Breaking News

జగదీష్ చంద్రబోస్

జననం: నవంబర్ 30, 1858
మరణం: నవంబర్ 23, 1937


మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈ లోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్ జగదీశ్ చంద్రబోస్. ఈయన వాస్తవానికి భౌతిక, రసాయనిక శాస్త్రాలను చదువుకున్నారు. అయినప్పటికీ వృక్షశాస్త్రంలో మైలు రాయిలాంటి పరిశోధనను ఆవిష్కరింపజేశాడు. ఒకరకంగా 'ప్లాంట్ ఫిజియాలజీ' కి శ్రీకారం చుట్టాడు.

జగదీష్ చంద్రబోస్ 1858 నవంబరు 30వ తేదీన ప్రస్తుతం బంగ్లాదేశ్ లో వున్న మైమన్ సింగ్‌లో జన్మించాడు. కలకత్తాలోని జేవియర్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన బోస్ 1884లో కేంబ్రిడ్జ్ నుండి పట్టా పుచ్చుకున్నాడు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో లెక్చరరుగా జీవితం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఒకే చదువు చదువుతున్నప్పటికీ యూరోపియన్లకే మర్యాద ఎక్కువగా వుండేది. జగదీష్ చంద్రబోస్ కు యూరోపియన్ లెక్చరరుకు ఇచ్చే జీతంలో 66.8 శాతం మాత్రమే జీతంగా ఇస్తామని కళాశాల నిర్వాహకులు అంటే ఆయన ఒప్పుకోలేదు. అసలు జీతము తీసుకోకుండా మూడు సంవత్సరాలు బోధించి యూరోపియన్ లెక్చరర్ లకు తాను ఏ విధంగానూ తీసిపోనని నిరూపించి నిర్వాహకులచేత శభాస్ అనిపించుకున్నాడు. మొత్తం జీతాన్ని కళాశాలలో చేరినప్పటి నుంచీ పొందగలిగాడు. ఆయన ఆత్మగౌరవం అలాంటిది.

మొక్కల మీద ఎరువులు, కాంతికిరణాలు, వైర్‌లెస్ కిరణాలు, విష పదార్ధాలు ఇలాంటి వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈయన వివరించిన తీరు ఎంతోమందిని మంత్రముగ్దుల్ని చేసింది. మే 10, 1901న రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో మొక్కలు బ్రోమైడ్ విష ప్రభావం వల్ల ఏవిధంగా చనిపోతాయో ఈయన ప్రయోగ పూర్వకంగా నిరూపించాడు. ఒక ఎలుక ఏ విధంగా అయితే విష ప్రభావం వల్ల కొట్టుకుంటూ చనిపోతుందో అదేవిధంగా మొక్క కూడా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుందని ఈయన రుజువు చేసాడు.

ఈయన వెలువరించిన 'ది లివింగ్ అండ్ నాన్ లివింగ్'(1902), 'ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్' (1926) పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ది పొందుతాయి. ఈయన పరిశోధనలు మొక్కలకే పరిమితం కాలేదు. రేడియో తరంగాల మీద ఈయన వెలువరిచిన అంశాలు ఎన్నో వున్నాయి. వీటిని గుర్తించడానికి వీలుపడే 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని బోస్ స్వయంగా రూపొందించడం విశేషం, దీని గురించి ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి.

1920లో ఈయనను ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. కలకత్తాలో ఈయన చనిపోబోయే ముందు బోస్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించాడు. నవంబర్ 23, 1937 నాటి నుంచి ఈయన భౌతికంగా కనుమరుగైపోయినా ఈయన కొనసాగించిన పరిశోధనలు మాత్రం అనంతంగా ఎదుగుతూ ఎంతో మందికి స్పూర్తిని కలిగిస్తూనే వుంటాయి.

No comments