Breaking News

స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి


వీరనారి ఝాన్సీరాణి స్ఫూర్తితో స్వాతంత్య్రోద్య మంలో 'మేము సైతం' అంటూ కదం తొక్కారు ఈ తెలుగు వీర వనితలు. స్త్రీలు అబలలు కాదు ధీరులని నిరూపించారు. త్యాగమయమైన వీరజీవితాలు నేటి మహిళల కెంతో స్ఫూర్తి నందిస్తాయి. చైతన్య దివిటీలైన ఈ మాతృమూర్తులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వరాజ్యాన్ని సాధించటంలో అవిరళ కృషి చేశారు.

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌
ఆయుధం పట్టకుండా మహనీయుడు మహాత్మాగాంధీ అశేష భారతావనిని జాగృతం చేశాడు...ఆ మహాత్ముని దివ్య ప్రేరణకు ప్రతి స్పందించిన మహనీయురాలు దుర్గా బాయ్‌ దేశ్‌ముఖ్‌!

1909 సం||లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన నిరుపమాన సేవాపరాయణురాలు దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌! తన 14వ ఏట కాకినాడలో జరిగిన కాంగ్రెస్‌ సభల్లో వాలంటీరుగా పనిచేస్తూ, పండిట్‌ నెహ్రూని సైతం గేటు దగ్గర ఆపి 'ప్రవేశ టికెట్‌ అడిగిన కర్తవ్య పరాయణురాలు దుర్గాబాయి! 1930వ సం||లో మద్రాసులో జరిగిన ఉప్పు సత్యా గ్రహంలో పాల్గొని జైలు శిక్షకు సైతం వెరవని తెలుగింటి ఆడపడుచు, స్వాతంత్య్ర సమర యాధురాలు, బ్రిటిష్‌ వారి దమననీతిని బహి రం గంగా వ్యతిరేకించారు దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌! ఆంధ్ర దేశంలో గాంధీజీ పర్యటనలో పాల్గొని ఆయన ఉపన్యా సాలను తెలుగులో అనువదించిన దిట్ట. స్వరాజ్య నిధికి తన చేతి బంగారు గాజులను, ఇతర స్త్రీల నుండి 25వేల రూపాయల విలు వైన బంగారాన్ని గాంధీజీకి సమర్పించి, ఆయన మన్ననలు పొందారు. 1953లో చింతామణి ద్వారకానాథ్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె చేసిన అక్షరాస్యత వ్యాప్తికి యునెస్కో పురస్కారం లభించింది. భారత ప్రభుత్వ 'పద్మవిభూషణ్‌' బిరుదునిచ్చి గౌరవించింది.

సరోజనీ నాయుడు
హైదరాబాదులో పుట్టి, మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషన్‌ ప్యాసయి, ఉర్దూ, హిందీ, పర్షియన్‌, బెంగాలీలలో మాట్లాడగలిగేవారు. 1905 స్వాతంత్య్రోద్యమంలో చేరి రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌, గోపాలకృష్ణ గోఖలే, అనీబిసెంట్‌, సి.పి. రామస్వామి అయ్యర్‌, మోహన్‌దాస్‌ గాంధీ, నెహ్రూలతో కలిసి పనిచేశారు. 1925లో కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నిక య్యారు. గాంధీజీతో కలిసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. జైలు శిక్షననుభవించారు. 1931లో రౌండ్‌ టేబిల్‌ కాన్ఫరెన్స్‌, క్విట్‌ ఇండి యా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరు వాత యునైట్‌ ప్రావిన్స్‌కి (ఇప్పటి ఉత్తరప్రదేశ్‌) మొదటి మహిళా గవ ర్నర్‌గా వ్యవహరించారు. ముత్యాల గోవిందరాజులు నాయుడు గార్ని కులాంతర వివాహం చేసుకున్నారు. 1949 మార్చి 2న మరణించారు.

మల్లు స్వరాజ్యం
1931వ సంవత్సరం నల్గొండ జిల్లా కొత్తగూడెంలో శ్రీభీమిరెడ్డి నరసింహారెడ్డి, శ్రీమతి చుక్కమ్మ దంపతులకు జన్మించారు. గుర్రమెక్కి, తుపాకీ చేతపట్టి అడవుల్లో వీరవిహారం చేశారు. కోయ స్త్రీలకు కూడా ఆయు ధాలు వాడడం, ప్రాణాలు కాపాడుకోవడం నేర్పించారు. అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి,అక్క శ్రీమతి శశిరేఖ, ఆమె భర్త కూడా ఉద్యమంలో చేరారు. తల్లి చుక్కమ్మ 'ఈ పిల్లలు నా పిల్లలు కాదు. భారత మాత బిడ్డలు. నా బిడ్డలను ఆమె కాపాడుకుంటుంది' అని ధైర్యంగా ఉండే వీరమాత.

నిజాం నిరంకుశ పాలనపై కత్తికట్టి, కొండజాతి, కోయజాతి, అడవి జాతి వారిని ప్రోగుచేసి వారిలో చైతన్యం కలుగజేసింది మల్లు స్వరాజ్యం.

మల్లు నరసింహారెడ్డి 1954లో స్వరాజ్యంగారి వివాహం జరిగింది. ఈమె సూర్యాపేటలో కొంత కాలం కమ్యూనిస్టు పార్టీ ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. సి.పి.యం. పార్టీ ప్రోత్సాహంతో తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను గడగడలా డించిన వీర వనిత. స్త్రీలకు, బలహీనులకు. దళితులకు అన్యాయం జరి గితే ఆమె సహించే వారుకాదు. మద్యపాన నిషేధం, స్త్రీ విద్య, స్త్రీ గౌర వం గురించి ఆమె కృషి చేశారు.

ఆరుట్ల కమలాదేవి
1920లో నల్గొండ జిల్లాలోని ఆలేరు మండలం మంతపురిలో ఎలా వెంకటరామిరెడ్డి, లక్ష్మీనరసమ్మలకు రుక్ష్మిణి జన్మించారు. నిజాం పాలకుల కళ్లు కప్పి, కానుక పాకలో వంశాట పేరుతో పాఠశాలను, గ్రంథాల యాన్ని నడిపి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన నారీమణి. ఆర్యసమాజ పద్ధతిలో పెళ్లయి రుక్ష్మిణి పేరుమార్చి 'కమలాదేవి'గా నామ కరణం చేశారు. మద్యపాన నిషేధానికి ఎంతగానో కృషి చేశారు. స్త్రీలకు ఆదర్శ ప్రాయమయ్యారు. రామచంద్రారెడ్డిని వివాహం చేసుకుంది. రాజ కీయ తరగతుల్లో పాల్గొని రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్నారు. ఆమె కుమారుని పేరు విప్లవ్‌ అని పెట్టుకుంది. వెట్టి చాకిరీ రద్దుకై భార్యా భర్తలు ఎంతగానో కృషి చేశారు. 'దున్నే వానిదే భూమి', పన్నులు కట్ట వద్దని పోరాడి 10 గ్రామాల జమిందారి భూములను పేదలకు పంచిపెట్టారు.

1947 ఆగస్టు 17, అర్థరాత్రి భారతదేశం వదిలి బ్రిటిష్‌ సైన్యం పారి పోయింది. తెలంగాణా సాయుధ పోరా టం 1947 సెప్టెంబర్‌ 11వ తేదీన పిలుపు నిచ్చారు. భర్తతో పాటు కమలా దేవి తుపాకీ కాల్చడంలో శిక్షణ పొంది దళంలో చేరారు. భార్యా భర్తలిద్దరూ జైలుశిక్షను అనుభవించారు. విడుదల అయిన తరువాత 1952లో ఆలేరు నుండి శాసనసభకు పోటీ చేశారు. 1966 రాష్ట్ర మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1998 జనవరి 3వ తేదీన కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. జనవరి 1, 2001న కన్నుమూశారు.

చాకలి ఐలమ్మ
1901వ సం||లో నల్లగొండ జిల్లా జనగామ తాలూకా కృష్ణాపురంలో జన్మించారు. చిట్యాల నరసింహంతో వివాహం జరిగింది. కులవృత్తి చేపట్టి బట్టలు ఉతికి, జీవితం గడిపేది. అక్షరం ముక్కరాని ఒక చాకలి మహిళ సాహసంతో దొరలను, రజాకార్లను ఎదిరించి, భయపెట్టి ముం దుకు సాగింది. ఆమె పోరాటం భూ పోరాటాలకు నాంది అయ్యింది. పల్లె పల్లెలా వ్యాపించింది. క్రమంగా హైద రాబాదు సంస్థానం అంతా వ్యాపించింది. 1985 సెప్టెంబర్‌ 10న పాలకుర్తిలో ఆమె కన్ను మూశారు.

మద్దూరి వెంకట రమణమ్మ
1906లో జన్మిం చారు. భర్తతో జీవితాన్ని కాదు, దేశభక్తిలో కూడా పాలు పంచుకున్న మహో న్నత మహిళామూర్తి మద్దూరి వెంకట రమణమ్మ. 1934లో స్వా తంత్య్ర సమరంలో భాగంగా విదేశీ వస్త్ర దుకాణాల ముందు పికెటింగ్‌ నిర్వహించి వెల్లూరు, కన్ననూరు జైళ్లలో ఆరునెలలపాటు శిక్షను అనుభవించిన ధీరురాలు మద్దూరి వెంకట రమణమ్మ. రాత్రి సమ యాల్లో రహస్య సమావేశాలు నిర్వ హిస్తూ సాటి మహిళల్లో దేశభక్తిని ప్రేరేపించిన ప్రాత:స్మర ణీయురాలు.

శివరాజు సుబ్బమ్మ
1873లో జన్మించారు. భర్త లక్ష్మీనారాయణ. సంప్ర దాయ కుటుం బాల్లోని మహిళలకు ఆధ్యాత్మిక అంశాలతోపాటు, స్వాతంత్య్ర ఉద్యమాల గురించి తెలియజేస్తూ వారిని చైతన్య పరచిన ఆదర్శ మహిళ శివరాజు సుబ్బమ్మగారు. స్వాతంత్య్ర సమరాగ్నిని కణం నుంచి కణానికి విస్తరింప చేయడంలో కృతకృత్యురాలైంది. క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్న శిరాజు సుబ్బమ్మ గారు...సదా స్మరణీయురాలు! ఈమె శాసనోల్లంఘనోద్య మంలో పాల్గొని ఆరునెలలు నెల్లూరులో జైలు శిక్షను అనుభవించారు. జైల్లోని మహిళా ఖైదీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఆత్మ విశ్వాసం పెంచారు. ఆమె పెద్ద కుమారుడు వెంకట రామారావు కూడా స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొన్నారు. ఆమె నిత్య ఖద్దరు దారి. బ్రిటిష్‌ వారిని ఘాటు గా విమర్శించారు. ఆమె 1948లో మరణించారు. బారు అలిమేలమ్మ

1897లో పత్రి వెంకుబాయమ్మ, పత్రి కృష్ణారావుగార్లకు జన్మిం చారు. అఖిల భారత కాంగ్రెసు కార్యాలయ కార్యదర్శి రాజారావు భార్య. బారు అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరా స్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు. అలహాబాద్‌లో కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన జాతీయ నాయకురాలు బారు అలిమేలమ్మ.

పాలకోడేటి శ్యామలాంబ
1902వ సం||లో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మిం చారు. స్వాతంత్య్ర సమరయోధులు సూర్యప్రకాశరావుగారి భార్య. పాలకోడేటి శ్యామలాంబగారు రాజమండ్రిలో యువతను స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వ హించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించిన తెలుగు దివ్యె పాల కోడేటి శ్యామలాంబ. 1946-53 రాజమండ్రి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యు రాలు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని పికెడింగ్‌ నిర్వహించారు. 1932 శాసనోల్లంఘనంలోనూ, 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలోనూ పాల్గొని కఠిన కారాగార శిక్షననుభవించారు. 1953లో మరణించారు. గూడూరు నాగరత్నం

1913 జులై 6న పశ్చిమ గోదావరి జిల్లా యర్నగూడెంలో జన్మించారు. గాంధీజీ నాయకత్వంలో భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. గూడూరి నాగరత్నంగారు వర్ణ వివక్షను రూపుమాపే పంథాలో బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ రంగయ్యను వర్ణాంతర వివాహం చేసుకొని- 'మాటలు కాదు చేతలుండాలి' అని నిరూపించిన నిరుపమాన స్వాతంత్య్ర సమరయోధు రాలు! 1926-32లలో శాసనోల్లంఘన ఉద్య మంలో పాల్గొని చాగల్లు పరిసరాలలో హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి ఖద్దరు ప్రచారం, స్వదేశీ ప్రచారం నిర్వహించిన చేవగల వీరవనిత గూడూరి నాగరత్నమ్మ.

