Breaking News

హంతకుడు దొరికాడు


పార్లమెంటులో బాంబులేయటం దారుణం, దుస్సాహసం, నిష్కృతిలేని నేరం - అని మండిపడ్డ పెద్ద మనుషులు ఆ నేరగాళ్లకు న్యాయస్థానం యావజ్జీవ ఖైదు విధించిందని తెలిస్తే మామూలుగా అయితే సంతోషించాలి.
కాని - ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. అలాంటి వీరులకు అంత పెద్ద శిక్ష వేయటం అన్యాయం, అమానుషం అని విలవిలలాడారు. సెషన్సు కోర్టులో ముద్దాయిలు ఇచ్చిన స్టేటుమెంటుతో అందరి మనసులూ మారాయి. భగత్‌సింగ్, బి.కె.దత్‌ల పేరు ఇంటింటా మారుమోగింది. జన జీవితానికి దూరమయ్యామన్న దిగులు హెచ్.ఎస్.ఆర్.ఎ. విప్లవ సంస్థకు పోయింది. దారి తప్పిన దేశభక్తులు అని - ఒకప్పుడు నొసలు ముడిచిన ప్రజా నాయకులు కూడా విప్లవకారులను, వారి ఆశయశుద్ధిని, త్యాగ నిరతిని అభిమానించసాగారు.
ఉదాహరణకు పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ! సెషన్సు కోర్టు శిక్షను ప్రకటించిన మరునాడు మీరట్ బహిరంగసభలో ఆయన మాట్లాడాడు. ‘వాళ్లు చేసిన పనికి మొదట్లో నేనూ షాకయ్యాను. కాని కోర్టులో స్టేటుమెంటుతో వారి ఆంతర్యం తేటపడింది. అలాంటి వీరులను పిరికిపందలు, బీభత్సకారులు అని నిందించటం చాలా తప్పు’ అని బహిరంగంగా ప్రకటించాడు. అప్పట్లో జవాహర్‌లాల్ కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. కాంగ్రెసు పార్టీ అధికారిక బులెటిన్‌లో భగత్, దత్‌ల సంయుక్త ప్రకటనను నెహ్రూ అచ్చువేయించాడు.
అది గాంధీ మహాత్ముడికి నచ్చలేదు. కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలను ప్రజలకు తెలియపరచటానికి ఉద్దేశించిన పత్రికలో వాళ్ల స్టేటుమెంటును వేయటమేమిటి - అని ధుమధుమలాడాడు. అది వాళ్లు సొంతంగా చెప్పింది కాదు కదా? వాళ్ల తరఫు న్యాయవాదే తయారుచేసి, కోర్టులో దానిని వినిపించాడాయె - అనీ గాంధీగారు చిరాకుపడుతూ ఉత్తరం రాశాడు.
దానికి నెహ్రూ ఏమని బదులిచ్చాడు? తన చర్యను ధైర్యంగా సమర్థించుకున్నాడా? మీరన్నది సరికాదు అని గాంధీజీకి జంకు లేకుండా చెప్పాడా?

Nehru replied in apologetic confusion: "I am sorry you disapproved of my giving Bhagat Singh and Dutt's statement in the Congress Bulletin. I was myself a little doubtful as to whether I should give it but when I found that there was very general appreciation of it among Congress circles, I decided to give extracts. It was difficult, however to pick and choose, and gradually most of it went in. But I agree with you that it was somewhat out of place... My information is that counsel had practically nothing to do with it. He might have touched up the punctuation ... ...
[The Trial of Bhagat Singh, A.G.Noorani, p.67]

భగత్‌సింగ్, థత్‌ల స్టేట్‌మెంటును ‘కాంగ్రెసు బులెటిన్’లో నేను ఇవ్వడాన్ని మీరు ఆమోదించనందుకు సారీ. దాన్ని ఇవ్వాలా వద్దా అని నేను కూడా డౌటు పడ్డాను. కాని కాంగ్రెసు వర్గాల్లో దాన్ని అందరూ మెచ్చుకుంటున్నందున వాటిలోని కొన్ని భాగాలను ఇద్దామని నేను అనుకున్నాను. ఏ భాగాలను ఎంచుకోవాలి అన్నది కష్టమవడంతో దాదాపుగా స్టేట్‌మెంటు మొత్తం వెళ్లిపోయింది. దాన్ని ప్రచురించడానికి అది సరైన స్థలం కాదు అని మీరన్నారు. అది నేనూ ఒప్పుకుంటాను. అన్నట్టు దాన్ని తయారుచేసింది వాళ్ల తరఫు న్యాయవాది కాదు. మహా అయితే వారి ప్రకటనలో కామాలు, ఫుల్‌స్టాప్‌లు అతడు సరిచేశాడేమో - అని నెహ్రూగారు తడబడుతూ బదులిచ్చాడు.
