బిర్సా ముండా జీవిత చరిత్ర-Birsa Munda Life Story in telugu
బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారు.
సుగుణా ముండా, కర్మీ హాతుల కుమారుడైన బిర్సా, 1875 నవంబర్ 18వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలీహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాధమిక విద్య తర్వాత ఆయన ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారు. ముండా జనజాతివారిని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేందుకు ఒక ఉద్యమానికి నేతృత్వం వహించారు. కాలేజీలో, స్కూల్ లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమి హక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు.
ఆ రోజుల్లో ఒక క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ నోట్రేట్ అనే ఆయన ముండా సర్దారులు కనుక క్రైస్తవ మతంలోకి మారి, ఆ మతం అనుసరిస్తూ ఉంటే, వారు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పిస్తానని ప్రలోభం చూపడం ప్రారంభించాడు. అయితే, 1886-87సంవత్సరాల్లో ముండా సర్దారులు తమ పోయిన భూముల కోసం ఉద్యమం చేస్తే, ఆ నిరసనను అణిచివేయడమే కాదు, క్రైస్తవ మిషనరీల ద్వారా వారివై తీవ్ర దూషణ, దాడి చేయించారు. ఇది బిర్సా ముండాని ఎంతగానో గాయపరిచింది. ఆయన తిరుగుబాటు చూసి, ఆయనను విద్యాలయం నుంచి బహిష్కరించారు. తత్ఫలితంగా 1890లో బిర్సా, ఆయన తండ్రి చైబాసా నుంచి తిరిగి వచ్చారు. 1886 నుంచి 1890 వరకు చైబాసా మిషన్ లో ఉన్న కాలం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక కీలక దశ. ఈ కాలంలోనే ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఆత్మాభిమానం అనే దీపం ప్రజ్వరిల్లింది. సంతాల్ ఉద్యమం, చువార్ ఉద్యమం,కోల్ విప్లవం ప్రభావం కూడా ఆయన మీద ఎంతగానో ఉంది. తన జాతి ఏ దుర్దశలో ఉందో, తమ సామాజిక, సాంస్కృతిక,మతపరమైన అస్తిత్వానికి ఎటువంటి ముప్పు ఉందో చూసి, ఆయన మనసులో విప్లవ భావాలు పెల్లుబికాయి. ముండా జాతివారి పాలన వెనక్కి తీసుకురావాలని, తన తోటివారిని జాగృతం చేయాలని ఆయన నిశ్చయించారు. 1894లో అనావృష్టి కారణంగా ఛోటా నాగపూర్ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడి, అంటువ్యాధులు వ్యాపించాయి. ఆ సమయంలో బిర్సా పూర్తి అంకితభావంతో తన వారికి సేవలందించారు.
ముండా సమాజాన్ని ఏకం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బ్రిటిష్ పాలకులకు పెద్ద సవాల్ గా పరిణమించాయి. బిర్సాయిత్ మతాన్ని స్థాపించి ఆయన ప్రజలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చారు. సాత్వికత, ఆధ్యాత్మికత,పరస్పర సహకారం, ఐక్యత, సౌభ్రాతృత్వం ఆ మతానికి ప్రాతిపదికలు. ‘తెల్లవాళ్లు వెనక్కి పోవాలి’ అన్న నినాదం ఇచ్చి ఆయన మన సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపన జరగాలని పిలుపునిచ్చారు. ‘మహారాణీ పాలన పోతుంది – మన రాజ్యం వస్తుంది’అని ఆయన అంటుండేవారు.
1894 అక్టోబర్ 1 నాడు ఒక యువనేతగా ముండా ప్రజలను ఐక్యం చేసి ఆయన భూమి శిస్తు మాఫీ కోసం బ్రిటిష్ వారిపైన ఒక ఉద్యమం ప్రారంభించారు. 1895లో ఆయనను అరెస్ట్ చేసి, రెండేళ్లు హజారీబాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. కానీ బిర్సా, ఆయన శిష్యులు కరువుపీడిత ప్రజలకు సహాయపడాలన్న సంకల్పాన్ని కొనసాగించి తమ జీవితకాలంలోనే మహాపురుషులుగా ఒక ఘనత సంపాదించుకున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆయనను ధర్తీ బాబా అని పిలుస్తూ ఆయనను గౌరవించేవారు. ఆయన ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలోని ముండా ప్రజలందరిలో సమైక్యత తో నిలవాలన్న ఒక చైతన్యం బలపడింది.
1897 నుంచి 1900 వరకు ముండా ప్రజలకు బ్రిటిష్ సిపాయిలు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. బిర్సా, ఆయన సహచరులు తెల్లవారికి పెద్ద తలనెప్పిగా పరిణమించారు. 1897 ఆగస్టు లో బిర్సా, ఆయన వెంట 400 మంది సైనికులు విల్లంబులు ధరించి ఖూన్టీ పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. 1898లో తాంగా నది ఒడ్డున ముండా దళాల బ్రిటిష్ సేనతో ఘర్షణ పడగా ముందు పరాయి సేనలు ఓడిపోయినా ఆ తర్వాత ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని అనేకమంది వనవాసి నాయకులను నిర్బంధించడం జరిగింది.
బిర్సా ముండాని మహాత్ములైన దేశభక్తుల సరసన గౌరవిస్తారు. ఆయన వనవాసీలను ఏకం చేసి, శ్వేతా జాతీయుల పాలనను ఎదురొకొనేలా సంసిద్ధులను చేశారు. అంతే కాకుండా ఆయన భారతీయ ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు మతమార్పిడి చేసే క్రైస్తవ మిషనరీలను ఎదిరించారు. క్రైస్తవులుగా మారిన వనవాసీలకు ఆయన మన నాగరికత, మన సంస్కృతి గురించి తెలియచెప్పే, బ్రిటిష్ ప్రభుత్వ కుట్రలు, పన్నాగాల గురించి వారిని అప్రమత్తం చేశారు.
1900 జనవరిలో డొమబాడీ పర్వతంపైన మరొక పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది మహిళలు, పిల్లలు మరణించారు. ఆ ప్రదేశంలో బిర్సా ఒక బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 1900 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన సెంతారా లో పశ్చిమ అటవీప్రాంతంలో ఒక శిబిరం నుంచి బిర్సాని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా రాంచీ కారాగారంలో బంధించారు. ఆయనతో పాటు మరో 482 మంది నిరసనకారులను కూడా అరెస్ట్ చేశారు. వారి మీద 15 అభియోగాలు మోపారు. మిగిలిన బందీల్లో 98 మందికి వ్యతిరేకంగానే చేసిన ఆరోపణలు మాత్రమే రుజువయ్యాయి. బిర్సాకి అత్యంత సన్నిహితుడైన గయా ముండా, అతని కుమారుడు సాన్రే ముండాకి ఉరి శిక్ష విధించారు. గయా ముండా భార్య మాంకీ కి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
విచారణ ప్రారంభం అయ్యే ముందు ఆయన జైల్లో ఆహారం తీసుకునేందుకు అనాసక్తి చూపించారు. కోర్టులో అనారోగ్యం పాలుకావడంతో ఆయనను మళ్ళీ జైలుకి పంపివేశారు. జూన్ 1వ తేదీన జైలు ఆసుపత్రిలో డాక్టరు బిర్సాకి కలరా వచ్చిందనీ,ఆయన ఇంకా బ్రతికి ఉండే అవకాశం లేదని చెప్పేసాడు.
1900 జూన్ 9వ తేదీన బిర్సా తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇచ్చారు.
ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది. బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.
Source: www.arisebharat.com
బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారు.
ReplyDelete