పద్మజానాయుడు
1900వ సం||లలో నవంబర్‌ 17న హైదరాబాదులో జన్మించారు. సరోజనీనాయుడుగారి కుమార్తె పద్మజా నాయుడు. 21 సంవత్సరాల వయస్సు లోనే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు జాయింట్‌ ఫౌండర్‌ అయ్యారు. ఖాదీ వస్త్రాలను వాడమని, విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించమని ఆమె బోధించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లి, శిక్షను అనుభవించారు. 1950-67లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. రెడ్‌క్రాస్‌లో చేరి జాతికి సేవ చేసిన మహిళగా పేరుపొందారు. అఖిలభారత చేనేత సంఘానికి మెంబర్‌గా న్యూఢిల్లిdలోని నెహ్రూ మెమోరియల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. 1975 మే2న మరణించారు.

కొడాలి కమలమ్మ
గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మోపర్రు గ్రామంలో 1916న వ్యవ సాయ కుటుంబంలో గోగినేని కోటయ్య, వెంకాయమ్మలకు జన్మిం చారు. నాలుగో తరగతి వరకే చిదివినా 1940లో మహాత్మాగాంధీ చేతులమీదుగా మద్రాసులో హిందీ విశారద పట్టా తీసుకున్నారు. ఆయన స్ఫూర్తితో, గోరా గారి అడుగుజాడల్లో ఖాదీ వస్త్రాలు ధరించడం అలవాటు చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వీరవనిత. ఖైదీగా రాయ వెల్లూరు సెంట్రల్‌ జైలులో వుంటూ, బ్రిటిష్‌ కాపలాదార్ల కళ్లుగప్పి జాతీయ జెండాను ఎగువేశారు. భూదానోద్యమంలో పాల్గొన్నారు. హరి జనవాడలలో గ్రంథాలయాలు స్థాపించారు. హరిజన మహిళలకు ఉచి తంగా రాట్నాలు పంచారు. క్విట్‌ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు. 'గారా నాస్తిక మిత్ర మండలి'ని ఇంకొల్లులో స్థాపిం చారు. 96 సంవత్సరాల వయస్సులో ఇప్పటికీ ఆరోగ్యంగా జీవి తాన్ని అను భవిస్తూ నాటి స్వాతంత్య్ర సమర ఘట్టాలను నెమరువేసుకుంటూ ఈనాటి తరం వారికి ఆనాటి విషయా లను తెలియజేస్తూ వారికి స్ఫూర్తిదా యకంగా నిలుస్తున్నారు.

దువ్వూరి సుబ్బమ్మ
1880వ సంవత్సరంలో సనాతన కుటుంబంలో జన్మించారు. చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారి శిష్యు రాలు. వేదాంతి, విదుషీ మణి. గంభీర కంఠంతో అనర్గ ళంగా ప్రసంగించగల వక్త. మహా త్ముని ప్రేరణతో 1921లో జాతీయో ద్యమంలో ప్రవే శించారు.

స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగింటి ప్రథమ మహిళామణి 'దువ్వూరి సుబ్మమ్మ'. నిర్భీతికి మారు పేరుగా చెప్పుకునే సుబ్బమ్మనాటి బ్రిటిష్‌ కలెక్టర్‌ ఉద్యమంలో పాల్గొన్నందుకు క్షమా పణ చెప్పమంటే 'నా కాలిగోటికి సైతం నువ్వంటే అసహ్యం' అని చెప్పిన సాహసి! 1922, 30, 32, 42 ప్రాంతాలలో జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ధీరవనిత దువ్వూరి సుబ్బమ్మ. దుర్భరమైన దారి ద్య్రాన్ని అనుభ వించినా తలవంచని వ్యక్తిత్వం గలవారు. రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయాన్ని నెలకొల్పారు. 'దేశబాం ధవి'గా పేరుపొందారు. బ్రిటిష్‌వారిని పురాణాల్లోని రాక్షసులతో పోలుస్తూ బహిరంగ సభల్లో ప్రసంగించేవారు. ఆమె ఉపన్యాసాలు వినడానికి పల్లెటూళ్ల నుంచి కూడా వచ్చే వారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకోవడానికి పోలీసులు డప్పులు వాయించినా ఆమె ప్రసంగాన్ని ఆపేవారు కాదు. ఖాదీ చీరలు మోయ లేని వారు సంసారాన్ని ఎలా మోస్తారని స్త్రీలను ఉత్తేజ పరచి ఖాదీ వస్త్రాలను వాడేలా చేసేవారు. ఆమె 1946లో మరణించారు.

తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ
1899లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో జన్మించారు. వ్యక్తిగత బాధ్యతలను సైతం వెనక్కి నెట్టి సామూ హిక హక్కులకోసం సమర సంకల్ప సిద్ధురాలై, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్య మాల్లో పాల్గొన్న సాధ్వీమాత తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు. సామా జిక చైతన్యంతోనే స్వాతంత్య్ర సమరం సజావుగా సాగి, సత్ఫతాల నిస్తుం దనే మార్గంలో తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ రాజమండ్రి ఆర్యాపురం లో 'ఆనంద నికేతన్‌' ఆశ్రమాన్ని స్థాపించి స్త్రీ జనాభ్యుదయం కోసం పాటు పడ్డారు. ఉప్పు సత్యాగ్రహం, ఖద్దరు ధారణ, శాసనోల్లంఘన ఉద్య మాల్లో పాల్గొని జైలు శిక్షను అనుభవించిన స్థిరచిత్తురాలు తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ. కందుకూరి వీరేశలింగం 'వితంతు శరణాలయం' నిర్వహిం చడంలో సహకరించిన మహిళామూర్తి, సాహిత్యాన్ని కూడా ఉద్యమాల్లో వినియోగించిన వనిత. స్వాతంత్య్ర సము పార్జ నమే జీవితధ్యేయంగా ఎంచుకొని తూటాలకు, లాఠీలకూ నినాదాలతో సమాధానాలు చెప్పిన నిరుపమాన త్యాగధన సంపన్నురాలు, హరిజన సేవకురాలైన మన తెలు గింటి ఆడపడుచు 1949లో మరణించారు.

కాశీభట్ల వెంకట రమణమ్మ
1912లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించారు. కాశీభట్ల రమణమ్మ. భర్త లక్ష్మీనరసింహారావు కూడా దేశభక్తుడే. 1932లో శాసన ధిక్కారం చేసి, తన చూలింత తనాన్ని సైతం లెక్కచేయక రామ చంద్రా పురం సబ్‌ జైలులో శిక్షను అనుభవిస్తూ, అక్కడే మగపిల్ల వాణ్ణి కన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించాలనే ధ్యేయంతో అగ్రవర్ణాల ప్రాంతమైన రాజ మండ్రి ఇన్నీసుపేటలో ఉన్న తమ సొంత ఇంట్లో 'గాంధీ హరిజన హాస్టల్‌'ను ప్రారంభించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహిళామణి కాశీభట్ల రమ ణమ్మ. 1938-40లలో రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా ప్రజా సేవ చేశారు. మహిళల్లో చైతన్యం తీసుకురావా లని తీవ్రంగా కృషి చేశారు. హిందీ విద్యాలయాన్ని నిర్వహించారు. జీవి తాంతం ఖద్దరు ధరించి 2001లో మరణించారు.

చేబియ్యం యశోదమ్మ
1895లో భీమవరంలో సదాచార కుటుంబంలో జన్మించారు. చేబియ్యం యశోదమ్మ. భర్త సోమయ్యతో కలిసి 1920-21 సం||రాలలో సహాయ నిరాకరణ, 1930లో ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొనటమే కాకుండా పోల వరంలో 'స్వరాజ్య ఆశ్రమాన్ని' స్థాపించి గిరిజనుల అస్పృశ్యతా నివారణ, అక్ష రాస్యత కోసం, ఖాదీ ప్రచారం కోసం విశేషంగా పనిచేశారు. శాసన ధిక్కారం చేసి వెల్లూరు, కన్ననూరు జైళ్లలో కఠిన కారాగార శిక్షను అనుభ వించిన అకుంఠిత స్వాతంత్య్ర పిపాసి. ఆమె 1974లో మరణించారు.

పెద్దాడ కామేశ్వరమ్మ
1907వ సం||లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయ పట్టభద్రు రాలు. ఉపాధ్యాయురాలిగా పని చేశారు. శ్రీ బులుసు సాంబయ్యమూర్తి వల్ల ప్రభావితురాలైన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. పెద్దాడ కామేశ్వ రమ్మ మైసూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి మహిళా రత్నం!

స్వాతంత్య్రోద్యమంలో ప్రథమ శ్రేణి నాయకులు జైల్లో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకురాళ్లతో పెద్దాపురం తోటల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బ్రిటిషు పోలీసుల లాఠీ దెబ్బలను చవి చూసినప్పటికీ మడ మ త్రిప్పక ముందుకు సాగిన సాహసవంతురాలు పెద్దాడ కామేశ్వరమ్మ. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫ రెన్సులో ప్రముఖ పాత్ర వహించారు. వీరు 1979లో మరణించారు.

గుజ్జు నాగరత్నం
1915 ఫిబ్రవరి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో భ్రమరాంబ, వెంకటరత్నం గార్లకు జన్మించారు. విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో పనిచేసి భర్త వెంకటరావుతో కలిసి రాజమండ్రి మెయిన్‌ రోడ్డులో ఖద్దరు దుకాణం నిర్వహించింది. గుజ్జు నాగరత్నం యువతలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే కార్యకలాపాలు నిర్వహించినందుకు 16 నెలలు ఏలూరు, గుంటూరు, వెల్లూరు, కన్ననూరు జైళ్లలో శిక్షననుభరించారు. ఆ కాలంలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అస్పృశ్యత నివారణా సంకల్పంతో హరిజనులతో వైశ్యసేవాసదన్‌లో ఉన్న నూతి లోని నీటిని త్రాగించి సమానత్వాన్ని నెలకొల్పిన అసమాన మహిళా రత్నం నాగరత్నం 2004లో మరణించారు.

సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి
18సం||రాల వయస్సులోనే నడిరోడ్డులో కర్కశ ముష్కర శ్వేత సైన్యాన్ని ఎదిరించి ముతక సైను గుడ్డలతో జైలు గోడల మధ్య జీవించడానికి కూడా వెనుకాడని రాజ్య లక్ష్మి స్వాతంత్య్రోద్యమానికి జీవితాన్ని అంకితం చేశారు. 1914, మే 18న నంది గామ తాలూకా వీరులపాడులో రైతు కుటుం బంలో జన్మించారు. తండ్రి వాసిరెడ్డి సీతా రామయ్య. గాంధీజీ ప్రభావంతో, మహిళలతో కూడా రాట్నం వడి కించింది. తాను ఖాదీ వస్త్రా లనే ధరిస్తానని దీక్షబూనింది.

ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొనాలని ఉబలా టపడేది. శాసనోల్లం ఘనం చేసినందుకు పొన్నూరు జైలులో శిక్షన నుభవించారు. జైలు రూ ల్సు ప్రకారం నడు చుకో వాలని గాంధీజీ ఆదేశాన్ని పాటించేవారు. 1936-37లో రాజగోపాలాచారిగారు జిల్లా బోర్డు ఎలక్షన్స్‌ నిర్వ హిస్తే, రాజ్య లక్ష్మి గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గార్ని ఓడించారు. అది స్త్రీలకు గర్వ కారణం. 1942లో జయప్రకాష్‌ నారా యణ్‌ ఆంధ్రకు వచ్చి ఐదుగురు మెంబర్లతో ఒక కమిటీ వేస్తే దాంట్లో రాజ్యలక్ష్మిగారున్నారు. విజయ వాడలో 'తెలుగుదేశం' పత్రికను నెల కొల్పారు. గ్రంథాలయ ఉద్యమంలో, మద్యపాన నిషేధంలో ఈమె పాత్ర ప్రధానమైంది. సారా ఉద్యమంలో ఉన్నతమైన పాత్ర నిర్వహించారు. 2010 ఆగస్టు 12న హైదరాబాదులో మరణించారు. 
- నిట్టల గోపాలకృష్ణ.

మూలం: ఆంధ్రప్రభ దినపత్రిక-15 ఆగష్టు 2011.

1 comment:

  1. స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి.

    ReplyDelete