దటీజ్ రాజ్‌గురు! - భగత్‌సింగ్
ఓ రోజు ఆగ్రా ఇంట్లో అందరూ కూచుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
మీరు అరెస్టంటూ అయితేగియితే ఏ పరిస్థితుల్లో అవుతారు? దానికి ఎలా స్పందిస్తారు? అందరూ చెప్పండి - అన్నారెవరో.
ముందు రఘునాథ్ (రాజ్‌గురు మారుపేరు) మొదలెట్టాడు.
‘ఈ దొరగారు (అంటే తానే) నిద్రపోతూండగా పట్టుబడతారు. తెలుసు కదా? సార్ నడుస్తూ కూడా నిద్రపోగలరు! అలాగే ఓ రోజు నిద్రలేచేసరికి పోలీసు లాకప్‌లో ఉంటారు. కళ్లు నులుముకుని, ‘ఇంతకీ నేను నిజంగా అరెస్టయ్యానా? కలగంటున్నానా?’ అని సెంట్రీని అడుగుతారు.’
అంతా కడుపుబ్బ నవ్వారు. తరువాత వంతు మోహన్ (బటుకేశ్వర్‌దత్)ది.
‘నేను ఏ పార్కులోనో హాయిగా వెనె్నలని ఆస్వాదిస్తుండగా పట్టుకుంటారేమో; ‘చూడండి - చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో’ అంటాను సంకెళ్లు వెయ్యడానికి వచ్చిన వాళ్లతో.
మరి భగత్‌సింగ్ మాటేమిటి?
‘నేను అరెస్టంటూ అయితే అది సినిమా హాల్లోనే! అప్పుడు ఏ విజయ్‌కుమారో నా పక్కన ఉంటాడు. ‘పట్టుకుంటే పట్టుకున్నారు. మీతో వస్తాములే. కొంపలేమీ మునిగిపోవు. ముందు అందరం సినిమా చివరిదాకా చూద్దాం’ అంటాను పోలీసులతో.’
ఔను. నువ్వు అంతటివాడివేలే - అన్నారు మిత్రులు. మరి మీ సంగతేమిటని పండిట్జీ (ఆజాద్)ని అడిగారు.
‘నేనా? ఏ బుందేల్‌ఖండ్ ఫారెస్టులోనో వేటాడుతూ సొమ్మసిల్లిన స్థితిలో నేను బాగా నమ్మిన ఏ ఠాకూరో చేసిన ద్రోహంవల్ల పట్టుబడతానేమో. మళ్లీ స్పృహలోకి వచ్చేసరికి నాకు రాజ్యద్రోహ నేరానికి ఉరిశిక్ష వేసేశారని తెలుస్తుందేమో’
అప్పుడు భగత్‌సింగ్ హాస్యమాడాడు. ‘పండిట్జీ! మిమ్మల్ని ఉరి తీయాలంటే రెండు తాళ్లు కావాలి! ఒకటి మెడకు వేయటానికి. రెండోది మీరు పెంచి పెద్ద చేసిన పొట్టను గట్టిగా చుట్టటానికి’
ఆజాద్ మొగం చిట్లించాడు. ‘ఏం? తమాషాగా ఉందా? ఉరికంబమెక్కాలని నేనేమీ సరదా పడటం లేదు. అది కలలో మాట. అయినా ఈ మంత్రదండం (వౌజర్ రివాల్వర్) నా దగ్గర ఉన్నంతకాలం నాపై చెయి వేయడం ఈ భూమి మీద ఎవరితరం?’ అన్నాడు మీసాలు మెలేస్తూ.
[Chandra Shekhar Azad - A Biography, Malwinderjit Singh Waraich, Sangram Singh p.127]
సరిగ్గా అలాగే జరిగింథి. చంద్రశేఖర్ ఆజాద్ కంఠంలో ప్రాణం ఉండగా పోలీసులకు పట్టుబడలేదు. చివరి క్షణం దాకా తుపాకితో ఫైర్ చేస్తూనే నేలకొరిగాడు. భగత్‌సింగ్ పోలీసులకు పట్టుబడి ఉరికంబమెక్కాడు. రాజ్‌గురు నిద్రపోతూనే పోలీసులకు చిక్కాడు.
పై సంభాషణలో రాజ్‌గురు తాను నడుస్తూనే నిద్రపోగలను అన్నది సరదాకు చెప్పింది కాదు. నడచేటప్పటి సంగతి ఏమోగాని అతడు నిలబడే నిద్రపోగలడు.
ఆగ్రాలో ఉండగా ఓ రోజు రాజ్‌గురు ఎవరికీ కనపడలేదు. చుట్టుపట్ల గాలించారు. జాడలేడు. పార్టీకి చెందిన రెండో ఇంటికీ వెళ్లి వెతికారు. అక్కడా లేడు. ఎటుపోయాడో, ఏమయ్యాడో తెలియదు. చెప్పాపెట్టకుండా ఎవరూ బయటికి వెళ్లరు. వెళ్లకూడదు. అది పార్టీ రూలు. మరి ఇతడు ఏమైనట్టు? కొంపదీసి పోలీసుల చేతిలో పడ్డాడా?
సహచరులకు కంగారు పుట్టింది. వెంటనే ఆజాద్‌కి విషయం తెలియపరిచారు. కర్మంచాలక ఎవరైనా పోలీసులకు పట్టుబడితే చిత్రహింసలను తట్టుకోలేక పార్టీ గుట్టుమట్లు బయటపెట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఎవరైనా కామ్రేడ్ ఆచూకీ తెలియకుండా మాయమైతే, అతడికి తెలిసిన రహస్య స్థావరాలను ముందుజాగ్రత్తగా వెంటనే ఖాళీ చేస్తారు. అదే ప్రకారం ‘వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. సామాన్లు సర్దండి. క్విక్’ అన్నాడు ఆజాద్. అప్పుడు...
అందరూ చకచకా పనిలో పడ్డారు. సదాశివ్ అంతకు ముందు తన పంచెను ఉతికి గోడ మీద రెండు మేకులకు కట్టి ఆరేశాడు. ఇల్లు ఖాళీ చెయ్యాలి కనుక ఇప్పుడు దాన్ని లాగేశాడు. తన కళ్లను తాను నమ్మలేక ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.
రాజ్‌గురు ఆరేసిన పంచె వెనుక గోడకు ఆనుకుని నిలబడి గాఢంగా నిద్రపోతున్నాడు!
‘అందరూ రండి రండి! ఈ విడ్డూరం చూడండి’ అని సదాశివ్ కేకేశాడు. బిలబిలమంటూ అందరూ వచ్చారు. అంతా కలిసి ఓ పాట ఎత్తుకున్నారు:
‘్భయే ప్రాగత్ కృపాలా, గడ్‌బడ్‌ఝాలా, కుంభకర్ణ అవతారీ’ (మమ్మల్ని అనుగ్రహించటానికి, లోకాన్ని గడబిడచేసే కుంభకర్ణుడి అవతారమూర్తి ప్రత్యక్షమయ్యాడు) అంటూ.
ఆ కేకలకు రాజ్‌గురుకు నిద్రాభంగమైంది. ‘కష్టపడి ఈ చోటు కనుక్కున్నాను. ఇక్కడ కూడా నన్ను సుఖంగా నిద్రపోనివ్వరా?’ అంటూ చిరాకుపడ్డాడు. నిద్రపోవడానికి రాజ్‌గురు భలే కొత్త పద్ధతి కనిపెట్టాడు. దీనికి ఇతడికి స్పెషల్ ప్రైజు ఇవ్వాలి’ అన్నాడు విజయకుమార్ సిన్హా.
‘బాబూ, నా మానాన నన్ను నిద్రపోనివ్వండి. ఆ బహుమతి చాలు’ అంటూ ఆవలించి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు రాజ్‌గురు.
