Breaking News

ఎవరీ బావమరిది?


భగత్‌కి దుర్గ్భాభీ ముందు నుంచీ తెలుసు.
పార్టీకి సిద్ధాంతకర్త, తనకు మంచి మిత్రుడు అయిన భగవతీ చరణ్ వోరా భార్యగానే అతడికి ఆమె ఎరుక. విప్లవ కార్యక్రమాల్లో ఆమె కూడా చురుకుగా పాల్గొనేది. లాహోర్‌లో నౌజవాన్ భారత్ సభ ప్రారంభ సభలో కర్తార్‌సింగ్ చిత్రపటాన్ని ఆవిష్కరించి, తన రక్తంతో తిలకం దిద్దింది దుర్గాదేవే. లాజపత్‌రాయ్‌పై పోలీసు దాడికి ప్రతీకారంగా స్కాట్‌ని చంపాలని నిర్ణయం జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిందీ, ఆ ‘యాక్షను’లో పాల్గొనేందుకు మొట్టమొదట చెయ్యి ఎత్తింది కూడా ఆవిడే. దుర్గాదేవి చొరవ, నిబద్ధత, అందరినీ ఆమె ప్రేమగా చూసే తీరు అంటే భగత్‌కి గౌరవం. అయనా ఆమెతో ఎప్పుడూ తీరుబడిగా కబుర్లాడలేదు. ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు.
తెలుసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరం... రెండు రోజులు పైగా ప్రయాణం. ఉన్నది ఇద్దరు. కలిసి వెళ్లేటప్పుడు కబుర్లు తప్పవు. రైలు కదిలాక కాసేపటిదాకా జరిగిన ఘటనలను నెమరువేసుకుంటూ తీవ్రాలోచనలో పడ్డా భగత్‌సింగ్ నెమ్మదిగా తెప్పరిల్లాడు. సంభాషణ మొదలయ్యాక ఆగలేదు. తన కుటుంబ నేపథ్యం, నేషనల్ కాలేజిలో చదివిన రోజులు, ప్రిన్సిపాల్ ఛబీల్‌దాస్ విద్యార్థులకు దేశభక్తిని నూరిపోసిన తీరు, కాలేజిలో ఉండగా యశ్‌పాల్, శచీంద్ర సన్యాల్ వంటి వారి సంపర్కం, తాను విప్లవ మార్గం పట్టిన వైనం పూసగుచ్చినట్టు దుర్గ్భాభీకి వివరించాడు.
‘సరే కాని, నీకూ సుఖ్‌దేవ్‌కీ జత ఎలా కలిసింది?’ అని అడిగింది దుర్గాదేవి.
‘నేషనల్ కాలేజిలోనే కలిశాం. పరిచయం అయిన రోజు నుంచే ఒకరికొకరం అతుక్కుపోయాం. దేశ రాజకీయ పరిస్థితుల గురించి, అంతర్జాతీయ విప్లవోద్యమాల గురించి ఎప్పుడూ చర్చిస్తూండేవాళ్లం. ద్వారకాదాస్ లైబ్రరీ పుస్తకాలు తెగ చదివేవాళ్లం. సంగీతంఅన్నా, ఆర్ట్ అన్నా ఇద్దరికీ ఇష్టం కూడా.’
‘కానీ మీ స్వభావాలు పరస్పర విరుద్ధం కదా?’ అంది దుర్గ్భాభీ.
‘నిజమే. నాకు ఎమోషను ఎక్కువ. విప్లవవాదికీ హృదయం ఉండాలి. మానవత్వపు ఫీలింగ్స్ ఉండాలి. అవి లేకపోతే విప్లవకారుడికీ, టెర్రరిస్టుకూ తేడా ఉండదు. సున్నితమైన స్వభావం ఉన్నప్పుడే అర్థంలేని హింసకు పాల్పడకుండా రాడికల్స్ నిగ్రహించుకోగలరు అంటాను నేను. సుఖ్‌దేవేమో అది తప్పు... అలా ఫీలింగ్సు పెట్టుకుంటే విప్లవకారుడు మెత్తపడిపోయి సెంటిమెంటల్‌గా మారుతాడు అంటాడు. మనిషికి దయాగుణం ఉండాలని నేనంటాను. దానివల్ల శత్రు నిర్మూలన కష్టమవుతుందని అతను వాదులాడతాడు. రానురాను ఈ తేడాలు మరీ బయటపడుతున్నాయి తెలుసా?’ అన్నాడు భగత్.
అది నిజమే. ఒకసారి రంగంలోకి దిగాక సుఖ్‌దేవ్ ఆగడు. ఎంతటి హింసకూ వెనకాడడు. భగతేమో తప్పనిసరై హింసకు పాల్పడాల్సి వచ్చినా లోలోన తెగ బాధపడతాడు. అతణ్ని దగ్గరి నుంచి చూసిన వాళ్లందరూ ఆ మాట చెబుతారు.
ఉదాహరణకు భగవాన్‌సింగ్ మహోరే. పార్టీ పిలిస్తే అతడు గ్వాలియర్ నుంచి లాహోర్ వెళ్లాడు. అతడు, రాజ్‌గురు, బి.కె.సిన్హా కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. సాండర్స్ వధ తరవాత కోల్‌కతా వెళ్లే ముందు సిన్హాను కలవడం కోసం వాళ్లున్న చోటికి భగత్‌సింగ్ వెళ్లాడు.

‘ఆ రోజు నేను చూసిన భగత్‌సింగ్ మొహం నా మనసులో ముద్రపడిపోయింది. అదేమిటో నేను చెప్పలేను - కాని, ఒకలాంటి ఉద్వేగం అతడి విశాలమైన నుదురు మీద కనపడింది. ఇద్దరు మనుషులను చంపడంలో అతడి ప్రమేయం ఉంది. అది మరిచిపోలేకేమో - బాగా డిస్టర్బ్ అయ్యాడు. లాలాజీ మరణానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ప్రతిపాదన తాను చేసిందే అయినా, తన చేతులతో తాను ఒక మనిషి ప్రాణం తీయవలసి రావడాన్ని అతను తట్టుకోలేక పోయాడు.
The spectacle of that workshipper of humanity, which I saw on that day, makes my head bow before him most reverentically and I felt that I should lift the dust from under his feet and smear my forehead with it.
(మానవత్వం పట్ల అతడికున్న ఆరాధనను ఆ రోజు చూస్తే అతడి ముందు భక్తిపూర్వకంగా శిరసు వంచాలనిపించింది. అతడి కాళ్ల కింద మట్టి తీసి నా నుదుట అద్దుకోవాలనిపించింది) అంటాడు భగవాన్‌సింగ్.
[Quoted in Bhagat Singh,
The Eternal Rebel, waraich, PP.83-84]
భగత్‌సింగ్ హింసావాథి, టెఠ్రరిస్టు అని తెలిసీ తెలియకుండా తీర్పులు చెప్పేవాళ్లు అతడిలోని ఈ సున్నిత పార్శ్వం ఎరుగరు.
సుదీర్ఘ రైలు ప్రయాణంలో భగత్‌సింగ్ ఏమీ దాచుకోకుండా తన మనసు లోపలి పొరలను దుర్గాదేవి ముందు ఆవిష్కరించాడు. తన అనుభవాలను, అనుభూతులను, అనుమానాలను, ఆదర్శాలను అతడు ఏకరవు పెడుతూంటే ఆమె శ్రద్ధగా వింది. అంతకు ముందు లేని ఒక ఆత్మీయత, సాన్నిహిత్యం ఇద్దరి మధ్య నెలకొన్నాయి.
వాళ్లను ఎవరూ అనుమానించలేదు. పోలీసులు వెంటపడిన దాఖలాలూ లేవు. కాని ఎందుకైనా మంచిది ప్రయాణం మధ్యలో బ్రేక్ చేద్దాం; కాన్పూర్‌లో దిగేసి మరునాటి రైలులో కోల్‌కతా వెళదాం అని దుర్గ్భాభీ సూచించిందట. ఆ ప్రకారమే వారిద్దరూ కాన్పూర్ హోటల్లో ఆ రాత్రి బస చేశారట. రాజ్‌గురు వారితో ఉండకుండా కాన్పూర్ నుంచే ఎటో వెళ్లిపోయాడట. ఇది Life & Trial of Bhagat Singh
ఫుస్తకంలో కుల్‌దీప్ నయ్యర్ చెప్పిన సంగతి. దానే్న ప్రమాణంగా తీసుకుని ఇతర గ్రంథకర్తలూ అదే మాట రాశారు. దాంతో దుర్గాదేవితో భగత్‌సింగ్ ఒక రాత్రి హోటల్ గదిలో గడిపాడని చాలామంది అనుకుంటారు. అనంతర కాలంలో ఒక సందర్భాన సుఖ్‌దేవ్ స్ర్తి సంబంధమైన బలహీనతను భగత్‌సింగ్‌కి ఆపాదించాడని ఇంకొందరు కనిపెట్టిన దానితో దీన్ని కలిపి చూస్తే అక్రమ సంబంధం లాంటిదేదో నిజంగానే ఉండి ఉండొచ్చన్న అనుమానమూ తెలియని వారికి సహజంగానే కలుగుతుంది.
