మిస్టర్ అండ్ మిసెస్ రంజిత్
కాసేపట్లో హత్యాస్థలమంతా పోలీసులతో నిండిపోయింది. హంతకులు డి.ఎ.వి. కాంపౌండులోకి పారిపోయారని తెలిశాక పోలీసులు ఆ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. కాలేజి, హాస్టళ్లలో కనిపించిన వారినల్లా నిగ్గదీశారు. రిజిస్టర్లు తెప్పించి హాస్టల్‌వాసుల అటెండెన్సు తీసుకున్నారు. ఎవరైనా లేకపోతే వారు ఎవరు, ఎక్కడికి పోయారు, ఎవరితో వెళ్లారు అని ఆరాలు తీశారు. ఆ పక్కన ఉన్న డి.ఎ.వి. మిడిల్‌స్కూలు, అగర్వాల్ ఆశ్రమ్‌లనూ అణువణువూ శోధించారు. అనుమానం తోచిన వారినల్లా కస్టడీలోకి తీసుకున్నారు. ఎంత హైరాన పడ్డా హంతకుల ఆచూకీ గురించి పిసరంత సమాచారం రాబట్టలేక పోయారు.
పట్టపగలు నడివీధిలో పోలీసు ఆఫీసరును చంపారు. డి.ఎ.వి. కాంపౌండు వైపు పారిపోయారు. తరవాత ఏమయ్యారు? ఎటు వెళ్లారో, ఎలా ఉంటారో కూపీ తియ్యటానికి లాహోర్‌లో అందుబాటులో ఉన్న ప్రతి పోలీసునూ పరుగులెత్తించారు. వీధులు, కూడళ్లు, ఊరి నుంచి బయటికి వెళ్లే రోడ్డు, రైలు మార్గాలు అన్నిటిమీదా గట్టి కాపలా పెట్టారు. పోలీసు అధికారిని అంత ధైర్యంగా కాల్చి చంపటం బ్రిటిషు ప్రభుత్వ ప్రతిష్ఠకు సవాలుగా భావించి అధికార యంత్రాంగం యావత్తూ సర్వశక్తులూ ఒడ్డింది. ఆ పని విప్లవకారులే చేసి ఉంటారని అనుమానం ఉన్నా, చిన్న క్లూ కూడా దొరక్కపోవటంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలిచిపోయింది.
హత్యాస్థలం పరిసరాలను పోలీసులు జల్లెడ పడుతూండే సమయానికి ముగ్గురు వీరులూ మొజాంగ్ రోడ్ ఇంట్లో నిర్భయంగా కబుర్లాడుతున్నారు. సుఖదేవ్ వాళ్లకంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. అనుకున్న ప్రకారం స్కాట్‌ని చంపలేకపోయామే అన్న అసంతృప్తి అందరికీ ఉంది. గురి తప్పితేనేమి, మనం చంపినవాడు కూడా చంపదగినవాడే... వేల మంది చూస్తూండగా లాలాజీని లాఠీతో గొడ్డును బాదినట్టు బాదిన దుర్మార్గుడే - అని అందులోనే ఒకింత ఊరట. హత్యాస్థలంలో వారిని ప్రత్యక్షంగా చూసిన పోలీసు కానిస్టేబుల్ చచ్చిపోయాడు. ఇన్స్‌పెక్టర్ ఒకడు దూరం నుంచి చూసినా తుపాకిగుండ్లకు బెదిరి పారిపోయాడు. తమను ఆనవాలు పట్టలేడు. కాబట్టి పోలీసులు తమ వెనకాలే తరుముకుంటూ వచ్చి పట్టుకుంటారన్న భయం అక్కర్లేదు. కాని పగబట్టిన పోలీసులు తమను అంత తేలిగ్గా వదలరు. విప్లవ భావాలున్న ప్రతివాడినీ, పార్టీ సహచరులనూ, సానుభూతిపరులనూ సమాచారం కోసం పీడించక మానరు. పొరపాటున ఎవరన్నా కాస్త నోరు జారారా, పిశాచాల్లా వెంటపడి ఎలాగైనా తమ ఆచూకీ కనిపెట్టక మానరు. వాళ్లకు ఉప్పందక ముందే తాము ఇక్కడి నుంచి ఉడాయించటం క్షేమం.
ఈలోపు ఆలోచించాల్సినవి రెండు అతి ముఖ్య విషయాలు. మొదటిది - ముగ్గురికీ ఆకలి దంచేస్తున్నది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. బ్రిటిషు మహా సామ్రాజ్యాన్నయితే గడగడ లాడించగలిగారు కానీ కడుపు నింపుకోవటానికి ఎవరి జేబులోనూ దమ్మిడీ లేదు. రాజ్‌గురు ఎరిగిన వాడి దగ్గర అప్పుచేసి, తిండికి ఏర్పాటు చేయటానికి బయటికి వెళ్లాడు.
ఇక రెండోది. తాము ఏమి చేసిందీ, ఎందుకు చేయవలసి వచ్చిందీ ప్రజలకు తెలియజెప్పాలి. భగత్‌సింగ్ అంతకు ముందే ‘స్కాట్‌ని వధించాం’ అంటూ పోస్టరు రాసి ఉంచాడు. ఇప్పుడు అతడే ఆ పేరును చెరిపి దాని స్థానంలో ‘సాండర్స్’ పేరు చేర్చాడు. మాటరులోనూ అవసరమైన మార్పులు చేశాడు. అంతా కలిసి కాపీలు తయారుచేశారు.
తెల్లవారేసరికి లాహోర్ నగరం కూడలి స్థలాల్లో ఎర్ర అక్షరాలతో పెద్ద పోస్టర్లు వెలిశాయి:
=======================
హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ
నోటీసు
జె.పి.సాండర్స్ హతం... లాలాజీ మృతికి ప్రతీకారం.
30 కోట్ల హిందుస్తాన్ ప్రజలు ఎంతో గౌరవించే పెద్దాయన ఒంటిపై జె.వి.సాండర్స్ వంటి నీచుడు, దుర్మార్గుడు అంత అవమానకరంగా చేయి చేసుకోవడాన్ని ఊహిస్తేనే కంపరం పుడుతుంది. భారత జాతీయత శిరసుపై దెబ్బలు కొట్టటమంటే భారత యువతను, వారి మగటిమిని సవాలు చేయటమే. ఇండియా ఇంకా బతికే ఉందనీ, యువకుల నెత్తురు ఇంకా చల్లబడలేదనీ, జాతి పరువు నిలబెట్టటానికి ప్రాణాలను పణం పెట్టటానికి వారు సిద్ధంగా ఉన్నారనీ ప్రపంచం గ్రహించునుగాక!
క్రూర పాలకులారా ఖబడ్దార్!
అణచిపెట్టిన దేశం మనోభావాలను గాయపరచకండి. పైశాచిక కృత్యాలకు పాల్పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు ఆయుధాల చట్టాలు తెచ్చినా, ఆయుధాల రవాణా మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా, రివాల్వర్లు వస్తూనే ఉంటాయి. సాయుధ తిరుగుబాటుకు కాకపోయినా కనీసం జాతీయ అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి అవి సరిపోతాయి. ఆ సంగతి గుర్తుంచుకోండి.. ...
విప్లవం వర్థిల్లాలి.
ఒక మనిషి మరణానికి విచారిస్తున్నాం. కాని అతడు ప్రపంచంలోకెల్లా క్రూరమైన ఒక నీచ నికృష్ట ప్రభుత్వ వ్యవస్థకు ప్రతీక. విప్లవ బలిపీఠం మీద వ్యక్తుల రక్తం స్రవించేది దోపిడీని అంతమొందించి అందరికీ స్వాతంత్య్రం సాధించేందుకే.
