సాండర్స్ వధ
దేశ ప్రజలు ప్రేమించే అంత పెద్దాయన ఒంటిమీద చేయి వేసేంత దుర్మార్గానికి ఆ నీచులు తెగబడ్డారని తలచుకుంటేనే నాకు కంపరమెత్తుతోంది. దేశంలో మగటిమిగల యువకులు లేరా? ఈ సిగ్గు, అవమానం వారిని దహించటం లేదా?
లాలా లాజపత్‌రాయ్‌పై తెల్ల పోలీసుల పాశవిక దౌర్జన్యానికి తల్లడిల్లి, ‘దేశబంధు’ చిత్తరంజన్‌దాస్ సతి వాసంతీదేవి వెలిబుచ్చిన ఆగ్రహమిది. రెండువేల కిలోమీటర్ల దూరంలోని ఆమెకే అంతగా కంపరమెత్తిందంటే -లాలాజీ పక్కనే ఉండి మహా నాయకుడిపై తెల్లవాళ్ల కిరాతకాన్ని కళ్ళారా చూసిన భగత్‌సింగ్‌కి కసి, కోపం ఎంతలా కట్టలు తెంచుకున్నాయో చెప్పాలా?
తీవ్రంగా గాయపడి కూడా, ఎలాగో ఓపిక తెచ్చుకుని అదే రోజు సాయంత్రం నిరసన సభలో లాలాజీ అతికష్టంగా మాట్లాడాడు. ‘ఈ మధ్యాహ్నం నా ఒంటి మీద పడ్డ ఒక్కో దెబ్బ బ్రిటిషు సామ్రాజ్య శవపేటికపై దిగిన ఒక్కొక్క మేకు. తెల్లవాళ్లు ఇలాగే పేట్రేగితే మన కుర్రవాళ్లు ఎవరు ఆపినా ఆగరు. చేయదలచుకుంది చేసి తీరతారు’ అని పంజాబ్ కేసరి హెచ్చరించాడు.
ఏదో ఒకటి చేసి తీరాలనే భగత్‌సింగ్ కూడా అనుకుంటున్నాడు. తన 12వ ఏట జలియన్‌వాలా బాగ్ నుంచి నెత్తుటి మట్టిని సీసాలో తెచ్చుకున్నది మొదలుకుని అతడి మనసులో ప్రతీకార కాంక్ష రగులుతున్నది. తన కళ్ల ముందే ఈనాడు జరిగిన ఘాతుకంతో అది సలసల మరిగింది.
సాయంత్రం బహిరంగసభ కాగానే భగత్ అటు నుంచి అటే మొజాంగ్ రోడ్‌లోని రహస్య స్థావరానికి వెళ్లాడు. రహస్య విప్లవ కార్యక్రమాల కోసం ఊరి చివర స్మశానం దగ్గర జన సంచారం ఉండని చోట ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. భగత్ వెళ్లేసరికే శివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లు ఆనాటి దారుణం గురించి మాట్లాడుకుంటున్నారు.
‘పెద్దాయన ఇంకా ఎక్కువ రోజులు బతకడు. జనమంతా గౌరవించే అంత పెద్దాయనను చితకబాది మొత్తం భారత జాతిని అవమానించారు. వాళ్లను వదలటానికి వీల్లేదు. శిక్షించి తీరాలి’ అన్నాడు భగత్ ఆవేశంగా.
‘ఔను. మనం చేసేది అందరూ నిర్ఘాంతపోయేట్టు ఉండాలి. యతీంద్రనాథ్ లాగా పోలీసులతో తలపడదామా?’ అని అడిగాడు రాజ్‌గురు.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బెంగాలీ విప్లవకారుడు యతీంద్రనాథ్ ముఖర్జీ నలుగురు సహచరులతో కలిసి ఒరిస్సాలోని బాలసోర్ వద్ద వెంటపడ్డ పోలీసులతో 75 నిమిషాలపాటు హోరాహోరీ కాల్పులు జరిపాడు. ఆ వీరగాథ అప్పట్లో యావద్దేశాన్ని ఊపేసింది.
‘అలా చేస్తే పెద్ద సంచలనం వస్తుంది. మనం చస్తాం. కాని స్కాట్‌గాడు బతికే ఉంటాడు కదా? మనకు కావలసింది రక్తానికి రక్తం. ప్రాణానికి ప్రాణం’ అన్నాడు భగత్.
ఏమైనా అది ముగ్గురు మాత్రం మాట్లాడుకుంటే సరిపోదు. మిగతా వాళ్లతోనూ చర్చించాలి. సెంట్రల్ కమిటీలో నిర్ణయించాలి. కాబట్టి వీలైనంత త్వరగా లాహోర్ రమ్మని హెచ్‌ఎస్‌ఆర్‌ఎ కమాండర్ ఇన్ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కీ, మిగతా కమిటీ మెంబర్లకీ కబురు చేశారు. వారి రాకకోసం ఎదురుచూడసాగారు.
పక్షం రోజులు గడిచాయి. ఆస్పత్రి పాలైన లాజపత్‌రాయ్ లాఠీదెబ్బలవల్ల, తెల్లవాళ్లు కలిగించిన మానసిక గాయం మూలంగా 1928 నవంబర్ 17న కన్నుమూశాడు. యావద్భారతం శోకసంద్రంలో మునిగింది. అంతిమయాత్రలో లక్షన్నర మంది పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు లాలాజీ ఇంటి నుంచి బయలుదేరిన శవయాత్ర 4 మైళ్ల దూరంలో రావీనది తీరాన స్మశాన వాటికకు చేరేసరికి సాయంత్రమైంది. పంజాబ్ కేసరి చితాభస్మం చల్లారేలోపే ఆయన మరణానికి బాధ్యులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్ తహతహలాడాడు.
కాకోరీ కేసులో పోలీసులకు పట్టుబడకుండా అజ్ఞాతంగా తిరుగుతున్న చంద్రశేఖర్ ఆజాద్, ఇతర ముఖ్యులు లాహోర్‌కి చేరుకొనేసరికి డిసెంబర్ నెల వచ్చింది. 10వ తేదీ రాత్రి మొజాంగ్ రోడ్ ఇంట్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, జయ్‌గోపాల్, కిశోరీలాల్, దుర్గాదేవి, మహావీర్ సింగ్‌లు సమావేశమయ్యారు. దుర్గాదేవి అధ్యక్షత వహించింది. ఆమె హెచ్.ఎస్.ఆర్.ఎ. పార్టీ మేనిఫెస్టో రాసిన సిద్ధాంతకర్త భగవతీచరణ్ వోహ్రా భార్య. అంతేకాదు. వెరపెరగని విప్లవకారిణి. కాల్పుల కేసులో మూడేళ్లపాటు జైలుశిక్ష అనుభవించింది. ఆమె అంటే అందరికీ గౌరవం.
మొదట భగత్‌సింగ్ మాట్లాడాడు. నిరాయుధుడైన లాజపత్‌రాయ్‌పైన, ఆందోళనకారులపైన లాఠీచార్జి దురంతాన్ని కళ్లకు కట్టినట్టు వివరించాడు. లాలాజీ మరణానికి దేశంలోని యువత భగభగలాడుతున్నది. దేశమంతా మహా ఉద్రిక్తంగా ఉంది. కాంగ్రెసు వారిలో కూడా కదలిక వచ్చింది. ఈ నెల కలకత్తా సభల్లో వాళ్లేదో చేస్తామని చెబుతున్నారు. కాని మనం కాంగ్రెసు వాళ్లని నమ్ముకుని ప్రయోజనం లేదు. లాలాజీ మీద చెయ్యి చేసుకున్న స్కాట్ మీద, మిగతా తెల్లవాళ్ల మీద పగ తీర్చుకోవాలి. వాళ్లు చంపిన ఒక్కో భారతీయుడికిగాను పది మంది ఇంగ్లిషు వాళ్లను మనం చంపాలి. అప్పుడుగాని శత్రువుకు బుద్ధి రాదు. బెంగాల్‌లో మన వాళ్లు ఇంతకు ముందే చంపుడు పని మొదలుపెట్టారు. ఠారెత్తిపోయిన తెల్లవాళ్లు తమ భార్యాబిడ్డలను వాళ్ల దేశానికి పంపేస్తున్నారు. ఇదే అదను. మనం మన తడాఖా చూపించాలి. ఈ దేశంలోని యువకులు చేతులు ముడుచుకుని లేరని, అవసరమైనప్పుడు హింసకూ దిగి దెబ్బకు దెబ్బ తియ్యగలరని, అంగ్రేజీలకు అర్థమయేట్టు చెప్పాలి. మన ప్రతాపంతో దేశవాసులకు ఉత్తేజం ఇవ్వాలి. నిస్పృహను పోగొట్టి వారిలో పౌరుషాన్ని రగిలించాలి..
భగత్ చెప్పినదాన్ని ఆజాద్ బలపరిచాడు. పోలీసులతో హోరాహోరీగా పోరాడి, ప్రాణాలు అర్పించడం ద్వారా ప్రజలకు ప్రేరణ ఇచ్చి, విప్లవోద్యమానికి గొప్ప ఊపు తీసుకొద్దాం అని రాజ్‌గురు ఈ సమావేశంలోనూ ప్రతిపాదించాడు. ఆ సూచన ఎవరికీ నచ్చలేదు. చివరికి అందరూ ఒకే నిశ్చయానికి వచ్చారు.
లాలాజీని బలిగొన్న పోలీసు సూపర్నెంటు స్కాట్‌ని చంపాలి.
అది చాలా కష్టం. ఆ సంగతి అక్కడున్న వారందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఒక బ్రిటిషు అధికారి మీద, అందునా ఎప్పుడూ ఆయుధం దగ్గర ఉంచుకునే పోలీసు అధికారి మీద చేయి వేయటం ఆషామాషీ సాహసం కాదు. పైగా అతడున్నది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య పట్టణంలో. అతడి చేతిలో అపారమైన వనరులు, మందీమార్బలం భారీగా ఉంటాయి. ధైర్యం చేసి దాడి చేసినా తప్పించుకోవటం అసంభవం. ప్రాణంమీద ఆశలొదులుకునే అలాంటి సాహసానికి తెగించాలి.
అది ఎవరు అన్నదే ఇక తేలాలి.
ఎవరు ముందుకొస్తారో రండి - అంది దుర్గాదేవి. అంటూనే - ఆమె తన చెయ్యి ఎత్తింది.
ఇందులో ఆమెను ఇన్వాల్వ్ చేయటం ఎవరికీ ఇష్టంలేదు. ఆడది అన్న కారణంతోకాదు. దుర్గ్భాబీ సత్తా ఏమిటో తెలియకకాదు. ఆ సమయాన ఆమె భర్త ఊళ్లో లేడు. కాంగ్రెసు మహాసభలకు హాజరవడానికి కోల్‌కతా వెళ్లి ఉన్నాడు. భర్తలేని సమయంలో ప్రాణాంతకమైన బాధ్యతను ఆమెకు అప్పగించడం ఎవరికీ ఇష్టంలేదు.
దుర్గ్భాబీ వద్దు. మరి ఇంకెవరు? వెతుకులాడాల్సిన పనిలేదు. అక్కడ ఉన్న వాళ్లందరూ నేనంటే నేనంటూ ఉరకలేసేవాళ్లే. అందరికంటే ముందుగా భగత్‌సింగ్, సుఖదేవ్‌లు చెయ్యెత్తారు. ఆ ఇంగ్లిషువాణ్ని నా చేత్తో నేనే చంపేస్తానని సుఖదేవ్ ఉత్సాహపడ్డాడు. కాని అతడికి ఆ పని ఒప్పగించడానికి ఆజాద్ ఇష్టపడలేదు. నువ్వు పంజాబ్‌లో ఇలాంటి ఆపరేషన్లు ఇంతకు ముందూ చేయించావు కదా? ఆ అనుభవంతో దీన్నీ పైనుంచి సమన్వయం చేసి నడిపించు. వ్యూహరచన చేసి ఎవరి బాధ్యతలు వారికి ఒప్పగించు - అన్నాడు దళపతి. మిగతావారూ దాన్ని బలపరిచారు.
సుఖదేవ్ ఆలస్యం చేయలేదు. సంధానకర్త బాధ్యతను స్వీకరించగానే చకచకా ప్లాను వేశాడు. పని పూర్తి చేయటానికి నలుగురు సహచరులను ఎంచుకున్నాడు. ఎవరి డ్యూటీ వారికి వేశాడు.
‘స్కాట్‌ని వధించేది భగత్‌సింగ్’ అని సుఖదేవ్ ప్రకటించగానే నిశ్శబ్దం అలుముకొంది. స్కాట్‌ని కాల్చటమే బహు కష్టం. తరవాత తప్పించుకోవటం దాదాపు అసాధ్యం. చిచ్చరపిడుగు లాంటి భగత్‌కి ఆ పని అప్పజెప్పటమంటే పోలీసుల తూటాలకు అతడిని బలి ఇవ్వటమే. తమకు ఎంతో ప్రీతిపాత్రుడైన భగత్‌సింగ్‌ను చేజేతులా కోల్పోవటం ఎవరికీ ఇష్టం లేదు. భగత్ పాప్యులారిటీని చూసి ఓర్వలేకే సుఖదేవ్ అతడిని వదిలించుకోవటానికి ఈ ఎత్తు వేశాడా అన్న అనుమానమూ ఒకరిద్దరికి కలిగింది.
ఎవరేమనుకున్నా సుఖదేవ్ లక్ష్యపెట్టలేదు. గంభీరంగా పని విభజన చేశాడు.
కొత్తగా పార్టీలో చేరిన జయగోపాల్ స్కాట్ కదలికలను కనిపెట్టి భగత్‌కి సిగ్నల్ ఇవ్వాలి. తన ఆఫీసు నుంచి బయటికి రాగానే స్కాట్‌ని భగత్‌సింగ్ కాల్చాలి. ఆ సమయాన అతడికి రాజగురు కాపు కాయాలి. వారు అక్కడి నుంచి బయటపడే ఏర్పాటు ఆజాద్ చేయాలి.
వచ్చేవారం ఇదే రోజున (అంటే డిసెంబర్ 17) స్కాట్‌కి ‘స్పాట్’ పెట్టాలని నిర్ణయం అయింది.
ఆజాద్ లాహోర్‌కు రావడమే ఓ నల్ల సూట్‌కేసుతో వచ్చాడు. ఆ రాత్రి సమావేశంలో దాన్ని తెరిచాడు. అందులో రకరకాల పిస్తోళ్లున్నాయి. వాటిలో నుంచి వౌజర్ రివాల్వర్లు తీసి ఒకటి భగత్‌కి, ఒకటి రాజగురుకూ ఇచ్చాడు. దళం సభ్యులు మరునాటి నుంచే పనిలో పడ్డారు. పోలీసు ప్రధాన కార్యాలయం ఉన్నది సెంట్రల్ సెక్రటేరియటు ప్రాంగణంలో. దాని మెయిన్ గేటు నుంచి బయటికి రాగానే పోలీసు సూపర్నెంటు స్కాట్‌ని కాల్చాలి. భగత్, రాజ్‌గురులు అక్కడికి వెళ్లి, ఆనుపానులు గమనించారు. గేటు దాటి రోడ్డు మీదికి వస్తుండగా అతడిని వధించాల్సిన ‘స్పాట్’నూ భగత్‌సింగ్ సెలక్టు చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా భగత్‌కి ఉప్పందించటం ఎలా అన్నది రాజగురు ఆలోచించుకున్నాడు. జయగోపాల్‌ని వెంటబెట్టుకుని ఆజాద్ ఇంటి నుంచి ఆఫీసు దాకా స్కాట్ ప్రయాణించే దారిని ఒకటికి రెండుసార్లు చూసుకున్నాడు. ‘వాడి కారు నెంబరు 6728. బాగా గుర్తు పెట్టుకో’ అని జయగోపాల్‌కి చెప్పాడు. పోలీసు ఆఫీసు ఎదుటి రోడ్డులో ఫలానా చోట కాల్పులు కాగానే పక్కనే ఉన్న డి.ఎ.వి. కాంపౌండులోకి పరుగెత్తమని భగత్, రాజ్‌గురులకు చెప్పాడు. అక్కడి నుంచి పారిపోవటానికి వారి కోసం సైకిళ్లను ఎక్కడ సిద్ధంగా ఉంచాల్సిందీ చూసి పెట్టుకున్నాడు. హత్య కాగానే అది తామే చేశామని ప్రజలకు తెలియజేయటానికి భగత్‌సింగ్ ఎర్ర అక్షరాలతో SCOTT KILLED (స్కాట్‌ను చంపాం) అన్న శీర్షికతో పెద్ద పోస్టరును స్వహస్తాలతో రాశాడు.
తన చేతిరాతతో ఉన్న ఆ పోస్టరే మునుముందు లాహోర్ కుట్ర కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం అవుతుందని భగత్‌సింగ్ ఎరుగడు. ఆ పోస్టరుకు నాలుగు కాపీలు తీసిపెట్టిన కామ్రేడ్ హన్స్‌రాజ్ వోహ్రా అప్రూవరుగా మారి తనకు ఎదురుతిరుగుతాడనీ అతడు ఊహించలేదు.
ప్లాన్ పక్కాగా వేశారు. రెక్కీ బాగా చేశారు. రెండు రోజుల ముందు (డిసెంబర్ 15న) ‘డ్రై రన్’ రిహార్సలు వేసి టైమింగులు, సన్నాహాలు సరిచూసుకున్నారు. 17న అనుకున్న ముహూర్తానికి ‘ఆపరేషన్’కు సర్వం సిద్ధమైంది.
ఎటొచ్చీ ఒకటే లొసుగు. స్కాట్‌ను ఆఫీసు బయటికి రాగానే గుర్తు పట్టి భగత్‌కి సంకేతం ఇవ్వాల్సిన జయగోపాల్ అతడిని ఎప్పుడూ చూడలేదు. అతడి ముక్కూ మొగం ఇతడు ఎరుగడన్న సంగతి మిగతా వారికి తెలియదు. పనికి ఒప్పుకున్నాక ఆ మాత్రం తెలియకుండా ఉంటాడా అని వారు అనుకున్నారు. తెలియదని చెబితే సాహసకృత్యంలో పాల్గొనే చాన్సు ఎక్కడ పోతుందోనని జయగోపాల్ భయపడ్డాడు. ఎలాగూ కారు నెంబరు తెలుసు కదా, అందులో కూచునే ఆసామి మొగం ఎరుగనంత మాత్రాన మునిగిపోయేదేమిటని అతడు అనుకుని ఉండొచ్చు.
ఇంకో తిరకాసు. 17వ తేదీన సీనియర్ పోలీసు సూపర్నెంటు స్కాట్ తన ఆఫీసుకు రావటంలేదు. అతడి అత్తగారు ఆ రోజు ఇంగ్లండు నుంచి వస్తున్నది. ఆమెను రిసీవ్ చేసుకోవటానికి ఆ రోజు అతడు సెలవు పెట్టాడు. ఆ సంగతి అతడి కోసం కాచుకు కూచున్న వాళ్లకి తెలియదు.
1928 డిసెంబర్ 17.
చంపుడు జట్టు సభ్యులు ఎవరి స్థానాల్లో వారున్నారు.
సాయంత్రం 4.30 అయింది.
అసిస్టెంట్ సూపర్నెంట్ జాన్ సాండర్స్ ఆఫీసు గేటులోంచి మోటారుసైకిల్ మీద బయటికొచ్చాడు.
అతడే స్కాట్ అని జయగోపాల్ అనుకున్నాడు. అక్కడక్కడే తచ్చాడుతున్న భగత్, రాజ్‌గురులకు సిగ్నల్ ఇచ్చాడు.
భగత్‌సింగ్ సాండర్స్‌ని గుర్తుపట్టాడు. లాలాజీని అతడు స్కాట్‌తో కలిసి లాఠీతో పిచ్చెత్తినట్టు కొడుతూండగా తాను దగ్గరి నుంచి చూశాడు. ఇవాళ చంపాలనుకున్నది వీడిని కాదు. సూపర్నెంటు స్కాట్‌ని. రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కబోయిన భగత్ ఆగాడు. ‘వాడు కాదు. వద్దు’ అని అరిచాడు.
అంతలోనే రాజ్‌గురు సాండర్స్‌ని గురిపెట్టి కాల్చాడు. సాండర్స్ మోటారుసైకిల్ మీంచి నేలకు ఒరిగాడు. అతడి కాలు బైక్ చక్రంలో చిక్కుకుంది.్భగత్‌సింగ్ లెక్క తప్పిందని కంగారుపడలేదు. స్కాట్ కాకపోతేనేమి? ఇప్పుడు తమకు చిక్కినవాడూ అమాయకుడు కాదు. లాలాజీని కొట్టిన పాపంలో వీడికీ భాగం ఉంది. వీడూ చంపదగినవాడే. సంహారం మొదలెట్టాక పూర్తి చెయ్యాల్సిందే.
అప్పటికే అచేతనంగా పడి ఉన్న సాండర్స్‌ని భగత్ కూడా నాలుగైదుసార్లు పిస్టల్‌తో కాల్చాడు.
ముందు అనుకున్న ప్రకారం అక్కడే ఉన్న ఆజాద్ ఇద్దరు సహచరులతో కలిసి రోడ్డుకు ఆ వైపు ఉన్న డి.ఎ.వి. కాంపౌండ్ వైపు పరుగుతీశాడు. కాల్పుల శబ్దం వినబడి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ మిస్టర్ ఫెర్న్ పోలీసుస్టేషనులోంచి పరుగెత్తుకు వచ్చి సాండర్స్ పడి ఉన్న చోటికి రాబోయాడు. ఆజాద్ అతడి తలమీదుగా గురిపెట్టి రెండుసార్లు కాల్చేసరికి అతడు భయపడి అటు నుంచి అటే వెనక్కిపోయాడు.
అంతలో తూటాల చప్పుళ్లు విని హెడ్‌కానిస్టేబుల్ చనన్‌సింగ్ ఠాణాలోంచి పరుగున వచ్చాడు. సాండర్స్ దగ్గరికి వెళ్లి చూడగానే ప్రాణం పోయినట్టు గ్రహించాడు. వెంటనే పారిపోతున్న వారి వెంటపడ్డాడు. ‘ఆగు. ముందుకు రాకు. భారతీయుణ్ని చంపటం నాకు ఇష్టం లేదు’ అని అరిచాడు ఆజాద్. పోలీసువాడు ఆగలేదు. ఇక విధిలేక రాజ్‌గురు అతడిని కాల్చి చంపాడు.
అనుకున్న ప్రకారం ముగ్గురూ డి.ఎ.వి. కాంపౌండులోకి దూసుకెళ్లారు. కాలేజిలోంచి గోడదూకి హాస్టల్ వైపు వెళ్లారు. చుట్టూ చూశారు. ఎవరూ వారిని గమనించడం లేదు. భగత్‌సింగ్ కోటు, టోపి మార్చేశాడు. మరుగుదొడ్లకు పక్కన ముందే సిద్ధంగా ఉంచిన సైకిళ్లు ఎక్కి ఇంకోవైపు నుంచి రోడ్డు మీదికి వెళ్లారు. తాపీగా సైకిలు తొక్కుకుంటూ మొజాంగ్ రోడ్డు దారి పట్టారు.
వారిని చూసిన వారెవరైనా రోజంతా కష్టపడి ఇంటికెళుతున్న కాలేజి విద్యార్థులనే అనుకుంటారు.
*
** లాహోర్‌లో అప్పటి పోలీస్ సూపర్నెంట్ ఆఫీసు. దీని ముందే సాండర్స్‌ని కాల్చారు. **
================
ప్రజల్లోకి విప్లవం
జనం మధ్య మసలుతూ, జనాన్ని చైతన్యపరుస్తూ పోలీసుల కట్టెదుటే బహురూపాల్లో పనిచేస్తూనే సర్వశక్తివంతమైన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, బానిసత్వ శృంఖలాలను తెంచి పరపీడనకు తావులేని సమాజాన్ని స్థాపించాలన్న ఆలోచన నిజంగా గొప్పది. నౌజవాన్ భారత్ సభ గురించి చెబుతూ రాసిన ఈ మాటలు అక్షర సత్యాలు. అలాగే కాకోరీ కేసులో ఉరికంబమెక్కిన యోధుల సంస్మరణ దినాలనూ భగత్‌సింగ్ కలకాలం గుర్తుండేలా జరిపించటం.. ఇత్యాది సంఘటనలు రేపటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)
సాండర్స్ వధ
ReplyDelete