గాడిచర్ల హరిసర్వోత్తమరావు
జననం: సెప్టెంబర్ 14, 1883-కర్నూలు
మరణం: ఫిబ్రవరి 29, 1960
గాడిచర్ల హరిసర్వోత్తమరావు గొప్ప జాతీయవాది. ఆయనను ఆంధ్రదేశంలో రాజకీయాల సారధిగా భావిస్తారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలులో, ఉన్నత విద్య చెన్నైలో పూర్తి చేశారు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలతో ఉత్తేజితుడై వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతో ఆయనను రాజమండ్రి కాలేజీ నుంచి బహిష్కరించి, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిగా ప్రకటించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా వందేమాతరం ఉద్యమాన్ని ఆంధ్రలో నలుమూలలకు వ్యాపింపచేశారు. ఆయన 1908లో స్వరాజ్య పత్రికను స్థాపించారు. ఆ పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించటంతో జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చింది.
1914లో హోమ్‌రూల్ ఉద్యమ కార్యదర్శిగా ఆంధ్రదేశమంతటా ప్రచారం చేశారు. ఆంధ్రపత్రికకు తొలి సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు కౌముది, ఆంధ్రవార్త, గ్రామ పంచాయితీ పత్రికలకు కూడా సంపాదకత్వం వహించారు. మహిళల కోసం ‘సౌందర్యవల్లి’ పత్రికను నడిపారు. 1928లో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలో రాయలు ఏలిన సీమను ‘రాయలసీమ’గా వ్యవహరించారు. తర్వాత ఆ ప్రాంతానికి అదే పేరు స్థిరపడింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన 1923లో స్వరాజ్య పార్టీని స్థాపించారు.
అనేక గ్రంథాలు రాయటంతో పాటు గ్రంథాలయాల్ని స్థాపించారు. దక్షిణ భారత వయోజన విద్యాసంఘ అధ్యక్షుడిగా వయోజనవిద్య వ్యాప్తికి కృషి చేశారు. స్వాతంత్య్రం అనంతరం 1948లో ఆంధ్రదేశ విద్యా ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆంధ్రదేశంలో గురుకుల విద్యాసంస్థల స్థాపనకు కారకుడు. రైతాంగ సమస్యలపై పోరాడి రైతు సంఘాల్ని స్థాపించిన ఈ బహుముఖ మేధావి.
No comments