Breaking News

మేము మళ్లీ పుడతాం


రెండు నెలల తరవాత భగత్‌సింగ్ మళ్లీ కాన్పూర్ వెళ్లాడు. ఈసారి ఎక్కువ రోజులే ఉన్నాడు. అతడు వచ్చేసరికి పని బాగానే ముందుకెళ్లింది. అప్పగించిన పనిని విజయ్‌కుమార్ సిన్హా చక్కగా నెరవేర్చాడు. అతడు లక్నో జైలుకువెళ్లి బిస్మిల్‌ని కలిశాడు. ప్లాను బాగుందని బిస్మిల్ మెచ్చుకున్నాడు. ఇక అతడిని విడిపించటానికి తేదీ, సమయం నిర్ణయించడమే తరువాయి.
భగత్ వచ్చీరాగానే ఆ పనిలో పడ్డాడు. 1925 నవంబరులో బిస్మిల్‌ను తప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. కాని, దురదృష్టం. విప్లవకారుల్లో ఒకరు నోరు జారడం ద్వారా అధికారులకు ముందే ఉప్పందింది. ప్రయత్నం విఫలమైంది. 1926 జనవరిలో వేసిన ఇంకో పథకమూ అలాగే భగ్నమైంది. అయినా భగత్‌సింగ్ పట్టు విడవకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు.
దుర్భేద్యమైన జైలుగోడలు పగులగొట్టి, గట్టి కాపలాను చెదరగొట్టి, మరణశిక్ష పడిన ఖైదీని విడిపించుకు రావటం తేలిక కాదు. దానికి ఎన్నో గుండెలు కావాలి. గుండెలు తీసిన బంట్లను సమకూర్చుకోవాలి. అద్భుతమైన ఉపాయం వేయాలి. మెరపు వేగంతో కదలాలి. దానికి ముందస్తు ఏర్పాట్లు బోలెడు చేయాలి. మూడోకంటికి తెలియకుండా అంతా రహస్యంగా జరగాలి.
ఒక్క గదిలోనే ఉంటున్నా జయ్‌దేవ్ కపూర్‌కు మొదట భగత్‌సింగ్ ఎవరో తెలియదు. ఖైదీని విడిపించే ఆపరేషనులో జయదేవ్ కూడా ఉన్నాడు. విప్లవ కేంద్రం నుంచి తనకు రహస్యంగా అందే ఆదేశాలను అమలు జరుపుతున్నా, టీము లీడరు తమ గదిలో చేరిన కొత్త మిత్రుడేనన్న సంగతి అతడికి తెలియదు. భగత్‌సింగ్ తీరిక వేళల్లో కూకా, గదర్ తిరుగుబాట్లు గురించి, కర్తార్‌సింగ్, సూఫీ అంబాప్రసాద్‌ల సాహస కృత్యాల గురించి, బబ్బర్ అకాలీల గుండె ధైర్యం గురించి ఎన్నో కబుర్లు చెబుతూంటే జయదేవ్ విననట్టే నటించేవాడు. క్లాసు పుస్తకాలు, చదువు తప్ప మరొకటి తనకు పట్టనట్టే కనిపించేవాడు. పార్టీ తనకిచ్చిన రెండు తుపాకులు భగత్ కంటపడకుండా జాగ్రత్త పడేవాడు. చూసి చూసి ఓ రోజు భగత్ అసలు సంగతి చెప్పాక జయదేవ్ ఆశ్చర్యంతో నోరువెళ్లబెట్టాడు.
బిస్మిల్‌ని బయటికి తీసుకొచ్చే టీములో జయదేవ్‌ను చేర్చి, తనను వదిలేయటం రూమ్‌మేటు శివవర్మకు మనస్తాపం కలిగించింది. అది భగత్ గ్రహించాడు.
‘మనమందరం సైనికులమే. ప్రతి సైనికుడికీ యుద్ధరంగానికి వెళ్లాలనే ఉంటుంది. పోరాడుతూ మరణించేవారికి, ఉరికంబం ఎక్కేవారికి గొప్ప కీర్తి వచ్చే మాట నిజమే. కాని అలాంటి వారు ఇంటి సింహద్వారానికి తాపడం చేసిన రత్నంలాంటి వాళ్లు. రత్నం విలువైనదే. కాని పునాదిరాయి దానికంటే విలువైనది. ఇంటికి రత్నం శోభనిస్తే పునాదిరాళ్లు బలాన్ని ఇచ్చి కలకాలం నిలబెడతాయి. దృఢకాయుడు కాబట్టి జయదేవ్‌ను యాక్షను టీములోకి తీసుకొని, శరీర దృఢత్వం లేని కారణాన నిన్ను వదిలేసినంత మాత్రాన బాధపడవలసిన అవసరం లేదు. నీ పని నీకు ఉంటుంది’ అని భగత్ నచ్చచెప్పాక శివవర్మ కుదుటపడ్డాడు.
జయదేవ్‌ను, ఇంకొందరిని తీసుకుని 1926 జనవరిలో భగత్‌సింగ్ బిస్మిల్‌ని విడిపించేందుకు ఇంకోసారి రంగంలోకి దిగాడు. ఎలా తెలిసిందో గాని పోలీసులు అప్పుడూ కుట్రను వాసనపట్టి జాగ్రత్తపడ్డారు. పథకం భగ్నమైంది.
మళ్లీ అతి కష్టం మీద విజయ్‌కుమార్ సిన్హా జైలుకు వెళ్లి బిస్మిల్‌ని కలిశాడు. మొగం వేలాడేసుకుని తిరిగి వచ్చాడు. జైల్లో ఆంక్షలు మరీ ఎక్కువయ్యాయి. ఉరిశిక్ష పడిన వారి దరిదాపుల్లోకి పురుగును కూడా పోనివ్వకుండా వెయ్యికళ్ళతో కాపలా కాస్తున్నారు. బిస్మిల్ నుంచి విజయ్ రాబట్టగలిగిందల్లా ఒక కవితను.
ప్రేమికుడు కనుమూశాక
ప్రేమ సందేశం వస్తేనేమి?
ఆశలన్నీ ఉడిగాక
తలపులన్నీ మలిగాక
దూత వచ్చీ నిరుపయోగం
అని అర్థం వచ్చేలా రాసిన పద్యాలవి. చేయగలిగింది ఏమైనా ఉంటే వెంటనే చెయ్యమని వాటి అంతరార్థం.

‘కవిత్వ సందేశాన్ని చదవగానే భగత్ నిశే్చష్టుడయ్యాడు. అతడి చేతిలో నుంచి కాగితం జారిపోయింది. తల పట్టుకుని ఉన్నచోటే కూలబడ్డాడు. అతణ్ని ఆ స్థితిలో చూసి ఎవరికీ నోట మాట రాలేదు. విజయ్, సురేందర్ వౌనంగా నిష్క్రమించారు. కాసేపటికి భగత్ లేచి ఏమీ మాట్లాడకుండా గంగ ఒడ్డుకు వెళ్లాడు. రాత్రి పొద్దుపోయాక నేను, జయదేవ్ అతణ్ని వెదుక్కుంటూ వెళ్లాం. చల్లటి ఇసుకలో నుదురు మీద చెయ్యి పెట్టుకుని శిలావిగ్రహంలా కూచుని ఉన్నాడు. భుజం తట్టి మేము రమ్మనగానే మారుమాట్లాడక మా వెంట వచ్చాడు. మర్నాటికి తేరుకున్నాడు. ఓటమికి డీలాపడితే మనం ఎందుకూ పనికిరాము. ఆటంకాలను తొలగించాల్సింది పోయి పోరాటానికి మనమే ఆటంకం అవుతాము! అని మా అందరికీ చెప్పి, ఇకపై చేయవలసిందేమిటో వివరించి, మళ్లీ వస్తానంటూ పంజాబ్‌కి తిరిగి వెళ్ళాడు.
[Shiv Varma, Quoted in Bhagat Singh,
Malwinder Jit Waraich, p.37]

ఆర్యసమాజ్ ఒద్దికలో ఎదిగిన రాంప్రసాద్ బిస్మిల్ స్థితప్రజ్ఞుడు. ఇటుక తగిలి కన్ను చిట్లి రక్తం చిమ్ముతున్నా జంకక ఎదురుదాడిని కొనసాగించి సహచరులను రక్షించిన ధీరుడు. విప్లవ కార్యక్రమంలో భాగంగా దోపిడీల్లో పాల్గొన్నా... సామాన్య ప్రజలకు, స్ర్తిలకు ఎటువంటి హానినీ బిస్మిల్ జరగనిచ్చేవాడు కాదు.
