Swami Vivekananda-స్వామి వివేకానంద
స్వామి వివేకానంద, మార్క్స్ వలె పిడివాది కాదు. జ్ఞాన సముపార్జన కు జగత్తును చుట్టి వచ్చాడు.
వివేకానంద తెరచిన మనస్సు, బంధనాలు లేని బుద్ది గలవాడు. రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా తప్ప ప్రపంచం అంతా తిరిగాడు. ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలను సానుభూతి తో పరిశీలించాడు. తన మెదడు తో విశ్లేషించారు. ప్రపంచమే రంగస్థలం గా మానవజాతి కి సేవచేశాడు. అందుకోసం దోహదపడే పరిజ్ఞానాన్ని సంపాదించడానికి విశేషంగా శ్రమించారు.
అనేకమంది ప్రముఖులను కలిశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క మనస్తత్వ శాస్త్ర వేత్త ప్రొఫెసర్ జేమ్స్, స్కాట్లాండ్ కి చెందిన సామాజిక వేత్త ప్రొఫెసర్ పాట్రిక్ గెడోల్స్, ఇటాలియన్ సైంటిస్ట్ ఎన్.టెస్లా, బ్రిటిష్ సైంటిస్ట్ లార్డ్ కెల్విన్, కీల్ విశ్వవిద్యాలయం సంస్కృత పండితుడు ప్రొఫెసర్ డ్యూసన్, ఇండాలజిస్ట్ మాక్స్ ముల్లర్, రష్యా అరాచక వాది కమ్యూనిస్టు నేత పీటర్ క్రొపీటికిన్, ఫ్రాన్సు మతాధికారి లైసన్, సుప్రసిద్ద నాస్తిక వాది ఇంగర్ సోల్, అమెరికా ధనవంతుడు రాక్ ఫెల్లర్ వంటివారిని కలిశారు.
మార్క్స్ తన జీవితం అంతా ఇంగ్లాండ్‌లో చదవడానికి వెచ్చించాడు. అంతేగాని ఏ ఒక్క ప్రముఖున్ని కలవలేదు.తనకు పరాయివి, తెలియనివాటిని ముట్టుకోలేదు.హెగెల్ ను గ్రుడ్డిగా అనుకరిస్తూ వచ్చాడు.కాని ముందు గా ఏర్పరచుకున్న అభిప్రాయం తో భారత్ ని కాముక దేశం గా, కష్టాల దేశం గా వర్ణించాడు.
ఏ జాతి ఐనా బ్రతికి బట్ట కట్టాలంటే ఇతరులకు ఏదైనా ఇవ్వాలి. ఇవ్వకుండా వున్నట్లయితే, కొద్ది రోజుల లోనే చరిత్ర నుండి మటుమాయం అవుతుంది. భారతదేశం దానికి భిన్నంగా వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నదంటే ప్రపంచానికి ఎంతో కొంత ఇస్తూ వస్తున్నదని గుర్తించాలి.
ప్రపంచ విజేత గా స్వామి వివేకానంద ఎదగడానికి ఆయన వ్యక్తిత్వమే ప్రధాన కారణం.
స్వామి వివేకానంద అణగారిన వర్గాల కోసం అంకితం అయ్యాడు.
అవసరం వస్తే త్యాగానికి కూడా వెనుకాడలేదు.
జన్మ సిద్దంగా పోరాడే స్వభావం కలవాడు.
ఇతరుల మెప్పు కోరి సగం సగం మాట్లాడలేదు.
డొంక తిరుగుడు మాటలు చెప్పలేదు.
చూసినది చూసినట్లు పచ్చినిజం చెప్పడానికి కూడా వెనుకాడలేదు.ఫలితంగా ఆగ్రహం, శతృత్వానికి గురైనా భరించారు.
డాంబికం ప్రదర్శించలేదు. భావాలపై బలమైన విశ్వాసం వుండేది.
ఎంత వెచ్చించైనా జ్ఞానాన్ని ఆర్జించే అలవాటు వుంది.
