Breaking News

నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీయే! - Death Secrets of Netaji


సమాజ సేవచేయాలి. అది నీ జీవితలక్ష్యం కావాలన్న తన తండ్రి సలహా మేరకు తన జీవిత లక్ష్యాన్ని బాల్యంలోనే నిర్ధారించుకున్నట్టు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ఓ సందర్భంలో స్వయంగా తెలిపారు. ఐసీఎస్‌లో ఉత్తీర్ణుడైనా మాతృదేశానికి సేవ చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నాడు. జై జవాన్‌ అంటూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 1897 జనవరి 23న కటక్‌ నందు జానకీనాథ బోసు, ప్రభావతి దంపతులకు సుభాష్‌ చంద్రబోస్‌ జన్మించారు. బ్రిటిష్‌ వాళ్ళిచ్చిన ఉన్నత పదవిని తిరస్కరించి, లండన్‌ నుండి స్వదేశానికి వచ్చి, తన రాజకీయ గురువైన చిత్తరంజన్‌ దాస్‌ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమంలో చేరారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు శిక్షల ననుభవించారు. సుభాష్‌ చంద్రబోస్‌. 1938, 39 సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్‌ వారిపై స్వాతంత్య్ర పోరాటాన్ని తేవడానికి నాటి కాంగ్రెస్‌ సహకరించకపోవడంతో తీవ్రమన స్థాపంతో పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, అతివాదులందరిని సంఘటిత పరచి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని ఏర్పరచినారు. బోస్‌ని హత్యా నేరంపై అరెస్టుచేసి, 1940లో విడుదలచేసి, గృహ నిర్భంధంలో వుంచారు. ఆ గృహ నిర్భంధం నుంచి 1941లో (ఇప్పటికి మిస్టరీ) తప్పించుకొని జర్మనీ వెళ్ళాడు. అనేక కష్టాలను, బాధలను మాతృదేశం కోసం అనుభవించాడు. జర్మనీ నియంత హిట్లర్‌ను కలుసుకున్నాడు. దేశ, విదేశాలలో ఉన్న భారత ఖైదీలను కలుసుకొన్నాడు. వారిని సంఘటితపరచి, తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడే యువకులను తీసుకొని 1942 జనవరి 26న అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారతదేశ తొలి స్వతంత్ర జాతీయ సైన్యాన్ని రూపొందించినాడు. అజాద్‌హింద్‌ రేడియో కేంద్రాన్ని బెర్లిన్‌లో ప్రారంభించిన నేతాజీ జపాన్‌ మొదలైన దేశాలలో కూడా ఆయా రాజ్యనేతలను ప్రధానమంత్రులను ప్రభావితం చేయగలిగాడు. అయితే హిట్లర్‌తో విభేధించి, ఒక జలాంతర్గామిలో ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా 25 వేల కి.మి. ప్రయాణించి జపాన్‌ చేరుకున్నాడు. తూర్పు ఆసియాలోని స్వాతంత్య్రోద్యమ సారధిగా 1943లో నేతాజీ నాయకత్వంలో సింగపూర్‌లో అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ ప్రభుత్వాన్ని అనేక దేశాలు గుర్తించడం కూడా జరిగింది.

జైజవాన్‌, ఛలో ఢిల్లీ నే రణ నినాదం చేస్తూ, అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైన్యం నేతాజీ నాయకత్వంలో బయలుదేరింది. దారి పొడవునా విజయపరంపర సాధిస్తున్నాం, భారత్‌, బర్మా సరిహద్దులను దాటి మణిపూర్‌, కోహిమా మైదానాలలో ఆంగ్లసైన్యంలో ఒక్కసారిగా పోరాటం సాగించింది.

భారత భూమి పై తొలిసారిగా అడుగుపెట్టినా అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైన్యం భూమిని ముద్దాడి, ఢిల్లీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలనే సత్సంకల్పంతో ముందుకు సాగుతూ, ఇంఫాల్‌ను చక్రబంధం చేశారు. చాలా కీలకమైంది ఇంఫాల్‌ మరికొద్ది గంటలలోనే స్వాధీనం కానున్నది. ఈ విషయమై ఎవరికీ సందేహం కలుగలేదు. కానీ విధి వక్రించింది. కారణం జపాన్‌ వారు వాగ్దానం చేసిన సహాయం అందలేదు. కారణం రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా ఆటంబాంబు ప్రయోగించడం, దానిపై దెబ్బతినడం లొంగిపోక పోతే మరింతగా తమదేశం నాశనమవక తప్పదని భావించి జపాన్‌ తిరిగిపోయింది. తప్పని పరిస్థితులలో అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యుద్ధ కార్యక్రమాలను నిలిపివేసి, సింగపూర్‌కి వచ్చి తన ప్రభుత్వంలోని సివిల్‌ మిలిటరీ అధికారులతో భవిష్యత్తుగురించి నేతాజీ చర్చించి, అందరూ సింగపూర్‌ని వదిలిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. నేతాజీ సైగాన్‌ చేరి అక్కడ నుంచి ఆగస్టు 17న ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. వారు ఎచ్చటికి వెడుతున్నది ఎవరికీ చెప్పలేదు.

1945 ఆగస్టు 22న టోక్యో రేడియో నుంచి ఒక వార్త నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించారు అని చెప్పింది. ఆ వార్తని నేతాజీ అభిమానులు ఎవరూ నమ్మలేదు. నేటికీ నేతాజీ అదృశ్యం ఒక హిస్టరీగానే మిగిలింది. నేతాజీ అదృశ్యం వార్త విన్న వెంటనే బ్రిటిష్‌ అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ బ్రిటిష్‌ ప్రభుత్వపు సైన్యంలోని భారతీయ సైనికులందరిలో స్వాతంత్య్ర కాంక్ష మరింతగా ప్రజ్వరిల్లి బ్రిటిష్‌ సైనికాధికారులకు భారతీయ సైనికులకు మధ్య హోరా హోరీ పోరాటం జరిగింది. స్వాతంత్య్రం రావడానికి నేతాజీ పోరాటమే ప్రధాన కారణం.1947 స్వాతంత్య్రం రావటానికి ప్రధాన కారణం నేతాజీ పోరాటమే. ఎందుకంటే 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం తరువాత దేశంలో ఎక్కడా స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన సంఘటనలు లేవు. 1942 వరకు ఉద్యమం జరిగింది. కాని నేతాజీ నాయకత్వంలో అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైన్యం బ్రిటిష్‌ వారితో చేస్తున్న పోరాటానికి దేశంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎటువంటి సహాయ, సహకారం గాని, కనీసం నైతిక మద్దతును యివ్వలేదు. ఇది చారిత్రక సత్యం. ఈ సత్యం గ్రహించినవారు స్వాతంత్య్రం రావడానికి కొందరే కారణం చెబుతారు. స్వాతంత్య్రానంతరం నేతాజీ అనుచరులను సమరయోధులుగా కనీసం నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదనే కథనాలు వచ్చాయి.

నేతాజీ పోరాట ఫలితమే 1947 వ స్వాతంత్య్రం రావటానికి కారణమయ్యింది. దురదృష్టకరం ఏమిటంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నేతాజీ లేకపోయినారు. వారి అదృశ్యం వెనుక కారణాలపై ఇప్పటికీ వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసికోవాలి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశభక్తి, క్రమశిక్షణ, పోరాట పటిమ నేటితరానికి స్ఫూర్తిదాయకం వారు నిత్య ప్రాత: స్మరణీయులు.

-వేదుల జనార్దనరావు
మూలం: ఆంధ్రప్రభ దినపత్రిక (23-01-2014)

1 comment:

  1. నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీయే!

    ReplyDelete