చేయగలిగిందేమన్నా ఉంటే నా ప్రాణం పోక ముందే చెయ్యమని సహచరులకు సందేశం పంపినా, రాంప్రసాద్ బిస్మిల్ మరణ భయంతో బెంబేలెత్తలేదు. ఉరిశిక్షకు ఎదురుచూస్తూ, జైలు బారక్‌లో గ్రంథపఠనం చేస్తూ విసుగు పుట్టినప్పుడు జానపద బాణీలో తానే రాసిన ‘మేరా రంగ్‌దే బసంతి చోలా’ పాట పాడుకునేవాడు. ఆ పాటంటే భగత్‌సింగ్‌కి మహా ఇష్టం. 1927 డిసెంబర్ 19న గోరఖ్‌పూర్‌లో తన 27వ ఏట బిస్మిల్ ఉరికంబం ఎక్కడానికి ముందు రోజు భగత్‌సింగ్ జైలుకు వెళ్లి కలిశాడు. తరవాత ‘ప్రభాత్’ అనే మారుపేరుతో రాసిన వ్యాసంలో బిస్మిల్ గుండె నిబ్బరాన్ని భగత్ ఇలా వర్ణించాడు:

ఉరితీయడానికి ముందు రోజు మొదటిసారీ, చివరిసారీ కండెమ్డ్ సెల్‌లో ఆయనని చూశాను. ఆ సౌజన్యమూర్తి నిర్భయత్వం ఈనాటికీ నా కళ్లకు కట్టినట్టే ఉంది. ఆయన బందిపోటు, హంతకుడు అని ఎవరేమైనా అననీ నేను మాత్రం ఈనాటికీ ఆయన్ని ఆరాధిస్తున్నాను.
ఆనాడు తనను చూడవచ్చిన తల్లిని చూసి రాంప్రసాద్ కళ్లు చెమ్మగిల్లాయి. తల్లికి ఆయన ఇచ్చిన జవాబుని ఈనాటికీ మరచిపోలేను. ఆ దృశ్యం చూసి జైలు అధికారులు సైతం అవాక్కయిపోయారు.
చెమ్మగిల్లిన బిస్మిల్ కళ్లు చూసి తల్లి ఇలా అంది. ‘నువ్వు స్థితప్రజ్ఞుడివనుకున్నాను. ఇదేమిటి? ఇలా అయిపోతున్నావు? జీవిత పర్యంతం దేశం కోసం కంట తడిపెట్టని నీవు చివరి దశలో నా కోసం ఏడుస్తావా? ఇలాంటి పిరికితనం వల్ల ఇప్పుడేంకాను; వీరుడిలా చిరునవ్వులు చిందిస్తూ నీవు ప్రాణాలు విడిస్తే చూసి ధన్యురాలినవ్వాలని ఆశించాను. నా కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. నా పని నిన్ను పెంచి, పెద్ద చేయడం. ఆ తర్వాత నువ్వు దేశం మనిషివి. అందుకోసమే నువ్వు ఉపయోగపడాలి.. నాకెలాంటి దుఃఖమూ లేదు’ అంది తల్లి.
‘అమ్మా నా మనసు నీకు బాగా తెలుసు. నీ కోసం నేను ఏడుస్తున్నానని ఎలా అనుకున్నావు? రేపు ఉరితీస్తారని ఏడుస్తున్నాననుకుంటున్నావా? చావంటే నాకు దుఃఖంలేదు. నేతికి నిప్పు సెగ చూపిస్తే అది కరుగుతుంది. అది దాని స్వభావం. భౌతిక సంబంధం వల్ల నిన్ను చూడగానే రెండు మూడు కన్నీటి బొట్లు రాలాయి. అంతే. నా మృత్యువంటే నాకు ఎంతో తృప్తిగా ఉంది. నన్ను నమ్ము’ అని జవాబిచ్చారాయన. నేనొక పక్క నిలబడి ఆ దృశ్యాన్ని చూశాను. ఇంతలో టైం అయిపోయిందన్నారెవరో. బయటికి వచ్చేశాను. మర్నాడు ఆయన్ని ఉరితీసేశారని విన్నాను. ఉరికంబం మీద నిలబడి ఆ ప్రేమ పూజారి గిరిధారి చరణాలకు తనని తాను అర్పించుకుంటూ ఇలా పాడారట:
మాలిక్ తేరీ రజారహే ఔర్ తూహీ తూ రహే
బాకీ నామై రహూఁ న మేరీ ఆర్జూ రహే
అబ్‌నా పిఛలే లవలేహై నార్ న అరమానోంకీ భీడ్
ఏక్ మీట్ జాన్‌కీ హసరత్, బప్‌దితే బక్మిల్‌మే మై
(ఇక పూర్వపు ఆవేశాలు లేవు, కోర్కెలు లేవు విలుప్తమై పోతున్న ఒక ప్రబల వాంఛ తప్ప)
నా నెత్తురు వృధా కాదు: భగత్‌సింగ్ రచనలు,
జన సాహితి ప్రచురణ, పే.75-76

లక్నో కోర్టులో కేసు విచారణ ఏణ్నర్ధంపాటు నడిచినా తమకు పడే శిక్ష ఏమిటో విప్లవకారులకు ముంథే తెలుసు. అందరూ పాతిక ముప్పై ఏళ్ల పడుచువాళ్లే. మరణిస్తామన్న భయంగాని, దిగులుగాని ఎవరి మొగానా లేదు. ఏదో పెళ్లికి వెళుతున్నట్టే వాళ్లు నవ్వుతూ, తుళ్లుతూ దేశభక్తి గీతాలు పాడుతూ కోర్టుకు హాజరయ్యేవారు. వారికి విధించిన క్రూర శిక్షల పట్ల దేశవాసులు దిగ్భ్రాంతి చెందినా వారిలో మాత్రం ఎలాంటి కలవరపాటు లేదు...
అష్‌ఫాకుల్లా ఖాన్, కుందన్‌లాల్ గుప్తాలతోబాటు ఉరికంబమెక్కే ముందు బిస్మిల్ అన్న మాటలివి: ‘మేము మళ్లీ పుడతాం. మళ్లీ కలుస్తాం. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి మళ్లీ కలిసి పోరాడతాం!’ జైలుగది నుంచి బలిపీఠానికి చేతులు కలిపి అడుగులేస్తూ ఆ ముగ్గురు వీరులు గొంతెత్తి పాడిన ‘సర్‌ఫరోషికీ తమన్నా అబ్ హమారే దిల్ మే హైఁ’ అన్నది దేశమంతటా విప్లవకారులకు స్వాతంత్య్ర గీతం అయింది.
కాకోరీ కేసులో చిక్కిన కామ్రేడ్లను తప్పించటమైతే కుదరలేదు గానీ ఆ ప్రయత్నాల్లో భగత్‌సింగ్ మాత్రం పోలీసుల దృష్టిలో బాగా పడ్డాడు. కాన్పూర్‌లో అజ్ఞాతవాసం చేస్తూ ఆ పని మీద ఉన్నంతకాలమూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సకల జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అతడు ఎప్పుడూ పట్టుబడలేదు. ఇక చేయగలిగింది ఏమీ లేదు; అన్ని ద్వారాలూ మూసుకుపోయాయి అని ధ్రువపడ్డాక, వాస్తవంతో రాజీపడి, మళ్లీ తన పోరాటం తాను కొనసాగించేందుకు వెనక్కి మరలాక భగత్ పోలీసుల చేతిలో పడ్డాడు. అదీ ఊహించని విధంగా.
1927 మే 29వ తేది. భగత్‌సింగ్ ఎక్కడికో వెళ్లి రైల్లో ఇంటికి తిరిగి వస్తున్నాడు. టిక్కెట్టయితే లాహోర్ దాకా కొన్నాడు. కాని మధ్యలో అమృత్‌సర్ దగ్గర దిగిపోయాడు. అది అప్పటికప్పుడు చేసిన నిర్ణయం కాదు. వెంటపడే పోలీసులను మభ్యపెట్టే జాగ్రత్తలో అదీ భాగం.
అమృత్‌సర్ స్టేషన్‌లో దిగాక చుట్టూ చూస్తే పోలీసుల అలికిడి లేదు. కాని స్టేషన్ బయటికి వెళ్లాక కాస్త దూరాన పొంచి ఉండి ఒక సి.ఐ.డి. పోలీసు కనిపించాడు. వేరే వైపు తిరిగి భగత్ జనంలో కలిసిపోయాడు. జేబులోని రివాల్వర్ మీద ఒక చెయ్యి వేసి, ఇరుకు దారుల వెంట కాసేపు చకచకా తిరిగి చటుక్కున ఒక ఇంట్లోకి ప్రవేశించాడు.
అది అడ్వొకేటు శార్దూల్‌సింగ్ ఇల్లు. ఆయన ప్రభుత్వ ప్లీడరు. అయినా విప్లవకారులంటే సానుభూతి ఉన్నవాడు. భగత్ ఆయన గురించి అంతకు ముందు విని ఉన్నాడు. మూలమలుపు తిరగగానే ఇంటి ముందు నేమ్‌ప్లేటు మీద ఆయన పేరు చూసి, రివ్వున లోపలికి వెళ్లాడు. ఆఫీసు గదిలో ఏవో కాగితాలు చూసుకుంటున్న న్యాయవాదికి తనను పరిచయం చేసుకున్నాడు. శార్దూల్‌సింగ్ పరిస్థితి అర్థం చేసుకుని భగత్‌ని లోపలికి వెళ్లమన్నాడు. నాస్తా తయారుచెయ్యమని భార్యను కేకేసి, తాను గుమ్మం బయట వరండాలో పచార్లు చేయసాగాడు.
అంతలో సిఐడి పోలీసు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగి, ‘సాబ్! సిక్కు యువకుడెవరైనా ఇటుకేసి వచ్చాడా?’ అని అడిగాడు.
‘అవునయ్యా, వచ్చాడు. పొడుగ్గా ఉన్నాడు. వాడేనా?’ అని అడిగి, పోలీసు ‘ఔనౌను’ అన్నాక ‘కీర్తి’ పత్రిక ఆఫీసు వైపు చెయ్యి చూపించాడు ఇంటాయన అటుకేసి వెళ్లాడన్నట్టు-
పోలీసు ఆ వైపు పరిగెత్తాడు. ప్లీడరు ఇంట్లో భగత్‌సింగ్ సుష్టుగా బ్రేక్‌ఫాస్టు చేస్తూండగా పోలీసులు బిలబిలమంటూ వాహనాల్లో వచ్చి పత్రిక కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆ సంగతి భగత్‌కి తెలియదు. ఎందుకైనా మంచిదని తన దగ్గరి రివాల్వరును శార్దూల్‌సింగ్‌కి ఒప్పగించి, మెల్లిగా బయటపడి, తను వచ్చిన పని చూసుకుని రైలెక్కి సాయంత్రానికల్లా అతడు లాహోర్ వెళ్లాడు.
ఏం లాభం? వెళ్లగానే పోలీసులు ప్రత్యక్షం.
పోలీసులకు అనుమానంతోచి తన కదలికలను కనిపెడుతున్నారనే అప్పటిదాకా భగత్‌సింగ్ అనుకునేవాడు. ఎందుకైనా మంచిదనుకుని తన జాగ్రత్తలో తానుండేవాడు. రెడ్‌హాండెడ్‌గా తాను ఎప్పుడూ పట్టుబడలేదు కనుక, తన మీద ఏ కేసూ లేదు కాబట్టి పోలీసులు తన కోసం గాలిస్తున్నారని, అరెస్టు చేయబోతున్నారని అతడు ఊహించలేదు. లాహోర్ రైలుస్టేషను దాటి తోట పక్కగా నడిచి వెళుతూండగా పోలీసులు భగత్‌ని చుట్టుముట్టారు.
అది అనుకోని ఆపద. కాని భగత్‌సింగ్ కంగారు పడలేదు. పిస్టల్‌ను ముందే లాయరుకు ఇచ్చెయ్యడం మంచిదైంది. సోదా చేస్తే పోలీసులకు ఆయుధం దొరకలేదు.
*

పసందైన విందు
భగత్‌సింగ్ తండ్రి కిషన్ సింగ్‌కు బ్రిటిష్ వారిని ఎదిరించే ఉద్యమ తీర్థ యాత్రికులకు ఆతిథ్యమిస్తాననడం ఆయన ధైర్యానికి నిదర్శనం. కిషన్ తప్పించుకోవాలంటే కారణం కూడా ఉంది - బొంబాయి వెళ్తున్నట్టు చెప్తే సరిపోయేది. కానీ ఆ బాధ్యతను తన కొడుకు భగత్‌సింగ్‌కి అప్పజెప్పటం.. అతడు 17 సం.ల కుర్రవాడైనా తన సహచరులతో కలిసి ఆతిథ్యం చాలా గొప్పగా ఇవ్వటం.. అతిథులు అబ్బురపడటం.. పోలీసులు సైతం సంఘటనా స్థలికి చేరుకొని ఏమీ చేయలేక వెనుదిరగడం - నిజంగా ‘్భగత్‌సింగ్’ సీరియల్ చదువుతూంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఉద్యమ స్ఫూర్తిని మా మనసుల్లో నింపుతోంది.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)

1 comment: