Breaking News

సామా జగన్ మోహన్ రెడ్డి జీవిత విశేషాలు-Sama Jagan Mohan Reddy


జాతి జెండ కోసం చేసిన బలిదానం 'న భూతో న భవిష్యతి'
జాతీయ జండా అంటే బట్ట/గుడ్డ ముక్క కాదు.
చైతన్య పూరిత జగజ్జననీ...

దాన్ని క్రింద పడేసి ఎవరు తగల పెట్టినా,కాళ్లతో తొక్కినా ఒక తల్లికి పుట్టిన సంతానంగా గుండెలు మండుతాయి. నరాలుప్పొంగుతాయి.
దేశ సరిహద్దుల్లో ఈ జండా రక్షణ కోసం మన జవాన్ లు వీర మరణం పొందుతున్నారు. అమరులై చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతున్నారు.
మరి జెండా రక్షణ కు సరిహద్దులోపల ఒక సామాన్య యువకుడు ఏ వేతనం లేకుండా, ఏ అద్దె/కిరాయి డబ్బులకు ఆశ పడకుండా , తన పక్కన ఎవరి తోడు లేకుండా, రాబోయే మరణం ఊహించి కూడా ఎదురొడ్డి నిలువగలిగే దమ్మున్న దేశభక్తుడి గా చరిత్ర సృష్టించాడు సామా జగన్ మోహన్ రెడ్డి.

స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ దేశపు జెండా కాషాయం వుండాలని డా అంబేడ్కర్, తన ఇద్దరు రాజ్యాంగ సభ సభ్యులు ఒప్పుకున్నా మరొక సభ్యుడి అభ్యంతరం వల్ల ఆ ప్రతిపాదన నిలిచిపోయింది.
అయినప్పటికి మూడు రంగుల జెండా 1947 ఆగస్ట్ 15 జాతీయ పతాకమై రెప రెపలాడినప్పుడు అదే ఉత్సాహంతో ఆ జెండాలో భారత మాతను చూసుకున్నాడు సామా జగన్. ఆ భారత మాత లో బలిదానమైన 3లక్షల మంది జాతీయ వీరులను దర్శించాడు. ఆ వీరుల గుండెల్లో అఖండ భారత ప్రతి ధ్వనులు విన్నాడు. ఆ అఖండ భారతం లోని కోట్లాది ప్రజల ఆకలి కేకలు, స్వేచ్ఛా నినాదాల గొంతుకల వెనుక నున్న వేదన - సంవేదనలను గ్రహించాడు. ఆ వేదనాయుత చప్పుళ్ల లో 1200 సంవత్సరాల దీర్ఘ బానిసత్వపు చీకట్లను చీల్చే వీరుల త్యాగం, ధీరుల కాగడాల కాంతి రేఖల అడుగు జాడల్లో నడుస్తూ, క్రింద పడుతున్న నా జాతీయ పతాకాన్ని ఎత్తి, కోట్లాది భారతీయుల మాన మర్యాదలు, లక్షలాది అమరవీరుల కలలనూ నిలిపి సార్థకం చేయడానికి సామా జగనన్న కాకతీయ సింహమై కదులుతుంటే, దేశ ద్రోహులు, విశ్వాస ఘాతకుల గుండెలు నిజంగానే అదిరినయి. 'ఎత్తిన జెండా దించకన్నా' అంటూ యువ తరంగం పడి లేస్తూ తోడు రాగా త్రివర్ణ పతాకాన్ని మళ్లీ విను వీధుల్లో ఎగరేసిన వీర విక్రమ సింహానికి ఈ జాతి ఎంతగానో రుణ పడివుంది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులందరికీ నిరంతర ప్రేరణాశ్రోతస్సు సామా జగనన్న. జాతీయాభిమానం వున్న ప్రతి భారతీయుడికి ఆదర్శం సామా జగనన్న.
సంకుచిత సంస్థల సిద్దాంతాల కళ్ళద్దాల్లోంచి చూస్తే జగన్ అర్థం కాడు. వినీల ఆకాశం వంటి విశాల భావన తో పరికిస్తే నా జగన్ మాత్రమే కాదు జ్ణానం,శీలం ఏకతల సాధనతో ఎవరెస్టంత ఉన్నతంగా ఎదిగే నా సమస్త భారతం నా కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
ఆ సాధన కోసం అడుగులు వేద్దాం. సామా జగనన్నకు నివాళు లర్పిద్దాం.
(1980 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కాకతీయ విశ్వ విద్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని రాడికల్స్ నేలపై పడేసి నిప్పు పెడుతుంటే పడి లేచే కడలి తరంగాలతొ సామా జగన్ పతాకాన్ని లేపి ఎగరేసినప్పుడు కోటి కోటి భారతీయ శిరస్సులు గర్వంగా పైకి లేచాయి. 'నేరం చేశాం జైలు తప్పదని' భావించిన దుండగులకు ఎదురుగా వచ్చే ధైర్యం లేక 1982 ఎప్రిల్ 29 న సామా జగన్ ని బలిగొన్నాయి.)
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. జాతి జెండ కోసం చేసిన బలిదానం 'న భూతో న భవిష్యతి'

    జాతీయ జండా అంటే బట్ట/గుడ్డ ముక్క కాదు.
    చైతన్య పూరిత జగజ్జననీ...

    ReplyDelete