Breaking News

బందిపోటు భగత్


-ఎం.వి.ఆర్. శాస్త్రి
-------------------
భగత్‌సింగ్ - 13
-------------------

విప్లవమనేది ఖర్చుతో కూడుకున్న పని. ఆశయం, ఆవేశం ఉండగానే సరిపోదు. పోరాటం నడపటానికి ఇం‘్ధన’మూ కావాలి.
ఆ కాలపు విప్లవకారులకు సుఖాల మీద, భోగాల మీద ధ్వాస ఏ కోశానా లేదు. ఉన్న దానితోనే సర్దుకుంటూ, లేనినాడు కాళ్లు ముడుచుకుని ఖాళీ కడుపుతోనే శ్రామిక స్వర్గపు కలలు కంటూ, సిద్ధాంత చర్చలతో రాజకీయ రచ్చలతో ఆకలిని మరిచిపోతూ విరాగులలాగే బతికేవారు. అయనా తిండి, బట్ట, వసతి లాంటి కనీసావసరాలకు డబ్బు తప్పనిసరి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్లు కూడా, ఉద్యోగాలో వృత్తి వ్యాపారాలో వదులుకుని విప్లవ తమకంతో ఊరు వదిలి వచ్చాక రహస్య జీవితంలో నిత్యావసరాలకే ఖాళీ జేబులు తడుముకోవలసిన పరిస్థితి. రహస్య శిబిరమో, స్థావరమో నడపటానికి నెలనెలా తగు మాత్రం ఖర్చు తప్పదు.
దీనికి తోడు ఉద్యమాన్ని వ్యాప్తి చేయటానికి ఎంతోమంది ఎన్నో ఊళ్లు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగుడు ఖర్చులు బాగానే అవుతాయి. విదేశీ విప్లవ సంస్థలతో, ప్రవాస భారతీయ ఉద్యమకారులతో సంబంధాలు పెంచుకోవటానికి అప్పుడప్పుడు విదేశ యాత్రలూ చేయవలసి వస్తుంది. బాంబులూ ఆయుధాల తయారీలో శిక్షణ నిమిత్తం ముఖ్య కార్యకర్తలను ఎక్కడెక్కడికో పంపవలసి ఉంటుంది. వారు నేర్చుకొచ్చిన విద్యను ఆచరణలో పెట్టి చాటుమాటున బ్యాంబుల ఫ్యాక్టరీలు, తుపాకుల తయారీ కేంద్రాలు నడపటానికి పెట్టుబడి చాలా అవుతుంది. ఇవిగాక విప్లవ సాహిత్యాన్ని, కరపత్రాలూ పోస్టర్ల వంటి ప్రచార సామగ్రిని రహస్యంగా ముద్రించటానికీ, ఊరూరికీ వాటిని చేరవేయటానికీ ఖర్చు మోపెడు.
మరి ఇవన్నీ వెళ్లతీయడానికి డబ్బు ఎలా? దేశభక్తి, విప్లవకారుల పట్ల సానుభూతి ఉన్న స్థితిపరులు ఎవరికి చేతనైన, ఎవరికి తోచిన సాయం వారు డబ్బు రూపంలోనో, వస్తు రూపంలోనో అందిస్తూనే ఉన్నారు. పురుషోత్తమ్‌దాస్ టాండన్, నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ, అడ్వొకేట్ జనరల్ ఎ.ఎన్.సర్కార్, మోతీలాల్ నెహ్రూ వంటి ప్రముఖులు చంద్రశేఖర్ ఆజాద్ బృందానికి చేయగలిగిన ఆర్థిక సహాయం చేస్తూనే ఉన్నారు. అయినా అవసరాలకు అది సరిపోవడం లేదు. అష్ట దరిద్రాల్లో ఉన్న సామాన్య ప్రజలు విరాళాలు ఇచ్చే స్థితిలో లేరు. అదీగాక కాంగ్రెసు వాళ్లలా రహస్య విప్లవకారులు వీధినపడి బాహాటంగా నిధులు పోగుచేయలేరు. కనుక ఆర్థిక లోటు పూడ్చుకోవటానికి వేరే దారులు పట్టక తప్పలేదు.
హింస పనికిరాదు; దౌర్జన్యం కూడదు అన్న చాదస్తం విప్లవకారులకు లేదు. పోరాడుతున్నదే విదేశీ వలస పాలనను అంతమొందించడానికి అయినప్పుడు ఆ పాలనలో భాగమైన ప్రభుత్వ ట్రెజరీల మీద, ప్రభుత్వ సంస్థల మీద దాడిచేసి అందిన కాడికి దోచుకోవటానికి సిద్ధాంతపరంగా అభ్యంతరమేమీ లేదు. కాని ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టటానికి బోలెడు హంగులు కావాలి. అందులో రిస్కూ ఎక్కువ. అంతకంటే ఇనప్పెట్టెల్లో నగదూ, నగలూ మూలుగుతూండే ఘరానా గృహస్థులను, వ్యాపారులను బెదిరించి, దోపిడీ చేయడం తేలిక. రిస్కూ తక్కువ. సామాన్య ప్రజలను దోచుకోరాదన్నదే నియమం కాబట్టి బ్రిటిషు తొత్తులైన సంపన్నులను దోచుకోవడానికి సైద్ధాంతికంగా అభ్యంతరం లేదు.
అందుకని హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్.ఆర్.ఎ.) పార్టీ వారు ఆపద్ధర్మంగా అడపాదడపా దోపిడీలూ చేసేవారు. కాన్పూరు ప్రాంతంలో ఉండగా భగత్‌సింగూ అలాంటి ఆపరేషన్లు కొన్నిటిలో పాలుపంచుకున్నాడు.
విప్లవకారులకు తెలివితేటలు ఎక్కువ. కాబట్టి ఎవరి మీద, ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న వ్యూహం బాగానే పనే్నవారు. మాటువేసి మెరపు దాడి బాగానే చేసేవారు. తాము దోచుకున్న మొత్తాల, వస్తువుల వివరాలు (మన్యంలో మన అల్లూరి సీతారామరాజులా) లెక్క రాయడమే కాదు. స్వతంత్ర భారత విప్లవ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటి విలువ తిరిగి చెల్లించబడునంటూ రసీదు కూడా ఇచ్చేవాళ్లు.
అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే వీరు మంచి బందిపోట్లు. మామూలు బందిపోట్లలా తమకు చిక్కిన వారిని క్రూరంగా చితకబాదటం, చిత్రహింసలు పెట్టి డబ్బూ దస్కం బయటికి

తీయించటం వీరికి చేతకాదు. వీళ్ల బడాయి బెదిరింపులకు, అదిలింపులకు వీరి బారిన పడ్డవారు ఏమంత లొంగేవారు కాదు. రష్యన్, ఐరిష్ విప్లవకారుల్లా తామూ బలవంతపు విరాళాల సేకరణకు దోపిడీలు చేయాలని ఉబలాటపడ్డా, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు పాల్గొన్న బందిపోటు సాహసాల్లో గిట్టుబాటు తక్కువ.
ఆ కాలాన హెచ్.ఆర్.ఎ.కు నాయకత్వ బాధ్యత నిర్వర్తిస్తున్న రామ్‌ప్రసాద్ బిస్మిల్‌కు ఓ సంగతి తెలిసింది. ఒక విప్లవ సంస్థ వారు జర్మనీ నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను రహస్యంగా తెప్పించుకోబోతున్నారట. మాకూ ఆయుధాలూ కావాలి; మీతోబాటు మాకూ తెప్పించండి అని బిస్మిల్ వాళ్లని అడిగి ఒప్పించాడు. మరి వాటిని కొనడానికి డబ్బు?
ప్రతి విప్లవకారుడు తన జేబులో ఉన్నది, ఇంటి దగ్గర ఉన్నది తెచ్చి ఇచ్చారు. సానుభూతిపరులను అడిగి కొంత పోగుచేశారు. అయినా కొన్ని వందల రూపాయలు మాత్రమే వసూలైంది. అవసరమేమో వేలల్లో. మరి ఎలా?
తీవ్రంగా ఆలోచిస్తే బిస్మిల్‌కి కొంతకాలం కింద రైలు ప్రయాణంలో తాను గమనించిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. రైలు ఆగిన చోటల్లా స్టేషను మాస్టరు డబ్బు సంచి తెచ్చి గార్డు ఉన్న పెట్టెలో వేస్తున్నాడు. అలా గమ్యం చేరేసరికి గార్డు పెట్టెలో పోగయ్యే మొత్తం చాలా వేల రూపాయలే ఉండొచ్చు.
మాటువేసి వాటిని దోచుకుంటే పోలా?
ఐడియా రాగానే బిస్మిల్ ఎక్కడెక్కడి విప్లవకారులనూ లక్నోలో ఒక రహస్య స్థలానికి పిలిచాడు. అంతా కలిసి యాక్షన్ ప్లాను వేశారు. మెరికల్లాంటి తొమ్మిది మందిని ఈ పనికి ఎంపిక చేశారు. వారికి నాయకుడు బిస్మిల్.
పిస్తోళ్లు, రివాల్వర్లను సిద్ధం చేసుకుని 1925 ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నానికల్లా ఎవరికి వారుగా కాకోరి చేరుకున్నారు. అది షాజహాన్‌పూర్ - లక్నోల మధ్య లక్నోకి ఎనిమిది మైళ్ల దూరంలోని చిన్న రైలుస్టేషను. రైల్వే లైనుకు అటూఇటూ దట్టమైన పొదలు, పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. జన సంచారం తక్కువ. తప్పించుకోవటం తేలిక.
హర్‌దోయి నుంచి లక్నో వెళుతున్న ‘8 డౌన్’ పాసింజరు రాగానే అందరూ ఎక్కారు. అష్‌ఫాక్ ఉల్లాఖాన్, శచీంద్రనాథ్ భర్ష, రాజేంద్రనాథ్ లాహిరి జంటిల్మెన్ల వేషంలో సెకండ్ క్లాసు కంపార్టుమెంటులో ఉన్నారు. రాంప్రసాద్ బిస్మిల్, ఆజాద్, మన్మథ్‌నాథ్ గుప్తా, కుందన్‌లాల్, కేశవ్ చక్రవర్తి మూడో తరగతి పెట్టెలో ఉన్నారు.
అది చీకటి రాత్రి. రైలు కాకోరి స్టేషను దాటి కాస్త దూరం వెళ్లగానే సెకండ్ క్లాసులోని వాళ్లు ఏదో వంకన చైనులాగారు. రైలు ఆగగానే అందరూ దిగ్గున లేచి గార్డు పెట్టె దగ్గరికి పరిగెత్తారు. అక్కడ కాపలా ఉన్న పోలీసుల మీద అధాటున పడి తుపాకులు ఎక్కుపెట్టి లొంగదీసుకున్నారు. వాళ్లను ఆయుధాలు వదిలేసి నేల మీద బోర్లా పడుకోమన్నారు. ‘ఎవరూ కదలొద్దు. దగ్గరికి రావద్దు’ అని తుపాకులు ఝళిపిస్తూ చుట్టుపక్కల వారిని భయపెట్టారు.
ఇక డబ్బును కొల్లగొట్టాలి. పెట్టె చాలా బరువుగా ఉంది. తాళాలు సీళ్లు యమా గట్టిగా ఉన్నాయి. బిస్మిల్ సైగ చేయగానే సహచరులు ఉలి, సుత్తులతో చాలాసేపు కొట్టికొట్టి మొత్తానికి తాళం పగులగొట్టారు. పెట్టె తెరచి మొత్తం రొక్కాన్ని సంచిలో వేసుకుని వచ్చినంత వేగంగా పరారయ్యారు. వారు వద్దువద్దని హెచ్చరిస్తున్నా కొందరు వెంటపడ్డారు. ఆత్మరక్షణకు విప్లవకారులు జరిపిన కాల్పుల్లో ఒక ప్రయాణికుడి ప్రాణం పోయింది.
