ప్రేమ ఎంత మధురం!
ఏమి చేయాలన్నది తేలిపోయింది. అది ఎవరు చేయాలన్నదే ఇక తేల్చాల్సి ఉంది.
ఆ పని ఇద్దరికి అప్పగించాలి అన్నాడు భగత్‌సింగ్.
‘ఎవరిని చంపటమూ మన ఉద్దేశం కాదు. మనం వేసేది ఎవరికీ హాని చెయ్యని తేలిక రకం పొగబాంబు. దానికి ఇద్దరు కామ్రేడ్స్‌ని, రిస్కు చేయటమెందుకు? అదను చూసి బాంబు విసిరి పరిగెత్తడానికి ఒకరు సరిపోతారు కదా?’ - అని ఒకరి శంక.
‘బాంబు వేసిన సమయంలోనే ఆ పని మనం ఎందుకు చేశామో వివరించే పత్రాలను కూడా సభలోకి వెదజల్లాలి. గట్టిగా నినాదాలూ చేయాలి. ఇద్దరు ఉంటే కాని కుదరదు’ అన్నాడు భగత్‌సింగ్.
‘సరే! అలాగే కానీ! ఒకరికి ఇద్దరు ఉంటే మాత్రమేమి? వాళ్లను అక్కడి నుంచి ఎలా తప్పించాలన్నది నేను చూసుకుంటా! సాండర్స్‌ని చంపగానే మీ ఇద్దర్నీ బయటికి తీసుకురాలేదూ? అలాగే ఇదీనూ’ అన్నాడు చంద్రశేఖర్ ఆజాద్ ధీమాగా.
‘పండిట్జీ! నాకు తెలుసు. మీకదో లెక్కలోనిది కాదు. కాని ఈసారి మాత్రం అలా కుదరదు. బాంబు విసిరిన వాళ్లు పారిపోకూడదు’
భగత్ చెప్పేది మిగతావారికి అర్థంకాలేదు. ఎక్కడైనా ఒక సాహసానికి పాల్పడ్డాక ప్రభుత్వానికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలా అనే విప్లవకారులు ఎవరైనా ఆలోచిస్తారు. ప్రయత్నించినా సాధ్యపడకపోతే వేరే సంగతి. కాని ఇతడేమిటి - అసలు ప్రయత్నమే చేయవద్దంటాడు? పార్లమెంటులో బాంబులు వేసి, గువ్వపిట్టల్లా పోలీసుల చేతికి చిక్కితే ఇంకేమైనా ఉందా?
‘ఔను. ప్రమాదమే. చిత్రహింసలు తప్పవు. ఉరిశిక్ష కూడా పడవచ్చు. అన్నీ తెలిసే ఈ మాట చెబుతున్నా. మనం ఇదంతా చేస్తున్నది మన ప్రాణాలు దక్కించుకోవటానికి కాదు. మన ఆశయమేమిటో, మన మార్గమేమిటో, దాన్ని ఎందుకు ఎంచుకున్నామో ప్రజలకు తెలియాలి. మహాత్మాగాంధీ పదేపదే ముద్ర వేస్తున్నట్టు మనం అల్లరిచిల్లర దౌర్జన్యకారులం కామని లోకానికి అర్థంకావాలి. దీనికి నేను చెప్పిందే సరైన పద్ధతి’ అన్నాడు భగత్‌సింగ్.
‘అలా ఎందుకు? మన ఉద్దేశమేమిటో వివరంగా రాసిన కరపత్రాలు ఘటనా స్థలంలో వెదజల్లి పారిపోవచ్చుగా? దానివల్ల మన విధానం స్పష్టం చేసినట్టూ అవుతుంది. కిరాతక సర్కారు బారినుంచి తప్పించుకున్నట్టూ ఉంటుంది కదా?’
‘కుదరదు. మన వైఖరిని మనం ఎంత చక్కగా చెప్పినా జనం నమ్మరు. పార్లమెంటులోనే బాంబులేస్తారా అని మనమీదే అందరూ మండిపడతారు. మనం అరాచక మూక అని తాము ఇంతకాలంగా చెబుతున్నదానికి ఇదే రుజువు అని కాంగ్రెసు వాళ్లూ, ఇతరులూ ప్రచారం చేస్తారు. దాన్ని తట్టుకోవటం మన తరంకాదు. చివరికి పాపిష్టి టెర్రిరస్టులుగానే మనం చరిత్రహీనులమవుతాం. అలా జరగకూడదనుకుంటే మనం ధైర్యంగా నిలబడాలి. పోలీసులు అరెస్టు చేసినప్పుడూ, కోర్టు ముందు పెట్టినప్పుడూ మన వాదాన్ని గట్టిగా వినిపించాలి. పారిపోవాలని చూడకుండా మనంతట మనమే పోలీసులకు ఎందుకు లొంగిపోయాం అని ప్రజలు తప్పక ఆలోచిస్తారు. మనం ఈ త్యాగానికి సిద్ధపడితేనే మనం ఆశించేది నెరవేరుతుంది’
భగత్‌సింగ్ ఇంతలా విడమర్చి చెప్పాక ఎవరూ కాదనలేక పోయారు. ఇక నిర్ణయించాల్సిందల్లా ఆ ఇద్దరూ ఎవరన్నదే. పోలీసు టార్చరుకూ, జీవితాంతం చెరసాలకూ, బహుశా ఉరికీ కూడా సిద్ధపడేవాళ్లు దీనికి కావాలి. మామూలుగా అయితే ఎవరైనా మావల్ల కాదు బాబోయ్ అని వెనక్కిపోతారు. కాని ఆగ్రాలో విప్లవకారులు నేనంటే నేనని ముందుకొచ్చారు.
అందరికంటే ముందుగా చెయ్యెత్తినవాడు భగత్‌సింగ్.
‘నేనైతే ఈ పనిని బాగా చేయగలనని అనుకుంటున్నాను. లొంగిపోయాక ఏమి చెప్పాలో, న్యాయస్థానంలో ఏమి మాట్లాడాలో, మన భావజాలాన్ని జనం ముందు ఎలా పెట్టాలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇలాంటి అదను కోసం నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. దయచేసి ఈ అవకాశం నాకు ఇవ్వండి’ అని గట్టిగా కోరాడు.
ఆ మాట నిజమే. విప్లవ ఆశయం, గమ్యం, మార్గం గురించి భగత్‌కున్నంత స్పష్టత, అతడికున్న అధ్యయనం, విషయ పరిజ్ఞానం, అతడికున్న వాగ్ధాటి, వాదనా పటిమ వేరొకరికి లేవు. ఆ సంగతి సహచరులందరూ నిస్సంకోచంగా ఒప్పుకుంటారు. కాని - ఇప్పుడు నిర్ణయించిన కార్యానికి అతడిని నియోగించటం ఎవరికీ ఇష్టంలేదు. విప్లవ పార్టీకి అతడొక మూల స్తంభం. అతడు లేని లోటును వేరొకరు పూడ్చలేరు. చట్టసభలో బాంబు బాధ్యత భగత్‌కి అప్పజెప్పటమంటే అతడిని శాశ్వతంగా దూరం చేసుకోవటమే. దానికి ఎవరూ సిద్ధంగాలేరు.
ముఖ్యంగా పార్టీ కమాండరు చంద్రశేఖర్ ఆజాద్. భగత్‌సింగ్ అతడికి ప్రాణంలో ప్రాణం. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడికంటే ఎక్కువ. దేశమాత సేవలో వ్యక్తిగత ప్రేమలకు, అనుబంధాలకు తావులేదని ఆజాద్‌కి తెలుసు. కర్తవ్య పాలనలో మానవ బలహీనతలకు లొంగిపోయే తత్వం కాదతడిది.
భగత్‌సింగ్ విషయంలో ఆజాద్ అభ్యంతరానికి ముఖ్య కారణం వేరే ఉంది. మూడు నెలల కింద సాండర్స్ హత్య జరిగినది లగాయతు హంతకుల కోసం పోలీసులు వెయ్యి కళ్లతో వెతుకుతున్నారు. కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని లండన్ నించి మాటిమాటికీ రిమైండర్లు వస్తున్నా ‘ప్రోగ్రెస్ నిల్’ అని చెప్పుకోలేక నానా చావులు చస్తున్నారు. విప్లవకారులందరితోబాటు భగత్‌సింగ్ కూడా పోలీసుల నిఘాలో ఉన్నాడు. అతడికి హత్యతో సంబంధం ఉన్నట్టు పిసరంత సాక్ష్యం దొరకలేదు. అందువల్లే ఇంతవరకూ వాళ్లు అతడి జోలికి రాలేదు. ఇప్పుడు పార్లమెంటులో బాంబు కేసులో భగత్‌సింగే ఏరికోరి వాళ్ల చేతికి చిక్కితే...?
పోలీసులు ఆరాలు తియ్యకమానరు. ఆ కేసు దర్యాప్తులో వాళ్ల చేతిలో పడ్డ వాడెవడైనా కర్మంచాలక పాత కేసు గుట్టు విప్పాడా - కొంప మునిగిందే. బాంబు కేసు ఏమోగానీ సాండర్స్ కేసులో భగత్‌సింగ్‌కి ఉరి ఖాయం. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదు. దానికి ఒకటే దారి: ఇప్పుడు బాంబు ప్రయోగానికి భగత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించకూడదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ భగత్‌సింగ్‌ని మాత్రం అనుమతించేది లేదని సమావేశంలో ఆజాద్ కరాఖండిగా చెప్పాడు! మిగతా సభ్యులూ దాన్ని ముక్తకంఠంతో బలపరిచారు. అందరూ అలా ఏకమయ్యేసరికి భగత్ కూడా చేసేదిలేక పార్టీ ఏకగ్రీవాభిప్రాయానికి తలవంచాడు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కామ్రేడ్లలో నుంచి బాంబు ఆపరేషన్‌కి బటుకేశ్వర్‌దత్, రామ్‌శరణ్‌దాస్‌లను కేంద్ర కమిటీ ఎంపిక చేసింది. వారికి కావలసిన ఏర్పాట్లు చూసేపని జయదేవ్ కపూర్‌కి అప్పగించారు.
కేంద్ర కమిటీ సమావేశంలో సుఖ్‌దేవ్ లేడు. అప్పుడతడు లాహోర్‌లో ఉన్నాడు. సమావేశానికి ముందు భగత్‌సింగ్ ఆగ్రా నుంచి లాహోర్ వెళ్లి నల్లబిల్లులు, వాటిని ఎదుర్కొనవలసిన పద్ధతి గురించి సుఖ్‌దేవ్‌తో వివరంగా మాట్లాడి వచ్చాడు. తాము అభిమానించే ఫ్రెంచి అనార్కిస్టు వేలన్ మార్గానే్న అనుసరించటం ఉత్తమమని ఇద్దరూ అంగీకరించారు. కాలేజి రోజుల నుంచీ తాము ఎన్నోసార్లు మాట్లాడుకుని, ఎంతగానో ఎదురుచూస్తున్న అవకాశం వచ్చినప్పుడు భగత్‌సింగ్ దానిని అందిపుచ్చుకోకుండా వదలడని సుఖ్‌దేవ్ అనుకున్నాడు. ఎలాగైనా సరే నేనే బాంబు విసిరి తీరతానని భగత్ కూడా ఎంతగానో ముచ్చటపడ్డాడు. ఆ సంగతి తెలుసు కాబట్టి సెంట్రల్ అసెంబ్లీలో బాంబు ప్రయోగించటానికి పార్టీ కమిటీ అంగీకరించాక దాని అమలుచేసే బాధ్యత కచ్చితంగా భగత్ మీద పడుతుందనే సుఖ్‌దేవ్ నమ్మాడు. తీరా భగత్‌ను పక్కకు తప్పించి, వేరెవరికో అంత కీలక బాధ్యత అప్పగించారని తెలిసి సుఖ్‌దేవ్ నిర్ఘాంతపోయాడు. హుటాహుటిన ఆగ్రా వచ్చి ఆజాద్‌ను నిగ్గదీశాడు. మనం హింసా మార్గం ఎందుకు పట్టవలసి వచ్చిందో ప్రజలకు వివరించి, గాంధీ అంటున్నట్టుగా మనం హంతకులం, టెర్రరిస్టులం కామని నిరూపించుకోవటానికి బంగారంలాంటి అవకాశం వచ్చింది కదా? మనం ఆశిస్తున్న విధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటానికి భగత్ ఒక్కడే సమర్థుడని తెలిసి కూడా అతడిని వదిలేసి వేరే వాళ్లకు ఆ పని ఎందుకు పురమాయించారని నిలదీశాడు.
ఆజాద్ ఒకసారి నిర్ణయమంటూ చేశాక దాని నుంచి అంగుళం బెసిగే రకం కాదు. సుఖ్‌దేవ్ మొండి అయితే అతడు జగమొండి. నువ్వనుకుంటున్నట్టు నాకేమీ భగత్‌మీద పక్షపాతం లేదు. ఇదిగో ఈ కారణాలవల్ల అతడు వద్దనుకున్నాను. మిగతా కామ్రేడ్సూ అలాగే తలిచారు. ఇప్పుడు నువ్వొచ్చి ఏదో అన్నావు కాబట్టి, అన్నీ ఆలోచించి పార్టీ చేసిన నిర్ణయాన్ని తిరగదోడే ప్రసక్తి లేదని తెగేసి చెప్పాడు.
దాంతో సుఖ్‌దేవ్ నేరుగా భగత్‌సింగ్‌నే తగులుకున్నాడు. ‘వాళ్లు వద్దంటే మాత్రం నువ్వెలా సరే అన్నావు? పార్టీ వైఖరిని సరిగ్గా ప్రజెంట్ చేయగలగటం నీకు మాత్రమే చేతనవుతుందని తెలిసి కూడా నువ్వెందుకు తోకముడిచావు? నువ్వు లేకపోతే పార్టీకి మనుగడ లేదని నీ అహంకారమా? నీ తాహతను మరీ అతిగా ఊహించుకుంటున్నావా - అని ఎత్తిపొడిచాడు.
ఒకప్పుడు పెద్ద విప్లవకారుడైన భాయిపరమానంద్ ఎంతసేపూ తన సహచరులను ఆత్మబలిదానాలకు పురికొల్పటమే తప్ప తాను ప్రాణ త్యాగానికి ఇష్టపడేవాడు కాడని అతడి కేసును విచారించిన జడ్జి ఒక సందర్భంలో వ్యాఖ్యానించాడు. ఆ సంగతి ఇప్పుడు సుఖ్‌దేవ్ గుర్తు చేశాడు. ‘నువ్వూ అలాగే తయారయ్యావ్! త్యాగం చెయ్యాల్సిన సమయం వచ్చేసరికి వేరేవాళ్లని ముందుకు నెట్టి నువ్వు పిరికిపందలా తప్పించుకున్నావ్’ అని భగత్‌సింగ్‌ని ఆక్షేపించాడు. ‘నువ్వు లేకపోతే పార్టీ లేదు; విప్లవం అంగుళం ముందుకు సాగదు అని అహంకరిస్తున్నావ’ంటూ తీవ్రారోపణ చేశాడు.
భగత్‌సింగ్‌కి తల తిరిగిపోయింది. ప్రాణమిత్రుడు, తనకు అత్యంత ఆప్తుడైన సహచరుడే అంత అన్యాయంగా తనను తూలనాడటాన్ని అతడు తట్టుకోలేక పోయాడు. ‘నువ్వు నన్ను అవమానిస్తున్నావ్’ అన్నాడు బాధగా.
‘లేదు. నా మిత్రుడికి అతడి కర్తవ్యం గుర్తు చేస్తున్నాను’ అన్నాడు సుఖ్‌దేవ్. ‘నేను ఎంతగా అడిగినా ఆజాద్‌గాని, మిగతావాళ్లు గాని నన్ను పంపించటానికి ఒప్పుకోలేదు’ అని భగత్ చెప్పినా అతడు నమ్మలేదు. ‘ఆ కబుర్లు నా దగ్గర చెప్పకు. పార్టీ వారికి నువ్వంటే ఎంత గౌరవమో, నీ మాటకు ప్రతివాడూ ఎంత విలువిస్తాడో నాకు తెలుసు. నువ్వు నిజంగా పట్టుబట్టి ఉంటే ఎవరు కాదనగలరు?’ అని రెచ్చగొట్టాడు.
అంతటితో ఆగలేదు.
‘ఒక ఆడదాని వలపు మైకంలో పడ్డావు. విప్లవానికి ఇక నువ్వేమి పనికొస్తావులే’ అని పుండు మీద కారం చల్లాడు.
సుఖ్‌దేవ్ మాట్లాడుతున్నది దుర్గాదేవి గురించి. భగత్‌సింగ్‌కూ ఆమెకూ ఎప్పటినుంచో పరిచయం. విప్లవ కార్యక్రమాల్లో భర్త భగవతీ చరణ్‌తో బాటు ఆమె చురుకుగా పాల్గొనేది. ఆ రకంగా భగత్‌కి ఆమెతో స్నేహం. సాండర్స్ హత్య తరవాత భార్యాభర్తల్లా నటించి లాహోర్ నుంచి కోల్‌కతా దాకా రెండురోజులు పైగా రైల్లో కలిసి ప్రయాణం చేసిన సందర్భంలో వారు మానసికంగా మరింత దగ్గరయ్యారు. వారి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. అందులో దాచుకోవలసిందీ, సిగ్గుపడవలసిందీ భగత్‌కి ఏమీ కనిపించలేదు. అన్నీ తెలిసి కూడా సుఖ్‌దేవ్ ఇప్పుడు దాని గురించి ఇంత వంకరగా మాట్లాడినందుకు సున్నితమైన భగత్ మనసు విలవిలలాడింది.
‘చాలు. ఇంకా ఎక్కువ మాట్లాడకు’ అని విసురుగా వచ్చేశాడు. ఎకాఎకి వెళ్లి బాంబు ఆపరేషన్‌లో తానూ ఉండి తీరాలని ఆజాద్ గొంతు మీద కూచున్నాడు. పంతం పట్టి పార్టీ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయించాడు. ఒకసారి ఒక నిశ్చయానికి వచ్చాడంటే భగత్‌సింగ్ ఎవరు చెప్పినా వినడు. ఆ సంగతి తెలుసు కాబట్టి ఈసారి వారించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అతడు పడుతున్న మానసిక క్షోభను అర్థం చేసుకుని, బరువెక్కిన గుండెలతో అతడు కోరిన మార్పునకు ఇష్టం లేకున్నా ఒప్పుకున్నారు. రామ్‌శరణ్‌దాస్ స్థానంలో భగత్‌సింగ్‌ని చేర్చారు.
సమయం ఆట్టే లేదు. సెంట్రల్ అసెంబ్లీలో బాంబు ముహూర్తం తేదీకి పట్టుమని పదిరోజులు కూడా లేవు. వెంటనే రంగంలోకి దిగాలి. ఏర్పాట్లు చూసుకోవాలి.
భగత్‌సింగ్ ఢిల్లీకి బయలుదేరుతూంటే ఆజాద్‌కి దుఃఖం వచ్చింది. తన ప్రియమైన కామ్రేడ్ మళ్లీ తిరిగి రాడని అతడికి తెలుసు. ‘ఇంకొద్ది రోజుల్లో వాళ్లిద్దరినీ చరిత్ర తనలో కలిపేసుకుంటుంది. బహుశా వారి వీరగాథలే మనకు మిగులుతాయి’ అని శివవర్మతో అన్నాడు ఆజాద్.
వెంటపడి రెచ్చగొట్టి భగత్‌ని మృత్యుముఖంలోకి పంపించిన సుఖ్‌దేవ్ కూడా అనుకున్నది నెరవేరినందుకు సంతోషంగా లేడు. విప్లవవాణిని ప్రపంచానికి వినిపించటం మరెవరివల్లా కాదన్న విశ్వాసంతో అతడిని అంతలా సతాయించినా భగత్ అంటే సుఖ్‌దేవ్‌కూ చచ్చేంత ఇష్టమే. ఆగ్రాలో పార్టీ మీటింగు అయిన రాత్రే రైలెక్కి తెల్లవారేసరికి అతడు లాహోర్ చేరాడు. ‘రాత్రంతా అతడు ఏడిచినట్టుంది. కళ్లు వాచి ఎర్రబడ్డాయి’ అని మరునాడు అతణ్ని చూసిన దుర్గాదేవి తరవాతెప్పుడో గుర్తు చేసుకుంది.
ఉద్దేశం ఏమైతేనేమి మిత్రుడు అన్న మాటలు భగత్‌సింగ్ మనసును ములుకుల్లా తొలిచాయి. ఢిల్లీ వెళ్లాక (1929 ఏప్రిల్ 5న) సుఖ్‌దేవ్‌కి తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ పెద్ద ఉత్తరం రాశాడు. ప్రేమ సంబంధమైన బలహీనత గురించి మిత్రుడు ఆరోపించిన దానికి ఇలా జవాబు చెప్పాడు:
ప్రియ సోదరా
ఈ ఉత్తరం నీకు అందేసరికి సుదూర గమ్యం వైపు వెళ్లిపోతాను. జీవితం ఎంత ఇష్టంగా ఉన్నా నేను ఈ ప్రయాణానికి ఎప్పుడో సిద్ధపడ్డాను. నా సొంత సోదరుడే నన్ను అపార్థం చేసుకుని, చాలా తీవ్రమైన బలహీనత ఆరోపణ చేశాడే అన్న బాధొక్కటే నా గుండెను పిండేస్తున్నది. ఏదీ దాచుకోకుండా మనసులోని భావాన్ని విప్పి చెప్పే నా తత్వంవల్లే నాకు బలహీనత ఉందన్న అపోహ కలిగినట్టుంది. మనలో ఎవరి కంటేనూ నేను బలహీనుణ్ని కాను సోదరా!... ...
... నాకూ కోరిక ఉంది; ఆశ ఉంది; జీవితమంటే ఆకర్షణ ఉంది. కాని అవసరం వచ్చినప్పుడు నేను వాటన్నిటినీ వదులుకోగలను. అదే నిజమైన త్యాగం. ఈ విషయాలు ఏ మగవాడి దారికీ -నిజంగా అతడు మగవాడైతే - అడ్డురావు. ప్రేమ ఎప్పుడైనా ఏ మనిషికైనా సహాయకారి అయిందా అని నువ్వు అడిగావు. దానికి ఇవాళ జవాబు చెబుతున్నాను. ఔను! మనిద్దరం అభిమానించే (ఇటాలియన్ విప్లవ నాయకుడు) మాజ్జీనికి అది సహాయకారి అయింది. తొలి తిరుగుబాటు ఘోరంగా విఫలమయ్యాక, దానికి బలైపోయిన కామ్రేడ్స్ వియోగాన్ని భరించలేక అతడు పిచ్చివాడవుతాడా, ఆత్మహత్య చేసుకుంటాడా అన్న దశలో తాను ప్రేమించిన యువతి రాసిన ఉత్తరం అతడిని మళ్లీ మామూలు మనిషిని చేసింది.
ప్రేమ అనేది మోహమే. కాని అది పాశవికం కాదు. మానవీయ మోహం. అది చాలా మధురంగా ఉంటుంది. నిజమైన ప్రేమ మనిషి వ్యక్తిత్వాన్ని దిగజార్చదు. ఇంకా పైకి లేపుతుంది. అది సినిమాల్లో మనం చూసే పిచ్చి ప్రేమల్లాంటిది కాదు. అసలైన ప్రేమను ఎవరూ పుట్టించలేరు. దానంతట అదే కలుగుతుంది. ఎప్పుడు అన్నది ఎవరూ చెప్పలేరు. అది సహజమైనది. నీకో సంగతి చెప్పదలిచాను. ఒక యువకుడు, యువతి ఒకరినొకరు ప్రేమించగలరు. ఆ ప్రేమ ద్వారా మోహాన్ని జయించి తమ స్వచ్ఛతను నిలబెట్టుకొననూ గలరు.. ఒక విషయం గుర్తుపెట్టుకో. మనం ఎంత రాడికల్‌గా ఆలోచిస్తున్నామనుకున్నా, పాతకాలపు నైతిక ప్రమాణాలు మనలను అంత తేలికగా వదలవు. నువ్వు వాటి నుంచి దూరం జరుగు. నీ ఆదర్శాల బావుటాను కాస్త కిందికి దించు. ఎవరితోనూ కటువుగా మాట్లాడి వారి కష్టాలను, కన్నీళ్లను ఇంకా ఎక్కువ చెయ్యకు. స్వయంగా నీకే అనుభవమైతేగానీ ఇలాంటి విషయాలు నీకు అర్థం కావనుకో!
ఇప్పుడు నా గుండె బరువు తీరింది. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
నీ
బి.ఎస్.
[Bhagat Singh, Edited by Shiv Verma, pp.74-76]
ప్రేమ ఎంత మధురం!
ReplyDelete