తమ సౌకర్యాలు, ఆరోగ్యం పట్టించుకోలేదు. ఏదో పిశాచం వెంట తరుముతూ వున్నట్లు విశ్రాంతి కూడా తీసుకో లేదు. జీవితమే ఒక యుద్ధం అయితే విశ్రాంతి ఎక్కడుంటుంది?
స్పష్టమైన ఆలోచన, క్షుణ్ణమైన విశ్లేషణ ఆయన సొంతం. స్వామి రచనలు, మాటలు బాంబుల కంటే శక్తి నిచ్చేవి.
రానున్న విజయం పై అపరిమితమైన విశ్వాసం వుండేది. ఆ విజయం కోసం అనుసరించవలసిన మార్గం ఏదో వారికి స్పష్టత వుంది.
స్వామి వివేకానంద ప్రపంచం అంతా తిరగడానికి అంతగా కదిలించింది ఏది?
ఆయన హృదయాన్ని లోతుగా కలవరానికి గురి చేసింది మాతృభూమి లోని ప్రజల దుస్థితి.
దేశ ప్రజల పేదరికం, ఆంగ్లేయుల చేతిలో దాస్యం, శతాబ్దాల పాటు అణిచివేతకు గురైన ప్రజల దృశ్యాలు.. ఇవన్నీ జీవితం అంతా వెంటాడినాయి.
భారత ప్రజల బాధలను నివారించాలన్న ఆలోచన అతనిలో ఆవరించి వుండేది.
పేదప్రజల సేవయే నిజమైన మతం అని, దరిద్రుడే నిజమైన దేవుడని నమ్మాడు. వివేకానందుడిది భౌతిక, సాయుధ పోరాటం కాదు. అది ఆఖరి సాధనం మాత్రమే. పీడిత వర్గాల ప్రజలు నిర్భయంగా, రాజీ పడకుండా లేచి నిలబడాలని, విద్య ను,వెలుగును సంపాదించాలని,సంఘటితమై హక్కులు సాధించుకొమ్మని పిలుపునిచ్చాడు.
చిన్నప్పటి నుంచే విద్యార్ధిగా, సన్యాసి గా,విదేశాలలో వున్నా సరే చదువుకు సమయం కేటాయించారు. అరుదుగా దొరికిన పుస్తకాన్ని అంతే తీవ్రత తో అధ్యయనం సాగించి, సమస్త విజ్ఞాన శాస్త్ర రంగాలలో జరుగుతున్న అభివృద్ధి తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు.
మెదడుకు ఎక్కించడానికి అద్భుతమైన నైపుణ్యం వుండేది. ఒక్కసారి పుస్తకం తిరగేస్తే చాలు అక్షరం పొల్లు పోకుండా తిరిగి అప్పజెప్పేవాడు.
వినేవారికి కరెంట్ షాక్ కి గురిచేసే అద్భుత ప్రసంగాలు చేసి స్వామి వివేకానంద రికార్డు సృష్టించారు.
ఆయన ఉపన్యాసాలు విన్న ప్రజలు, ఇంటికి వెళ్ళి మళ్ళీ తేరుకోవడానికి చాలా సమయం పట్టేది. ఆయనలో కపటం లేదు.ఆయన కు నటించడం రాదు. "సత్యాన్ని "బలి పెట్టి ఎదుటివారిని సంతోష పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.
గద్యం, పద్యం, ప్రసంగం, రచన - ఏదైనా సరే శక్తి వంతంగా, సూటిగా శ్రోతల మనస్సు లోకి వెళ్ళి ప్రభావితం చేస్తాయి.
వంద సంవత్సరాలు గడిచినా
ఇప్పటికీ ఆయన భీకరమైన మాటలు, అసంఖ్యాకమైన ప్రజల జీవితాలను ఆదర్శం, అంకిత భావం వైపు నడిపిస్తూనే వున్నాయి.
30 ఏళ్ల వయస్సులోనే 1893 , సెప్టెంబర్ 11 న చికాగో ప్రసంగం గొప్ప గొప్ప పరిణామాలకు దారి తీసింది. ప్రపంచం, భారతదేశం ఈ సంఘటనతో ప్రభావితం అయింది.
"ప్రతి హిందువు దేశానికి ఎక్కువ మేలు చేయగలడని నిరూపణ చేయడానికి చికాగో వెళ్లాడు. ఏకాకి తనం భారతదేశం పతనానికి మూలకారణం. ఇతర దేశాల నుంచి వేరుగా బ్రతకడం కాదు, ఆచారం పేరుతో గోడ కట్టుకోవడం కాదు, విస్తరణ యే జీవితం. కుంచించుకు పోవడమే మరణమని" తన ప్రసంగాల ద్వారా తెలిపారు.
అమెరికా లో హిందుత్వం పేరుతో ఆయన ఉరిమిన ఉరుములు..ఆయన చేసిన 'గర్జన' భారత్ లో ప్రతిధ్వనించింది. విదేశీ దాస్యం నుండి విముక్తి చేసిన జాతీయ ఉద్యమానికి ఊపునిచ్చింది. ఆ విధంగా స్వామి వివేకానంద నవభారతానికి ప్రవక్త అయ్యాడు.
స్వామి వివేకానంద కాలంనాటికి ప్రపంచం ద్వేషించుకునే మతాలవారిగా చీలి వుంది.
దేనికది ఆధిపత్యం తనదేనంటూ, ఇతర మతాలను హీనంగా చూస్తున్నది.
ఈ అసహనం, ఒంటెత్తు పోకడల మధ్య అందరినీ కలుపుకునిపోయే సమన్వయ ప్రబోధం తో హిందుత్వ సందేశాన్ని తీసుకుని వచ్చి ఘన విజయం సాధించాడు.
ఇతర మతాలు నాశనం అయి, తన మతమొక్కటే మిగిలివుండాలని కలలు కంటున్నవారిని చూసి జాలి పడుతున్నానని స్వామీజీ అన్నారు.
రోమన్ రోలా అను విదేశీ వనిత ఇలా అంటుంది. "ఆయన పలుకులు సంగీత స్వరాలు. ప్రపంచంలోని లక్షలాది ప్రజల హృదయాల్లో ధ్వనిస్తున్న పాటకు - ఏకత, సమన్వయం, ప్రేమ, శాంతి అనే రాగ తాళాలను సమకూర్చారు".
ఘర్షణ, అన్యాయం లేని ప్రపంచాన్ని కోరుకున్నాడు.'హిందువు తక్కువ స్థాయి సత్యం నుండి ఎక్కువ స్థాయి సత్యం వరకు అధిరోహిస్తున్నాడు.' అని స్వామీజీ అంటారు.
స్వామీజీ 40 ఏళ్లు నిండకుండానే దేహం చాలించారు.
స్వామీజీ చివరి జీవిత సంఘటనలు, వచ్చే 1500 సంవత్సరాల పాటు మనందరికీ అత్యంత శక్తి నిచ్చే ప్రేరణదాయక అమృత గుళికలు.
స్వామి వివేకానంద అంటారు
'ఒకరినొకరు విమర్శించుకోవడమే అనర్థానికి హేతువు. అదే సంస్థలను విచ్ఛిన్నం చేస్తుంది.'
తోటి సోదరుల అభిప్రాయాలను గౌరవించడం, సర్ది చెప్పడానికి ప్రయత్నించడం సంఘటనకు బలం ఇస్తుందంటాడు.
'నా జీవితాంతం మురుగు కాల్వలు శుభ్రం చేయమని చెప్పినా, సంతోషంగా చేస్తానంటాడు' స్వామీజీ.
అందుకే కాల పరీక్ష కు తట్టుకుని నిలబడే రామకృష్ణ మిషన్ ని స్థాపించిన సంఘటనా దక్షుడు.
సోదరి నివేదిత (విదేశీ వనిత)కు జీవితాంతం అండగా వుంటానని మాట ఇచ్చాడు. ఒక సారి తన పరిచయం లోనికి వచ్చిన మిత్రులను ఎప్పటికీ వదిలి పెట్టుకోలేదు.
