Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 9 / 50


1959 దావణగెరె లో సంఘశిక్షావర్గ. వర్గకు వచ్చిన శ్రీ గురూజీ ని కలవడానికి స్థానిక వ్యాపారి అయిన శ్రీ కాసల శ్రీనివాసశెట్టి అనే వ్యక్తి వచ్చారు. మాటల్లో ఆయన ' నేనొక స్వాతంత్ర్య పోరాట యోధుడిని. ఇపుడు మంత్రులు అయినవారిలో చాలామంది నా మిత్రులుగా ఉండేవారు. స్వాతంత్ర్యం రాకముందు నాతోబాటు జైలు జీవితం గడిపినవారే. ఆ రోజుల్లో వారు చాలా త్యాగం చేశారు. అయితే ఇపుడు అధికారం రాగానే వారి పద్ధతే మారిపోయింది. స్వార్థపరులయ్యారు. బాగా డబ్బు సంపాదించారు. ఇలా ఎందుకవుతుంది. దీన్ని సరిచేసే మార్గమేమీ లేదా? ' అనడిగారు. 

అపుడు శ్రీ గురూజీ ' నిజమే. మీరు చెప్పింది తీవ్రంగా ఆలోచించవలసిందే. నా స్వంత అనుభవం ఒకటి చెబుతాను. ఒక సన్యాసి ఉన్నారు. నాకు బాగా పరిచయం ఉంది. గాఢమైన స్నేహమూ ఉంది. భవిష్యత్తులో ఆయన ఒక మఠాధిపతి అయ్యారు. తర్వాత నేను కలవడానికి వెళ్తే ,ఆయన మాట, నడవడికలో చాలా తేడా కనిపించింది. ఏం జరిగింది. ఆయన చేతికి కాసింత అధికారం వచ్చింది అంతే. అది కూడా ఒక మఠానికి చెందిన అధికారం. ఒక సన్యాసి అయిన ఆయనే దాన్ని నిర్వికార భావనతో నిభాయించలేకపోయారు.... ఇలా ఉంటుంది అధికార ప్రభావం...'

తర్వాత సంఘ శిక్షణ గురించి శ్రీ శ్రీనివాస శెట్టికి తెలుపుతూ నిత్యశాఖ కార్యపద్ధతి, అక్కడ లభించే సంస్కారం, దానిద్వారా తయారయ్యే వ్యక్తి మొదలగువాటి గురించి వివరించారు. చివరలో ' అధికారం ఎంతటిదైనా తలను చెడగొట్టగలదు అనేది నిజమే. అధికారంలో ఉండి కూడా తల చెడగొట్టుకోకుండా ఉండాలంటే , దానికోసం వ్యక్తి తనలోని ఉత్తమ సంస్కారాలను కాపాడుకోవడానికి పెద్ద ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది' అన్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. అధికారం ఎంతటిదైనా తలను చెడగొట్టగలదు అనేది నిజమే. అధికారంలో ఉండి కూడా తల చెడగొట్టుకోకుండా ఉండాలంటే , దానికోసం వ్యక్తి తనలోని ఉత్తమ సంస్కారాలను కాపాడుకోవడానికి పెద్ద ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది

    ReplyDelete