Breaking News

పూజ్య శంకర భగవత్పాదులు

భారతీయ సంస్కృతిని ప్రపంచ సంక్షేమానికి ప్రతీకగా నిలిపి చరాచర సృష్టిలో భగవంతుడు ఉన్నాడని, భేద భావాలు లేని, అద్వైత తత్వాన్ని లోకానికి అందించిన అపర శంకర భగవత్పాదులు అప్పుడు ఆచరణలో వున్న 72 కి పైగా సమాజానికి హాని చేసే మూఢమైన సంప్రదాయాలను ఖండన మండన చేసి ,భక్తి తత్వాన్ని బోధించిన మహనీయులు.
ఒకసారి వారణాసిలో గంగాస్నానం చేసి కాశీ విశ్వనాథ దర్శనానికై వెళ్తూనప్పుడు ఒక చండాలుడు ఎదురవుతాడు. ఆ చండాలుని ప్రక్కకు జరగమని శంకరులు సూచించినప్పుడు, 'అందరి శరీరాలు అన్నంతో నిర్మితమైనప్పుడు, ఒక శరీరం నుండి మరొక శరీరం దూరంగా ఎందుకు జరగాలి? ఒకవేళ మీలో,నాలో ఒకే చైతన్యం వున్నప్పుడు, దూరంగా జరగమని ఎందుకు అన్నట్లు?' అంటూ చండాలుడి వేసిన ప్రశ్నకు శంకరులు ఆశ్చర్యపడి,సాక్షాత్ పరమేశ్వరుడే తనను పరీక్షించవచ్చాడని గ్రహించి సాష్టాంగపడ్డారు.

బ్రాహ్మణ అనే పదాన్ని బ్రహ్మ తత్వాన్ని సాధన చేసేవారనే అర్థం లో ఉపయోగించారు. ఆది శంకరులు కఠోరశ్రమ చేసి జ్ణాన భక్తి తత్వాలు సమాజంలో ప్రచారం చేసి, భగవద్గీత,ఉపనిషత్తుల పై భాష్యం వ్రాశారు. ఎన్నెన్నో భక్తి స్తోత్రాలను ఈ యుగానికి అందించి, ఏకాత్మ భావాన్ని జాగృతం చేసి, ధర్మ సంస్థాపన గావించిన ఋషి పుంగవులు..
మహాత్మా బసవేశ్వరులు
12 వ శతాబ్దంలో గొప్ప సామాజిక క్రాంతి కి అంకురార్పణ జరిపి, శాశ్వత సత్య సనాతన ధర్మాన్ని ప్రతిపాదన చేసిన సమాజ సంస్కర్త సంత్ బసవేశ్వరులు.విశాల భావన,మానవత్వం,సమతా సందేశాలను అందించి జన జాగృతి గావించిన మహనీయులు.
గాంధీజీ,మానవెంద్ర రాయ్,జయప్రకాష్ నారాయణ, ఆచార్య వినోభా భావే తో పాటు ఆర్థర్ మాయిల్స్,సర్ జేమ్స్ కేంప్బెల్,జాన్ రసెల్ వంటి విదేశీ తత్వ వేత్తలు బసవేశ్వరుడి బోధనలతో ప్రభావితులయ్యారు.
వర్గ,లింగ భేదం లేకుండా అనుభవ మంటపం నిర్మించి,ధర్మసంసద్ ద్వారా మూఢ నమ్మకాలు పారద్రోలి సమతా యుక్త సమాజ నిర్మాణానికి కృషి చేశారు.
కర్నాటక లో జన్మించి,బిజ్జల రాజు వద్ద మంత్రిగా పని చేసి, ఆ తరువాత రాజీనామా చేసి, తన జీవితాన్ని అంతరాలు లేని సమ సమాజం కోసం ధార పోశారు. అన్ని కులాల వారిని, స్త్రీలతో సహా అనుభవ మంటపంలో సభ్యులుగా చేర్చుకుని వచన సాహిత్యం తో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో సమరసతను ఆచరించి బోధించిన మహానుభావులు బసవేశ్వరులు.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. భారతీయ సంస్కృతిని ప్రపంచ సంక్షేమానికి ప్రతీకగా నిలిపి చరాచర సృష్టిలో భగవంతుడు ఉన్నాడని, భేద భావాలు లేని, అద్వైత తత్వాన్ని లోకానికి అందించిన అపర శంకర భగవత్పాదులు అప్పుడు ఆచరణలో వున్న 72 కి పైగా సమాజానికి హాని చేసే మూఢమైన సంప్రదాయాలను ఖండన మండన చేసి ,భక్తి తత్వాన్ని బోధించిన మహనీయులు.

    ReplyDelete