ఈ లోపాలు, పాలకుల పాపాలే
వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం...
అయినా ఆకలిచావులెందుకు, అనారోగ్యాలు ఎందుకు, పోషక విలువల లోపం ఎందుకు.
అంటు వ్యాదులెందుకు, కలుషిత జలాలెందుకు, విష వాయువులెందుకు?
ఆ లోపాల వెనకున్న పాపాల భైరవులేవ్వరు?
ఒకటి... ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి సూచీ ప్రకారం, 176 దేశాల జాబితాలో భారత్ 94వ స్థానంలో ఉంది. నిజానికి, 2007 ప్రాంతంలో మనం 72వ స్థానంలో ఉన్నాం! ఆ తర్వాత వెల్లువెత్తిన కుంభకోణాలు మనల్ని మరింత కిందికి దిగజార్చాయి. ఆ స్కాములన్నీ రాజకీయ స్వాముల చలవే!!
రెండు... చేయకూడని పని చేయడం అవినీతి. చేయాల్సిన పని చేయకపోవడమూ పరోక్ష అవినీతే. 2013లో గత ప్రభుత్వం 61 గంటలా 45 నిమిషాలు సమావేశమైన లోక్ సభ, అందులో 59 గంటలా 7 నిమిషాల్ని వృధా చేసినప్పుడు, భారత ప్రజలు ప్రతి నిమిషం సభ జరగడానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నప్పుడు-అంతకుమించిన ప్రత్యక్ష అవినీతి ఇంకెక్కడైనా ఉంటుందా!
మూడు... మన చదువులు నానాటికి తీసికట్టుగా తయారవుతున్నాయి. నాస్కమ్ అంచనా ప్రకారం 75 శాతం సాంకేతిక పట్టభద్రులూ 80 శాతం సాధారణ పట్టబద్రులూ... ఐటీ కంపెనీల సంగతి దేవుడెరుగు, కాల్ సెంటర్లలో పనిచేయడానికి కూడా పనికిరారు. వీళ్లలో చాలావరకూ, పైరవీ నేతలు నెలకొల్పిన తూతూమంత్రపు విద్యాసంస్థల నుంచి వచ్చినవారే.
నాలుగు.... దేశంలో ప్రతీ ఐదు నిమిషాలకూ ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. 2020 నాటికి ఆ నిడివి మూడు నిమిషాలకు మారే అవకాశముంది. రహదారుల నిర్మాణం మరీ నాసిరకంగా ఉంటుంది. అయినవారికే కాంట్రాక్టులూ నామినేషన్లూ! రవాణాశాఖ పనితీరును రాజకీయ దళారులు శాసిస్తున్నారు. తూకానికేల్లాల్సిన డొక్కుబండ్లు రోడ్డు మీదికి వస్తున్నాయి!!
ఐదు... ఆఫ్రికాను మినహాయిస్తే... ఓ పదహారు దేశాలు మాత్రమే, స్థూల జాతీయ తలసరి ఆదాయంలో భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. మనకంటే మహా అయితే, ఓ రెండేళ్ల ముందు స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న దక్షిణ కొరియా... తలసరి ఆదాయంలో, స్థూల దేశీయ ఉత్పత్తిలో మనకంటే చాలా ముందుంది. అందుకు కారణం నాయకత్వ లోపం కాక, ఇంకేమిటి?
ఆరు... ప్రపంచ దేశాలతో పోలిస్తే, బరువు తక్కువ పిల్లలు భారత్ లోనే ఎక్కువ. చిన్నారుల్లో పోషక విలువల్ని పెంచడానికి ఏటా వేలకువేల కోట్లు మంజూరవుతున్నాయి. అందులో రూపాయికి పావలా కూడా చేరాల్సిన వాళ్లకు చేరడం లేదు. అత్యున్నత స్థాయి నేతల నుంచి గల్లీ లీడర్ల దాకా... ఎవరి స్థాయిలో వారు జనం ధనాన్ని దిగమింగేస్తున్నారు.
ఏడు... ఓవైపు కడుపునిండా ఆహరం దొరకనివారు కోట్లమంది! మరోవైపు, సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడంతో ఏటా 21 మిలియన్ టన్నుల గోధుమలు వృథాగా పోతుంది. పెదలేమో బక్కచిక్కిపోతున్నారు, గోదాముల్లోని పందికోక్కులేమో బలసిపోతున్నాయి. రైతుకేమో గిట్టుబాటు ధర లభించడం లేదు. "పందికొక్కుల" అదృష్టానికి అసూయపడాల్సిన పరిస్థితి!
ఎనిమిది... డబ్భై శాతం ప్రజలు మలేరియా బారిన పడే ప్రమాదమున్న దేశంలో.. మార్కెట్లో దొరుకుతున్న ఏడు శాతం మలేరియా మందులు నకిలివే! బొలీవియా, కంబోడియా, హైతీ వంటి చిన్నచిన్న దేశాల్ని పక్కనపెడితే.... పారిశుద్ధ్యంలో ప్రపంచంలోనే మనం అధమస్థానంలో ఉన్నాం. శిశు మరణాల్లో ఆఫ్ఘనిస్థాన్, హైతీ, మయన్మార్, కంబోడియా, పాకిస్థాన్ దేశాల కంటే ఒక్కమెట్టు మాత్రమే పైనున్నాం. గ్రామీణ సంక్షేమానికి కేటాయించే వేలకోట్లు ఎవరు మెక్కేస్తున్నట్టు?
తొమ్మిది... మహిళలు సురక్షితంగా ఉద్యోగం చేసుకోడానికి వీల్లేని చండాలమైన దేశాల్లో భారత్ ఒకటి. ప్రతీ గంటకు ఒక వరకట్న హత్య జరుగుతుంది. ప్రతీరోజు పాతికమంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన పోలీసు వ్యవస్థ సమర్ధవంతమైందే, అయినా ఈ సమస్యలు ఎందుకు.. పోలీస్ బాసుల్ని నడిపించే రాజకీయ బాసుల వైఫల్యం కాదా ఇది!
పది... వేలకోట్ల కుంభకోణాల్ని పక్కనపెడదాం. లీవ్ ట్రావెల్ కన్సేషన్ల వ్యావహారంలోనూ కక్కుర్తిపడుతున్న ఖద్దరు పెద్దలున్నారు. తొమ్మిదిమంది రాజ్యసభ సభ్యులు ఎకానమీ క్లాసులో ప్రయాణించి, బిజినెస్ క్లాసులో వెళ్లినట్టు దొంగ పత్రాలు సృష్టించినట్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక చెబుతోంది.
ఇప్పుడు చెప్పండి ఈ లోపాలు, పాలకుల పాపాలే కదా! రాజకీయ అవినీతి పాపాలపుట్ట! పాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది, దేశాన్ని భ్రష్టుపట్టిస్తుంది. పాలకుల చీకటి వ్యవహారాలపై నిఘాపెట్టి, నిలువరించి, నిలదీయాల్సిన దేశ పౌరులు ఏమిచేస్తున్నారు??? సమాధానాన్ని మీ ఊహలకే వదిలేస్తున్నా..... నేటి నుంచైనా ప్రశించటం అలవాటు చేసుకోండి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల తప్పులను వేల్లెత్తి చూపించండి. ప్రతీ పౌరుడూ తన భాద్యతను తాను సక్రమంగా నిర్వర్తించాలి. నేను మారాలి అనుకునే ప్రతీ పౌరుడూ దేశ అభివృద్ధిలో భాగమే. రోజు రోజుకి తాను అభివృద్ధి చెందుతూ, దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి. "భారతదేశ కీర్తి ప్రపంచం మొత్తం వినిపించాలి".
జై హింద్..
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.
భారతదేశ కీర్తి ప్రపంచం మొత్తం వినిపించాలి.....
ReplyDeleteకచ్చితంగా పాలకుల లోపాలే.
ReplyDeleteమేరా భారత్ మహాన్.
ReplyDeletetime to change our mindset. Let's start
ReplyDelete