భగత్‌సింగ్‌కి సంబంధించి గాంధి - నెహ్రూ సంవాదంలోని మరికొన్ని విశేషాలు ఇంకోసారి.
‘్భగత్, దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష వేయటం సమంజసం కాదు. అది చాలా అన్యాయం’ అని ‘ట్రిబ్యూన్’ లాంటి పత్రికలలు సంపాదకీయాల్లో ఆక్షేపించాయి. శిక్ష పడిన వారికి మాత్రం ఎలాంటి చింతలేదు. జీవిత ఖైదుని విధిస్తున్నట్టు జడ్జి గంభీరంగా ప్రకటిస్తూంటే భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు నవ్వుతూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించారు.
సెషన్సు కోర్టు తీర్పు మీద కావాలనుకుంటే హైకోర్టుకు అపీలు చేసుకోవచ్చు. అది భగత్‌సింగ్‌కి ఇష్టం లేదు. కోర్టు అధికారానే్న మనం
గుర్తించటం లేదు; దాని మీద శిక్ష తగ్గించమంటూ ఇంకో కోర్టును దేబిరించాలా? - అని మొదట వ్యతిరేకించాడు. మన వాదాన్ని బహిరంగంగా వినిపించటానికి అది ఇంకో అవకాశం. ఎందుకు వదులుకోవాలి అని సన్నిహితులు అన్న మీదట అతడు అపీలుకు అంగీకరించాడు.
లాహోర్ హైకోర్టులోనూ షరా మామూలే. సర్ ఫోర్డ్, జేమ్స్ ఎడిసన్‌లతో కూడిన బెంచి నిజం చూసేదీ, వినేదీ లేదని ముందే డిసైడై, విచారణ తతంగం తరవాత అపీలును కొనగోటితో (1930 జనవరి 13న) కొట్టి పారేసింది. ఈ ఘట్టంలో విశేషంగా చెప్పుకోవలసిందల్లా తన వాదాన్నీ, వైఖరినీ బలంగా వినిపిస్తూ భగత్‌సింగ్ కోర్టులో చేసిన ప్రకటన ఒక్కటే. సెషన్సు కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంటుకు వచ్చినంత ప్రాచుర్యం దీనికి చరిత్ర గ్రంథాలలో రాలేదు. నిజానికి మొదటి ప్రకటన కంటే దీనిలోని వాదనా పటిమ ఒకింత ఎక్కువే. మచ్చుకు ఈ వాక్యాలను చూడండి:

ఉద్దేశం ఏమిటి అన్నది చూడకుండా ఎవరినీ నేర ప్రవర్తనకు గాను శిక్షించకూడదని ప్రసిద్ధ న్యాయవేత్త సోలన్ చెప్పాడు. లక్ష్యాన్ని విస్మరించినట్టయితే ఏ వ్యక్తికీ న్యాయం జరగదు. కేవలం చర్యనుబట్టి శిక్ష వేస్తామంటే ప్రసిద్ధి చెందిన మిలిటరీ జనరల్స్ కూడా హంతకులుగానే చూడబడతారు. ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేవాళ్లు సైతం దొంగలుగానే కనపడతారు. జడ్జిల మీద కూడా హత్య అభియోగాలు మోపవలసి వస్తుంది. ఆంతర్యాన్ని మరచిపోయే పక్షంలో జీసస్ క్రైస్ట్ కూడా శాంతిని భగ్నపరిచేవాడుగా, తిరుగుబాటుదారుగా, న్యాయ భాషలో ‘ప్రమాదకరమైన వ్యక్తి’గా నిర్ధారించబడతాడు.
సెంట్రల్ అసెంబ్లీలో మేము రెండు బాంబులు వేశాం. కొద్ది మంది స్వల్పంగా గాయపడ్డారు. వందల సంఖ్యలో మెంబర్లు, విజిటర్లు బయటికి పరిగెత్తారు. గందరగోళం అలుముకుంది. నేను, నా కామ్రేడ్ బి.కె.దత్ విజిటర్సు గ్యాలరీలోనే కూచుని, మమ్మల్ని అరెస్టు చేసుకోమన్నాం. తలచుకుని వుంటే మేము తేలికగా తప్పించుకోగలిగేవారమే అని సెషన్సు జడ్జి కూడా అంగీకరించాడు. మేము నేరాన్ని అంగీకరించి, మా వైఖరిని స్పష్టీకరిస్తూ కోర్టులో స్టేట్‌మెంటు ఇచ్చాం. శిక్షకు మేము భయపడం. కాని మమ్మల్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకూడదని మాత్రమే మేము కోరుతున్నాం.
మా స్టేట్‌మెంటులో కొన్ని పేరాలను కింది కోర్టు తొలగించింది. దేశం ఇప్పుడున్న కీలక దశలో చాలా బిగ్గరగా హెచ్చరిక చేయవలసిన అవసరం ఉన్నదని, ఆ పనే మేము చేశామని మా స్టేట్‌మెంటు సారాంశం. మా అభిప్రాయం తప్పు కావచ్చు. జడ్జిగారికి అది నచ్చి ఉండకపోవచ్చు. అంత మాత్రాన మా భావాలను మేము ప్రకటించుకండా అడ్డుకోవటం సరికాదు.
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ‘సామాజ్య్ర ముర్దాబాద్’లకు మేము ఇచ్చిన నిర్వచనాన్ని కూడా రికార్డు నుంచి తొలగించారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’కి అర్థం అందరూ అనుకునేది కాదు. పిస్టలు, బాంబు విప్లవాన్ని తీసుకురాలేవు. ఇంక్విలాబ్ కత్తిని ఆలోచనల అంచు మీద సాన పట్టాలి. ప్రధాన ఆశయాన్ని అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తి చర్యల మీద తీర్పు చెప్పటం అన్యాయం.
దేశంలో అంతకంతకూ ఎగసిపడుతున్న అసంతృప్తి తీవ్రత గురించి హెచ్చరిక చేయటం చాలా అవసరం. సకాలంలో చికిత్స చేయకపోతే రోగం ప్రాణాంతకంగా ముదురుతుంది. దాన్ని ఏ మానవశక్తీ నివారించజాలదు. ముంచుకొస్తున్న తుఫాను దిశను మార్చటానికే మేము ఆ చర్యకు పాల్పడ్డాం.
బాంబుల శక్తి, అవి తేగల విధ్వంసం గురించి ఏమీ తెలియకుండానే మేము మోతీలాల్ నెహ్రూ, కేల్కర్, జయకర్, జిన్నా వంటి జాతీయ నేతలు ఆసీనులై ఉన్న చోట బాంబులను ఎందుకు విసురుతాం? అంత గొప్ప నేతలకు ప్రమాదం తెచ్చి పెట్టటానికి మేమేమైనా పిచ్చివాళ్లమా? మాకు బాంబుల గురించి బాగా తెలుసు. మనుషులు కూచుని ఉన్నచోట గురిపెట్టి బాంబులు వేయటం తేలిక. మనుషులకు తగలకుండా, దగ్గర్లోని ఖాళీ స్థలాల మీద గురిపెట్టి బాంబు విసరటం ఎంతో కష్టం. నిజానికి ఎవరికీ ఎలాంటి హానీ కలగని రీతిలో లక్ష్యం మీద గురి పెట్టగలిగినందుకు మమ్మల్ని అభినందించాలి. మా శిక్షను తగ్గించమనో, రద్దు చేయమనో అడగటానికి మేము మీ ముందుకి రాలేదు. మమ్మల్ని సరిగా అర్థం చేసుకోవాలనే మేము కోరేది. శిక్ష ఎంత అన్నది మాకు పట్టదు.
[Shaheed Bhagat Singh, Kirendra Sandhu, pp.37-42]
శిక్ష సంగతి భగత్‌సింగ్‌కి పట్టనట్టే, అతడు చెప్పింథి హైకోర్టు జడ్జిలకూ పట్టలేదు. నలుగురు జ్యూరీ సభ్యుల్లో ఇద్దరు భగత్, దత్‌లకు హత్యాయత్న నేరం కింద శిక్షించడం సరికాదని అభిప్రాయపడ్డా లెక్క చేయక సెషన్సు కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. విచారణ క్రమంలో జరిగిన అన్యాయాలను డిఫెన్సు న్యాయవాది ఎంత బలంగా తమ దృష్టికి తెచ్చినా హైకోర్టు జడ్జిలు నిజాన్ని చూడనిచ్చగించక కింది కోర్టు తీర్పును కళ్లు మూసుకుని ధ్రువీకరించారు.
అపీలు కూడా వీగిపోయింది. ఇక జీవిత ఖైదుకు తిరుగులేదు. ముద్దాయిలు తమంతట తాము నేరాన్ని అంగీకరించి ఉండకపోతే నేర నిరూపణ కష్టమయ్యేదని అంగీకరిస్తూనే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, విచారణ తతంగం ముగించిన సీమ దొరతనం అంతటితో భగత్ కేసును పక్కన పడేసి ఉండాల్సింది. కాని బ్రిటిషు ప్రభుత్వానికి అక్కడితో పని అయిపోలేదు. అసలు పని అప్పుడే మొదలైంది.
పార్లమెంటులో బాంబు కేసు తెల్లవారికి అనుకోని లాభం. అయాచిత వరం. అంతకు ముందు దాకా శాయశక్తులా కష్టపడ్డా సాండర్స్‌ను చంపిన వారి ఆచూకీ తీయడం వారివల్ల కాలేదు. బాంబు ఘటనకు కొద్ది రోజుల ముందు కూడా సాండర్స్ హత్య కేసులో పురోగతి లేదని ఇండియా విదేశాంగ మంత్రికి పంపిన తంతిలో వైస్రాయ్ బిక్కమొగం వేశాడు. ఎంత వెదికినా దొరకని తీగ కాస్తా పార్లమెంటు బాంబు కేసు పుణ్యమా అని తానే వచ్చి పోలీసుల కాలికి తగిలింది.
పార్లమెంటు హాలులోకి బాంబుతోబాటు విసిరిన పత్రాన్ని చూడగానే పోలీసులకు బుర్రలో లైటు వెలిగింది. హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ పేరు మీద ఎర్ర కాగితం మీద టైపు చేసిన ‘నోటీసు’ను, దాని కింద బాలరాజ్, కమాండర్ ఇన్ చీఫ్ అన్న సంతకాన్ని చూస్తే ఇలాంటిది ఇంతకు ముందూ ఒకటి చూశామే అని అధికారులకు అనుమానం వచ్చింది. సాండర్స్ హత్య మర్నాడు లాహోర్ నగరంలో అంటించిన పోస్టరును తెప్పించి చూశారు. అదీ హెచ్.ఎస్.ఆర్.ఎ. పేరు మీదే. దానికి వాడిందీ ఎర్ర కాగితమే. దాని కింద బాలరాజ్ వ్రాలూ సరిగ్గా అదే.
అంతేకాదు. రెండిటిలోనూ వాడిన భాష, శైలీ, పదాలు కూడా ఇంచుమించు ఒకే తీరు. రెండూ ‘నోటీసు’తో మొదలై ‘విప్లవం వర్ధిల్లాలి’తో ముగిశాయి. అసెంబ్లీలో విసిరిన కాగితం చివరి పేరాలో ‘మానవ జీవితాన్ని ఎంతో పవిత్రంగా పరిగణించే మేము
మానవ రక్తాన్ని చిందించవలసి వచ్చినందుకు విచారిస్తున్నాం. విప్లవ పూజాపీఠం ముందు వ్యక్తుల బలి అందరికీ స్వాతంత్య్రాన్ని తీసుకువస్తుంది’ అన్నారు. ఇక సాండర్స్ పోస్టర్‌లోని చివరి మాటలేమో-
‘ఒక మనిషి రక్తాన్ని చిందించినందుకు విచారిస్తున్నాం. కాని విప్లవ పూజా పీఠం ముందు వ్యక్తుల బలి అందరికీ స్వాతంత్య్రాన్ని తీసుకువస్తుంది’ అని.
సందేహం లేదు. రెండు పత్రాలూ ఒకరు రాసినవే. పైగా సాండర్స్ పోస్టరు స్వయానా భగత్‌సింగ్ చేతిరాతే. అంతేకాదు. సెంట్రల్ అసెంబ్లీలో భగత్‌సింగ్ నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వరు, సాండర్స్ హత్యకు ఉపయోగించిన రివాల్వరు ఒక్కటే అని పరీక్షలో తేలింది.
చిక్కుముడి విడింది. మిస్టరీ తేలిపోయింది. నాలుగు నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని మొత్తం పోలీసు యంత్రాంగం వెదుకుతున్న హంతకుడు దొరికాడు.
పకడ్బందీగా కేసు మోపి ఉరికంబం ఎక్కించడమే తరువాయి.

1 comment: