ఈ దారి ఎక్కడికి?
ఈ దారి ఎక్కడికి? ఎంత దూరం వచ్చాం? ఏమి సాధించాం?
ఇవి విప్లవకారుల మనసులను తొలుస్తున్న ప్రశ్నలు.
లక్ష్యం స్పష్టం. దేశాన్ని అణగదొక్కిన విదేశీ పెత్తనాన్ని అంతమొందించి, పీడనకూ దోపిడీకీ తావులేని సిసలైన స్వాతంత్య్రం సాధించి తీరాలి. ఒక మహా సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేటప్పుడు సర్వశక్తులూ సమీకరించి చిట్టచివరి దెబ్బ తీసేంతవరకూ పరిమిత విజయాలతోటే తృప్తి పడాలి. ఆ సంగతి తెలుసు. కాని ఇల్లూ వాకిలీ, వృత్తి వ్యాపారాలూ వదిలి పోరాటంలోకి దిగి ఇంతవరకూ నికరంగా సాధించింది ఏమిటి?
బిస్మిల్, అష్‌పాక్, రోహన్, రాజేంద్ర లాహిరి రైలు దోపిడీ చేసింది దేశం కోసం. ఉరికంబమెక్కింది దేశం కోసం. అయినా వారి ఆత్మార్పణకు దేశవాసుల్లో పెద్దగా స్పందన లేదు. సాండర్స్‌ని చంపింది అతడి మీద వ్యక్తిగత కక్షలేవో ఉండి కాదు. ఒక జాతీయ మహానేతను గొడ్డును బాదినట్టు బాది, జాతిని అవమానించినందుకే ప్రాణాలకు తెగించి అతడిని హతమార్చారు. అయినా బాధ్యత పట్టని అరాచక శక్తుల ఆగడంగానే గాంధి లాంటి మహాత్ములు దాన్ని చిత్రించారు. దాంతో జన సామాన్యానికి విప్లవకారులు చేసిన మహా సాహసం విలువ తెలియకుండా పోయింది. రాష్ట్ర రాజధానిలో పట్టపగలు పోలీసు అధికారిని కాల్చి చంపితే తెల్లవాళ్లలో భయోత్పాతం రేకెత్తుందనుకున్న అంచనా తారుమారైంది. సాండర్స్ హత్యతో హడలిపోయి కొంతమంది బ్రిటిషు అధికారులు భార్యాబిడ్డలను స్వదేశానికి పంపించారు. కాని అవి చెదురుమదురుగా జరిగిన ఘటనలు. సాండర్స్ హత్యకు బ్రిటిషు దొరతనం నిర్ఘాంతపోయినా క్రమేణా తెప్పరిల్లింది. విప్లవకారులను ఉక్కుపాదంతో అణగదొక్కడానికి ఆయత్తమైంది.
జిల్లా పోలీసు అధికారిని అతడి కార్యాలయం ముందే చంపినా బ్రిటిషు సర్కారు కిందు మీదు కాలేదు కదా? రాజ ప్రతినిధి అయిన వైస్రాయ్‌నే ఏకంగా లేపేసి తడాఖా చూపిద్దామా - అనీ ఒక దశలో విప్లవకారులు తలపోశారు. ప్రాణాలు పణం పెట్టి గట్టి ప్రయత్నం చేశారు కూడా.
అది 1929 మార్చి 25. హోళీ పండుగ రోజు. ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనే డిన్నర్ పార్టీకి లార్డ్ ఇర్విన్ హాజరవనున్నట్టు సమాచారం అందింది. విప్లవ దళం రంగంలోకి దిగింది. దళనాయకుడు శివ్‌వర్మ. రాజ్‌గురు, జయదేవ్ కపూర్‌లు అతడికి సహాయకులు. ఇంతకు ముందు లాహోర్‌లో స్కాట్‌ను చంపబోయి సాండర్స్‌ను చంపినట్టు పొరపాటు జరగకుండా దళ సభ్యులు ఇర్విన్ మొగం బాగా గుర్తు పెట్టుకున్నారు. ఆ సాయంత్రం నుంచే వైస్రాయ్ హౌస్ బయట మాటువేశారు. ఒక్కొక్కరి దగ్గర రెండు బాంబులు, గుండ్లు నింపిన రివాల్వర్లు, దండిగా అదనపు తూటాలు ఉన్నాయి.
