Breaking News

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్

జననం: అక్టోబర్ 11, 1902
మరణం: అక్టోబర్ 8, 1979



ఈ విశాల భారతదేశం మనందరిదీ. ప్రతి పౌరుడు సమాన భాగస్వామి. మనమంతా ఒకే కుటుంబం సభ్యులం. సమతాభావంతో లోక కళ్యాణానికి పాటుపడాలి. అని ఎలుగెత్తి చాటిన దేశబంధువు, కర్తవ్య పరాయణుడు, రాజనీతిఙ్ఞుడు అయిన జయప్రకాశ్ నారాయణ్ ప్రపంచంలో విశిష్ట వ్యక్తిగా ప్రశంసలు పొందారు. 'ధనికులు, పేదవారు' అనే భేధం ఉండకూడదు. మనమంతా భరతమాత బిడ్డలము. మనమంతా కలిసి స్వాతంత్ర్యం సంపాదించి, సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించుకొని, ఆర్ధిక వ్యత్యాసాలు నిర్మూలించి, నిరుద్యోగం, పేదరికం సమస్యలను పరిష్కరించి, మన జీవితాలకు ఒక సార్ధకత ఏర్పరచుకోవాలి" అని ఉద్భోదించాడాయన. ఆయన చరిత్ర గురించి తెలుసుకుందాం.

జయప్రకాష్ నారాయణ్ బీహారు రాష్ట్రంలో 1901 లో అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. జయప్రకాష్ చిన్నతనము నుంచి ప్రజల మధ్యలో వున్న అంతరాల గురించి ఆలోచిస్తూండేవాడు. అతి సామాన్యకుటుంబంలో పుట్టి, ప్రపంచ రాజకీయాలను, ప్రజల స్థితిగతులను అధ్యయనం చేసి, తన దేశ ప్రజలను ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించడానికి నిరంతరం శ్రమించి, అన్ని అడ్డంకులనూ ఎదుర్కొని, తన ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి శ్రమించిన మహనీయుడు జయప్రకాష్.

కొంతమంది పెద్ద పెద్ద భవంతుల్లో హాయిగా జీవిస్తూ వుండగా, మరి కొంతమంది గుడిసెల్లో ఎందుకు జీవించాలి? వీళ్ళు ఇలా ఉండగా ఎక్కడో పరాయిదేశము నుంచి వచ్చిన ఆంగ్లేయులు అందరిపైనా అధికారం చెలాయిస్తూ మనదేశ సంపదను ఎందుకు కొల్లగొట్టుకు పోవాలి? పెద్దవారి నెవరినైనా అడిగితే "నీకు చెప్పినా అర్ధంకాదు. అయినా నీకు అవి అనవసరం పోయి చదువుకో" అని మందలించేవారు. జయప్రకాష్‌కు ఆ సమాధానం మానసిక అశాంతిని మరింత పెంచసాగింది. మనదేశాన్ని ఆంగ్లేయులు విడిచివెళ్తే మన సంపద మనకు సరిపోతుంది. మనలో సమానత్వం వస్తుంది. మనం మరొకరిని "దేహీ" అని అర్ధించవలసిన అవసరం ఉండదు. మన వనరులను అందరూ సమానంగా అనుభవించవచ్చు. అది సాధించేవరకు విశ్ర్రమించకూడదు. అని చిన్నతనంలో నిశ్చయించుకున్నాడు.

1921లో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ప్రజలలో చైతన్యం తీసుకురావటానికి అనేక ప్రసంగాలు చేశాడు. సభలు నిర్వహించాడు. జాతీయ జీవితంలో భద్రత సుఖశాంతులు కావాలంటే, ఆర్ధిక, సాంస్కృతిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు బలంపుంజుకోవాలంటే ముందుగా అందరూ సమానంగా కలిసి కృషిచేసి తెల్లవారిని వెళ్ళగొట్టి, సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించుకోవాలని ప్రజలకు ఉద్బోదించాడు. అది చూసి భయపడిన బ్రిటన్ ప్రభుత్వం జయప్రకాశ్ ఉనికి తమకు ఉపద్రవం వస్తుందని భావించి, అతనికి కాలేజీలో ఇస్తున్న స్కాలర్ షిప్పులను ఆపివేసింది. అంతవరకు ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్ధిగా అతను స్కాలర్ షిప్పులను పొందేవాడు. దానివలన ఆర్ధిక ఇబ్బందిలో పడినా ఆ యువ నాయకుడు తన పట్టు విడనాడలేదు. ఒక బట్టల షాపులో లెక్కలు రాస్తూ తన ఖర్చుకు సరిపడే డబ్బు సమకూర్చుకునేవాడు.

ప్రజలలో ఆర్ధిక, సామాజిక సమానత్వం కలగాలంటే ముందుగా చదువు ముఖ్యం కాబట్టి, ఉన్నత విద్యనభ్యసించాలని పట్టుదల అతనిలో బాగా పెరిగింది. కానీ బ్రిటీష్ దొరలు అతనికి అన్ని విధాల ఆటంకాలు కలిగించటం ప్రారంభించాడు. అతని చదువు పూర్తి చేస్తే తమ కొక పెద్ద సమస్య అవుతాడని వారు భయపడేవారు. ఇండియాలో తన చదువు కొనసాగించటటం దుర్లభం అని భావించి ఎవరికీ చెప్పకుండా అమెరికా పారిపోయాడు. అక్కడ కొంతమంది భారతీయుల సహాయంతో కాలేజీలో చేరి, సాయంత్రం సమయాలలో పళ్ళ తోటలలో కూలీగా పనిచేస్తూ పేపర్లు అందిస్తూ, కాఫీహొటల్లో పనిచేస్తూ తన ఫీజు తనే కట్టుకొని, కష్టపడి అర్ధశాస్త్రంలో ఎం. ఏ. పూర్తి చేసి, పెట్టుబడిదారీ విధానం వలన కలిగే నష్టాల గురించి, గుప్తాధిపత్యం గురించి, ధీసిస్ రాసి యూనివర్సిటీ మేధావుల ప్రశంసలు అందుకుని అర్ధశాస్త్ర ప్రవీణుడిగా సామ్యవాదిగా కీర్తిపొంది, 1928లో తిరిగి భారతదేశం వచ్చాడు.

భారతదేశంలో మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేక ఉద్యమాలు, నిరాహారదీక్షలు నిర్వహించి, ఆంగ్లేయుల పక్కలో బల్లెం గా మారి, వారి కంటికి కునుకులేకుండా చేశాడు. తన ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యులను కూడా లెక్కచేయకుండా జైలు శిక్షల్ని అనుభవిస్తూ, రాత్రనకా, పగలనకా, కష్టపడి నానా ప్రయాసలు పడి ఆంగ్లేయులను ముప్పతిప్పలుపెట్టాడు జయప్రకాష్ నారాయణ్. మానవతావాదిగా, సర్వోదయ నాయకుడిగా, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడిగా కీర్తిగాంచిన జయప్రకాష్ ప్రజలలో సమానత్వం తీసుకురావడానికి తన వంతు కృషి చేశాడు. ఆర్ధిక వ్యవస్థలోని వ్యత్యాసాలను తగ్గించడానికి, కార్మికులకు, కర్షకులకు సహయం చేకూరేలా అనేక పధకాలను తయారు చేశాడు.

చంబర్ లోయలోని దారి దోపిడి గాండ్రను కలుసుకోని, వారి మనసు మార్చి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన లోకనాయకుడు. జయప్రకాష్ నారాయణ్ లోని మహొన్నత మానవతకు, సమతాభావానికి, 1965లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.

No comments