18 డిసెంబర్ 1928. బాలరాజ్
కమాండర్ ఇన్ చీఫ్
============================
తెల్లవారగానే గోడల మీద పోస్టర్లను చూడటంతో తెల్లవాళ్ల గుండెల్లో రాయి పడింది. లాలాజీపై పోలీసు దాడి జరిగిన నాటి నుంచి ఆగ్రహంతో లోలోన రగిలిపోతున్న ప్రజల గుండెమంట కాస్త చల్లారింది. దిగ్భ్రమ కలిగించిన సాండర్స్ హత్య ఎవరు చేయించిందో వారికి తెలిసిపోయింది. తెల్లవాళ్లకే కాదు - తమకూ ఒక సైన్యం ఉంది; అఘాయిత్యాలు చేసేవారికి అది తగిన శిక్ష వేస్తుంది అన్న భరోసా జన సామాన్యానికి కలిగింది. భగత్‌సింగ్ ఆశించిందీ అదే.
కడుపులో ఆకలి నకనకలాడుతున్నది. రాజ్‌గురు ఇంకా తిరిగి రాలేదు. ఆజాద్ కాళ్లు ముడుచుకుని పడుకున్నాడు. రాత్రి 11 గంటలకు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లు తమ రహస్య స్థావరం నుంచి ఇస్లామాబాద్ ప్రాంతంలోని సోహన్‌సింగ్ జోష్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఇంట్లో సోహన్‌సింగ్ ఒక్కడే ఉన్నాడు. అతడి కుటుంబం ఊరికెళ్లింది. ఆ సమయాన వాళ్లను చూసి జోష్ ఆశ్చర్యపడ్డాడు. ‘ఇలా రావటం ప్రమాదం కదా? పోలీసు నిఘా బాగా ఉన్నట్టుంది’ అని గొణిగాడు.
‘్ఫరవాలేదు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాములే’ అన్నాడు భగత్‌సింగ్. ‘బాగా ఆకలవుతుంది. తినడానికి ఏమైనా పెట్టు’ అని అడిగాడు.
ఇంట్లో రెండు చపాతీలు, కాస్త కూర, కాసిని పాలు మాత్రమే ఉన్నాయి. ‘కాస్త ఆగండి. వంట చేస్తా’ అన్నాడు సోహన్‌సింగ్.
‘వద్దులే. ఉన్నదేదో పెట్టేసేయ్. తిని నిద్రపోతాం’ అన్నాడు భగత్.
ఆ రాత్రి సూటు, హ్యాటులో భగత్‌ని చూసి సోహన్‌సింగ్ మొదట గుర్తుపట్టలేదు. ఢిల్లీలో మూణ్నెల్ల కింద విప్లవకారుల రహస్య సమావేశం నుంచి తిరిగి రాగానే భగత్‌సింగ్ ఫిరోజ్‌పూర్ వెళ్లి ఒక మెడికల్ ప్రాక్టీషనరు చేత జుట్టు కట్ చేయించాడు. (కర్మం చాలక ఆ సమయాన జయగోపాల్ అతడి వెంట ఉన్నాడు. అప్రూవరుగా మారాక ఆ సంగతి కాస్తా పోలీసులకు చెప్పాడు. కుట్ర కేసులో అదో సాక్ష్యం.)
భగత్‌సింగ్ హ్యాటు, కోటు తీసి రివాల్వరు టేబిలు మీద పెట్టాడు. ఉన్నదేదో తిని ఆకలి బాధ కాస్త తీర్చుకున్నాక సోహన్‌సింగ్‌ని అడిగాడు - ‘జనం ఏమనుకుంటున్నారు’ అని.
‘కుర్రాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. స్కాట్‌ని చంపగలిగి ఉంటే ఇంకా సంతోషించేవాళ్లు’
‘వాడి కోసమే వెళ్లాం. అంతలో ఈ సైతాన్ బయటికొచ్చాడు. అంత కష్టపడ్డాక వట్టి చేతులతో తిరిగి రాలేము కదా?’ అని వివరించాడు భగత్.
