Breaking News

నిత్యనూతన స్ఫూర్తి నేతాజీ-Netaji Subash Chandra Bose 118th Birth Anniversary

నేడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

జాతి జీవించి ఉండాలంటే వ్యక్తి మరణించవలసిందే, భారతదేశం స్వాతంత్య్రం పొందాలంటే నేను మరణించవలసి ఉంటుంది అని చాటిన దేశ భక్తుడు సుభాష్‌ చంద్రబోస్‌. ఆయన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. నేతాజీగా ప్రసిద్ధి గాంచిన దేశ భక్తుడు. దేశ స్వాతంత్య్రం సిద్ధించాలంటే పోరాటమే మార్గమని నమ్మి, ఆచరించిన మహనీయుడు. గాంధీజీ మాటే వేదముగా చెల్లుబాటవుతున్న కాలంలో అహింసతోనే స్వరాజ్యం లభిస్తుందని గాంధీ, ఆయన అనుచరులు విశ్వసించి ఆచరిస్తుంటే బోస్‌ మాత్రం గాంధీజీని ధిక్కరిస్తూ, విభేదిస్తూ బ్రిటీష్‌ వారిని దేశం నుంచి తరిమికొడితేనే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని ఆకాక్షించాడు. బ్రిటీష్‌ వారిని పారద్రోలేందుకు మిలిటెంట్‌ పంథాను ఎంచుకొని, సైన్యం ఏర్పాటుచేసి పోరాడి, ధైర్యశాలిగా ఎందరికో ఆదర్శప్రాయుడైనాడు.బోస్‌ 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్‌లో ధనిక కుటుంబంలో జన్మించాడు. తండ్రి జానకీనాథ్‌ బోస్‌, తల్లి ప్రభావతీదేవి. బోస్‌ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్సా కాలేజియేట్‌ స్కూల్‌లోను, కలకత్తాలోని స్కాటిష్‌ చర్చి కాలేజీలోను, ఫిట్జ్‌ విలియమ్‌ కాలేజీలోను, ఉన్నత విద్య కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోను సాగింది. 1920లో భారతీయ సివిల్‌ సర్వీసు పరీక్ష రాసి నాలుగో ర్యాంకు పొంది ఎంపికయ్యాడు. 1921లో ఇండియన్‌ సివిల్‌ సర్వీసు నుంచి వైదొలగి భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ యువజన విభాగంలో చురుకైన, కీలకమైన పాత్ర పోషించాడు. కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణోద్యమ సమయంలో మహాత్మాగాంధీ ఆయనను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్‌ దాస్‌తో కలిసి బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌కు రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. గాంధీజీతో సిద్ధాంతపరం గా విభేదించి 1939లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. గాంధీ అహింసావాదంతో స్వాతంత్య్రం సిద్ధించదని, పోరాటమే సరైన మార్గమని భావించి 1939లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.

బ్రిటీషు ప్రభుత్వం భారత్‌ను సంప్రదించకుండా యుద్ధం ప్రకటించడంతో బోస్‌ ఆగ్రహించి వైస్రారు లార్డ్‌ లిన్‌లిత్‌గోకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాడు. మన శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే ఆలోచనలతో బ్రిటీష్‌ శత్రు దేశాలతో చేతులు కలపాలన్నాడు. ప్రభుత్వం అందుకు బోస్‌ను జైలులో పెట్టింది. ఏడు రోజులు నిరాహార దీక్ష చేయడంతో విడుదల చేసింది కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. నిర్బంధం అధికమవడంతో 1941 జనవరి 19న కలకత్తా లోని ఎల్జిన్‌రోడ్‌లోని తన ఇంటి నుంచి పఠాన్‌ వేషంలో తప్పించుకుని పెషావర్‌ చేరుకున్నాడు. 1941 జనవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌ వాయవ్య సరిహద్దు ప్రాంతం ద్వారా కాబూల్‌ ద్వారా ప్రయాణించి సోవియట్‌ యూనియన్‌ సరిహద్దుకు చేరుకున్నాడు. దేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, రష్యా, ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్‌ జర్మన్‌ల సహకారంతో ఆజాద్‌ హింద్‌ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్‌లో స్వతంత్ర భారత కేంద్రం స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటీషు సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన 4,500 మంది భారతీయ సైనికులతో ఇండియన్‌ లెజియన్‌ ప్రారంభించాడు. నాజీ జర్మన్‌ సైన్యం సహాయంతో బ్రిటీష్‌ వారిని పారద్రోలాలని బోస్‌ ఆకాంక్షించాడు. కానీ ఆశించిన దానికి విరుద్ధంగా హిట్లర్‌ వ్యవహరించడంతో ఒక జర్మనీ నుంచి గుడ్‌హోప్‌ అగ్రం మీదుగా ఆగేయ ఆసియాకు వెళ్ళి అక్కడి నుంచి జపాన్‌ చేరుకున్నాడు. జపాన్‌ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను 1942 సెప్టెంబర్‌లో సింగపూర్‌లో నెలకొల్పాడు. వారి యుద్ధ నినాదం చలో ఢిల్లీగా మారింది. నాటి నుంచే బోస్‌ను నేతాజీగా పిలువసాగారు. బోస్‌ పిలుపుతో చాలామంది సైన్యంలో చేరారు. ఆర్థిక సహాయం కూడా అందించారు. జపాన్‌ ప్రభుత్వం తమ ఆధీనంలోకి వచ్చిన అండమాన్‌ నికోబార్‌ దీవులను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు దత్తత ఇచ్చింది. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ, పౌర నియమాలు రూపొందించి అమలు జరిపేది. ఫౌజ్‌ 3,000 వేల మంది సైనికులతో భారతదేశానికి బయలుదేరి అస్సాంలోని కోహిమాను ఆక్రమించి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. తర్వాత ఇంఫాల్‌ సమీపంలోని మోయిరాంగ్‌ అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. కానీ కాలక్రమేణా ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల ఆహారం సక్రమంగా లభించక సైన్యం నిర్వీర్యం కాసాగింది. 1945 నాటికి ఫౌజ్‌ దళాలను బ్రిటీష్‌ సైన్యం ఓడించి బర్మాను ఆక్రమించాయి. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ శకం ముగిసింది.

1945 ఆగస్టు 18న తైవాన్‌ మీదుగా టోక్యోకు ప్రయాణి స్తుండగా విమాన ప్రమాదంలో బోస్‌ మరణించాడని జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిం చింది. కానీ బోస్‌ శవం మాత్రం కనుగొనలేక పోవడంతో మరణంపై చిక్కుముడి నెలకొన్నది. బోస్‌ మరణంపై నెలకొన్న సందిగ్ధతను నిగ్గుతేల్చడానికి భారత ప్రభుత్వం 1956 మేలో షా నవాజ్‌ ఖాన్‌ కమిటీని జపాన్‌కు పంపి విచారించింది. కానీ ఫలితం శూన్యం. తరువాత 1999-2005లో ముఖర్జీ కమిషన్‌ విచారణ చేపట్టి బోస్‌ మరణించలేదని తన నివేదికను 2005 నవంబర్‌ 8న ప్రభుత్వానికి సమర్పించింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ముఖర్జీ కమిషన్‌ నివేదికను తిరస్కరించింది. 1985లో భగవాన్‌జీ పేరుతో సన్యాసివేషంలో అయోధ్య దగ్గర ఫైజాబాద్‌లో నివసించాడని కొందరి నమ్మకం. కానీ అవన్నీ నిరాధారమని తేలడంతో మరణ రహస్యం నేటికీ శేష ప్రశ్నగానే మిగిలి ఉంది. ఆయన మరణం నేటికీ తరగని దేశభక్తిని, యువతకు స్ఫూర్తిని, పోరాట పటిమను రగిలిస్తున్నది. అందుకే ఆయన జయంతిని దేశ్‌ ప్రేమ్‌ దివస్‌గా జరుపుకుంటూ ఉద్యమ వీరగాథను స్మరించుకోవడం జరుగుతున్నది.
- శ్యామ్‌ కుమార్‌.
మూలం: ప్రజాశక్తి దినపత్రిక (23-01-2015)

2 comments:

  1. నిత్యనూతన స్ఫూర్తి నేతాజీ-Netaji Subash Chandra Bose 118th Birth Anniversary

    ReplyDelete