రవీంద్రనాధ్ ఠాగూర్
జననం: మే 7, 1861
మరణం: ఆగష్టు 7, 1941
మంచి అలవాట్లు అలవరచుకొని, పేరు ప్రతిష్టలను ఆర్జించిన ప్రముఖులలో ఒకరు రవీంద్రనాధ్ ఠాగూర్. వారు ఎన్నుకున్న బాట "కవిత్వం" తన దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది."
1861 మే 7 న జన్మించిన రవీంద్రుడు తన తల్లిదండ్రులకు పద్నాలుగో సంతానం. వారి తాత ముత్తాతలు ఊరికి పెద్దవారవటం వలన వారిని ఠాకూర్ అని పిలిచేవారు. కాని బ్రిటీష్ వారు ఠాకూర్ అని పిలవడానికి నోరు తిరక్క టాగూర్ అని పిలిచేవారు. రాను రాను వారి వంశం లో టాగూర్ అనే పేరే శాశ్వతమయిపోయింది. రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాధ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. ఇద్దరూ భారతీయ సంస్కృతిని, కళలను ఎంతో అభిమానించేవారు. చిన్నారి రవీంద్రనాధుడి మనసులో ఆ రోజుల్లోనే భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యం ముద్రపడిపోయింది. తన సోదరులతో "మనం హిందువులయి, భారతదేశంలో పుట్టినందుకు భగవంతుడికి ఎంతో ఋణపడ్డాము మనవంతు కర్తవ్యం గా, హిందూ మత ఆచారాలను, సిద్దాంతాలను క్రమం తప్పక పాటించాలి" అన్నాడు. అప్పుడు అతని వయస్సు పది సంవత్సరాలే.
1875లో జరిగిన "హిందూ మేళా"లో తన పద్యాలను గానం చేసి ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాడు. "ఆనందబజార్" పత్రిక ఆ పద్యాలను ప్రచురించి రవీంద్రుడికి అద్భుతమైన ప్రచారం ఇచ్చింది. కేవలం కవిత్వమే పరమావధిగా పెట్టుకున్న కొడుకును మార్చాలంటే పెళ్ళి ఒక్కటే మార్గమని తలచి, అతని తండ్రి 1883లో రవీంద్రుడికి వివాహం చేసి, తన వ్యవసాయ పనులను కూడ అప్పగించాడు. పొలంలోని రైతు కూలీలు గడుపుతున్న దుర్భర జీవితాన్ని చూచి మనసు వికలమై, వారి జీవితాలను చక్కబరచడానికి ఎంతో సహాయం చేశాడు.
రవీంద్రుడు తన రచనల ద్వారా తన మాతృభూమికి దాస్యవిముక్తి కలిగించటానికి ఆ క్షణం నుంచి నిరంతరం పాటుపడ్డాడు. అనేక దేశభక్తి గేయాలు, కవితలు, ప్రసంగాలు ఒకటేమిటి నిద్రాహారాలు మాని దేశ స్వాతంత్ర్యం గురించి అనేక విధాలుగా కృషిచేశాడు. 1901లో శాంతినికేతన్ ప్రారంభించి రవీంద్రుడు రత్నాల్లాంటి విద్యార్ధులను తయారు చేయడంలో సఫలీకృతుడయ్యాడు. తన విద్యార్దులకు కేవలం చదువు మాత్రమే కాకుండా సంగీతం, కవిత్వం, ఆట పాటల్లో కూడా నిపుణుల చేత శిక్షణ ఇప్పించేవాడు. ఒక పక్క శాంతి నికేతన్, మరొకపక్క స్వాతంత్ర్య పోరాటాలలో కీలకపాత్రను వహిస్తుండేవాడు. 1912వ సంవత్సరంలో రవీంద్రుడి "గీతాంజలి"కి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి వచ్చింది కవిత్వంలో ఆ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు నేటికీ అతడే. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలు డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి.
No comments