పిల్లలు మెచ్చిన పంతులు
భగత్‌సింగ్ 12
‘సర్దార్ బహదూర్’ దిల్బాగ్‌సింగ్ నిప్పు తొక్కిన కోతిలా ఎగిరెగిరి పడ్డాడు.
పడడా మరి? ఇంతకాలమూ తన ఇలాఖాలో తన మాటే సుగ్రీవాజ్ఞ; తాను గీచిందే గీటు; వేసిందే వేటు; ఆడిందే ఆట - అని అతడికి గొప్ప నమ్మకం. ఊళ్లన్నీ తన గుప్పిట్లో ఉన్నాయని, కనుసైగతో ఎవరినైనా, దేన్నయినా కట్టడి చెయ్యగలననీ మహా ధీమా. పైవాళ్లతో ఏ పని కావలసి వచ్చినా, ఏ కేసు మీద పడ్డా, సాయంకోసం ఎవరైనా అతడి కాళ్ల దగ్గరికి రావలసిందే. ఫలానా పని చేయవద్దు అని తాను అంత గట్టిగా ఆజ్ఞాపించాక జనమంతా కుక్కిన పేనుల్లా పడి ఉంటారని అనుకుంటే - ఇదేమిటి? కథ ఇలా అడ్డం తిరిగింది? అకాలీగాళ్ల మొగాన మంచినీళ్లయినా పోయవద్దు అని సర్కారువారు తనకు సెలవిస్తే, తన ఊరిజనం మేళతాళాలతో వాళ్లని స్వాగతించి, మృష్టాన్న విందు భోజనాలే పెట్టి పంపారంటే తెల్లదొరల ముందు తనకు మొగం ఎలా చెల్లుతుంది? తన ప్రయోజకత్వానికి మెచ్చి దొరవార్లు భూరి బహుమానాలేవో ఇస్తారని ఆశపడుతూండగా ఆఫ్టరాల్ ఒక కుర్రకుంక, అందునా తన పాలివాడు తననో వాజమ్మను చేసి పరువు పీకి పెట్టాడంటే ఒళ్లు మండదా?
అందుకే దిల్బాగ్‌సింగ్ పళ్లునూరి భగత్ మీద పగపట్టాడు. క్రిమినల్ లా అమెండ్‌మెంటు సెక్షను 17 (1) కింద కేసు పెట్టించి, గౌరవ మేజిస్ట్రేటు హోదాలో భగత్‌సింగ్ అరెస్టుకు వారంటు కూడా జారీ చేయించాడు. దొరికాక వాడి కాళ్లూ చేతులకు సంకెళ్లు వేయించి చిత్రహింసలు పెట్టించి, జైల్లో వేయించి సంతోషిద్దామనుకున్నాడు.
కాని భగత్‌సింగ్ దొరకలేదు.
కిషన్‌సింగ్ ముంబయి నుంచి ఇంటి దారిలో ఉండగానే కొడుకు ప్రతాపం చెవిన పడింది. ఇంటికొచ్చేసరికి ‘అన్నా! మీవాడు సామాన్యుడు కాడు. ఏదో ఒకనాడు గొప్ప జాతీయ నాయకుడు అయిపోతాడు. మీ ఊళ్లో అతడివల్ల మాకు దొరికిన ఆతిథ్యాన్ని మా జన్మలో మరచిపోలేము’ అంటూ జథేదారు కర్తార్‌సింగ్ రాసిన ఉత్తరం వచ్చి ఉంది. అది చదివి తండ్రి సంతోషపడ్డాడు. అంతలోనే ఎరిగిన వారెవరో వచ్చి ‘మీ జ్ఞాతి దిల్బాగ్ మీ వాడి మీద కత్తికట్టాడు. రేపోమాపో అరెస్టు చేయొచ్చు. జాగ్రత్త’ అని హెచ్చరించారు.
కిషన్‌సింగ్ క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే కొడుకును పిలిచి, ఉన్నపళాన రైలు ఎక్కించాడు. కిందటి సంవత్సరం తండ్రి నుంచి తప్పించుకోవటానికి భగత్ ఇల్లు వదిలి పారిపోయాడు. ఇప్పుడు ఇంటి నుంచి పారిపొమ్మని తండ్రే పురికొల్పాడు.
ఎక్కడికి వెళ్లాలి, ఏమి చేయాలి అని మధనపడాల్సిన పనిలేదు. కాన్పూర్ భగత్ కోసం కాచుకు కూచున్నది. సెలవల్లో కొద్దిరోజులు ఇంటికొచ్చి, మళ్లీ తన పనికి తాను తిరిగి వెళుతున్నట్టే ఉంది అతడికి. ఇంటి పట్టున ఉన్న కొద్ది వారాల్లో లాహోర్, దాని చుట్టుపట్లా హెచ్.ఆర్.ఎ. కార్యకలాపాలను సాగించి, కొత్త కార్యకర్తలను తయారుచేసుకోవడంతో భగత్ బలగం పెరిగింది. కాన్పూర్‌లో విప్లవ కదలికా అతడు తిరిగి వెళ్లాక మరింత ఊపునందుకుంది.
కార్యస్థానం కాన్పూరే. కాని ఇంతకు ముందు ఉన్నచోటే ఉంటూ, చేసిన కొలువునే మళ్లీ చేస్తే ప్రమాదం. ‘ప్రతాప్’ ప్రెస్సులో పనిచేస్తూండగా భగత్‌సింగ్ పోలీసుల కంట్లో బాగానే పడ్డాడు. సొంత ఊళ్లో క్రిమినల్ కేసు మీద పడి, పోలీసుల గాలింపు తీవ్రమయ్యాక కూడా మళ్లీ అదే చోట ఉండి అదే పని చేయటం మంచిది కాదు. కొంతకాలం నగరానికి దూరంగా ఉండటం క్షేమం.
అలా దూరం ఆలోచించి గణేశ్ శంకర్ విద్యార్థిగారు భగత్‌సింగ్‌ని తన స్నేహితుడు ఠాకూర్ తోడర్‌సింగ్ దగ్గరికి పంపించాడు. తోడర్‌సింగ్ అలీగఢ్ జిల్లాలో పేరు మోసిన కాంగ్రెసువాది. విప్లవకారులంటే ఆయనకు సానుభూతి, సదభిప్రాయం ఉన్నాయి. అలీగఢ్ జిల్లా ఖేర్ తహసీల్‌లోని షాదీపూర్ గ్రామంలో ఆయన కొత్తగా ఒక జాతీయ పాఠశాల పెట్టాడు. దాన్ని చక్కగా నిర్వహించడానికి సమర్థుడైన హెడ్మాస్టరు కోసం వెతుకుతున్నాడు. భగత్‌సింగ్ ఆయనకు చూడగానే నచ్చాడు. వెంటనే ఉద్యోగం ఇచ్చి బడి బాధ్యత అప్పగించాడు.
కాన్పూర్ నుంచి భగత్‌సింగ్ మకాం మార్చాల్సి వచ్చినా యోగేశ్‌చంద్ర చటర్జీ లాంటి విప్లవ నాయకులు అభ్యంతరం చెప్పలేదు. ఒకరకంగా అదీ మంచిదే అనుకున్నారు. కనీస అవసరాలకే డబ్బు కటాకటిగా ఉన్న పరిస్థితుల్లో భగత్‌సింగ్‌కి ఎంతో కొంత జీతం రావటం విప్లవ కార్యక్రమాలకు సహాయకారి అవుతుంది. పార్టీ కేడర్ నియామకాలకు, శిక్షణకు షాదీపూర్ పాఠశాల రహస్య కేంద్రంగా పనికొస్తుంది.
నాయకుల నమ్మకాన్ని భగత్‌సింగ్ వమ్ము చేయలేదు. అలాగని పాఠశాల పనినీ అతడు నిర్లక్ష్యం చేయలేదు. అప్పటికి అతడికి ఇంకా 18వ ఏడు నిండలేదు. ఏ కాలేజీలోనో చదువుకుంటూ ఉండాల్సిన వయసు. అయినా కుర్రవాడన్న చిన్నచూపు ఎవరికీ కలగకుండా చక్కని దీక్షాదక్షతలతో బడిని ఒక దారిన పెట్టాడు. సమర్థులైన ఉపాధ్యాయుల బృందాన్ని సమకూర్చుకున్నాడు. బడిపిల్లలనూ అయస్కాంతంలా ఆకర్షించగలిగాడు. ఊరిపెద్దల అభిమానాన్నీ చూరగొనగలిగాడు. విప్లవవీరుడు కాకుండా ఉంటే భగత్‌సింగ్ గొప్ప ఉపాధ్యాయుడిగా పెద్ద పేరు తెచ్చుకునేవాడని అప్పట్లో అతడి పనితీరును గమనించిన సహచరులు అనేవారు.
భగత్‌సింగు స్కూలు హెడ్మాస్టరుగా పని చేస్తున్న కాలంలోనే 1924 సెప్టెంబరు 26, 29 తేదీల్లో భారీ వర్షాల ధాటికి గంగా, యమున నదులకు వరదలొచ్చాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం విపరీతంగా జరిగి, కొంపా గోడూ కొట్టుకుపోయి, లక్షల జనం నానా అగచాట్లు పడ్డారు. నిర్వాసితులను ఆదుకోవటం, అంటురోగాలను అరికట్టటం, సహాయ పునరావాస చర్యలు సాగించటం ప్రభుత్వానికి, సమాజానికి పెద్ద సవాలు అయింది.
ప్రజలకు వచ్చి పడ్డ ఈ ప్రకృతి వైపరీత్యానికి భగత్‌సింగ్ తీవ్రంగా స్పందించాడు. విప్లవ కార్యకలాపాలు మాత్రమే తన పని అనీ, వరద బాధితులను ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత అనీ అనుకోకుండా చప్పున కదిలి, పదుగురినీ సమీకరించి, వరదలు ముంచేసిన కాన్పూర్‌లో శాయశక్తులా సహాయక చర్యల్లో నిమగ్నుడయ్యాడు. గతంలో కాంగ్రా భూకంప సమయాన తన తండ్రి కిషన్ సింగ్ హుటాహుటిన వెళ్లి బాధితులకు గొప్పగా సహాయపడినట్టే భగత్ కాన్పూర్ వరదల్లో నిర్విరామంగా కష్టపడి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
పగలంతా పాఠశాల పని. రాత్రులు గ్రామాల్లో తిరుగుతూ విప్లవ సిద్ధాంతాల ప్రచారాలు. ఊపిరి సలపనివ్వని పార్టీ పనులు. ఇలా క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న సమయంలో హెచ్.ఆర్.ఎ. పార్టీని ఆర్గనైజ్ చేసే పని మీద భగత్‌సింగ్ కొన్నాళ్లు ఢిల్లీకి మకాం మార్చవలసి వచ్చింది. అక్కడ స్వామి శ్రద్ధానంద కుమారుడు ఇంద్ విద్యా వాచస్పతి నడుపుతున్న హిందీ దినపత్రిక ‘వీర్ అర్జున్’లో నెలకు 25 రూపాయల జీతంతో ఉద్యోగం సంపాదించాడు. ‘బల్వంత్‌సింగ్’ పేరుతోనే అందులో రచనలు చేస్తూండేవాడు.
జర్నలిస్టు కొలువు భగత్‌సింగ్‌కి కొత్త కాదు. అంతకు ముందు కాన్పూర్‌లో ‘ప్రతాప్’ వారపత్రికలో పనిచేశాడు. అయినా దినపత్రిక పనికీ, వీక్లీ జర్నలిజానికీ తేడా ఉంది. వైరు మీద ఇంగ్లిషులో వచ్చే వార్తలను డైలీ జర్నలిస్టులు ఎప్పటికప్పుడు చదివి అర్థం చేసుకుని, హిందీలో తర్జుమా చేయాలి. దానికి రెండు భాషల మీదా గట్టి పట్టు ఉండాలి. లోకజ్ఞానమూ కావాలి.
నిండా ఇరవై ఏళ్లు రాకుండా దినపత్రికలో సబ్ ఎడిటరుగా చేరిన భగత్‌సింగ్ వృత్తిపరమైన అనుభవంలేక మొదట్లో తడబడ్డాడు. అందరు జర్నలిస్టుల్లాగే ఆరంభంలో తప్పులో కాలూ బాగానే వేశాడు.
మచ్చుకు యశ్‌పాల్ తన జ్ఞాపకాల్లో చెప్పిన ఓ ముచ్చట. CHAMAN LAL EDITOR DEFUNCT NATION ARRIVED AT LAHORE అని ఒకరోజు ప్రెస్ టెలిగ్రాం ‘అర్జున్’ కార్యాలయానికి వచ్చింది.
‘డిఫంక్ట్ నేషన్ కీ సంపాదక్ చమన్‌లాల్ లాహోర్ పహుంచ్ గయే’ అని భగత్‌సింగ్ తర్జుమా చేశాడు. ఆ వార్త అలాగే అచ్చయ్యింది. ‘అదేమిటయ్యా అలా రాశావ్’ అని మర్నాడు ఇంద్రవాచస్పతి ముక్కున వేలేసుకున్నాడు.