స్వామీజీ కి డబ్బు మీద,విలాసాలపై మమకారం లేదు. ''ఆకాశమే నీ కప్పు, గడ్డి నీ పరుపు, ఏ అన్నం నీకు కళంకం కలిగించలేదు. నీవు ప్రవహించే నదివలె సర్వస్వతంత్రుడివి." అని తనకు తాను తన పద్ధతి ని వివరించాడు.
తన సంచార జీవితం కష్టాలమయం. అమెరికా లో మాట్లాడుతూ "పది సంవత్సరాల పాటు నిద్ర, ఆహారం లేక బిచ్చగాడివలె జీవించాన'ని చెప్పాడు.
ముప్పై రోజులు నిల్వ పెట్టిన రొట్టెలు నా జోలెలో వేసే వారు. ఆ గట్టి రొట్టెలు తింటూ వుంటే నా నోట్లోంచి రక్తం వచ్చేది. ఒక కుండ లో నాన బెట్టుకుని తినే వాడిని. అదంతా నా ఆరోగ్యం మీద ప్రభావం చూపింది".
అన్నం కొరకు యాచించనని, అడగకుండా లభించినదానినే తింటానని సంకల్పం చేసారు. అందువల్ల డబ్బైనా,మరేదైనా గాని స్వామీజీ కి బానిసవలె వచ్చిపడేది అంతేగాని తాను మాత్రం డబ్బుకు దాసోహం కాలేదు.
వ్యక్తిగత ప్రయోజనం కంటే సామూహిక ప్రయోజనం ముఖ్యమని, తను జీవించే సమాజం కొరకు త్యాగం చేయడమే నిజమైన, మౌలిక మైన విలువ అని గట్టిగా నొక్కి చెప్పాడు.మానవ జాతితో మాత్రమే కాదు చరాచర జగత్తు అంతటితో స్వామీజీ మమేకం అయ్యారు.
సన్యాసి గా కఠిన నియమాలు పాలించాడు. స్త్రీలను సాక్షాత్తూ జగన్మాత గా భావించాడు. హృదయంలో పవిత్రత లేనిదే ఆధ్యాత్మిక జీవితం అసాధ్యమని తెలుసుకున్నాడు.
ఆ జగన్మాత తన పని తాను చేసుకుంటూ పోతుంది. నాలాంటి చిన్న చిన్న పురుగులు ఎన్నో అనుక్షణం చచ్చి పోతుంటాయి. ఆమె పనికి అంతరాయం వుండొద్దు. తల్లి వైభవం మాత్రం నిత్యం, నిరంతరం సాగుతూ ఉంటుంది.
స్వామీజీ 40 ఏళ్లు నిండకుండానే దేహం చాలించారు.
వివేకానంద స్వామి మహా సమాధి కి మూడురోజుల ముందు కూడా ధ్యానం చేసాడు. ఆశ్రమంలో పచార్లు చేసాడు. సోదర సన్యాసుల తో కలిసి భోజనం చేసారు. శుక్ల యజుర్వేదం లోని ఒక క్లిష్టమైన శ్లోకం యొక్క అర్థం వివరించారు. మూడు గంటల పాటు శిష్యులకు పాణినీయ వ్యాకరణం బోధించాడు. వేద పాఠశాల ప్రారంభించి, మూఢనమ్మకాలు, దురాచారాలు నిర్మూలించాలని శిష్యులకు సూచించారు.
స్వామీజీ బ్రతికింది తక్కువ కాలమైనా, ఈ లోకంలోకి తాను వచ్చిన పని పూర్తి చేసి, మిగతా పని మనకు అప్పజెప్పి వెళ్లారు.
సాయంత్రం తన గదిలోకి వెళ్ళి ధ్యానం లో కూర్చుని, ఇక అందులోంచి లేవలేదు - మహా సమాధిని పొందారు. ఒక దేవదూత కు, తుఫాను వంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నునికి ఇది చిరస్మరణీయ నిర్యాణం,విముక్తి, పరమపదము, మోక్షం.
- అప్పాల ప్రసాద్.
Swami Vivekananda-స్వామి వివేకానంద
ReplyDelete