సుఖ్‌దేవ్ ఒక్క మాటా మాట్లాడలేదు. వ్యూహకర్తగా అతడి మనసంతా తరవాత ఏమి చెయ్యాలి? వీళ్లని ఎలా తప్పించాలి అన్న విషయం మీద ఉంది. హత్యకు వివరంగా పథకం వేసి, జాగ్రత్తగా సన్నాహాలు చేసిన వాళ్లు - తరవాత ఊరి నుంచి ఎలా తప్పించుకు పోవాలన్నది ముందు ఆలోచించుకోలేదు. వాళ్లు నెత్తురు మండే విప్లవకారులే తప్ప ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు కనకేమో!
ఒక మంచం మీద సుఖ్‌దేవ్ పడుకున్నాడు. పెద్ద మంచం మీద భగత్, సోహన్‌సింగ్‌లు సర్దుకున్నారు. తెల్లవారకముందే లేచి మొజాంగ్‌రోడ్ ఇంటికి వెళ్లబోతూ భగత్‌సింగ్ మిత్రుడి ఇంట్లో కనిపించిన Liberty and the Great Libertarian అనే పుస్తకాన్ని చదివి ఇచ్చేస్తానంటూ పట్టుకుపోయాడు. ‘వద్దు. నేను ఇంకా దాన్ని చదవలేదు’ అని సోహన్‌సింగ్ వారిస్తున్నా లక్ష్యపెట్టలేదు.
సుఖ్‌దేవ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పోలీసుల వల విసిరి తమను పట్టుకునేలోపే, నిఘా కళ్లు కప్పి సహచరులను సురక్షిత స్థలానికి తరలించడానికి ఒకటే ఉపాయం. సహాయపడగలిగింది ఒకే ఒక వ్యక్తి.
దుర్గా భాభీ!
ఆ సమయాన ఆమె భర్త భగవతీచరణ్ వోరా కాంగ్రెస్ సభల కోసం కోల్‌కతా వెళ్లాడు. దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లూ మహాసభ నిమిత్తం అక్కడ చేరారు కాబట్టి వీళ్లను కూడా అక్కడికే పంపిస్తే సరి! అది దుర్గ్భాభీ వల్లే అవుతుంది.
వోరా ఇంటి మీద రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ పోలీసుల నిఘా ఎప్పటి నుంచో ఉంది. కాపలా పోలీసులు వెళ్లిపోయాక పొద్దునే్న సుఖ్‌దేవ్ వెళ్లి తలుపు తట్టాడు.
అతడి మొగం చూడగానే దుర్గాదేవికి విషయం అర్థమైంది.
‘మీరు వెంటనే లాహోర్ విడిచి వెళ్లగలరా?’
‘ఎందుకు? ఎక్కడికి? ఏమి చేయడానికి?’
‘సాండర్స్‌ని చంపిన వాళ్లలో ఒకరిని అతడి భార్యలా నటించి బయటికి తీసుకెళ్లాలి. మీ బిడ్డ కూడా మీ వెంట ఉండాలి. ఆలోచించండి. ఇందులో రిస్కు ఉంది. కాల్పులూ జరగొచ్చు’ అన్నాడు సుఖ్‌దేవ్.
పసిబిడ్డను తీసుకుని ప్రమాదభరితమైన ప్రయాణం అనేసరికి తల్లి మనసు ఒక క్షణం ఝల్లుమంది. మళ్లీ తెప్పరిల్లింది. తమ క్షేమంకన్నా దేశం ముఖ్యం. ఆదర్శం ప్రధానం.
‘సరే! ఇంతకీ ఎవరతను?’ అని అడిగింది దుర్గ్భాభీ. హత్యకు నిర్ణయం అయిన తొలి సమావేశంలో ఆమె కూడా ఉంది. ఫలానా ఫలానా వాళ్లు ‘యాక్షన్’లో ఉండొచ్చని తెలుసు. కాని, నిన్నటి రోజు ఏమయిందో, సాండర్స్‌ని చంపిందెవరో ఆమె ఎరుగదు.
‘ఎవరైనా కావచ్చు’ అన్నాడు సుఖ్‌దేవ్ ఆమె ముఖకవళికలు గమనిస్తూ.
‘సరే, వెళతాను’ అంది దుర్గాదేవి.
‘ఈ రాత్రికి అతను ఇక్కడే ఉంటాడు’
ఆమె ‘సరే’ అన్నాక సుఖ్‌దేవ్ మెల్లిగా అడిగాడు.
‘ఏర్పాట్లు చేయాలి. మీ దగ్గర డబ్బేమైనా ఉందా?’
కోల్‌కతా వెళ్లే ముందు అత్యవసర ఖర్చుల కోసం ఆమె భర్త 500 రూపాయలు ఇచ్చి వెళ్లాడు. అది మొత్తం తెచ్చి సుఖ్‌దేవ్ చేతిలో పెట్టింది.
కాసేపటికి ఓవర్‌కోటు, హ్యాటులో ఉన్న పొడవాటి యువకుడిని, అతడి సేవకుడిని వెంటపెట్టుకుని సుఖ్‌దేవ్ మళ్లీ దుర్గాదేవి ఇంటికి వెళ్లాడు. ఎవరో ‘జంటిల్మన్’ అనుకుని ఆమె ఆగంతకుడిని పట్టించుకోలేదు. ‘ఇతణ్ని గుర్తుపట్టారా?’ అన్నాడు సుఖ్‌దేవ్. అప్పుడు కొత్త మనిషిని పరకాయించి చూసి, ‘భగత్!’ అంటూ ఆశ్చర్యపోయింది భాభీ. అందరూ నవ్వుకున్నారు.
పనివాడి వేషంలో ఉన్నది రాజ్‌గురు.
ఏర్పాట్లు చకచకా అయ్యాయి. ఆ కాలంలో ఘరానా కుటుంబీకులు ప్రయాణం చేసేటప్పుడు చాలా సామాన్లు వెంట తీసుకెళ్లటం రివాజు. వాళ్ల వెంట పనివాడూ ఉంటాడు. పెద్ద ఆఫీసర్లయితే ప్రతి పెట్టె మీదా తమ పేరు, వెళ్లే ఊరు, సామాను నెంబరు రాసిన లేబిలు కూడా అంటిస్తారు. ఆ ప్రకారమే మర్నాటి ప్రయాణానికి పెట్టెలు, బెడ్డింగులు అన్నీ సిద్ధమయ్యాయి. ‘మిస్టర్ రంజిత్, కోల్‌కతా’ పేర లేబిళ్లు కూడా అన్నిటిమీదా అంటించారు. ‘పనివాడు’ కాబట్టి రాజ్‌గురు ఆ రాత్రి బయటే నేల మీద పడుకున్నాడు.
మర్నాడు ఉదయమే 5.30కి బయలుదేరే కోల్‌కతా మెయిల్ ఎక్కాలి.
తెల్లవారుఝామునే లేచారు. భగత్ వేసుకుని వచ్చిన కోటు నలిగిపోయింది. ఇంట్లో తన భర్త వాడే ఓవర్ కోటును, అతిథులెవరో వదిలివెళ్లిన మంచి హ్యాటును తీసి దుర్గాదేవి ఇచ్చింది. వాటిలో భగత్‌సింగ్‌ను చూసిన వారెవరైనా హైక్లాసు గవర్నమెంటు ఆఫీసరనే అనుకుంటారు.
‘పనివాడు’ సామాన్లు జాగ్రత్తగా టాంగాలో పెట్టాడు. ఖరీదైన చీర ధరించి, ఫ్యాషనబుల్‌గా మేకప్ చేసుకుని, హైహీల్స్ చెప్పులు వేసుకుని మూడేళ్ల ముద్దుల కొడుకు సచిన్‌ను చంకనెత్తుకుని దుర్గాజీ ‘మిస్టర్ రంజిత్’ వెంట బయలుదేరింది.
వాళ్లు వెళ్లేసరికి లాహోర్ రైలుస్టేషనులో ఎక్కడ చూసినా పోలీసులు. వచ్చేపోయే వారిని తీక్షణంగా వెయ్యి కళ్లతో గమనిస్తున్నారు. కాని గుర్రంబండి దిగి... పనివాడు సామాన్లు కూలీలతో మోయిస్తూ ముందు నడవగా... ‘మేడమ్’ను వెంటనిడుకుని... ఒక చేయి (రివాల్వరున్న) జేబులో పెట్టుకుని, ఇంకో చేత బిడ్డను ఎత్తుకుని... అధికార దర్పంతో ఠీవిగా నడచి వెళుతున్న ‘జంటిల్మన్’ను ఎవరూ అనుమానించలేదు. అడుగడుగునా ఉన్న పోలీసులు పక్కకు ఒదిగి వినయంగా వారికి దారి ఇచ్చారు కూడా.
అప్పటికే రైలు ప్లాట్‌ఫారం మీద నిలిచి ఉంది. ‘పనివాడు’ వెళ్లి కోల్‌కతాకు ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లు రెండు, ఒక థర్డ్ క్లాసు టిక్కెటు కొనుక్కొచ్చాడు. సామాన్లన్నీ జాగ్రత్తగా ఫస్ట్‌క్లాస్ కంపార్టుమెంటులోకి ఎక్కించాడు. ‘సాహెబ్’, ‘మేడమ్’ సుఖంగా కూచున్నాక రైలు కదిలే ముందు తన కంపార్ట్‌మెంటులోకి వెళ్లాడు.
ఎవరి పాత్ర వారు బాగా రక్తి కట్టించారు. కాలేజీ రోజుల్లో నాటకాల అనుభవం భగత్‌సింగ్‌కి బాగా పనికొచ్చింది. పైకి బింకంగా ఉన్నా ముగ్గురికీ లోలోన గుండె బితుకుబితుకుమంటూనే ఉంది - నాటకం ఎప్పుడు బయటపడుతుందో, పోలీసులు ఏ క్షణాన చుట్టుముడతారో అని!
అదృష్టవశాత్తూ అంతా సవ్యంగానే జరిగింది. నిమిషాలు గంటల్లా గడిచాక రైలు కూతవేసింది. గార్డు పచ్చజండా ఊపాడు. ఎట్టకేలకు బండి కదిలింది.
సాహెబ్, ‘మేడమ్’ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
*
-------------------
సైమన్ గో బ్యాక్
భగత్‌సింగ్ గురించిన వాస్తవ సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. ‘సైమన్ గో బ్యాక్’ శీర్షికలో - గాంధీ మహాత్ముడు చేసిన నిర్వాకాన్ని చక్కగా ఎండగట్టారు. సహాయ నిరాకరణోద్యమాన్ని చౌరీచౌరాలో హింస వంకతో గాంధీ చేతులారా చంపేసిన తరువాత దేశం కల్లోలితమైంది. మత హింస పేట్రేగింది. అల్లర్లలో వేల ప్రాణాలు పోయాయి. సైమన్ కమిషన్ దేశంలో నడయాడినంత కాలమూ ఎక్కడికి వెళ్లినా, ఎటుచూసినా ప్రచండ ప్రజా వ్యతిరేకతను చవి చూసింది. ఆనాటి సంఘటనలు చదువుతూంటే ఇన్నిన్ని త్యాగాలు చేసి సముపార్జించుకొన్న స్వాతంత్య్రానికి నేడు ఈ గతి పట్టిందే అన్న బాధ కలిగింది.
-సిహెచ్.ముకుంద (విజయవాడ)
మిస్టర్ అండ్ మిసెస్ రంజిత్
ReplyDelete