"Defunct" అంటే ఆగిపోయిన, మూతబడ్డ అని అర్థం. మూత పడిన ‘నేషన్’ పత్రిక సంపాదకుడు అని రాయాల్సింది పోయి, ‘డిఫంక్ట్ నేషన్’ అనేది పత్రిక పేరు అనుకుని భగత్ అలా రాశాడు.
‘ఊహించకు. పదం అర్థం కానప్పుడు డిక్షనరీ చూడు’ అని చెప్పాడు ఎడిటర్. భగత్ మళ్లీ అలాంటి తప్పు చేయలేదు. కష్టపడి ఇంగ్లిషు భాషను పుక్కిట పట్టాడు. డైలీ జర్నలిజం మెలకువలు గ్రహించి, ఇంద్ర వాచస్పతి చేతే శభాష్ అనిపించుకున్నాడు. వృత్తి నైపుణ్యంతో సహచరులందరి మెప్పూ పొందాడు.
కాని భగత్‌సింగ్ ఢిల్లీ వెళ్లింది జర్నలిస్టుగా రాణించడానికి కాదు. తనకు అప్పగించిన పార్టీ పనిని అతడు చక్కగా నిర్వర్తించాడు. ఢిల్లీలోని లాహోరీ గేటు పోలీసుస్టేషను సమీపాన సత్యకేతు విద్యాలంకార్ అద్దెకున్న గదిలో భగత్ కూడా ఉండేవాడు. ఆ సమయాన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషను పార్టీ తీరుతెన్నులను వివరించే ‘ది రివల్యూషనరీ’ కరపత్రాన్ని (1925 జనవరిలో) దేశమంతటా పంచి పెట్టటంలో భగత్‌సింగ్ పాత్ర ఉంది.
ఢిల్లీ పనులు చక్కపెట్టాక మళ్లీ కాన్పూరుకు. ఆ రోజుల్లో చంద్రశేఖర్ ఆజాద్ కాశీ విద్యాపీఠంలో చదువు చాలించి, హెచ్.ఆర్.ఎ.లో చేరాడు. చేరీ చేరగానే పార్టీలో ముఖ్య స్థానానికి ఎదిగాడు. అతడంటే భగత్‌సింగ్‌కి మహా ఇష్టం. గొప్ప ఆరాధనా భావం. చాలాకాలంగా ఆజాద్ పేరును వింటున్నా భగత్ అతడిని ఎప్పుడూ నేరుగా కలవలేదు. ఒక్కసారి కళ్ళారా చూడాలని కోరిక. విద్యార్థిగారి పుణ్యమా అని అదీ తీరింది.
ఓ రోజు విద్యార్థిగారు భగత్‌ని కేకేసి ‘ఆజాద్‌ని కలుస్తావా అని అడిగాడు.
‘అంతకంటేనా? కాని అంత పెద్దాయన నాతో మాట్లాడుతాడా?’ అని శంకించాడు భగత్‌సింగ్.
‘్భగత్! నువ్వు మాత్రం సామాన్యుడివా? నిజానికి ఆయనే నిన్ను చూడాలనుకుంటున్నాడు. రేపే వెళదాం’ అన్నాడు ‘విద్యార్థి’. ఎప్పుడు తెల్లవారుతుందా అని భగత్‌సింగ్ కాచుకు కూచున్నాడు.
మర్నాడు వేకువనే ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఇరుకు సందులు తిరుగుతూ కొంతదూరం వెళ్లాక ఎప్పుడో కూలిపోతుందోననిపించే పాత ఇంటి దగ్గర ఆగారు. చుట్టూచూసి, ఎవరూ తమను వెంటాడటం లేదని రూఢి చేసుకున్నాక చప్పున ఇంట్లోకి వెళ్లారు. శిథిలమైన మెట్ల దారిన మేడమీది గదిలో అడుగు పెట్టి తలుపు గడియ వేశారు.
గది మధ్య పెద్ద టేబిల్. తెల్లవారినా ఇంకా మసక చీకటి. కొవ్వొత్తి వెలుగులో ఒకాయన కుర్చీలో కూచుని బల్ల మీద ఏదో రాసుకుంటున్నాడు. వారిని చూడగానే లేచి, ‘రండిరండి విద్యార్థిజీ’ అని సాదరంగా ఆహ్వానించాడు. వదులు తలపాగా, కోటు, లుంగీలో ఉన్న కొత్త వ్యక్తిని ‘ఎవరు’ అన్నట్టు చూశాడు.
‘పండిట్జీ! ఇతను భగత్‌సింగ్. కిషన్‌సింగ్ కొడుకు’ అని విద్యార్థి పరిచయం చేశాడు. ‘ఇదిగోనయ్యా ఈయనే నువ్వు చాలాకాలంగా చూడాలనుకుంటున్న విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్’ అని భగత్‌కి చెప్పాడు.
‘పండిట్ చంద్రశేఖర్ ఆజాద్!’ అని ఆశ్చర్యంగా అన్నాడు భగత్‌సింగ్.
ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. అది ఇద్దరు గొప్ప విప్లవకారులు కలిసిన మహత్తర క్షణం. వారణాసి, లాహోర్‌ల నుంచి వచ్చిన రెండు విప్లవ ప్రవాహాలు కాన్పూరులో సంగమించిన ఘట్టం. జరగనున్న విముక్తి పోరాటానికి అది నాందీ వాచకం.
‘విద్యార్థిజీ! మీరు చెప్పకపోయినా నేను భగత్‌ని గుర్తుపట్టేవాడినే. ఇంత చురుకు, ఇంత వర్ఛస్సు ఇంకొకరికి ఎలా ఉంటాయి?’ అన్నాడు ఆజాద్.
‘పండిట్జీ’ అని పిలిపించుకున్నా ఆజాద్ వయసు మీరిన వృద్ధుడుకాడు.
కోడెవయసు కుర్రవాడే. భగత్‌సింగ్ కంటే అతడు ఏడాది మాత్రమే పెద్ద.
1921లో మహాత్మాగాంధి మీద భక్తితో, అసహాయోద్యమంలో చేరిన లక్షలాది యువకుల్లో అతడు కూడా ఒకడు. అప్పుడు అతడి వయసు కేవలం 15. అసలు పేరు చంద్రశేఖర్ తివారి.
వారణాసిలో సత్యాగ్రహం చేసినందుకు పోలీసులు అరెస్టు చేసి అతడిని కోర్టులో హాజరుపరిచారు.
‘నీ పేరేమిటి?’ అని అడిగాడు మేజిస్ట్రేటు.
‘ఆజాద్’ (స్వతంత్రుడు)
‘నీ తండ్రి పేరు?’
‘స్వాధీన్’
‘నీ చిరునామా?’
‘జైల్‌ఖానా’
అది మొదలుకుని అతడు చంద్రశేఖర్ ఆజాద్‌గా ప్రసిద్ధి చెందాడు.
మైనరు బాలుడు కావడంవల్ల జైలుకు పంపడం వీలుకాక కోర్టువారు అతడికి 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. అవి మామూలు దెబ్బలుకావు. బట్టలు విప్పించి కట్టేసి కొడుతూంటే దెబ్బదెబ్బకూ చర్మం చిట్లి రక్తం కాలవలు కట్టేది. భయానక బాధ ఓర్చుకోలేక ఎంతటివారైనా విలవిలలాడుతూ కేకలు పెట్టేవారు.
‘ఆజాద్’ మాత్రం నెత్తురు ధారగా కారుతూ ఒళ్లంతా పుండవుతున్నా ‘మహాత్మాగాంధీకీ జై’ ‘్భరత్ మాతాకీ జై’ ‘వందేమాతరం’ అని అరుస్తూనే ఉన్నాడు.
అనర్థక అహింసా ప్రహసనం చూశాక దేశంలోని లక్షలాది యువకుల్లాగే చంద్రశేఖర్‌కీ గాంధీగారంటే మనసు విరిగింది. ముంబయి, కాశీల్లో అనేక సాహసోపేత తిరుగుబాటు చర్యల తరవాత బెంగాలీ విప్లవ నాయకుల ప్రోద్బలంతో హెచ్.ఆర్.ఎ.లో చేరాడు. తన అద్భుత ప్రజ్ఞాపాటవాలతో నాయకత్వ శ్రేణికి ఎదిగాడు. ఆచితూచి అడుగువేస్తూ, వెయ్యి కళ్లతో గమనిస్తూ, లక్ష జాగ్రత్తలు తీసుకుంటూ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ పోలీసులకు పట్టుబడకుండా మహా పోరాటాలే నడిపాడు. చివరికి వీరుడిగానే మరణించాడు.
పిల్లలు మెచ్చిన పంతులు
ReplyDelete