Breaking News

చెవిటివారికీ వినపడేలా


సాధారణంగా కోర్టులో ముందు విచారణ... తరువాత తీర్పు.
బ్రిటిషు అన్యాయ వ్యవస్థ తీరు వేరు. ముఖ్యంగా స్వాతంత్య్రయోధుల, విప్లవకారుల విషయంలో.
తీర్పు ఏమి ఇవ్వాలో, ఏ శిక్ష వేయాలో ముందుగా నిర్ణయించుకునే బాంబు కేసు విచారణకు ఉపక్రమించాడు సెషన్సు కోర్టు జడ్జి లియొనార్డ్ మిడిల్టన్. 1929 జూన్ మొదట్లో మొదలుపెట్టి 12వ తేదీకల్లా ప్రశస్తమైన తీర్పును ప్రకటించాడాయన. దానికి తగ్గట్టుగా ప్రాసిక్యూషను వారు బోలెడు సాక్ష్యాలను బనాయించారు. సెంట్రల్ అసెంబ్లీలో భగత్‌సింగ్, బి.కె.దత్‌లు బాంబులు వేయబోతున్నారని దివ్య దృష్టితో ముందే గ్రహించి, అది ఎప్పుడెప్పుడా అని రెప్పవేయకుండా వాళ్ల మీదే దృష్టి నిలిపి, కాచుకు కూచున్నట్టుగా - ప్రత్యక్ష సాక్షుల కథనాలను పుట్టించారు. వాళ్లిద్దరూ బాంబులు విసురుతూండగా కళ్లారా చూశామని, కాగితాలు కుమ్మరించడంతోబాటు వాళ్లు పిస్టళ్లు కూడా పేల్చారని సాక్షుల చేత అబద్ధమాడించారు. ఫరవాలేదు రమ్మని భగత్‌సింగ్ భరోసా ఇచ్చేదాకా అతడి దగ్గరకు వెళ్లటానికే హడలిపోయిన సార్జంట్ టెర్రీ తానే అతడిని ఒడిసిపట్టి, పిస్తోలును లాక్కున్నట్టు బొంకాడు. మనుషులను మూకుమ్మడిన మట్టుపెట్టి సర్వనాశనం చేయటమే ముద్దాయిల ఉద్దేశమనటంలో ఎంత మాత్రం సందేహం లేదనీ దొంగ సాక్షులు ఒట్టు పెట్టుకున్నారు.
ఈ అబద్ధాల అల్లికలన్నీ గమనించిన విప్లవకారులకు బ్రిటిషు ప్రభుత్వం తమ అంతు చూసేందుకే నిశ్చయించుకున్నదని అర్థమైంది. తమను సమాజానికి చీడపురుగులుగా, నరరూప రాక్షసులుగా చిత్రించాలన్న సర్కారీ కుత్సితాన్ని వమ్ము చేయాలంటే తమ ఆంతర్యాన్ని, అంతరంగాన్ని ప్రజల ముందు వివరంగా ఆవిష్కరించడం అవసరమని వారు తలచారు. 1929 జూన్ 6న కోర్టు హాల్లోని ప్రతి ఒక్కరూ ఊపిరి ఉగ్గబట్టి వింటూండగా నిందితుల స్టేట్‌మెంటును వారి తరఫు న్యాయవాది అసఫ్ అలీ చదివి వినిపించాడు.
అది ఆషామాషీ ప్రకటన కాదు. ప్రపంచ విప్లవకారుల చరిత్రలో కలకాలం కాంతులీనే క్లాసిక్ స్టేట్‌మెంట్. విప్లవకారుల సిద్ధాంతాలు, కార్యాచరణ పద్ధతులు, వారి ఆదర్శాలు, ఆలోచనా స్రవంతులకు అక్షర రూపం ఇచ్చిన మాస్టర్ పీస్ అనదగ్గ డాక్యుమెంటు అది. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దానిది విశిష్ట స్థానం. ఇద్దరి పేరు మీద వెలువడినా, అక్కడక్కడ టచప్ చేసి చదివి వినిపించింది అసఫ్ అలీ అయినా జైల్లో కష్టపడి అతి జాగ్రత్తగా దానిని మలచినవాడు భగత్‌సింగ్. విలక్షణమైన అతడి శైలికీ, వాదనా పటిమకు, నిప్పులు చిమ్మే అతడి వ్యక్తిత్వానికీ మచ్చుతునక అయిన ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇవి:
మా మీద తీవ్రమైన అభియోగాలు మోపారు. మేము ఏమి చేశామో, ఎందుకు చేశామో ఈ దశలో వివరించటం అవసరం. ఈ సందర్భంలో రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
1.లెజిస్లేచర్ చాంబరులో మేము బాంబులు విసిరామా? విసిరి ఉంటే - ఎందుకు విసిరాం? 2.కింది కోర్టు నిర్ధారించిన అభియోగం నిజమా కాదా?
మొదటి ప్రశ్నలో మొదటి సగానికి మా సమాధానం - ఔను! కాని- దీని గురించి ఈ కోర్టులో కొందరు ఇచ్చిన సాక్ష్యాలు, మాలో ఒకరి నుంచి పిస్టల్ గుంజుకున్నట్టు సార్జంట్ టెర్రీ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలు.
ఇక మొదటి ప్రశ్నలో రెండో సగం సంగతి. దానికి జవాబివ్వాలంటే మా ఉద్దేశాలను, మేము అలా చేయవలసి వచ్చిన పరిస్థితులను కాస్త వివరించాలి.
మా దాడి వ్యవస్థ మీదే తప్ప వ్యక్తుల మీద గురిపెట్టినది కాదని ఉభయ సభల సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో లార్డ్ ఇర్విన్ ప్రకటించినట్టు జైల్లో మమ్మల్ని కలిసిన పోలీసు ఆఫీసర్లు చెప్పారు. ఆ మాట నిజం. మానవాళి పట్ల ప్రేమలో మేము ఎవరికీ తీసిపోము. మానవ జీవితం మాటలలో చెప్పలేనంత పవిత్రమైనదని మేము భావిస్తాము. సూడో సోషలిస్టు చమన్‌లాల్ వర్ణించినట్టు మేము దారుణ దురాగతాలకు పాల్పడి, దేశానికి సిగ్గుచేటు అయిన వాళ్లము కాము. ‘ది ట్రిబ్యూన్’ పత్రిక, మరి కొందరు ముద్ర వేసినట్టుగా మేము ఉన్మాదులమూ కాము.
మేము దేశం ఆకాంక్షలను, దాని దుస్థితిని సీరియస్‌గా అధ్యయనం చేసే చరిత్ర విద్యార్థులం. కపటం అంటే మాకు అసహ్యం. పుట్టింది మొదలుకుని తన నిరర్థకతను, అనర్థకతను అనేక విధాల చాటి చెబుతున్న చట్టసభ మీదే మా నిరసన! భారతదేశ నిస్సహాయతను, అవమాన స్థితిని ప్రపంచానికి ప్రదర్శించడానికే ఈ వ్యవస్థ ఉన్నదనీ... బాధ్యతారహితమైన నిరంకుశ పాలనకు ఇది ప్రతీక అనీ మేము నమ్ముతున్నాం. ప్రజా ప్రతినిధులు పెట్టిన జాతీయ డిమాండ్లను చెత్తబుట్టలో పడవేయటమే పదేపదే దాని పని. సభ ఆమోదించిన ఎన్నో గంభీర తీర్మానాలు సోకాల్డ్ ఇండియన్ పార్లమెంటులో కాళ్లకింద తొక్కివేయబడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, వైభవాల పటాటోపాలు ఎలా ఉన్నా కోట్లాది శ్రమజీవుల కష్టార్జితంతో నడిచే ఈ వ్యవస్థ అస్తిత్వానికి సరైన హేతువు ఒక్కటీ కనిపించదు.
ఈ విషయాలను మేము ఆలోచిస్తూండగా కార్మిక నాయకుల మూకుమ్మడి అరెస్టులు జరిగాయి. కార్మిక వివాదాల బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. దానిపై సాగిన చర్చను గమనిస్తే మాకు మరోసారి ధ్రువపడింది ఏమిటంటే - నిర్భాగ్య శ్రామికుల దోపిడీకి భయానక స్మృతిచిహ్నంగా నిలిచిన ఈ సంస్థ నుంచి దేశంలోని కార్మిక కోటి ఆశించగలిగింది ఏమీ లేదని. అసెంబ్లీ ఛాంబర్ ఫ్లోర్ మీద మేము బాంబు వేసింది గుండెలు పిండే వ్యథను వ్యక్తపరచడానికి ఏ సాధనమూ కానరాని ఆపన్నుల తరఫున తీవ్ర నిరసనగా. చెవిటి వాళ్లకు వినపడేలా, లక్ష్యం లేనివాళ్లను హెచ్చరించేలా చేయాలన్నదే మా ఏకైక ఆశయం. ఎందుకూ కొరగానిదని నవతరం గుర్తించిన ఊహాలోకపు అహింస శకానికి మేము భరతవాక్యం పలకదలిచాం. గురుగోవింద్ సింగ్, శివాజీ, కమాల్‌పాషా, రిజాఖాన్, వాషింగ్టన్, గారిబాల్జి, లాఫయిట్, లెనిన్‌ల నుంచి స్ఫూర్తి పొందిన భారతదేశ నవీన ఉద్యమ ఉషోదయం గురించి మా చర్య ద్వారా హెచ్చరిక చేయదలిచాం. విదేశీ ప్రభుత్వమూ, భారతీయ ప్రజా నాయకులూ ఈ ఉద్యమం ఉనికిని గుర్తించకుండా కళ్లు మూసుకున్నందువల్లే అందరికీ వినపడే చోట హెచ్చరిక గంటను మోగించాలనుకున్నాం.
స్వల్పగాయాలు తగిలిన వారి మీద గాని, అసెంబ్లీలోని మరెవరి మీదగాని మాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు. మరొకరిని గాయపరచడం కంటే మానవాళి సేవలో మా ప్రాణాలనే అర్పించడానికి మేము ఇష్టపడతాం. ప్రభుత్వ నిపుణుడు ఏమంటేనేమి - అసెంబ్లీ చాంబరులో మేము విసిరిన బాంబులవల్ల కొద్దిగా దెబ్బతిన్నది ఒక ఖాళీ బెంచి మాత్రమే. ఇంకో నాలుగైదు బెంచిలకు చిన్న గాట్లు పడ్డాయి. ఇదొక అద్భుతం అని ప్రభుత్వ నిపుణులు అన్నారు. మాకైతే ఇందులో అద్భుతమేదీ కానరాలేదు. రెండు బాంబులనూ ఖాళీ స్థలాల మీదే మేము గురిపెట్టాము. పేలుడు జరిగిన చోటికి రెండు అడుగులలోపే ఉన్న సర్ జార్జి షుస్టర్ లాంటి వారు కూడా గాయపడలేదు. లేదా కొద్దిగా గీరుకుపోయిందంతే. ప్రభుత్వ నిపుణులు ఊహించి ఉత్ప్రేక్షించి చెప్పిన మోతాదులో పొటాషియం క్లోరేటు, పైక్రేటు వాటిలో కూరబడి ఉంటే అవి బారియర్లను ధ్వంసం చేసేవి. పేలిన చోటికి కొన్ని గజాల దూరంలోని వారిని నేలకూల్చి ఉండేవి. వినాశనం చేసే పెల్లెట్లు, డార్ట్‌ల వంటి వాటితో భారీ ఎక్స్‌ప్లోజివ్‌లను బాంబుల్లో లోడ్ చేసి ఉన్నట్టయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల్లో అత్యధిక సంఖ్యాకులు హతమైపోయేవారు. మేము తలచుకుంటే కొందరు అత్యంత ప్రముఖులు కూచుని ఉన్న అఫీషియల్ బాక్సు మీదా పెద్ద బాంబులు వేసి ఉండేవాళ్లం. బాధ్యతాయుత వ్యక్తులందరూ ఏవగించుకున్న దౌర్భాగ్యపు కమిషన్‌కి పెద్ద అయిన సర్ జాన్ సైమన్ ఆ సమయాన ప్రెసిడెంట్స్ గ్యాలరీలో కూర్చుని ఉన్నాడు. కావాలనుకుంటే అతడిని కూడా మేము మాటువేసి మట్టుపెట్టగలిగే వాళ్లమే. కాని ఇవేవీ మేము ఉద్దేశించలేదు. బాంబులను మేము ఎలా డిజైను చేశామో అలాగే పేలాయి. అద్భుతమనేది ఏదైనా ఉంటే భద్రమైన చోట పడేలా వాటిని సరిగ్గా గురిచూసి విసిరిన పనితనంలోనే!
మేము చేసిన దానికి శిక్ష అనుభవించటానికి మా అంతట మేము ముందుకొచ్చాం. వ్యక్తులను తొక్కివేయటం ద్వారా భావాలను చంపలేరని దోపిడీ సామ్రాజ్యానికి తెలియజెప్పదలిచాం. ఇద్దరిని నలిపివేసినంత మాత్రాన జాతిని నలిపివేయలేరు. ఉరికంబాలు, సైబీరియా గనులు రష్యన్ విప్లవాన్ని ఆర్పలేకపోయాయి. బ్లడీ సండే, బ్లాక్ అండ్ టాన్స్‌లు ఐరిష్ స్వాతంత్య్రోద్యమ గొంతు పిసకలేకపోయాయి. ఇండియాలో స్వాతంత్య్ర జ్వాలలను ఆర్డినెన్సులు, సేఫ్టీ బిల్లులు ఆర్పగలవా? గొప్ప ఆదర్శానికి అంకితమైన యువకుల నిర్బంధాలు, కుట్రకేసులు విప్లవ కవాతును అడ్డగించలేవు. ఈ హెచ్చరికే మేము చేయాలనుకున్నాం. చేశాం.
విప్లవం అంటే అర్ధం ఏమిటి అని కింది కోర్టు అడిగింది. విప్లవం అంటే రక్తపాతంతో కూడిన సంఘర్షణ కానక్కరలేదు. వ్యక్తిగత విద్వేషాలకు అందులో తావులేదు. అది బాంబులు, తుపాకుల ‘కల్ట్’ కాదు. ఎల్లెడలా అన్యాయంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థను మొత్తంగా మార్చివేయటమే మా దృష్టిలో విప్లవం. అందరికీ ధాన్యం పండించి, తాను కుటుంబంతో పస్తులుండే రైతు, ప్రపంచ విపణికి నాణ్యమైన వస్త్రాల నందించి, తనకూ తన పిల్లలకూ ఒంటి మీద సరైన బట్టకే తెరవులేని నేత పనివాడు, మహా ప్రాసాదాలను నిర్మించీ మురికివాడల్లో సంఘ బాహ్యుల్లా బతికే తాపీ పనివారు, వడ్రంగులు, కమ్మరులు - అందరూ శ్రమ దోపిడీకి గురై, ప్రాథమిక హక్కులకు నోచుకోనివారే. ఈ భయానక అసమానతలు, ఈ స్థితిగతులు ఇంకా ఎక్కువ కాలం సాగలేవు.
విప్లవం మానవుల హక్కు. స్వాతంత్య్రం అందరి జన్మహక్కు. సమాజాన్ని యథార్థంగా పోషించేది కష్టజీవులు. ప్రజల సార్వభౌమాధికారం కార్మిక వర్గపు అంతిమ గమ్యం. ఈ ఆదర్శాల కోసం, ఈ విశ్వాసం కోసం మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా, ఎటువంటి శిక్ష వేసినా స్వాగతిస్తాం. ఈ విప్లవ పూజాపీఠం ముందు మా పరువాన్ని ధూపంలా సమర్పిస్తున్నాం. ఇంత గొప్ప ఉద్యమానికి ఎంతటి త్యాగమూ ఎక్కువ కాదు. విప్లవం కోసం మేము ఎదురుచూస్తున్నాం. విప్లవం వర్థిల్లాలి.
అసెంబ్లీలో విసిరింది కాదు.. కోర్టులో.. పేలిందే అసలైన బాంబు. అరెస్టయిన కుర్రకుంకల నోట ఇంత పరిణత రీతిలో విప్లవ భావజాల ఉదాత్త ఉద్ఘాటనను ఎవరూ ఊహించలేదు. న్యాయవాది వినిపించిన స్టేట్‌మెంటులోని కొన్ని భాగాలను అసందర్భమన్న నెపంతో రికార్డుల నుంచి జడ్జి తొలగించాడు. ఆ సంగతి ముందే ఊహించి విప్లవకారులు తగిన జాగ్రత్త పడ్డారు. టైపు చేసిన స్టేట్‌మెంటు కాపీలను ముఖ్యమైన అన్ని పత్రికల కార్యాలయాలకు ముందే చేరవేశారు. మర్నాటికల్లా అన్ని ప్రముఖ పత్రికల్లో అది యథాతథంగా అచ్చయింది.

బాంబులు ఎందుకు విసిరారు? భగత్‌సింగ్, దత్‌ల వివరణ
మేము చెవిటివాళ్లకూ వినిపించదలిచాము
ఊహాజనిత అహింసలో నమ్మకంలేదు
అసెంబ్లీ శుష్క ప్రదర్శనశాల
- అన్న శీర్షికలతో ‘ది ట్రిబ్యూన్’ ఆంగ్ల దినపత్రిక ప్రకటన పూర్తి పాఠాన్ని ప్రముఖంగా ప్రచురించింది. దేశమంతటా ఈ ప్రకటన పెద్ద సంచలనమైంది. పారిస్‌లోని జ్ఘ హఖ్ఘౄశజఆళ, సోవియట్ల ‘ప్రావ్దా’, కొన్ని ఐర్లండు పత్రికలూ ఆ ప్రకటనను సంక్షిప్తంగా ప్రచురించాయి. ప్రజల మనసులపై అది ప్రగాఢ ప్రభావం చూపింది. యు.పి, పంజాబ్, బెంగాల్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో నౌజవాన్ భారత్‌సభ, హెచ్.ఎస్.ఆర్.ఎ.లు విప్లవకారుల ప్రకటనను వేల సంఖ్యలో ముద్రించి పంచిపెట్టాయి. ‘్భగత్‌సింగ్, బి.కె.దత్‌లు పెద్ద హీరోలు అయిపోయారు. వారి ప్రకటన భాగాలను సభల్లో చదివి వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నదే తప్ప ప్రాణాలు తీసే ఉద్దేశం వారికి లేదని జనం చెప్పుకుంటున్నారు.’ అని పంజాబ్ సిఐడి విభాగం హోం డిపార్టుమెంటుకు రహస్య నివేదిక పంపింది. అప్పటిదాకా అసెంబ్లీలో బాంబులేయటం దుర్మార్గం, మహానేరం అని రంకెలేసిన పెద్ద మనుషులు కూడా కోర్టులో ప్రకటన తెలిశాక భగత్‌సింగ్‌ని అభిమానించసాగారు. విప్లవకారులు చేసింది హింస అంటే సామాన్య జనం సహించే స్థితిలో లేరు.
న్యాయాధికారి మాత్రం అలా అనుకోలేదు. సాక్షుల విచారణను, వాద ప్రతివాదాలను
చకచకా ముగించి, ఆగమేఘాల మీద 1929 జూన్ 12న సెషన్స్ జడ్జి మిడిల్టన్ తప్పుడు తీర్పును ప్రకటించాడు. సారాంశం ఇది:
వీలైనంత మందిని చంపాలి, లేదా తీవ్రంగా గాయపరచాలి అన్న కుత్సితంతోటే భగత్‌సింగ్, బి.కె.దత్‌లు అసెంబ్లీలో బాంబులు వేసినట్టు రుజువైంది. ఇద్దరు నిందితుల మీద మోపబడిన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. తమకు ఏ హానీ చేయని వారికి, అసలు మొగమే ఎరుగని వారికి ఇంతటి అపకారాన్ని నిష్కారణంగా తలపెట్టటం హేయం; కఠినంగా శిక్షార్హం. తాము మానవ జీవితాన్ని పవిత్రంగా చూస్తామని నిందితులు చెప్పుకున్నా వారి చేతలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తాము చేసింది సరైనదని వారు సమర్థించుకున్న తీరును బట్టి, వీలయితే మళ్లీమళ్లీ అటువంటి అకృత్యానికి వారు వెనకాడరని స్పష్టం. వీరిని చూసి ఇంకొకరు ఇదే దారిని పట్టకుండా గట్టి శిక్ష అవసరం. యువకులన్న కారణంతో వీరిని కనికరించడానికి వీల్లేదు. కాబట్టి-
భగత్‌సింగ్, బి.కె.దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్షను విధించడమైనది!

1 comment:

  1. చెవిటివారికీ వినపడేలా

    ReplyDelete