వైస్రాయ్ కారు బయటికి రాగానే మొదట రాజ్‌గురు ‘టార్గెట్’ను గుర్తించి, చేయెత్తి సైగ చేయాలి. వాహనంలో వైస్రాయ్ ఉన్నాడని అతడు నిర్ధారించాక కొద్ది దూరంలోని జయదేవ్‌కపూర్ బాంబు విసరాలి. అది విఫలమైతే మరి కాస్త దూరంలో పొంచి ఉన్న శివవర్మ బాంబు పేల్చాలి. ముగ్గురూ వెంటనే పారిపోవాలి. వీలుకాకపోతే పోరాడుతూ నేలకొరగాలి. అదీ ప్లాను.
వైస్రాయ్ వాహనాన్ని పోల్చుకోవటం తేలిక. దాని మీద బ్రిటిష్ సామ్రాజ్య చిహ్నం ఉంటుంది. మోటారు సైకిళ్ల మీద ముందొకరు, వెనకొకరు చొప్పున రైడర్లు వెంబడిస్తారు. వారి వెనుక సెక్యూరిటీ వాను అనుసరిస్తుంది.
చీకటి పడింది. బంగళా నుంచి ముందో మోటార్‌బైకు రైడరు బయటికొచ్చాడు. అతడి వెనుక బ్రిటిషు సామ్రాజ్య చిహ్నం ‘క్రౌన్’ గుర్తుగల వాహనం. సందేహం లేదు. అది వైస్రాయ్‌దే. రాజ్‌గురు సిగ్నలు కోసం సహచరులు చూస్తున్నారు. అతడు చేయి ఎత్తలేదు. ఏమైందా అని మిగతా ఇద్దరూ వాహనం తమ పక్కగా వెళుతున్నప్పుడు పరీక్షగా చూశారు.
వాహనంలో వైస్రాయ్ లేడు. డ్రైవరు వెనుక ముగ్గురు సీమ దొరసానులు కూచుని ఉన్నారు. తరవాత తెలిసింది. వైస్రాయ్ అంతకు ముందే వేరే చోటికి వెళ్లాడని; అటు నుంచి అటు వేరే దారిలో డిన్నరుకు వెళతాడని.
విప్లవకారులు ఉసూరుమన్నారు.
‘ఒకవేళ బండిలో వైస్రాయ్ ఉన్నా, నేను సిగ్నలు ఇచ్చేవాడిని కాను. ఒకడిని చంపడం కోసం ఇంకో నలుగురి ప్రాణాలు నిష్కారణంగా తీస్తామా?’ అన్నాడు అనంతర కాలంలో రాజ్‌గురు. అదీ నాటి విప్లవకారుల నీతి. ఒక మనిషిని హతమార్చటం కోసం వందల మంది అమాయకులను ఖతం చేయటానికి వెనకాడని ఈకాలపు మిలిటెంట్ల కోవకు చెందరు వారు.
ఏమైతేనేం? ప్లాను పాడైంది. విప్లవకారుల సత్తా చూపించడానికి ఇంకో యత్నం భగ్నమైంది. ఆ కాలాన దేశమంతటా తిరుగుతున్న సైమన్ కమిషన్ సభ్యుల మీద కొన్నాళ్ల కింద చేయబోయిన బాంబు దాడిని కూడా ఊహించని సమస్యల వల్ల చివరి క్షణంలో విరమించుకోవలసి వచ్చింది. ఆగ్రాలో బాంబుల తయారీ జోరుగా నడిచింది. సుఖ్‌దేవ్ పర్యవేక్షణలో లాహోర్‌లోను, శివ్‌వర్మ ఆధ్వర్యాన సహరాన్‌పూర్‌లోనూ బాంబులు కార్ఖానాలు మొదలయ్యాయి. బ్రిటిషు ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు కావలసినన్ని బాంబులు, తుపాకులు సిద్ధంగా ఉన్నాయి. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలు ధారపోయటానికి విప్లవ సైనికులు ఉరకలేస్తున్నారు. సైమన్ కమిషన్ మీదో, వైస్రాయ్ మీదో అనుకున్న విధంగా దాడి చేయలేక పోయినంత మాత్రానే డీలా పడేంత భీరువులు కారువారు. పోరాట పటిమకు కొదవలేదు. పోరాటం ఏ విధంగా అన్నదే ప్రశ్న.
ఇనే్నళ్ల అనుభవాల నుంచి విప్లవకారులకు అర్థమైందేమిటంటే
- ప్రాణాలకు తెగించి ప్రభుత్వంతో తలపడితే సరిపోదు. వారు పోరాడుతున్నది తమ విముక్తి కోసం అన్న నమ్మకం ప్రజలకు కలిగించాలి. కేవలం బాంబులతో, తుపాకులతో పనికాదు. వాటిని ప్రయోగిస్తున్నది తమ బానిసత్వ బంధాలను తెంచే బృహత్ పోరాటంలో భాగంగా అని జనాలకు తెలియజెప్పాలి. వేరే దారిలేక హింసా మార్గం పట్టినప్పటికీ విప్లవకారులు వట్టి హింసావాదులు కారు; రక్త పిపాసులూ కారు; దేశభక్తిలో, ప్రజా సేవా తత్పరతలో వారు ఏ కాంగ్రెసు వాదికీ, మరే రాజకీయ వర్గానికీ తీసిపోరు. ఆ దృఢ విశ్వాసం సామాన్య ప్రజానీకానికి కలిగించలేకపోతే వారి త్యాగం, శౌర్యం, బలిదానాలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. తమది ఆకతాయి హంతకుల మూక అయినట్టు ఒకవైపు బ్రిటిషు పాలకులు, ఇంకో చెంప కాంగ్రెసు పెద్దలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎలా వమ్ము చేయాలి, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా, కార్మిక, కర్షక విమోచనోద్యమాన్ని బలోపేతం చేయగలిగేలా ఎలా అడుగు వేయాలి - అన్న విషయంలో ఆగ్రా ప్రధాన కేంద్రంలో మేధోమథనం కొన్ని రోజులుగా జరుగుతున్నది. దాని గురించి మరీ బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేకుండా తెల్లదొరతనమే చక్కటి అవకాశాన్ని విప్లవకారుల చేతికందించింది.
ఆ రోజుల్లో అఖండ భారతదేశమంతటా స్వరాజ్యకాంక్ష, బ్రిటిషు వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది. సహాయ నిరాకరణోద్యమాన్ని అర్ధాంతరంగా చాలించినది లగాయతు అనేక సంవత్సరాల నిష్క్రియాపరత్వాన్ని వీడి కాంగ్రెసు మహా సంస్థ సైమన్ కమిషన్‌ను నిరసిస్తూ పెద్ద కదలిక తెచ్చింది. దేశమంతటా ఆ కమిషన్‌కు వ్యతిరేకంగా ప్రజా ప్రదర్శనలు, ఆందోళనకారులపై లాఠీచార్జిలు, పోలీసు కాల్పులతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇంకోవైపు సోషలిస్టు భావజాలం యువత మీద బ్రహ్మాండంగా పని చేస్తున్నది. సుభాస్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూల వంటి యువనేతలు కాంగ్రెసులో సోషలిస్టు గ్రూపును కూడగట్టారు. తొలుత కాంగ్రెసులో ప్రచ్ఛన్నంగా పనిచేసిన కమ్యూనిస్టులు బాహాటంగా బయటపడి కార్మిక రంగాన్ని సంఘటితపరచారు. వారి ప్రభావంవల్ల ముంబయిలో మిల్లు కార్మికులు పలుమార్లు సమ్మెలు కట్టి యజమానుల మెడలు వంచి తమ కోర్కెలు సాధించుకున్నారు. కార్మిక రంగంలో పెరుగుతున్న అశాంతి బ్రిటిషు సర్కారుకు చెమటలు పట్టిస్తున్నది.
గాంధీ అన్నా, కాంగ్రెసు కార్యక్రమాలన్నా తెల్లవారికి ఏనాడూ లెక్కలేదు. సత్యాగ్రహంతో మహాత్ముడి విలక్షణ ప్రయోగాలు చల్లగా సాగినంతకాలం తమ ఏలుబడికి ఢోకా ఉండదని వారికి తెలుసు. ఉడుకురక్తపు కాంగ్రెసు వాదులు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభుత్వానికి పెద్ద సమస్య తెచ్చిపెట్టినా, అహింస చక్రం అడ్డంవేసి మహాత్మాజీ తమను సంకటం నుంచి అడక్కుండానే గట్టెక్కించగలడన్న భరోసా వారికుంది. ముఖ్యంగా వారిని చికాకు పెడుతున్నవల్లా ఆ మహాత్ముడి కంట్రోలులో లేని కమ్యూనిస్టు, కార్మిక, విప్లవ వర్గాల కదలికలే. దేశమంతటా బ్రిటిషు వ్యతిరేకత, రాజ్యధిక్కారం ముఖ్యంగా యువజన, శ్రామిక వర్గాల్లో వెల్లువెత్తాయి. ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నవాళ్లు కూడా విప్లవకారులకు రహస్యంగా మద్దతిస్తున్న దృష్టాంతాలు చాలానే ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. సమ్మెలు, ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు సాధారణ విషయాలయ్యాయి. వాటిని అలాగే వదిలేస్తే తమ రాజ్యాధికారానికే ముప్పు వస్తుందని గ్రహించి బ్రిటిషు సర్కారు కత్తులు నూరింది. ఎస్.ఎ.డాంగే, సోహన్‌సింగ్ జోష్, ముజఫర్ అహ్మద్, ఇంకో ముప్పై మంది కమ్యూనిస్టు, కార్మిక నాయకులను అరెస్టు చేసి వారిపై ‘మీరట్ కుట్ర కేసు’ పెట్టింది. దేశంలో సోషలిస్టు భావాలను వ్యాప్తి చేయటానికి ఇంగ్లండు నుంచి వచ్చిన ఫిలిప్ స్ప్రాట్, బ్రాడ్లీ అనే విదేశీయులూ నిర్బంధితుల్లో ఉన్నారు.
అరెస్టులు చేసి కుట్ర కేసయితే బనాయించారు కాని పెట్టిన కేసు న్యాయస్థానంలో నిలబడేట్టు లేదు. నానాటికీ తీవ్రమవుతున్న ధిక్కార ధోరణిని అణచివేయటానికి ఇప్పుడున్న చట్టాలు చాలవని తలచి బ్రిటిషు సర్కారు రెండు కర్కోటక శాసన ప్రతిపాదనలను చేపట్టింది.
మొదటిది పబ్లిక్ సేఫ్టీ బిల్లు. దాని కింద ప్రజా భద్రత నెపంతో ఎవరినైనా అరెస్టు చేసి, కోర్టు ముందు పెట్టకుండా ఎంతకాలమైనా నిర్బంధించవచ్చు. రెండవది కార్మిక వివాదాల బిల్లు. అది సమ్మెలకు దిగలేకుండా ట్రేడ్ యూనియన్ల కాళ్లుచేతులు కట్టేసి, నిర్వీర్యం చేయటానికి ఉద్దేశించినది. రౌలట్ బిల్లులను తలదన్నిన ఈ శాసన ప్రతిపాదనలను యావద్దేశం గర్హించింది. ప్రజా భద్రత కాదు; భారతదేశ శాశ్వత బానిసత్వానికి తలపెట్టిన నల్లబిల్లులు; భారత జాతీయతపై ఎక్కుపెట్టిన అస్త్రాలు అని మోతీలాల్ నెహ్రు, మదన్‌మోహన్ మాలవీయ వంటి జాతీయ నాయకులు వాటిని నిరసించారు. న్యాయస్థానాల స్థానాన్ని కూడా ప్రభుత్వమే ఆక్రమించి, తనపై తిరగబడిన ఏ వ్యక్తినైనా, ఎంత కాలమైనా చెరబట్టాలని చూడటం దుర్మార్గమని అన్ని పార్టీల వారూ ఒక్క గొంతుతో ఖండించారు.
ఏ బిల్లు అయినా చట్టం కావాలంటే చట్టసభలో ఆమోదం పొందాలి. సెంట్రల్ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రెండు బిల్లులనూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త ప్రతిపాదనలకు గల చట్టబద్ధత ఎంతన్నదే అనుమానం. దానిపై తన రూలింగును ఏప్రిల్ 8న ప్రకటిస్తానని సభాధ్యక్షుడు విఠల్‌భాయ్ పటేల్ ప్రకటించాడు. ఆయన పేరు మోసిన జాతీయవాది. ఆయన ఇచ్చే రూలింగు ఎలా ఉంటుందన్న విషయంలో సర్కారుకు భ్రమలు లేవు. సభాపతి సూచనలను మన్నించటానికి ప్రభువులు సిద్ధంగా లేరు. ఏప్రిల్ 8న జరిగే ఓటింగులో ప్రజా ప్రతినిధులందరూ వాటిని వ్యతిరేకించినా సరే నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, తనకు గల ‘వీటో’ ప్రయోగించి ఆ బిల్లులకు చట్టప్రతిపత్తి ఇవ్వటం తథ్యమని వైస్రాయ్ తెగేసి చెప్పాడు.
మరి ఈ పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి? తెల్లవాళ్లు విసిరిన సవాలుకు ఎలా బదులు చెప్పాలి? ఇదీ దేశం ముందున్న ప్రశ్న. ఈ పరిణామాలన్నిటినీ విప్లవకారులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ దశలో తాము చేయవలసింది ఏమిటో ఆలోచించేందుకు హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషను సెంట్రల్ కమిటీ 1929 మార్చి చివరి వారంలో ఆగ్రాలో రహస్యంగా సమవేశమైంది.
అందరిలోకీ స్ఫుటంగా, దృఢంగా మాట్లాడినవాడు భగత్‌సింగ్.
‘వైస్రాయ్ ప్రకటన చూశాము కదా? బ్రిటిషు ప్రభుత్వం బెదిరించో, భయపెట్టో తన రాక్షసపు బిల్లులను సెంట్రల్ అసెంబ్లీ చేత పాస్ చేయించాలని చూస్తున్నది. ప్రజలెన్నుకున్న ప్రతినిధుల ఇష్టానికి వ్యతిరేకంగా తన తైనాతీలైన నామినేటెడ్ సభ్యుల ద్వారా సభామోదాన్ని అడ్డదారిలో పొందాలనుకుంటున్నది. దీన్ని మనం సాగనివ్వకూడదు. ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం లక్ష్యపెట్టకపోతే, అసలు ఆ ప్రభుత్వానికిగల అధికారం ఏపాటిది, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం సవాలు చేసి తీరాలి. దౌర్జన్యంతో ప్రజలను అణచాలని చూసేవారికి దౌర్జన్యంతోనే మనం జవాబు చెప్పాలి. బానిస దేశంలో రాజ్యాంగ ప్రక్రియకు, రాజ్యాంగబద్ధమైన నిరసన ప్రక్రియకు ఉన్న పరిమితులు,
రిలవెన్సు ఏమిటో మన ప్రజా ప్రతినిధులకు కూడా అర్థమయేట్టు చెప్పాలి.
‘తప్పుడు బిల్లులపై దేశమంతటా మారుమోగుతున్న నిరసనలేవీ ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు. ఇంతటి చెవిటి సర్కారుకు కూడా చెవులు బద్దలయేంత బిగ్గరగా మన గొంతును వినిపించాలి’
ఔను. భగత్ చెప్పిందే రైటు అని అందరూ అంగీకరించారు.
నల్లచట్టాలు చేయటానికి సర్కారు సెంట్రల్ అసెంబ్లీని ఇష్టానుసారం వాడుకోజూస్తున్నది కాబట్టి, ఆ దురాగతాన్ని తెగనాడే విప్లవ చర్యకు కూడా ఆ అసెంబ్లీయే వేదిక కావాలి.
ఈ విషయంలోనూ రెండో మాట లేదు.
మరి ఆ చర్య ఎలా ఉండాలి? సభ కొలువు తీరినప్పుడు వెలుపల నిరసన ప్రదర్శన చేయాలా? ప్రభుత్వ దుర్నీతిని బయటపెడుతూ పోస్టర్లు అంటిద్దామా? అరెస్టులకు సిద్ధపడి కరపత్రాలు పంచిపెడదామా? సభా కార్యక్రమం జరుగుతూండగా చట్టసభలోనే నినాదాలు చేద్దామా?
ఎవరికి తోచిన సూచనలు వారు చేశారు. కాని ఏదీ నచ్చలేదు. పోస్టర్లను, కరపత్రాలను ప్రభుత్వం అనుమతించదు. వాటిని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. పార్లమెంటు దరిదాపులకు ఆందోళనకారులను అనుమతించరు.
అప్పుడు భగత్‌సింగ్ మనసులో ఫ్రెంచి అనార్కిస్టు వేలన్ (ఖఖఒఆ ఘ్ఘేజశఆ) మెధిలాడు. అతడు ఎన్నో కార్మిక సంఘాలు పెట్టి ఎన్నో పోరాటాలు చేశాడు. బహిరంగసభల్లో లెక్కలేనన్ని ఉపన్యాసాలిచ్చాడు. అయినా కార్మిక వ్యతిరేకులైన పెత్తందారీ వర్గాలు పట్టించుకోలేదు. వారిని ఉలిక్కిపడేట్టు చేయటం కోసం అతడు ఫ్రాన్స్ అసెంబ్లీలో బాంబు వేశాడు. తాను ఏ ఉద్దేశంతో, ఏ పరిస్థితుల్లో ఆ సాహసం చేయవలసి వచ్చిందీ తన వాఙ్మూలంలో జడ్జి ముందు ఉద్వేగభరితంగా వివరించాడు. ఆ స్టేట్‌మెంటును బాకునిన్ రాసిన శ్ఘూష్దజఒౄ ఘశజూ యఆ్దళూ ఉఒఒ్ఘకఒ గ్రంథంలో కాలేజి విద్యార్థిగా ఉండగా భగత్‌సింగ్ చదివాడు. లాహోర్ ద్వారకాదాస్ లైబ్రరీలో ఆ ప్రకటన చదివీ చదవగానే ‘మనమూ అలాగే చేయాలి’ అని అరిచాడు కూడా. ఇప్పుడూ దానికి మించిన ఉపాయం ఏముంది?
‘సభ జరుగుతూండగా అసెంబ్లీలో బాంబు వేద్దాం’ అన్నాడు భగత్‌సింగ్.
ఆ పలుకు బాంబులా పేలింది. అందరూ ఉలిక్కిపడ్డారు. సెక్యూరిటీ బందోబస్తు మస్తుగా ఉండే సెంట్రల్ అసెంబ్లీలో బాంబా? అదెలా కుదురుతుంది? దాన్ని లోపలికి ఎలా తీసుకువెళ్లగలం? వందల సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉండగా బాంబు వేస్తే ఎన్ని ప్రాణాలు పోతాయో? అది అవసరమా? అంతమందిని చంపి మనం ఏమి సాధిస్తాం? అలా చేస్తే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారా? కనీసం క్షమిస్తారా?
ఇలా ఎన్నో శంకలు. అభ్యంతరాలు. ప్రతిపాదన పెట్టిన భగత్‌సింగే అనుమానాలనూ నివృత్తి చేశాడు.
మన ఉద్దేశం చెవిటి సర్కారుకు వినపడేంత పెద్ద చప్పుడు చెయ్యాలని! అంతే తప్ప మనుషుల ప్రాణాలు తీయటం కాదు. కాబట్టి మనం విసిరేవి ఎవరికీ ముప్పు వాటిల్లనంతటి తేలికరకం బాంబులు. వాటివల్ల భయోత్పాతం రేకెత్తుతుంది. కన్నూమిన్నూగానని దుష్ట ప్రభుత్వాన్ని దానికి అర్థమయ్యే భాషలో సవాలు చేసినట్టు అవుతుంది. మన ఆశయం ఏమిటో, దేని కోసం పని చేస్తున్నామో యావత్ప్రజానీకానికి వివరించడానికీ అవకాశం వస్తుంది.
ఈ ఆలోచన అందరికీ నచ్చింది.
‘ఔను, అలాగే చేద్దాం’ అన్నారు కేంద్ర కమిటీ సభ్యులందరూ.
ఈ దారి ఎక్కడికి?
ReplyDelete