ఓసారి భగత్‌సింగ్, రాజ్‌గురులు ఏదో రహస్య కార్యం మీద మథుర వెళ్లి, ఆగ్రాకు తిరిగొస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రి 11 గంటలకే వాళ్లు ఆగ్రా స్టేషను చేరుకున్నారు. అప్పటికి రెండు రాత్రులు పని ఒత్తిడివల్ల భగత్ కంటికి కునుకు లేదు. నిద్ర ముంచుకొస్తున్నది. ‘ఇక నా వల్ల కావటంలేదు. కళ్లు మూసుకుపోతున్నాయి. ఓ గంట మెలకువగా ఉండి జాగ్రత్తగా కనిపెడతావా? కాసేపు నిద్రపోతా’ అన్నాడు రాజ్‌గురుతో.
‘ఓస్! దానిదేముంది? అలాగే’ అన్నాడు రాజ్‌గురు. అతడి సంగతి తెలుసు కనుక భగత్‌కి నమ్మకం కుదరలేదు. అయినా వేరే దారిలేదు. ఒకటికి రెండుసార్లు హెచ్చరించి, చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పాడు. ‘ఎందుకు అన్నిసార్లు చెబుతావ్? నాకు మాత్రం బాధ్యత తెలియదా? నువ్వు నిశ్చింతగా పడుకో. రైలు వచ్చే ముందు లేపుతా’ అన్నాడు రాజ్‌గురు.
భగత్‌సింగ్ కోటు విప్పి రాజ్‌గురుకు అప్పగించాడు. ‘జేబులో పిస్టల్ ఉంది. జాగ్రత్త’ అన్నాడు. సరిగ్గా 1.30 కల్లా లేపమని చెప్పి కళ్లు మూసుకున్నాడు. వెంటనే గాఢనిద్ర పట్టింది.
మెలకువ వచ్చి వాచ్ చూసుకుంటే సమయం తెల్లవారుఝామున 4 గంటలు. రైలు వెళ్లిపోయి రెండు గంటలైంది. వెయిటింగు రూములో ఇంకో బెంచి మీద రాజ్‌గురు గురక పెట్టి నిద్రపోతున్నాడు!
[Rajguru, The Invincible Revolutionary,
Anil Verma, PP.72-73]
ఇంకోసారి ఆ ఇథ్దరే ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. అది కూడా రాత్రి ట్రెయినులోనే. యజమాని, పనివాడి వేషాలు వేసి సాండర్స్ వధ తరవాత వాళ్లు ఎంచక్కా లాహోర్ నుంచి పారిపోయారు. అది అచ్చివచ్చింది కనుక ఇప్పుడూ అలాగే చేద్దాం అనుకున్నారు. బాగా బరువున్న పెట్టెను సేవకుడు కాబట్టి ఎలాగూ రాజ్‌గురే మోయాలి కదా? ఈ చీకటిలో ఎవరూ చూడొచ్చారు! కనీసం ఇప్పుడైనా మిత్రుడికి బరువు తగ్గిందాం - అనుకుని భగత్‌సింగ్ పెద్ద పెట్టె తాను మోసుకెళ్లి బయటపెట్టాడు. తేలికపాటి చేతిసంచి రాజ్‌గురును పట్టుకోమన్నాడు. సామాన్లు బయటికి చేరవేశాక రాజ్‌గురు వెళ్లి టాంగా పిలుచుకుని వచ్చాడు. బండివాడి సాయంతో భగత్‌సింగ్ సామాన్లు ఎక్కించాడు. రాజ్‌గురు తాను అప్పుడు సేవకుడినన్న సంగతి మరచిపోయి మామూలు ప్రకారం భగత్ పక్కన కూచోబోయాడు. భగత్ కళ్లతో వారించి, ముందు సీటులో కూచోమని సైగ చేశాడు.
రైల్వేస్టేషనుకు చేరాక భగత్‌సింగ్ తనకు సెకండు క్లాసు, రాజ్‌గురుకు థర్డ్ క్లాసు టిక్కెట్లు కొన్నాడు. ఇంకా ట్రెయిను రాలేదు. యజమాని కాబట్టి అతడు జేబుల్లో చేతులు పెట్టుకుని ప్లాట్‌ఫాం మీద దర్జాగా పచార్లు చేయసాగాడు. రెండు చేతుల్లో సామాన్లు పట్టుకుని రాజ్‌గురు కూడా ఎప్పటిలాగా అతడి సరసన నడవటం మొదలెట్టాడు. అతణ్ని వదిలించుకుందామని భగత్ వేగం పెంచితే ‘సేవకుడూ’ పెంచాడు. భగత్ ఆగితే తానూ ఆగాడు. ‘ఏమిటి అలిసిపోయావా? ఇంత లగేజి మోస్తున్నా నాకైతే అలుపులేదు’ అన్నాడు పైగా.
భగత్‌సింగ్‌కి ఓరిమి పోయింది. ‘పనివాడివి పనివాడిలాగా ఉండు. అదిగో ఆ బెంచి మీద సామాన్లు పట్టుకుని కూచో పో’ అని కసిరాడు. అప్పుడుగాని రాజ్‌గురుకు తాను చేసిన తప్పు అర్థంకాలేదు.
యోగేశ్ చంద్ర చటర్జీని బలవంతంగా విడిపించే జట్టులో జయదేవ్ కపూర్, భగవాన్‌దాస్ మహోరెలను చేర్చాలని పార్టీ నిర్ణయించింది. సహరాన్‌పూర్ పోయి జయదేవ్‌ని వెంటబెట్టుకు రమ్మని రాత్రికి రాత్రి రాజ్‌గురును బయలుదేరదీశారు. ‘అతడితో కలిసి వెంటనే తిరిగి రావాలి. ఇదిగో ఈ డబ్బు జయదేవ్‌కి ఇవ్వు. అత్యవసర ఖర్చులకు తప్పనిసరి అయితేనే వాడమని చెప్పు. ఇక్కడ డబ్బుకు చాలా కటకటగా ఉన్నదని తెలియజేయి. ఖర్చు కాని మొత్తాన్ని ఇక్కడికి రాగానే తిరిగి ఇచ్చెయ్యాలని చెప్పు’ అని విజయకుమార్ సిన్హా ఒకటికి రెండుసార్లు రాజ్‌గురుకు నొక్కి చెప్పి, పంపించాడు. ‘సరే. అలాగే’ అన్నాడు రాజ్‌గురు. కాని సగం నిద్రలో అతడు సిన్హా మాటలు సరిగా వినలేదు. ఉన్నపళాన రైలు ఎక్కి సహరాన్‌పూర్ చేరాడు. ‘నిన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇదిగో ఈ డబ్బు నీ అవసరాలకు వాడేసుకోమన్నారు’ అని జయదేవ్‌కి చెప్పి చక్కా వచ్చాడు.
సిన్హా నెత్తి బాదుకున్నాడు. ఎందుకలా చేశావ్ అంటే ‘సహరాన్‌పూర్‌లో జయదేవ్ ఇల్లు ఎవరికీ తెలియదు. ఆపరేషనులో పాల్గొనబోయే మనవాళ్లు ఒకరిద్దరిని దాచటానికి ‘సేఫ్ హౌస్’గా అది పనికొస్తుందన్న ఉద్దేశంతో నాకు మీరే అలా చెప్పి పంపించారేమో అనుకున్నా’ అన్నాడు రాజ్‌గురు.
సిన్హా జుట్టు పీక్కుని ఆజాద్‌కి జరిగింది చెప్పాడు. అతడి సంగతి తెలిసి కూడా ముఖ్యమైన పనికి అతణ్ని ఎందుకు పంపించావ్? నీదే తప్పు అన్నాడు నాయకుడు. కాని, సహరాన్‌పూర్‌లో జయదేవ్ ఇల్లు ‘సేఫ్ హౌస్’గా పనికొస్తుందని రాజ్‌గురు అనుకున్నాడట’ - అని సిన్హా చెబితే ‘నిజమే సుమీ! నాకు ఆ ఆలోచన రానే లేదు’ అన్నాడు ఆజాద్. దాంతో రాజ్‌గురు మీద కోపం ఎగిరిపోయింది.
రాజ్‌గురు వాగుడుకాయ. తెరపిలేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కోసారి సమయాసమయాలు పట్టించుకోడు. ఓసారి అతడు, ఆజాద్, భగవాన్‌దాస్ కలిసి కాన్పూర్ నుంచి ఝాన్సీ వెళుతున్నారు. పోలీసుల కళ్లు కప్పటానికి ముగ్గురూ పేద కూలీల్లా వేషం వేశారు. రైల్లో వారెక్కిన కంపార్టుమెంటులో కొంతమంది సీక్రెట్ సర్వీసు పోలీసు గూఢచారులు ఉన్నారు. ఆ సంగతి ఆజాద్ కనిపెట్టాడు. భగవాన్‌దాస్‌ని ఏదో చవకబారు పాట పాడమన్నాడు. అతడు పాడుతూంటే అలగాజనపు ముతక భాషలో తాను మెచ్చుకోసాగాడు.
కాసేపటికి రైలుబండి బుందేల్‌ఖండ్ పొలిమేరలో కాల్పి మీదుగా వెళుతున్నది. దూరాన కొండలు, అడవుల ఎగుడుదిగుళ్లను కిటికీలో నుంచి చూస్తూంటే రాజ్‌గురుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిపిన గెరిల్లా యుద్ధాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు తాను అక్షరజ్ఞానం లేని కూలి పనివాడి వేషంలో ఉన్నానన్న సంగతి మరచిపోయి ‘పండిట్జీ! ఈ ప్రాంతం గెరిల్లా పోరుకు బాగా పనికొస్తుంది కదూ’ అన్నాడు. ఆజాద్ ఆ మాటలు విననట్టు నటించి, భగవాన్‌దాస్‌తో ‘్భలే బాగుంది. ఆ చరణం ఇంకోసారి పాడు’ అన్నాడు. ‘అచ్చు శివాజీ యుద్ధానికి ఎంచుకున్న స్థలాల్లాగే ఉంది కదూ’ అని రాజ్‌గురు మళ్లీ రెట్టించాడు. ఆజాద్‌లో ఏ చలనమూ లేకపోయేసరికి, పరిసరాలు గుర్తుకొచ్చినాలిక కరుచుకుని నోటికి తాళం వేశాడు.
ఇంటికి వెళ్లగానే ఆజాద్ మండిపడ్డాడు. ‘రఘునాథ్ (రాజ్‌గురు)ను నేను ఎప్పుడూ ఎందుకు తిడుతూంటానని మీరు అంటారు కదా? ఇందాక చూశావుగా? శివాజీ నడిపిన గెరిల్లా యుద్ధం గురించి ఇతగాడు రహస్య పోలీసుల ముందు ఎలా వాగాడో?’ అన్నాడు భగవాన్‌దాసుతో కోపంగా. కొద్దిసేపటికి మళ్లీ ఆజాదే రాజ్‌గురును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ‘కానీ, సోదరా! నీ పరిశీలన శక్తిని నేను మెచ్చుకుంటున్నాను. ఔను, నువ్వన్నట్టు ఆ ప్రాంతం గెరిల్లా పోరుకు అనువైనదే. సమయం వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా ఉపయోగించుకుందాం’ అంటూ.
ఇప్పటిదాకా చెప్పుకున్న కథలనుబట్టి రాజ్‌గురు వట్టి కంగాళీగాడు అనుకోకండి. కొన్ని హిందీ సినిమాలలో చూపించినట్టు అతడు బఫూన్ కాడు. గొప్ప దేశభక్తుడు. వెరపెరగని ధైర్యశాలి.
1929 సంవత్సరంలో ఓ రోజు ఆగ్రాలోని ‘హింగ్ కి మండి’ ఇంట్లో ఒక సమావేశం నడుస్తున్నది. పోలీసులు తమకు పట్టుబడిన విప్లవకారుల నుంచి రహస్యాలు రాబట్టడానికి ఎటువంటి చిత్రహింసలు పెడతారో, నిర్బంధితుల శరీరం మీద, మనసు మీద టార్చర్ టెక్నికుల ప్రభావం ఎలా పడుతుందో - చంద్రశేఖర్ ఆజాద్ సహచరులకు వివరిస్తున్నాడు. తప్పించుకోవడానికి వేరే దారి లేని పరిస్థితుల్లో పోలీసులకు పట్టుబడేకంటే చివరిదాకా పోరాడుతూ చచ్చిపోవటం మేలు అని చెబుతున్నాడు.
ఆ రోజు రాజ్‌గురుకు మెస్ డ్యూటీ. లోపలి గదిలో వంట వండుతూనే అతడు నాయకుడి మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. ఒకవేళ తాను పోలీసుల బారిన పడితే అలాంటి దారుణ చిత్రహింసలను తట్టుకోగలనా అని అతడికి సందేహం కలిగింది. తన నిబ్బరం ఎంతటిదో పరీక్ష చేసుకుందామనిపించింది. వెంటనే పటకారు తీసి పొయ్యి మీద పెట్టాడు. ఎర్రగా కాలాక దానితో చాతీ మీద వాతపెట్టుకున్నాడు. చర్మం కాలిపోయింది. భరించలేని నెప్పి వేసింది. అయినా పళ్లు బిగించి ఇంకోసారి కాల్చి వాత పెట్టుకున్నాడు. గుండెలు మండిపోతున్నా, బాధ తట్టుకోలేక కళ్లవెంట నీళ్లు కారుతున్నా ఆగక అలా మొత్తం ఐదుసార్లు ఒళ్లు కాల్చుకున్నాడు. బయటి గదిలోని వారికి ఆ సంగతే తెలియదు.
అందరూ పట్టుకున్నాక ఒక రాత్రివేళ రాజ్‌గురు మంట, నెప్పి తట్టుకోలేక బిగ్గరగా మూలిగాడు. పక్కనే పడుకున్న ఆజాద్‌కి మెలకువ వచ్చి, ఏమైందని అడిగాడు. ఏమీ కాలేదు లెమ్మని రాజ్‌గురు మొదట బుకాయించాడు. ఆజాద్ వదలకుండా నిగ్గదీసేసరికి జరిగింది చెప్పాడు.
ఆజాద్ అదిరిపోయాడు. ‘అయ్యో, ముందు చొక్కా విప్పు’ అన్నాడు. విప్పాక కొవ్వొత్తి వెలిగించి దగ్గరగా చూస్తే చాతి మీద పెద్దపెద్ద బొబ్బలు కనిపించాయి. చాలా చర్మం కాలిపోయింది. కరకు గుండెగల ఆజాద్ కూడా తన సహచరుడి స్థైర్యానికి, శౌర్యానికి నిర్ఘాంతపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స చేయించగలిగితే మంచిది. కాని వారున్న పరిస్థితుల్లో అది కుదిరే పనికాదు. అందరికీ ప్రమాదం. గృహ వైద్యం చేసి, నాటు మందులు వాడి ఎలాగో గాయాలు మాన్పారు. కాని వాతల చారలు అలాగే మిగిలిపోయాయి. నాటి నుంచి రాజ్‌గురు అంటే విప్లవకారులకు గౌరవం, అభిమానం పెరిగాయి.
మరి కొద్దిగంటల్లో రాజ్‌గురును ఉరితీస్తారనగా సుశీలా దీదీ లాహోర్ సెంట్రల్ జైలుకు వెళ్లి, కడసారి కలిసింది. ‘అన్నా! ఎప్పటి నుంచో నాకో కోరిక. దయచేసి నీ చాతి మీద మచ్చలను ఒకసారి చూడనివ్వు’ అని అడిగింది.
రాజ్‌గురు అప్పుడు పొట్టిలాగు, పొట్టి చేతుల చొక్కా, నెత్తిన గుండ్రటి టోపి ధరించి ఉన్నాడు. చిన్నగా నవ్వి చొక్కా గుండీలు తీసి ఛాతీని చూపించాడు. ఒక దేశభక్తుడి నిబ్బరానికి, నిశ్చల నిబద్ధతకు ఉజ్వల చిహ్నాలుగా ఐదు పెద్ద వాతలు తిలకించి, సుశీలాదీదీ కళ్లు చెమర్చాయి.
[Rajguru, The Invinaible
Revolutionary, Anil Verma, pp.77-78]
దటీజ్ రాజ్‌గురు! - భగత్‌సింగ్
ReplyDelete