కూర్మపురాణం
డైనోసార్స్..
ఈ భూమీద ఒకప్పుడు బతికిన అతిపెద్ద జీవులు.. ఈ రాకాసిబల్లులు...
వీటిని మనం చూసింది లేదు...
వాటిగురించి చెప్పుకునేదాంట్లో చాలావరకు ఊహే...
జురాసిక్ యుగంలో విచ్చలవిడిగా తిరిగిన ఈ జీవులు గురించి జరుగుతున్న పరిశోధనల కన్నా..కల్పితగాథలు ఆసక్తిరేపుతున్నాయి. సరే.. కానీ వీటికన్నా ముందుపుట్టి..వాటితో కలిసి బతికి... నేటికీ మనగలుగుతున్న జీవి ఒకటి ఈ భూమీద ఉందని ఎందరికి తెలుసు?
అదే- తాబేలు.
దాదాపు 220 మిలియన్ సంవత్సరాలనుంచి చెప్పుకోదగ్గ పరిణామాలకు లోనుకాకుండా జీవిస్తున్న అతిపెద్ద సరీసృపం ఇది. ఇప్పుడు దానికి పెద్దకష్టమొచ్చి పడింది. పర్యావరణ మార్పులు, జనవిస్ఫోటనం, పర్యాటకరంగం అభివృద్ధి, సముద్ర జలాల్లో పెరిగిన రాకపోకలు, కాలుష్యం, అక్రమవేట వాటి మనుగడను దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 50 సంవత్సరాల తరువాత తాబేళ్లలో చాలాజాతులు అంతరించిపోవడం ఖాయమని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది.
* * *
భారతీయ ఇతిహాసాల ప్రకారం పాలకడలిని మధించడానికి విష్ణువు కూర్మావతారం ధరించాడు. అందుకే మనదగ్గర తాబేళ్లను భగవంతుడి ప్రతిరూపంగా భావిస్తారు. జనసామాన్యానికి తాబేలు చేరువైందికూడా అందుకే. రాక్షసులను తుదముట్టించడానికి, జనులను రక్షించడానికి కూర్మావతారంలో విష్ణు భగవానుడు బాధ్యత నిర్వహించాడన్నమాట అటుంచితే.. ఇప్పుడు తాబేళ్లను రక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకు మనమే పూనుకోవాలి. ఈ విషయాన్ని చెప్పడానికే ఏటా మే 23న ‘ప్రపంచ తాబేళ్ల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని ఓ స్వచ్ఛంద సంస్థ ‘అమెరికా టార్టాయిస్ రెస్క్యూ’ 2000 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోంది. ప్రపంచ దేశాలూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి.
లక్ష్యం ఏమిటి?
సరీసృపాల్లో అతిపెద్ద జీవిగా చెప్పుకునే తాబేళ్లను ఆంగ్లంలో టార్టాయిస్ (నేలమీద జీవించేవి), టర్టిల్స్ (జలాల్లో జీవించేవి)గా పిలుస్తారు. కొన్ని దేశాల్లో రెండింటినీ టార్టాయిస్‌గానే పిలుస్తారు. ఈ రెండింటిలో నీళ్లలో మనుగడ సాగించే తాబేళ్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాబేళ్లలో 320 జాతులున్నప్పటికీ వాటిలో సగం జాతులు అంతర్థానమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే అంతరించిపోయినవాటిలో 22 ఉపజాతులున్నాయి. మరో 41 జాతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎన్నో విశిష్టతలున్న తాబేళ్లగురించి ప్రజలకు తెలియచేయడం, వాటి ప్రత్యేకతలపై ప్రచారం చేయడం, వాటి ఆవాసయోగ్య ప్రాంతాలను చెదరగొట్టకుండా చూడటం, సదస్సులు, సంరక్షణ చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా సాగర తీరప్రాంత దేశాల్లో ఈ కార్యక్రమాలు జోరుగా సాగుతాయి.
ప్రత్యేకతలు ఇవీ..
మనకు బాగా పరిచయం ఉన్న ‘పంచతంత్రం’ కథల్లో తాబేళ్ల పాత్ర ఉంది. చిన్నపిల్లలకు మంచి విషయాలు చెప్పడానికి వీటిని ఓ పాత్రగా మలిచారు. నిజానికి తాబేళ్ల ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. వాటిగురించి ఎక్కువమందికి తెలిసింది తక్కువే. అందుకే వాటిగురించి తెలుసుకోమని పోరుపెడుతున్నాయి జీవవైవిధ్య సంస్థలు. వాటిగురించి తెలిస్తే...అవి ఎందుకు అంతరించిపోతున్నాయో, ఏ పరిస్థితులవల్ల అలా జరుగుతోందో అర్థమవుతుంది. వాటి మనుగడ కొనసాగేలా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. నీటిలో ఉండే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ఒడ్డుకు వస్తాయని చాలామందికి తెలుసు. ఒక్కో ఆడ తాబేలు గుడ్లు పెట్టడానికి అవి పుట్టిన తీరానికే రావడం మనకు విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అవి 1500 మైళ్ల దూరం ప్రయాణించి అవి పుట్టిన ప్రాంతంలోనే గుడ్లుపెట్టి వెళ్లిపోతాయి. చీకటిగా ఉన్నప్పుడు తీరంలో సంచరిస్తూ అనువైన చోటు, సురక్షితమైన ప్రాంతాన్ని రోజుల తరబడి గమనించి ఇసుకలో గోతులు తవ్వి గుడ్లను వదిలి, ఇసుకను కప్పి వెళ్లిపోతాయి. నిజానికి తాబేలు సంపర్కదశకు చేరడానికి వయసుతో సంబంధం లేదు. అవి శరీర పరిమాణాన్నిబట్టి సంపర్కానికి సిద్ధపడతాయి. కనీసం 40 ఏళ్లకు అవి జతకట్టే వీలుంటుంది. అంటే అవి పుట్టిన తరువాత ఎక్కడెక్కడ సంచరించినా దాదాపు నలభై ఏళ్ల తరువాత అవి మళ్లీ పుట్టిన చోటుకు చేరతాయన్నమాట. అదెలా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక గుడ్లనుంచి పిల్లలు వచ్చినపుడు అవి ఆడా, మగా అన్నది వాతావరణంలో వేడిని బట్టి తేలుతుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు గుడ్లనుంచి ఆడ, చల్లటి వాతావరణంలో మగతాబేళ్లు పుడతాయి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణం వేడెక్కి ఆడ తాబేళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఆ జాతిలో సమతుల్యత దెబ్బతింటోంది. నిజానికి చీకటి వాతావరణంలో రహస్యంగా తాబేళ్లు ఒడ్డుకు చేరతాయి. సహజసిద్ధమైన వెలుతురులో, నక్షత్రాలు, సూర్యచంద్రుల కదలికలను బట్టి అవి పుట్టినచోటుకు వస్తాయని భావిస్తారు. అయితే, ఆధునిక ప్రపంచంలో తీరప్రాంతాల్లో కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌కాంతులు వాటికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సముద్రతీరాల్లో జనావాసాలు, పర్యాటకుల సంఖ్య పెరగడంతో అవి తీరానికి వచ్చేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కృత్రిమ విద్యుత్ కాంతులతో అవి సందిగ్ధతకు లోనై రూటు మారిపోతున్నాయి. అనుకున్న సమయంలోగా అనుకున్న తీరానికి అవి చేరుకోలేక కొత్తప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నాయి. అక్కడ వాటికి రక్షణ ఉండటం లేదు. దీంతో వాటి సంఖ్య తగ్గిపోతోంది. నిజానికి ఒక్కో తాబేలు వందల సంఖ్యలో గుడ్లను పెట్టినా వాటి పిల్లల్లో బతికేది పదిశాతం కన్నా తక్కువే. వాటిలోకూడా చివరివరకు జీవించేది ఒకటీఅరా శాతమే. అంత తక్కువ సంఖ్యలో ఉన్న వీటికి ఇప్పుడు మనుగడ కష్టమైపోయింది. ఈ భూమిమీద ఎక్కువకాలం జీవించే ప్రాణికూడా ఇదే. వీటి సగటు జీవనకాలం 150 సంవత్సరాలు. తాబేళ్లకు వాసనచూసే శక్తి ఉంది. తమ జతను అవి ఆ లక్షణంతోనే ఎంపిక చేసుకుంటాయి. ఇక వాటికి స్వరపేటిక లేకపోయినా చిన్నగా అరుస్తాయి. రకరకాల ధ్వనులు చేస్తాయి. తలను నేరుగా లోపలికి లాక్కునే రకం తాబేళ్లు, తలను ఇరుపక్కలకూ లాక్కునే రకం తాబేళ్లూ ఉన్నాయి. మనగోళ్లు తయారయ్యే కెరోటిన్‌తోనే వాటి తాబేళ్లపైనుండే చిప్ప తయారవుతుంది. అత్యంత దృఢంగా ఉండే పైచిప్ప 50 రకాల ఎముకలతో తయారవుతుంది. దానికి స్పర్శను గ్రహించే తత్వం ఉంటుంది. రక్తనాళాలతో అనుసంధానమైన పైచిప్పకు గాయమైతే తాబేలుకు నొప్పి తెలుస్తుంది. ఇవన్నీ చాలామందికి అంతగా తెలీని విషయాలు. శత్రువు దాడిచేసినప్పుడు అవసరమైతే ఓ అసహ్యకరమైన వాసనను వెదజల్లే ద్రవాన్ని విడుదల చేయడం కొన్ని జాతుల తాబేళ్ల ప్రత్యేకత. తాబేళ్లన్నింటికీ పైచిప్ప గట్టిగా ఉంటుందని, అన్నింటికీ పై చిప్ప ఉంటుందనీ భావించక్కర్లేదు. మెత్తగా ఉండే పైచిప్ప ఉన్న తాబేళ్లు కూడా ఉన్నాయి. మృదువైన పైచిప్పతో ఉన్నవి (లెదర్‌బాడీ టర్టిల్స్), పెట్టెలా ముడుచుకుపోయే (బాక్స్ టర్టిల్స్) ఉన్నాయి. పుట్టినప్పుడు మాంసాహారాన్ని, ఎదిగాక కేవలం శాకాహారాన్ని భుజించే గ్రీన్ టర్టిల్స్ ఉన్నాయి. సముద్రంలో కేవలం జెల్లీ ఫిష్, స్పాంజ్‌లను భుజించేవి, కోరల్ రీఫ్స్‌లో గడ్డిని మాత్రమే తినేవి, తెల్లగా ఉండే అల్బెనో (వీటిని ఎక్కువగా పెంచుకుంటారు) తాబేళ్లూ ఉన్నాయి. నేలపై జీవించే తాబేళ్ల పైచిప్ప, శరీర భాగాలు నీటిలో ఉండే తాబేళ్లకన్నా దృఢంగా ఉంటాయి. తాబేళ్లకు చెవులు లేకపోయినా కొంతస్థాయిలో వినగలిగే శక్తి ఉంది. అవి చెవిటివి మాత్రం కావు. చాలా జాతుల్లో తాబేళ్లకు పళ్లుండవు. యాలిగేటర్ టర్టిల్స్ చూడటానికి అతి భయంకరంగా ఉంటాయి. నాలుకను చుట్టచుట్టి వానపాముల్లా పొడవుగా మార్చి బయటకు పెట్టి చేపలకు ఎరగా పెట్టి, ఆకర్షించి చట్కున లాక్కుని తినేసే తాబేళ్ళివి. ఇక అతిశీతల వాతావరణంలో ఆరోగ్యంగా ఉన్న తాబేళ్లు కుహరం లోపలికి కాళ్లు, తల లాక్కుని నెలలతరబడి గడ్డకట్టుకుపోయి జీవిస్తాయి. వాతావరణం వేడెక్కాక మళ్లీ బయటకు తలపెట్టి జీవితాన్ని కొనసాగిస్తాయి. అయితే, ఆ సమయంలో వాటి పైచిప్పకుగాని, శరీరంలో ఇతరచోట్లగానీ గాయాలు ఉండకూడదు. వీటికున్న మరో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతాం. సముద్రగర్భంలో ఉండే తాబేళ్లు ప్రాణవాయువు లేకుండా నెలల తరబడి జీవించగలవు. సాధారణంగా ఆక్సిజన్ కోసం సముద్ర ఉపరితలానికి తరచూ వస్తాయి. ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైతే నెలల తరబడి గాలి పీల్చకుండా ఉండిపోగలవు. ఆహారం దొరకకపోయినా కూడా చాలాకాలం బతికేస్తాయి. ఇలా ఎన్నో విశిష్టతులున్న ఇవి వివిధ కారణాలవల్ల అంతరించిపోతున్నాయి.
మనుగడకు ముప్పు ఇలా...
సముద్రతాబేళ్లు జీవితాంతం నీళ్లలోనే తిరిగినా గుడ్లుపెట్టడానికి మాత్రం తీరానికి వస్తాయి. సురక్షిత తీరాలకు ప్రత్యేక సీజన్‌లో వందల సంఖ్యలో వచ్చి వెళతాయి. గుడ్లనుంచి పిల్లలు బయటపడ్డాక అవి సముద్రంలోకి వెళ్లడం ఇప్పుడు సమస్యగా మారిపోయింది. తీరప్రాంతాల్లో నిర్మాణాలు, ప్రజల కదలికలు ఎక్కువైపోవడంతో వాటికి రక్షణ కరవైంది. చేపలవేట పేరుతో మరపడవలు పెరిగిపోవడం, వేట పెరిగిపోవడంతో వాటికి ఆహార లభ్యత దుర్లభమవుతోంది. ఇక ప్లాస్టిక్ కాలుష్యం వాటి పాలిట శాపంగా మారిపోయింది. సముద్ర జలాల్లోకి చేరిపోతున్న ప్లాస్టిక్ కవర్లు, పాలిథిన్ కవర్లు వాటికి ప్రాణాంతకమవుతున్నాయి. జెల్లీఫిష్‌లను తినే ఒకజాతి తాబేళ్లు ఈ కవర్లను జెల్లిఫిష్‌లు, స్పాంజ్‌లుగా భ్రమించి తిని మరణిస్తున్నాయి. సముద్రంలో చమురు అవశేషాల వల్ల పెద్ద సమస్య ఏర్పడుతోంది. కళ్లు, నోటిలోకి చమురువెళ్లి అవి మరణిస్తున్నాయి. ఇక చేపలకోసం వేసే భారీ వలల్లో ఇవి ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి. సముద్రం అడుగున పెరిగే ఆల్గే, గడ్డిజాతి మొక్కలను తినే తాబేళ్లు అంతరిస్తే వేలసంఖ్యలో ఉండే సముద్రజీవులు అంతరించిపోతాయి. తాబేళ్ల నోళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. సముద్రం అట్టడుగున ఉన్న గడ్డిమొక్కలను, ఆల్గేను తినడానికి వీలుగా వీటికి పళ్లలాంటి ఏర్పాటు ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం అవి కోసుకుంటూ వెళతాయి.
ఆహారం...ఔషధం..
చైనా, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో తాబేళ్లను ఆహారంగా, ఔషధంగా ఉపయోగిస్తారు. చాలాదేశాల్లో తాబేళ్ల పైచిప్పతో తయారు చేసే వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. మూఢనమ్మకాలూ వాటి ప్రాణాలు తీస్తున్నాయి. తాబేళ్ల మాంసంతో చేసే పులుసుకు కొన్ని దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆంగ్లో-అమెరికన్ సంప్రదాయ వంటకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఫ్లోరిడాలో గోఫర్ తాబేళ్ల వంటకాలంటే పిచ్చి. గ్రాండ్ కెమన్ ప్రాంతంలో తాబేళ్ల మాంసంతో వంటకాలు చేసుకుంటారు. అందుకోసం తాబేళ్ల పెంపకం ఓ పరిశ్రమగా మార్చేశారు. కరేబియన్ దేశాలు, మెక్సికోలో తాబేళ్ల కొవ్వుతో సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. చైనా, తైవాన్‌లో సంప్రదాయ ఔషధాల తయారీకోసం వేల టన్నుల తాబేళ్లను వధిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ‘గిలింగ్గావో జెల్లీ’ అనే ఔషధాన్ని తయారు చేయడం కోసం తైవాన్, చైనా వేల టన్నుల తాబేళ్లను దిగుమతి చేసుకుంటోంది. ఇక వీటి పైచిప్పలతో చేసే వస్తువులకు గిరాకీ తక్కువేం కాదు. బ్యాగులు, పర్సులు, పాదరక్షలు, హెల్మెట్‌లు, అలంకరణ సామాగ్రి, చివరకు చేపలను పట్టే కొక్కేలు కూడా వీటి పైచిప్పలతో తయారు చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో తాబేళ్ల వ్యాపారం విపరీతంగా సాగుతోంది. ఒక కంపెనీ వారానికి 500 పౌండ్ల మాంసం కోసం తాబేళ్లను యథేచ్ఛగా వధిస్తోంది. ఒక పౌండ్ మాంసానికి 50 తాబేళ్లను వధించాల్సి ఉంటుంది. ఈ లెక్కన అక్కడ వాటిని ఏ స్థాయిలో చంపుతున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ తాబేళ్ల మనుగడను దెబ్బతీస్తున్నాయి.
ఇలా అంతరిస్తున్నాయి..
పదేళ్లక్రితం చేసిన ఓ పరిశోధన ప్రకారం 328 జాతుల తాబేళ్లుండేవి. వాటిలో 52 శాతం పరిస్థితి ‘్భయపెట్టేది’గా ఉంది. 25 జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మరో 40 జాతుల పరిస్థితి ‘హైరిస్క్ స్టేటస్’లో ఉంది. లెదర్‌బ్యాక్, కెంప్ రిడ్లే తాబేళ్ల నెమ్మదిగా అంతరించే దశకు చేరుతున్నాయి. ఆసియాలో ఉండే తాబేళ్ల మనుగడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. శుద్ధజలాల్లో ఉండే 263 జాతుల తాబేళ్లలో 115 జాతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక భూమిమీద జీవించే తాబేళ్లలో 71శాతం దాదాపు అంతరించిపోయాయి.
ఇలా చేయాలి..
తాబేళ్లను కాపాడుకోవడానికి ఎన్నో చర్యలు చేపట్టారు. ఫ్లోరిడా సహా మూడు ప్రాంతాల్లో ప్రత్యేక సంస్థలు ఏర్పాటయ్యాయి. సంప్రదాయంగా తాబేళ్లు తరలివచ్చే తీరప్రాంతాలలో పర్యాటకాన్ని నిరోధించాల్సి ఉంటుంది. అవి గుడ్లుపెట్టే సీజన్‌లో తీర ప్రాంతాల్లో విద్యుద్దీపాల వెలుగును నియంత్రిస్తారు. చేపలవేటకు ఉపయోగించే గాలపు కొక్కేల డిజైన్‌ను మార్చారు. ‘జె’ ఆకారంలో ఉండే కొక్కేలకు బదులు వృత్తాకారంలో ఉండే కొక్కేలను రూపొందించారు. వీటివల్ల అటు చేపలుగానీ, ఇటు తాబేళ్లుకానీ వాటికి చిక్కినా పెద్దగా గాయపడవు. తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంది. కొన్ని జాతుల తాబేళ్ల రవాణాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ మేరకు ముందుకు వచ్చాయి. ప్రజల్లో సరైన చైతన్యం వస్తే మన పాతనేస్తాన్ని కాపాడుకోవడం పెద్దకష్టం కాదు. *
**
టర్టిల్ సాట్
టర్టిల్‌సాట్ అనేది ఓ స్మార్ట్ఫోన్ యాప్. వరల్డ్ టర్టిల్ డే సందర్భంగా దీనిని ఆస్ట్రేలియా ప్రభుత్వం రూపొందించింది. కరవు, నక్కలు, తోడేళ్లు, అపరిమిత అభివృద్ధి కారణంగా ఆ దేశంలో తాబేళ్లు అంతరించిపోతూండటంతో ప్రజాచైతన్యంకోసం ప్రభుత్వం ఈ యాప్‌ను తయారు చేసింది. జిపిఎస్ ఆధారంగా తాబేళ్లు సంచరించే ప్రాంతాలు, వాటి సంరక్షణ కార్యక్రమాలు, వాటి ప్రత్యేకతలు, అవి గుడ్లు పెట్టే ప్రాంతాల వివరాలు అందులో ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. అక్రమాలు జరుగుతున్నట్లయితే యాప్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందించవచ్చు. అందుకు ఆధారంగా ఫొటోలనూ పంపాల్సి ఉంటుంది.
**
అంతరిక్షంలోకి ప్రయాణం
అంతరిక్షంలో పరిశోధనలకు మానవుడితోపాటు ఎన్నో జీవజాతులను పంపించారు. 1968లో రష్యా రెండు తాబేళ్లను అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడిపైకి వెళ్లేందుకు ఉద్దేశించిన ‘జాండ్-5’ మిషన్‌లో భాగంగా వాటిని పంపింది. అంతరిక్షంలోకి వెళ్లివచ్చాక వాటి బరువు చాలా తగ్గింది. కానీ ఇతర లక్షణాల్లో పెద్దగా మార్పులు లేవు. వాటి కాలేయ కణజాలంలో పెద్దమొత్తంలో ఐరన్, గ్లైకోజెన్ చేరినట్లు గుర్తించారు.
మూలం: ఆదివారం-ఆంధ్రభూమి.
కూర్మపురాణం
ReplyDelete