ఇంతా కష్టపడితే ట్రెజరీ లూటీలో దక్కిన సొమ్ము 4679 రూపాయల 1 అణా 6 దమ్మిడీలు. దోచిన సొత్తు తక్కువే అయినా సాయుధ పోలీసుల కాపలాతో తీసుకువెళుతున్న గవర్నమెంటు ట్రెజరీని విప్లవకారులు రైలు దోపిడీలో కొల్లగొట్టారన్న వార్త దేశమంతటినీ దిగ్భ్రాంతపరచింది. సైనిక బలంతో జనాన్ని భయపెట్టి బతుకుతున్న తెల్లదొరతనం ఆ బలానే్న బలాదూరు చేసిన విప్లవ దాడిని తన ప్రతిష్ఠకు సవాలుగా పరిగణించి వేగంగా కదిలింది. వేటు వేసింది. అన్ని రాష్ట్రాల్లో జల్లెడ పట్టి రాంప్రసాద్ బిస్మిల్, అష్‌ఫాకుల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్ వగైరా విప్లవకారులను అరెస్టు చేసింది. ‘కాకొరి కుట్ర కేసు’లో శచీంద్రనాథ్ సన్యాల్, యోగేశ్ చంద్ర చటర్జీలనూ ఇరికించింది. రైలు దోపిడీలో పాల్గొన్న పది మందిలో చంద్రశేఖర్, కుందన్‌లాల్ గుప్తాలు మాత్రమే పోలీసుల వల నుంచి తప్పించుకో గలిగారు. (ఇటువంటి సాహసకృత్యాలు ఎన్ని చేసినా చంద్రశేఖర్ ఆజాద్ తన కంఠంలో ప్రాణం ఉండగా పోలీసులకు పట్టుబడలేదు)
కాకొరి కుట్ర కేసును మొత్తం 21 మందిపై మోపారు. మొక్కుబడి విచారణ తరవాత రాంప్రసాద్ బిస్మిల్ సహా నలుగురికి ఉరిశిక్ష వేశారు. యోగేశ్‌చంద్ర చటర్జీ, శచీంద్రనాథ్ సన్యాల్ సహా నలుగురికి యావజ్జీవ ఖైదును విధించారు. మిగిలిన వాళ్లనూ జైలుకు పంపారు. రైలు దోపిడీతో దేశమంతటా విప్లవకారుల పేర్లు మోతమోగాయి. కాగా ముఖ్య నాయకులందరూ కాకోరి కేసులో జైలుపాలవడంతో విప్లవోద్యమానికి నడుము విరిగింది. మళ్లీ కాలూ చెయ్యి కూడదీసుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది.
రైలు దోపిడీలో భగత్‌సింగ్ లేడు. ఆ సమయాన అతడు లాహోర్ తిరిగి వచ్చి నేషనల్ కాలేజి పట్ట్భద్రులను, టీచర్లను, విద్యార్థులను కూడగట్టి యువజనోద్యమాన్ని సమీకరించే పనిలో ఉన్నాడు. బిస్మిల్ బృందం చేసిన సాహసకృత్యానికి అతడి ఒళ్లు పులకరించింది. పగబట్టి తన సహచరులను వేటాడుతున్న బ్రిటిషు ప్రభుత్వ దాష్టీకానికి అతడు మండిపడ్డాడు. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయాడు.
కాకోరీ కుట్ర కేసులో ఒక వంక అరెస్టులు సాగుతూండగానే ఇంకో చెంప నిర్బంధితులను విడిపించే ప్రయత్నాలూ మొదలయ్యాయి. న్యాయస్థానంలో కేసును ఎదుర్కోవడానికి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రు, గణేశ్ శంకర్ విద్యార్థి లాంటి ప్రముఖులతో కమిటీ ఏర్పాటైంది. హేమాహేమీలు ఎందరు తమ పక్షాన ఉన్నా తెల్లవారి న్యాయం మీద విప్లవకారులకు నమ్మకం లేదు. విచారణ తతంగం తరవాత ఉరికంబాలు, ద్వీపాంతర శిక్షలు ఎలాగూ తప్పవని వారికి తెలుసు. అందుకే కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే జైలు నుంచి నిందితులను తప్పించేందుకూ రహస్య ప్రయత్నాలు సాగాయి.
వాటిలో ముఖ్య భూమిక భగత్‌సింగ్‌ది.
ఈ పని మీద లాహోర్ నుంచి కాన్పూరుకు అతడు తరచూ వెళ్లేవాడు. అంతకు ముందే తాను సైతం అదే ఊళ్లో పోలీసుల నిఘా నేత్రానికి చిక్కినందువల్ల లోగడ తిరిగిన ప్రాంతాలకేసి వెళ్లకుండా, అప్పుడు పరిచయమైన వారిని పలకరించకుండా, కొత్త చోట్లను, కొత్త సహచరులను వెదుక్కోవలసి వచ్చింది. ఢిల్లీలోని కాశీరామ్ అనే సహచరుడి ద్వారా పరిచయం చేసుకుని కాన్పూరు డి.ఎ.వి. కాలేజిలో చదువుతున్న శివవర్మ, జయదేవ్‌ల దగ్గరికి భగత్‌సింగ్ మారు పేరుతో వెళ్లాడు. వారి దగ్గర ఉంటూనే బిస్మిల్ వంటి ముఖ్యులను జైలు నుంచి ఎత్తుకొచ్చేందుకు శాయశక్తులా కష్టపడ్డాడు.
ఆ ముచ్చట్లను శివవర్మ మాటల్లో చిత్తగించండి:

‘పంజాబీ జంటిల్మను ఒకాయన కాన్పూర్ వస్తున్నాడు. అతడిని ఈ మధ్యే నాకెవరో పరిచయం చేశారు. ఏదో పని మీద కాన్పూర్ వెళుతున్నాను; అక్కడ తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నీ పేరు, జయదేవ్ పేరు చెప్పాను. మీరున్న చోటికి వచ్చి త్వరలో కలుస్తాడు. మిగతా వివరాలు అతడే చెబుతాడు - అంటూ ఢిల్లీ నుంచి ఓ ఫ్రెండు ఉత్తరం రాశాడు.
దాన్ని చూసి నేను, జయదేవ్ కంగారుపడ్డాము. ఆ వచ్చేవాడు ఎవడో, ఎలాంటివాడో, మనవాడు మన గురించి ఏమి చెప్పాడో, అవన్నీ తెలుసుకుని ఇతగాడు మన కొంప ఎక్కడ ముంచుతాడోనని హడలిపోయాము. మా గదులను గాలించి మమ్మల్ని ఇబ్బంది పెట్టగలవనుకున్న సరంజామా అంతా తీసేశాము. కేవలం క్లాసు పుస్తకాలను మాత్రమే ఉంచాము. అప్పట్లో మేము కాలేజి హాస్టలు దగ్గర రెడ్ బంగళాలో ఉండేవాళ్లం. జయదేవ్ ఆఖరికి తన గదిలోని చర్ఖాను కూడా తొలగించాడు. పంజాబీవాడు ముందు నా దగ్గరికొస్తే నీ ఆచూకీ చెప్పను; నీ దగ్గరికొస్తే నా ఆచూకీ చెప్పకు అని పరస్పరం ఒప్పందం చేసుకున్నాం.
ఓ రోజు పొద్దున నా గదిలో కూచుని కాలేజి వర్కు చేసుకుంటూండగా బయట ఎవరో నా గురించి వాకబు చేయటం వినిపించింది. తలుపు తీసి చూద్దును గదా - ఒక సిక్కు యువకుడు. మాసిపోయిన సల్వార్ కమీజ్ ధరించి, దుప్పటి కప్పుకుని నిలబడి ఉన్నాడు. మంచి పొడగరి; పచ్చటి ఛాయ; ఎదుటి వారిని గుచ్చిచూసే కళ్లు; అందమైన మొగం; పొడుగు జుట్టు; తలపాగా.
‘ఇతనే శివవర్మ’ అని నా పొరుగువాడు అతడికి నన్ను చూపించాడు.
ఆగంతకుడు నేను ఎప్పటి నుంచో తెలిసిన ఆప్తమిత్రుడినైనట్టు చేతులు చాచి నన్ను కౌగిలించుకున్నాడు. తరవాత నా చెయ్యి పట్టుకుని నా రూములోకి తీసుకువెళ్లాడు... అదేదో తన ఇల్లయినట్టూ, నేను తనకు అతిథినయినట్టూ! ఏ మాత్రం తటపటాయించకుండా, ఆహ్వానం కోసం చూడకుండా నా బెడ్ మీద కూచున్నాడు. నన్నూ చెయి పట్టుకుని లాగి తన పక్కన కూచోబెట్టుకున్నాడు.
‘నా పేరు రంజిత్. కొన్నాళ్లు ఇక్కడ ఉంటాను. నీ గురించి, జయ్‌దేవ్ గురించి ఢిల్లీలో ఓ ఫ్రెండు చెప్పాడులే. నేనూ మీకు తోడుబోయనవాడినే’ అని క్షణం ఆగి ‘ఔనూ, నీకు విజయ్, సురేందర్ పాండేలు తెలుసా?’ అని అడిగాడు.
అతడి వాలకం, అతడి ప్రవర్తన, అతడి నవ్వు మొగం, ప్రేమను కురిపించే చూపులు మొదటి సమాగమంలోనే నన్ను కట్టి పడేశాయి. అతడిని నమ్మకపోవటం అనేది నాకు అసాధ్యమైంది. అంతకు ముందు నేను కట్టుకున్న రక్షణ గోడలు కూలిపోయాయి. అతడు అడిగినంత ఈజీగా నేనూ ‘ఔను. వాళ్లు నాకు తెలుసు’ అని జవాబు చెప్పాను. ‘ఐతే నన్ను ఇక్కడ కలవమని వాళ్లకు చెప్పు’ అని కాసేపు ఆగి ‘జయదేవ్ ఏడీ’ అని అడిగాడు అతను. ‘ఎటో వెళ్లాడు. ఇక్కడ లేడు’ అని నేను అబద్ధమాడాను. ఆ సంగతి అతడు గ్రహించాడు. మొగం చిన్నబుచ్చుకుని, తన వెంట తెచ్చుకున్న విక్టర్ హ్యూగో నవల 'La Miserables' చదవడం మొదలెట్టాడు గంభీరంగా.
నిజం దాచి అనవసరంగా అతడిని బాధపెట్టానే అని నేను చాలా నొచ్చుకున్నాను. తరవాత భోజనశాలలో జయదేవ్‌ను నేను చెప్పకుండానే ‘రంజిత్’ పోల్చుకున్నాడు. మళ్లీ మామూలుగా అయిపోయి సరదాగా జోకులేశాడు. అతడు వచ్చిన సంగతి సురేందర్‌కు చెబితే ‘ఔను. రంజిత్ మనవాడే. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాడే’ అన్నాడు. రంజిత్ ఉన్నంతకాలమూ విజయ్, సురేందర్‌లు రోజూ నా రూముకొచ్చి అతడిని కలిసి వెళుతూండేవాడు.
రంజిత్ వచ్చింది రాంప్రసాద్ బిస్మిల్‌ని జైలు నుంచి విడిపించే పని మీద. బిస్మిల్‌ను కాంటాక్ట్ చేసే పనిని, ప్లాను ఖరారు బాధ్యతను విజయ్‌కి అప్పగించి కొన్నాళ్ల తరవాత అతడు పంజాబ్ తిరిగి వెళ్లాడు. తరవాత తెలిసింది అతడి అసలు పేరు భగత్‌సింగ్ అని.
[Shiv Varma Quoted in "Bhagat Singh',
Malwinder Jit Singh Waraich, pp.33-34]

1 comment: