పుడు కలహాలు, పోరాటాలు జరగకుండా ఉంటే చాలునన్న ఉద్దేశంతో పాకిస్తాన్‌ ఏర్పాటుకు సమ్మతించాం. అదేవిధంగా ఆ పిమ్మట కూడా రక్తపాతం జరగకుండా ఉంటే చాలునని యుద్ధ విరమణ చేసి ఒకరకంగా కశ్మీరు విభజనకు సమ్మతించాం. మన ఈ ప్రవృత్తిని చైనా చక్కగా అర్థం చేసుకుంది. అందుకనే ‘మనం యుద్ధ విరమణను ప్రకటించామంటే భారతీయులు – బాగా జరిగింది, ఇక యుద్ధం, పోరాటం లేవు. ఇక శక్తిని నిర్మించుకోవలసిన అవసరమేముంది? అని తమ తమ పనులు చూసుకోవడంలో పడిపోతారు, బయట శాంతి ఏర్పడింది. కనుక మళ్లీ తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెడతారు. ఈ విధంగా దేశం తన కర్తవ్యాన్ని మరచిపోతుంది’ చైనా అనుకుని ఉంటుంది. నా పర్యటనల సందర్భంలో అనేకమంది ‘ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. ఇంక పెద్దగా కష్టపడి సొమ్ము పోగుచేయవలసిన అవసరం ఉందా? దేశరక్షణకు సంసిద్ధులం కావాలా, అక్కరలేదా?’ అన్న మీ మాంసలో పడడం చూశాను. ఈ విధంగా మన ప్రజల దృఢనిశ్చయాన్ని, సాహసాన్ని పల్చబరచడమే చైనా యుద్ధ విరమణ వెనుకగల ఆంతర్యం అయి ఉంటుంది. మరొక్క విషయం కూడా ఉంది. స్వయంగా దాడిచేసి పొరుగుదేశాలను స్వాహా చెయ్యడమొక్కటే కమ్యూనిస్టల వ్యూహం కాదు. ఇతర దేశాలలో తన సిద్ధాంతాలను సమర్థించేవారికి, అనగా కమ్యూనిస్టులకు బలం కలిగించి, వారి ద్వారా తిరుగుబాట్లు జరిపించి, వారిచేత స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటన చేయించడం, ఆ స్వతంత్ర రాజ్యాల రక్షణ నెపం మీద తమ సైన్యాలను ‘విముక్తి సేన’ పేరుతో అక్కడికి పంపడం, ఆ దేశమంతటా తమ ప్రాబల్యం స్థాపించుకోవడం – ఈవిధంగా కూడా వారి వ్యూహం ఉంటుంది. కమ్యూనిస్టులు చైనాలో సరిగ్గా ఇలాగే చేశారు. అందువల్లనే చాంగ్‌కైషేక్‌ ఓడిపోయి చైనా ప్రధాన భూభాగాన్ని వదిలివెళ్లవలసి వచ్చింది.

పంచమాంగ దళంగా కమ్యూనిస్టులు

భారత్‌లో కూడా ఇటువంటి చైనా పంచమాంగ దళం, అనగా కమ్యూనిస్టులు ఏమీ తక్కువ తినలేదు. కొన్ని రంగాలలో బలపడాలనేది వారి ప్రయత్నం. సాధారణ ప్రజలలో అన్నవస్త్రాల గురించిన సహజ అసంతృప్తిని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాలను కలిగించడానికి వారు ఎప్పటినుంచో కృషి చేస్తున్నారు.

తమకు విదేశీ సహాయం, అనగా చైనా సహాయం అందితే తాము విప్లవ ధ్వజాన్ని ఎగురవేసి ఈ దేశమంతటినీ స్వాధీనం చేసుకోవచ్చుననుకుంటున్నారు భారత కమ్యూనిస్టులు. ఇటువంటి కమ్యూనిస్టులు కొందరు కాంగ్రెసు పార్టీలో చొరబడ్డారు కూడా. వారిలో కొందరు ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఉండే ఉంటారు. లేకపోతే మన ఆకాశవాణిలో కన్నా ముందుగా పెకింగ్‌ ‌రేడియోలో ఇక్కడి సమాచారం కొంత ప్రసారం కావడం ఎలా జరుగుతుంది? మన ప్రభుత్వంలో నేడున్న వారంతా దుష్టులు అని, వారిని అంతం చేసి మనకు సుఖసమృద్ధులను ప్రసాదించ డానికే చైనావారు వస్తున్నారని, ఆ చైనా వారికి మనం సహాయపడాలని అస్సాం నుంచి కలకత్తా వరకు ఈ కమ్యూనిస్టులు ప్రచారం చేస్తున్నారు. వీరు ముందు ముందు ఇటువంటి కుట్రలు, తిరుగుబాట్లను ఇంకెంతగా సాగిస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం. కాని వారి చర్యలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారి ప్రభావానికి గురైన వ్యక్తులను వెతికి, వెతికి, వారి మనసులలోంచి ఆ ప్రభావాన్ని తొలగించడం ప్రతి దేశభక్తుని కర్తవ్యం. ప్రతి గ్రామంలోను, పట్టణాలలో ప్రతివాడలోను ఇలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ విధ్వంసక చర్యలు జరగకుండా అరికట్టే శక్తిని నిర్మాణం చెయ్యాలి.

40-50 ఏళ్ల కమ్యూనిస్టుల విశ్వవ్యాప్త చరిత్ర అంతా కుట్రలతో, విస్తరణవాదంతో, బల ప్రయోగంతో నిండి ఉంది. వాళ్ల భారతీయ శాఖకు దేశభక్తి విషయంలో నూటికి నూరుశాతం వేసి సర్టిఫికెట్లు ఇవ్వడం దురదృష్టం. అయితే ఈ కమ్యూనిస్టు నేతలే మా సంఘకార్యాన్ని విధ్వంసకర మంటున్నారు. ఇంతకూ సంఘ లక్ష్యం ఏమిటంటే, మన ధర్మసంస్కృతులను కాపాడుతూ మాతృభూమి పట్ల పౌరులలో ప్రగాఢ దేశభక్తిని నిర్మాణం చెయ్యడం, ప్రాణాలైనా ఒడ్డి ఆ మాతృభూమిని రక్షించుకోవడం. ఈ ప్రభుత్వం మాదనీ, ప్రభుత్వాన్ని నడుపుతూన్నవారు మా నేతలనీ మేము భావిస్తున్నాం. మా మధ్య కొద్ది అభిప్రాయభేదాలు ఉంటే ఉండవచ్చు. అవి ముఖ్యం కాదు. మరి మన పెద్దలు శత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించలేకపోతే మాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ పొరపాటు వల్ల విధ్వంసకారులైన కమ్యూనిస్టుల ద్వారా చాలా హాని కలుగుతుంది. చైనాతో సహోదరత్వం పాటించిన ఫలితం నేడు మన కళ్లముందుకు వచ్చింది. ఇక చైనాను సమర్థిస్తూ విద్రోహాలకు పాల్పడే కమ్యూనిస్టులతో సోదరత్వం పాటించడం, వాళ్లను కాంగ్రెసులోను, ప్రభుత్వంలోను, రక్షణ సమితులలోను, యుద్ధ సన్నాహాలలోను చొరబడనివ్వడం రేపు ఎటువంటి భయంకర పరిణామాలకు దారి తీయవచ్చు! ఈనాటి కష్టపరిస్థితిలో వీళ్లతో సహోదరత్వం పాటించడం కొత్తగా ఒక పెనుముప్పుకు ఆహ్వానం పలకడమే అవుతుంది.

(‘శ్రీ గురూజీ సమగ్ర గ్రంథావళి: సంఘర్ష పరంపర’  పుస్తకం నుంచి కొన్ని భాగాలు.)

(1962 డిసెంబరు 23న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన సార్వజనికోత్సవంలో గురూజీ ప్రసంగం)

Source - Jagriti Weekly Magazine

1 comment:

  1. 1962 డిసెంబరు 23న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన సార్వజనికోత్సవంలో గురూజీ ప్రసంగం

    ReplyDelete