వాస్తవానికి భగత్, దుర్గాదేవి కాన్పూర్‌లో దిగనే లేదు. ఏ రాత్రీ, ఏ హోటల్ గదిలో, ఎక్కడా బస చేయనే లేదు. ముందు జాగ్రత్తగా వారు రైలు మారిన మాట నిజం. కాని అలా చేసింది కాన్పూర్‌లో కాదు లక్నోలో. అక్కడైనా వారు తరవాతి రైలు కోసం వేచి ఉన్నది కొద్ది గంటలు మాత్రమే. అది కూడా రైల్వేస్టేషను వెయిటింగు రూములో.
మరి మధ్యలో కాన్పూర్ ఎక్కడి నుంచి వచ్చింది? కుల్‌దీప్ నయ్యర్ అంతటివాడే ఎలా పొరబడ్డాడు? అది పోలీసులు అల్లిన కథ. భగత్, రాజ్‌గురు, దుర్గాదేవి కాన్పూర్ వరకే టిక్కెటు కొనుక్కుని వెళ్లారని, అప్రూవర్‌గా మారాక జయగోపాల్ చేత పోలీసులు చెప్పించారు. దాన్ని బలపరుస్తూ ఎవరిచేతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. These were false witnesses who were there just to corraborate Jai Gopal's version. None went to Cawnpore. (వీళ్లు జయగోపాల్ కథనాన్ని గట్టి చేయడానికి పెట్టిన తప్పుడు సాక్షులు. కాన్పూర్‌కి ఎవరూ వెళ్లలేదు) అని అనంతరం కేసు విచారణ దశలో సుఖ్‌దేవే తనకందిన కోర్టు పత్రాల కాపీపై ఒక మూల రాసుకున్నాడు.
[waraich, p.86]
భగత్, థుర్గలతోబాటు రాజ్‌గురు కూడా లక్నోలో దిగిపోయాడు. అక్కడి నుండి కాన్పూర్ మీదుగా కాశీ చేరుకుని మళ్లీ అటు నుంచి కొన్నాళ్లకు ఆగ్రా చేరుకున్నాడు.
ఇక చంద్రశేఖర్ ఆజాద్ సంగతి. అంతకు ముందే అతడి మీద పోలీసు నిఘా గట్టిగా ఉంది. కాకోరీ కేసులోనే అతడి కోసం వెయ్యి కళ్లతో గాలిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి లాహోర్ చేరుకోవడానికే ఆజాద్ చాలా అవస్థలు పడ్డాడు. సాండర్స్ హత్య తరవాత పోలీసు కాపలా మరీ తీవ్రమైంది. అడుగడుగునా మోహరించిన రక్షక భటులను దాటుకుని ఊరు వదలడం బహుకష్టం.
కాని సాహసానికి, సమయస్ఫూర్తికి ఆజాద్ పెట్టింది పేరు. లాహోర్‌లో తనకు పరిచయస్థులైన కొంతమందిని అర్జంటుగా కూడగట్టి, అప్పటికప్పుడు తీర్థయాత్రకు బయలుదేరతీశాడు. యాత్రకు బయలుదేరవలసిన రోజు ఉదయం ‘్భక్తబృందం’ ఆజాద్ కోసం ఒక గదిలో వేచి ఉండగా తలుపు తోసుకుని ఒక సాధువు వచ్చాడు. గుండ్రని ముఖం, మెరిసే కళ్లు, బోడితలకు కాషాయపు జామారు ముసుగు, నుదురు మీద దట్టంగా విభూతి రేఖలు, వాటి మీద పెద్ద కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాల, ఒక చేత కమండలం, రెండో చేతిలో యోగ దండం, చంకలో పెట్టె. అందులో దేవతామూర్తులు గాని, సాలగ్రామాలుగాని లేవు. నిగనిగ మెరిసే పిస్తోళ్లు, తూటాలు, మ్యాగజిన్ డబ్బాలు ఉన్నాయి.
నకిలీ దంపతులు చెక్కేసిన ఐదు రోజులకు (1928 డిసెంబర్ 25న) ఈ స్వామివారు శిష్యమండలి వెంట రాగా అదే లాహోర్ స్టేషనులో అడుగుపెట్టారు. భక్తి పారవశ్యంలో గొంతెత్తి రాధాకృష్ణుల భజన చేయిస్తూ భక్తబృందంతో కోలాహలంగా మధుర వెళ్లే రైలెక్కుతూంటే దారిపొడవునా, ప్లాట్‌ఫారం మీదా ఉన్న పోలీసులు గుడ్లప్పగించి చూశారు. ఒక ఇన్స్‌పెక్టర్ అయితే స్వామివారి పాదాలకు సాష్టాంగపడి ఒక కోరిక తీర్చమని కోరాడు. అదేమిటంటే - సాండర్స్‌ని చంపిన విప్లవకారుల కమాండర్ బల్‌రాజ్‌ను పెడరెక్కలు విరిచికట్టి అరెస్టు చేసి ప్రభుత్వం ప్రకటించిన పదిహేనువేల రూపాయల బహుమతిని తాను దక్కించుకునేట్టు చేయమని. పక్కన పళ్లెం పట్టుకుని నిలబడ్డ శిష్యుని వద్ద కాస్త విభూతి తీసుకుని అతడి చేతిలో వేసి ‘నిశ్చింతగా ఉండు. నీ కోరిక తప్పక తీరుతుంది’ అని ఆశీర్వదించాడు ఆజాద్! ఇన్స్‌పెక్టరు ఆనందంతో తబ్బిబ్బయి అక్కడి నుంచి వెళ్లాడు.
చంద్రశేఖర్ ఆజాద్, బాబు కృష్ణమూర్తి, పే.98-99

(అథి నిజం కాదు; బిజినెస్‌మన్‌లా వేషం వేసి సుఖ్‌దేవ్ తల్లితో కలిసి ఆజాద్ లాహోర్ వదిలిపోయాడని కొంతమంది శివవర్మను ఉటంకిస్తారు.)
లక్నోలో ఆగినప్పుడు దుర్గాదేవి అక్కడి నుంచే తన భర్తకు టెలిగ్రాం పంపింది. "COMING WITH BROTHER - DURGAWATI" అని. దాన్ని అందుకున్న భర్త తెల్లబోయాడు. తనతోబాటు కోల్‌కతా రమ్మని ఎంతగా అడిగినా ఒప్పుకోని ఇల్లాలు చెప్పాపెట్టకుండా ఇలా వచ్చేస్తున్నదేమిటి? పైగా తన భార్యకు, అన్నదమ్ములు ఎవరూ లేరు. హఠాత్తుగా ఈ బావమరిది ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఎన్నడూ లేనిది తన పేరు ‘దుర్గావతి’ అని రాసిందేమిటి?
ఆలోచిస్తే అందులో ఏదో అంతరార్థం ఉన్నదని భగవతీ చరణ్‌కి అనిపించింది. సాండర్స్‌ని కాల్చి చంపిన సంచలన వార్తను అప్పటికే అతడు పత్రికల్లో చదివి ఉన్నాడు. తన భార్య ఆకస్మిక ప్రయాణానికీ దానికీ సంబంధం ఉన్నదా? ప్రతీకార చర్యలో పాల్గొన్న విప్లవకారుడెవరినైనా ఆమె వెంటబెట్టుకుని వస్తున్నదా? అతడు ఎవరై ఉంటాడబ్బా - అని భగవతీ చరణ్ ఆలోచనలో పడ్డాడు.
హౌరా స్టేషనులో భార్య రైలు దిగాకగానీ అసలు సంగతి అంతుబట్టలేదు. మొదటి తరగతి పెట్టెలో నుంచి భార్యతోపాటు వచ్చిన పాశ్చాత్య దుస్తుల నవయువకుడెవరా అని పరకాయించి చూస్తే భగత్‌సింగ్ చిలిపిగా కనుసైగ చేశాడు. వోరా అతణ్ని గుర్తు పట్టాడు. తాను రమ్మని పిలిచినా కోల్‌కతా రాకుండా మొరాయించిన ఇల్లాలు ఇప్పుడు విప్లవవీరుడిని తప్పించడం కోసం ప్రాణాలకు తెగించి, పసిబిడ్డతో ఇంత దూరం వచ్చినందుకు భగవతీ చరణ్ గర్వపడ్డాడు. భార్య భుజం మీద ఆప్యాయంగా చేయివేసి ‘నీలో కొత్త దుర్గను ఇవాళ కనుగొన్నాను’ అన్నాడు.
చిత్రమేమిటంటే భగత్‌సింగ్, రాజ్‌గురు, ఆజాద్‌లు తమ కంట్లో కారంకొట్టి ఇంత నాటకీయంగా తప్పించుకు పోయిన సంగతే బ్రిటిషు సర్కారుకు చాలా నెలల తరవాతగానీ తెలియలేదు. ఒక రాష్ట్ర ముఖ్య పట్టణంలో అదీ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట ఒక యూరోపియన్ ఉన్నతాధికారిని పది పనె్నండు మంది (అందులో సగం మంది పోలీసులు) చూస్తుండగా కాల్చి చంపినా దోషులు ఎవరన్నది సర్కారుకు తెలియదు. భగత్‌సింగ్, ఆజాద్‌లు పోలీసు నిఘాలో ఉన్నా, అతడి ఛాయాచిత్రాలూ పోలీసుల దగ్గర ఉన్నా, సాండర్స్ హత్య కేసులో పోలీసుల అనుమానం వారి మీదికి పోలేదు. ఎంతమందిని ఎన్ని విధాల సతాయించి, ఎందరిని అరెస్టు చేసినా పిసరంత క్లూ రాబట్టలేక తెల్లమొగం వేశారు.
అదేమీ మామూలు హత్య కాదు. బ్రిటిషు మహాసామ్రాజ్యాన్ని గంగవెర్రులెత్తించిన కేసు. ‘లాహోర్‌లో ఏదో అఘాయిత్యం జరిగిందని వినపడుతున్నది. అది నిజమా? పుకారా?’ అని హత్య జరిగిన నాటి రాత్రే లండన్ నుంచి ఇండియా విదేశాంగ మంత్రి వైస్రాయ్‌ని వాకబు చేశాడు. అప్పటి నుంచీ నాలుగు నెలలపాటు హోం డిపార్టుమెంటు పంజాబ్ గవర్నమెంటును పదేపదే అదిలిస్తూనే ఉంది. అటునుంచి వచ్చిన రిపోర్టులను బట్టి వైస్రాయ్ లండన్ పెద్దలకు రిపోర్టు మీద రిపోర్టు పంపుతూనే ఉన్నాడు. సారాంశం ఒక్కటే: ప్రోగ్రెస్ ఏమీ లేదని!
*

సాండర్స్ వధ
కాకోరీ కేసు గురించి.. ఆనాటి సంఘటనలను కళ్ల ముందుంచుతూన్న ‘భగత్‌సింగ్’ సీరియల్ ఆలోచింపజేసేదిగా ఉంది. ‘ఈ మధ్యాహ్నం నా ఒంటి మీద పడ్డ ఒక్కో దెబ్బ బ్రిటీషు సామ్రాజ్య శవపేటికపై దిగిన ఒక్కొక్క మేకు. తెల్లవాళ్లు ఇలాగే పేట్రేగితే మన కుర్రవాళ్లు ఎవరు ఆపినా ఆగరు. చేయదలచుకుంది చేసి తీరతారు’ అన్న పంజాబ్ కేసరి హెచ్చరికను వొంటబట్టించుకున్న భగత్‌సింగ్ ఏదో ఒకటి చేసి తీరాలని అనుకున్నాడు. ఆ వివరాలను తెలియజేస్తూ ‘సాండర్స్’ని ఎలా చంపారో చరిత్ర సంగతులు చదువుతూంటే ఒడలు పులకించింది.
-డి.వి.తులసి (విజయవాడ)

1 comment: