నన్ను కాల్చు.. లేదా కవిత్వం మాను
రాంప్రసాద్ బిస్మిల్‌ని ఉరి నుంచి ఎలాగూ కాపాడలేకపోయాం. కనీసం యోగేశ్‌చంద్ర చటర్జీనైనా విడిపించగలగాలి. ఎప్పటినుంచో విప్లవకారుల కోరిక అది.
కాకోరీ కేసులో శిక్ష పడి యోగేశ్ ప్రస్తుతం ఆగ్రా జైలులో ఉన్నాడు. జైలుగోడలు బద్దలు కొట్టటం వారివల్ల కాదు. ఏదో ఒక సందర్భాన అతడిని జైలు బయటికి తెచ్చినప్పుడే ఏదైనా చేయగలగాలి. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.
యోగేశ్‌ను లక్నో జైలుకు మార్చబోతున్నారని కబురందింది. ఆగ్రా నుంచి లక్నోకు ఎకాఎకి రైలు లేదు. కాన్పూరులో రైలు మారాలి. ఆలోపే ఏదైనా చెయ్యాలి.
స్కెచ్ బాగానే వేశారు. గ్వాలియర్ నుంచి భగవాన్‌దాస్ మోహరేని, మరికొందరిని పిలిపించారు. ఖైదీని ఎన్నడు ఏ రైలులో తీసుకువెళ్లేదీ ఆరాతియ్యమని బటుకేశ్వర్‌దత్‌కి చెప్పారు. (1929 ఫిబ్రవరి) 16వ తేది రాత్రి 10 గంటల ట్రెయినులో యోగేశ్‌ను తీసుకువెళతారని బి.కె.దత్‌కి తెలిసింది.
రాత్రిపూట ట్రయినులో అందరూ ఆదమరచి కునుకుతుంటారు. పోలీసు పార్టీ మీద అదనుచూసి దాడిచేసి ఖైదీని విడిపించుకుని పరారుకావచ్చు. ఆ ప్రకారం వ్యూహం పన్ని, రాత్రి 10 గంటల ట్రయిను ఎక్కడానికి విప్లవదళం సిద్ధమవుతూండగా - దత్ నుంచి ఇంకో కబురు. ముందు అందిన సమాచారం తప్పు; ఖైదీని తీసుకుని ఈ సాయంత్రం 5.30 బండికే వెళ్లబోతున్నారు - అని!
ఇప్పుడేం చేయాలి? బాంబును పరీక్షించడానికి ఝాన్సీ వెళ్లిన వాళ్లు ఇంకా తిరిగిరాలేదు. మరికాసేపట్లో బయలుదేరనున్న రైలును వాళ్లు అందుకునే ఆశలేదు. దారి మధ్య దాడికి చాన్సు లేదు. ఏదైనా చేయగలిగితే కాన్పూర్‌లో పోలీసు పార్టీ ఆ రాత్రి బస చేసిన సమయంలోనే చెయ్యాలి. ముందు వాళ్లు ఖైదీని కాన్పూర్‌లో ఎక్కడ ఉంచబోతున్నదీ తెలుసుకోవాలి. విడిపించాక పోలీసుల కళ్లుగప్పి ఖైదీని ఎక్కడ దాచిపెట్టవచ్చన్నది చూసుకోవాలి. అదేదో వెంటనే జరగాలి. ఆజాద్‌ను సంప్రదించడానికి వ్యవధిలేదు.
రంగంలో ఉన్నది సుఖ్‌దేవ్. అతడు మెరపులా కదిలాడు. అప్పటికప్పుడు రాజ్‌గురును వెతికిపట్టుకుని 5.30 గంటల రైలు ఎక్కించాడు. కాన్పూరులో దిగాక పోలీసులను వెంబడించు; ఈ రాత్రి యోగేశ్‌ని ఎక్కడ ఉంచేదీ కనుక్కో. విడిపించాక అతడిని దాచటానికి ఎక్కడ వీలవుతుందో చూడు. ఈ పనులు చక్కబెట్టి, వెనుక బండిలో వచ్చే మనవాళ్లను కాన్పూర్ స్టేషనులో కలుసుకో. తరవాత జరగాల్సింది వాళ్లు చూసుకుంటారు -అని రాజ్‌గురుకు చెప్పి పంపించాడు సుఖ్‌దేవ్.
కాన్పూర్‌కి తరవాతి బండి రాత్రి 8.30కి. ఆలోపే ఆజాద్ బృందం ఝాన్సీ నుంచి తిరిగొచ్చింది. సుఖ్‌దేవ్ విషయం తెలపగానే హుటాహుటిన రైలుస్టేషనుకు వెళ్లి బండెక్కారు. ‘ఎటాక్’ పార్టీలో ఆజాద్, భగత్‌సింగ్, బి.కె.సిన్హా, బి.కె.దత్, శివవర్మ, సదాశివ్‌లు ఉన్నారు. వారి దగ్గర ఒక పిస్టలు, రెండు రివాల్వర్లు, యతిన్‌దాస్ తయారుచేయించిన మూడో నాలుగో బాంబులు ఉన్నాయి.
వారికంటే ముందుగా కాన్పూర్ చేరిన రాజ్‌గురు అనుమానం రాకుండా పోలీసు పార్టీని వెంబడించి, ఆ రాత్రికి ఏ పోలీసు లాకప్‌లో యోగేశ్‌ని ఉంచిందీ కనిపెట్టాడు. కాని తెలిసిన వాళ్లను ఎంతమందిని కలిసి ఎంతగా ప్రయత్నించినా ‘ఖైదీ’ని దాచటానికి స్థలం దొరకలేదు. ఉసూరుమంటూ మళ్లీ రైల్వేస్టేషనుకు వెళ్లి సహచరుల కోసం వేచి ఉన్నాడు.
ఆ రోజు లేచిన వేళ బాగాలేదు. ఏ పనీ సరిగా కాలేదు. పైగా ఊహించని అవాంతరాలు. కాన్పూర్‌లో రైలు దిగగానే ప్లాట్‌ఫాం మీద ఎవడో ఆజాద్ పర్సు కొట్టేశాడు. ఉన్నదంతా పోయింది. ఎవరి దగ్గరా చిల్లిగవ్వ లేదు. ఖైదీని విడిపించుకొచ్చాక దాగడానికి చోటు దొరకలేదు. ఎక్కడికి పారిపోవాలన్నా డబ్బు కావాలి. ఆ సంగతి తరవాత చూసుకుందాము లెమ్మని మొండి ధైర్యంతో పోలీసు లాకప్ ఉన్న చోటికి జాగ్రత్తగా వెళ్లారు. కాని - లాభం లేదు. అది అనామతు భవనం కాదు. పక్కాబిల్డింగు. పైగా బందోబస్తు మస్తుగా ఉంది. మెరపు దాడికి వీలులేదు.
చేయగలిగింది ఏదీ తోచక కాళ్లీడ్చుకుంటూ రైలుస్టేషనుకు చేరారు. నకనకలాడే ఆకలితో ఆ రాత్రి అక్కడే గడిపారు. పొద్దున బయలుదేరే మొదటి ట్రయినులో ఆగ్రాకు మరలారు. వారి రైలు, లక్నో వెళ్లే రైలు ఇంచుమించుగా ఒకే సమయంలో బయలుదేరతాయి. ఉదయం వారి ముందు నుంచే పోలీసులు యోగేశ్ చటర్జీని తీసుకువెళ్లారు. కాళ్లకు
చేతులకు కట్టిన గొలుసులు ఖంగున మోగుతూండగా, పాదాలకు ఇనుప బంధనాలు ఈడ్చుకుంటూ ఒక్కో అడుగూ భారంగా వేస్తూ నడుస్తున్న యోగేశ్‌ని చూస్తే అందరికీ కడుపు తరుక్కుపోయింది. భగత్‌సింగ్ ఆ సమయాన బింకంగానే ఉన్నాడు. ఆగ్రా స్థావరానికి తిరిగొచ్చాక అతడికి దుఃఖం పొర్లుకొచ్చింది. అప్పుడు బిస్మిల్ అలా.. ఇప్పుడు యోగేశ్ ఇలా! ఎంత కష్టపడ్డా సహచరులను విడిపించలేక పోయామే అన్న ఆవేదనతో భగత్ వలవల ఏడ్చాడు. అతడి మనసు అంత సున్నితం!
చేతిలో రివాల్వర్లు, జేబులో బాంబులు ఎన్ని ఉన్నా విప్లవకారులు తమ కోసం, తమ సుఖభోగాల కోసం ఎన్నడూ దౌర్జన్యం చేయలేదు. ఎన్ని కష్టాలనైనా పళ్లబిగువున భరించారే తప్ప కట్టు తప్పలేదు. తప్పు చేయలేదు. ఆగ్రా స్థావరంలో వారు గడిపింది ఒకరకంగా ఆశ్రమ జీవితం. పడుకోవటానికి మంచాలు ఉండేవికావు. కప్పుకోవటానికి దుప్పట్లు కరవు. ఎముకలు కొరికే చలిలో నానా అవస్థలు పడేవారు. వండుకోవటానికి పాత్రలు చాలేవి కావు. ఒక్కోపూట అసలు తిండే దొరికేది కాదు. ఉన్న బియ్యం, సరుకులు పొదుపుగా వాడుకోవటం కోసం మధ్యాహ్నమో, రాత్రో భోజనం మానుకోవలసి రావటం పరిపాటి.
వసూళ్లు, ఖర్చులు, మేనేజిమెంటు చంద్రశేఖర్ ఆజాద్ చూసుకునేవాడు. విరాళాలు బాగానే వసూలయ్యేవి. విప్లవకారులంటే సానుభూతి, అభిమానం దేశంలో చాలామందికి ఉంది. ఎవరికి తోచిన సాయం వారు చేస్తూనే ఉండేవారు. మోతీలాల్ నెహ్రు, పురుషోత్తమ్‌దాస్ టాండన్ వంటి కాంగ్రెసు ప్రముఖులు, ఉన్నత స్థానాల్లోని అధికారులు, సంపన్న గృహస్థులు, మధ్యతరగతి వారు విరాళాలు పంపుతూండేవాళ్లు. ఓసారి బెంగాల్ అడ్వొకేట్ జనరల్ అంతటివాడే ఆజాద్‌కు పెద్ద మొత్తానికి బేరర్ చెక్కు పంపించాడు. వచ్చే రాబడి ఆయుధాల సేకరణకు, సాహిత్యం ప్రచురణకు, తిరుగుడు ఖర్చులకు, వివిధ రకాల విప్లవ కార్యకలాపాలకు బొటాబొటిగా సరిపోయేది. ముందు తమ తిండి, బట్టలు, సౌకర్యాల సంగతి చూసుకోవాలన్న ధ్యాస ఎవరికీ ఉండేది కాదు. ఇల్లు విడిచి, వృత్తి ఉద్యోగాల సంపాదన వదులుకుని ఇక్కడికి వచ్చింది సుష్టుగా మెక్కడానికి కాదు. దేశమాతను సేవించటానికి. ఉన్నదానితో సర్దుకుందాం, లేనివాటిని మరచిపోదాం, దేశానికి ఏమి చేయగలమన్నదే ఎప్పుడూ ఆలోచిద్దాం - అనుకునేవాళ్లందరూ. దేశ సమస్యల గురించి, తమ ముందున్న కర్తవ్యాల గురించి, సాధించబోయే ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించే తమకంలో ఎవరికీ ఆకలి, ఇబ్బందులు గుర్తుకొచ్చేవి కావు.
ఆగ్రాలో విప్లవకారుల జీవితం ఎలా ఉండేదో భగవాన్‌దాస్ మహోర్ చెబుతాడు వినండి:
ఓ రోజు విశ్వనాథ్ వైశంపాయన్ వచ్చి ‘పిలుపొచ్చింది. వెంటనే బయలుదేరాలి’ అంటూ నన్ను అర్జంటుగా ఆగ్రా లాక్కెళ్లాడు. అక్కడ ఓ ఇంటి మొదటి అంతస్థుకు వెళ్లి తలుపు తట్టాం. అప్పటికి రాత్రి 11 గంటలైంది. ఎక్కడా అలికిడిలేదు. ఒకతను కిటికీ తెరిచి టార్చ్‌లైటు వేసి మమ్మల్ని తల నుంచి కాళ్లదాకా తేరిపార చూశాక తలుపు తెరిచాడు. గదిలో అడుగుపెట్టగానే గురిపెట్టిన రివాల్వర్ గొట్టం మమ్మల్ని స్వాగతించింది. కిరోసిన్ దీపం గుడ్డివెలుతురులో పరకాయించి చూస్తే రివాల్వర్ పట్టుకుని ఒక యువకుడు తీక్షణంగా మమ్మల్ని చూస్తున్నాడు. అతడు భగత్‌సింగ్! ఆ రాత్రి సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. ముందు గదిలో కొంతమంది కుర్రాళ్లు నేల మీద వరసగా పడుకుని నిద్రపోతున్నారు. వాళ్లు నేల మీద న్యూస్ పేపర్లు పరచుకుని, ధోతులు కప్పుకుని పడుకున్నారు. మా అలికిడికి ఒకరిద్దరు లేచారు.
మాకు దారిలో వాన తగులుకుంది. ఇద్దరమూ ముద్దయ్యాము. తడిసిన బట్టలు విప్పి, వాటిని ఎక్కడ ఆరెయ్యాలా అని చూస్తున్నాము. భగత్‌సింగ్ వాటిని అందుకుని పిండేసి తీగ మీద ఆరేశాడు. చలికి తట్టుకోలేక మేము గజగజ వొణకసాగాము. ‘ఆకలిగా ఉందా?’ అన్నాడు భగత్‌సింగ్. ఆకలి దంచేస్తున్న మాట నిజం. కాని ఆ సమయాన అక్కడ తినడానికి ఏమీ ఉన్నట్టు లేదు. ‘అంతలేదులే. ఇప్పుడేమీ వద్దు. రేపు పొద్దున చూద్దాం...’ అన్నాడు వైశంపాయన్. విజయకుమార్ సిన్హా పక్కన కాస్త చోటు కనిపిస్తే నేను ఇరుక్కుని పడుక్కున్నాను. నేల మీద పరిచిన న్యూస్‌పేపర్లు చలిని ఆపలేవు. ఒళ్లంతా కొంగర్లు పోతున్నాయి. చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు.
మరునాడు ఉదయం నేను లేచేసరికే భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, విజయకుమార్ సిన్హాలు ఒక మూల చేరి సరదాగా కబుర్లాడుతున్నారు. భగత్‌సింగ్ ఎవరినైనా ఆటపట్టించటంలో దిట్ట. సైగ చేసి నన్ను వాళ్ల దగ్గరికి పిలిచాడు. ‘కొత్త కామ్రేడ్‌కి ఏం పేరు పెడదాం?’ అన్నాడు మిగతావాళ్లని. పార్టీలో ఎవరినీ అసలు పేరుతో పిలవరు. ఒక్కొక్కరికి ఒక కోడ్‌నేమ్ ఉంటుంది. ఆజాద్ పేరు ‘పండిట్జీ’. భగత్‌ను ‘రంజిత్’ అంటారు. మరి నన్ను?
‘హనుమాన్’ అందాం - అన్నాడు సిన్హా.
ఛ! పేరునిబట్టి మనిషిని గుర్తుపట్టేట్టు ఉండకూడదు. వద్దు. ‘కైలాష్’ అని పిలుద్దాం - అన్నాడు భగత్‌సింగ్. నేను కోతిలా ఉన్నానని అతడి ఉద్దేశం!
పక్కబట్టలు లేక న్యూస్ పేపర్లు నేల మీద పరచుకుని, కట్టుకునే పంచెలు కప్పుకుని పడుకోవలసి వస్తున్నా, వండుకోవటానికి సరైన పాత్రలు లేక సొట్టలు పడ్డ సత్తుగినె్నలతో, కుండ పెంకులతో సర్దుకుపోతున్నా వ్యక్తిగత ఇబ్బందులను ఎవరూ పట్టించుకునేవారు కారు. ఎప్పుడూ దేశ పరిస్థితులో, రాజకీయాలో, జనం అవస్థలో చర్చిస్తూండేవాళ్లు. సిద్ధాంతాలూ, విధానాల వాదోపవాదాల్లో ఎవరికీ సమయం తెలిసేది కాదు. రోజంతా బాంబుల తయారీ మినహా వేరే పని లేకపోవటంవల్ల ఏదో ఒక అంశం మీద చర్చలు జోరుగా నడుస్తుండేవి. అన్నిటికీ కేంద్ర బిందువు భగత్. రోజూ లైబ్రరీకి వెళ్లి పత్రికలూ, పుస్తకాలూ చాలాసేపు చదివి వస్తూండేవాడు. తాను చదివిన విషయాలు తిరిగొచ్చాక మిగతా వాళ్లకు చెబుతూండేవాడు.
భగత్‌సింగ్ ఏ భేషజాలూ లేకుండా అందరితో కలిసిపోయేవాడు. అయినా అతణ్ని చూడగానే అతడో ప్రత్యేక వ్యక్తి అన్న అభిప్రాయం కలిగేది. ఘరానా కుటుంబం నుంచి వచ్చినవాడని అతడి సహజమైన స్టైలు, ఠీవి సూచించేవి. భగత్ చలాకితనం, మాటకారితనం ఎవరినైనా ఆకర్షించేవి. అతడు చిలిపి మాటలతో ఎంత ఏడిపించగలడో అంత ప్రేమనూ కురిపించగలడు. అలాగే తన పంతం నెగ్గించుకోవటంలో మహాఘనుడు.
ఓ రోజు మేము ముగ్గురం కలిసి వీధిలో వెళుతూంటే ‘అంకుల్ టామ్స్ కాబిన్’ ’ సినిమా పోస్టరు కనిపించింది. అది మనం తప్పక చూసి తీరాల్సిన సినిమా; ఇప్పుడే వెళదాం అన్నాడు భగత్. మా ముగ్గురికి రెండు రోజుల భోజనం ఖర్చు కింద ఆజాద్ నా చేతికి, రూపాయిన్నర ఇచ్చి ఉన్నాడు. అందులో ముప్పావలా పెట్టి సినిమా చూద్దాం అన్నాడు భగత్‌సింగ్.
మరి భోజనమో?
‘దానికేమొచ్చె? ఈ రోజుకు మానేద్దాం’ అన్నాడు భగత్. వద్దంటున్నా వినకుండా సినిమా హాలుకు లాక్కెళ్లాడు. వెళ్లి నాలుగణాల టిక్కెట్లు మూడు తీసుకురమ్మని నాకు పురమాయించాడు.
కౌంటర్లో రద్దీ విపరీతంగా ఉంది. ‘నావల్ల కాదు’ అని తిరిగొచ్చాను. భగత్ ఊరుకునే రకం కాదు. జనంలోకి ఎలా చొచ్చుకెళ్లాలో, ఎటునుంచి చేతులు జాపి టిక్కెట్లు ఎలా సంపాదించాలో నాకు బోధించాడు. ప్రయత్నించాను. కాని నాతరం కాలేదు.
‘ఉండు. నేను తెస్తాను’ అని నా జేబులో డబ్బులు లాక్కుని భగత్ వెళ్లాడు. నాలుగణాల టిక్కెట్లు తీసుకోవటం అతడికీ సాధ్యం కాలేదు. దాంతో ఎనిమిదణాల టిక్కెట్లు మూడు కొనుక్కొచ్చాడు. మొత్తం రూపాయిన్నరా ఖర్చయిపోయింది.
‘ఓరి దేవుడా! రెండు రోజులు పస్తు ఉండాల్సిందే’ అని ఉసూరుమన్నాను నేను. కాని సినిమా చాలా బాగుంది.
ఇంటికి తిరిగెళ్లాక ఆ సినిమా గొప్పతనం గురించి, ప్రతి విప్లవకారుడూ దాన్ని చూడటం ఎంత అవసరమన్న దాని గురించి భగత్‌సింగ్ ఎంత చక్కగా ఉపన్యసించాడంటే చంద్రశేఖర్ ఆజాద్ అంతటివాడు కూడా తిండి డబ్బుతో సినిమాకు వెళ్లినందుకు కోప్పడటం మరచిపోయాడు. భోజనాల ఖర్చుకు నాకు మళ్లీ ఒక రూపాయిన్నర ఇచ్చాడు!
జాతీయ, అంతర్జాతీయ సమస్యలను చర్చించటం, పుస్తకాలు చదవటం, కాలక్షేపానికి పేక ఆడటంతోబాటు అందరం కలిసి ఎప్పుడైనా బయటికి వెళ్లేవాళ్లం. ఓ రాత్రి సరదాగా తాజ్‌మహల్ దగ్గరికి వెళ్లాం. పండువెనె్నలలో ఆ పాలరాతి సౌధాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. అసలే భావుకుడైన భగత్‌సింగ్ సరేసరి. ఈ లోకంలోనే లేనట్టు తదేకంగా తాజ్‌ను చూస్తూండిపోయాడు. అంతలో రాజ్‌గురుకు ఎప్పుడూ అలవాటులేనిది కవితావేశం పొంగుకొచ్చింది.
అలవాటులేనిది కవితావేశం పొంగుకొచ్చింది.
ఇప్పటిదాకా నాకు ప్రేమంటే తెలియదు సుమీ
ఈ సమాధిని చూడగానే నా ప్రేమ చేసింది దొమీ
- అని కవిత్వమల్లి మాకు వినిపించాడు. ప్రేమ దొమీ చేయటమేమిటి అని మేము పగలబడి నవ్వాం. భగత్‌సింగ్ మాత్రం సీరియస్‌గా చూశాడు. చటుక్కున లేచి తన జేబులోని రివాల్వరును తీసి రాజ్‌గురు చేతిలో పెట్టాడు.
‘తీసుకో. నన్ను కాల్చెయ్. లేదా ఇంకెప్పుడూ కవిత్వం జోలికి పోనని మాట ఇవ్వు’ అన్నాడు గంభీరంగా.
మామూలుగా వంతుల ప్రకారం రోజుకొకరు వంటచేసేవాళ్లం. భగత్‌సింగ్ మాత్రం ‘నాకు వంట చేతకాదు. దాని బదులు బట్టలు ఉతుకుతా’ అనేవాడు. అలాగే తన వంతు రోజున అందరి బట్టలు ఉతుకుతూ ఐరిష్ విప్లవం ఊసులను మాకు చెప్పేవాడు. ఒక్కోసారి పంజాబీ, హిందీ, బెంగాలీ పాటలు గొంతెత్తి శ్రోతలు మైమరిచేలా పాడేవాడు. ‘మేరా రంగ్‌దే బసంతి’ పాట అంటే అతడికి మహా ఇష్టం.
అందరిలోకీ ‘ఔరంగజేబు’ చంద్రశేఖర్ ఆజాద్. అతడికి కళలన్నా, భావుకత అన్నా చెడ్డ చిరాకు. అందరితో కలిసి తాజ్‌మహల్‌కేసి వెళ్లినా ‘నాకు దాన్ని చూస్తే కంపరం పుడుతుంది’ అనేవాడు.
ఎప్పుడూ సీరియస్ చర్చలు చేసిచేసి ఒక్కోసారి బుర్రలు వేడెక్కేవి. కాస్తంత రిలీఫ్ కావాలనిపించేది. అందుకే కాబోలు ఓ రోజు రాజ్‌గురు అర్ధనగ్నంగా ఉన్న అందమైన అమ్మాయి రంగుల చిత్రాన్ని ఏదో పత్రికలో నుంచి కట్‌తీసి గోడకు అతికించాడు. ఉన్నవాళ్లందరూ నిండా పాతికేళ్లులేని కోడెవయసు కుర్రవాళ్లే కదా? బొమ్మ చూసి ముసిముసి నవ్వులు నవ్వారు మెచ్చుకోలుగా.
కాసేపటికి రాజ్‌గురు బయటికి వెళ్లాడు. బయటికెళ్లిన ఆజాద్ తిరిగొచ్చాడు. గదిలో అడుగు పెడుతూనే అతడి కన్ను అమ్మాయి బొమ్మ మీద పడింది. పట్టరాని కోపం వచ్చింది. పర్రుమని దాన్ని చించి ముక్కలు చేసి బయట పారేశాడు. రాజ్‌గురు వచ్చాక గట్టిగా మందలించాడు. ‘మనం మాతృభూమి సేవ కోసం ఇల్లు వదిలి, ఇక్కడికొచ్చాం. మన లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని మరిచి ఇలా అందాల వెంటపడకూడదు’ అని కోపంగా అన్నాడు.
రాజ్‌గురు మనసుకు కష్టం వేసింది.
‘అందులో తప్పేమిటి? తాజ్‌మహల్ కూడా అందమైనదే. బొమ్మను చించినట్టు దాన్నీ కూల్చేస్తావా?’ అని అడిగాడు.
‘ఆహా! మన ఏకాగ్రత చెడకుండా చేయటానికి అవసరమైతే, నాకు శక్తి ఉంటే తాజ్‌మహల్‌ని కూల్చేయడానికీ నేను వెనకాడను’ అన్నాడు ఆజాద్ రౌద్రంగా.
రాజ్‌గురు మిన్నకుండలేదు. ‘మనం ప్రపంచాన్ని ఇప్పటికంటే అందంగా మార్చాలని అనుకునేవాళ్లం కదా? అందమైనవన్నీ కూల్చేస్తూ పోతే అది సాధ్యపడుతుందా?’ అన్నాడు నిష్ఠూరంగా.
ఆ మాటలకు ఆజాద్ చలించిపోయాడు. ఆవేశం చప్పున చల్లారి మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. ‘ఔను. నువ్వన్నదీ నిజమే. మనం ఎంచుకున్న లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదనేనా ఆరాటమల్లా. ఏదో కోపంలో అలా చేశాను. నువ్వది పట్టించుకోకు’ అని రాజ్‌గురును సముదాయించాడు.
ఆగ్రా ఇంట్లో మళ్లీ ఎన్నడూ అమ్మాయిల బొమ్మలు కనిపించలేదు.
నన్ను కాల్చు.. లేదా కవిత్వం మాను
ReplyDelete