Breaking News

వీరనారి చాకలి ఐలమ్మ


మధ్య యుగాల నాటి భూస్వామ్య దోపిడీికి వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన వీరవనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ. తెలంగాణ వీరోచిత సాయుధ రైతాంగ పోరాటానికి ఆమె నాంది పలికింది. భూమి కోసం నిజాం నిరంకుశపాలనలో దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటమే ఆమెకు చరిత్రలో సమున్నత స్థానం కల్పించింది.

అది 1944వ సంవత్సరం పేద రైతులను భూములు నుంచి తొలగించడం రైతులు పండించుకున్న పంటలకు భూస్వాముల దేశ్‌ముఖ్‌ల గూండాలు దౌర్జన్యంగా కోసుకెళ్లడం అడ్డుకున్న రైతాంగాన్ని చితకబాదడం అత్యంత క్రూరమైన వెట్టి చాకిరీ అమలు జరుగుతున్న రోజులవి నిమ్నకులాల స్త్రీలు దొరల పొలాల్లో వెట్టి చాకిరి చేయాలి. అంతటి క్రూరమైన పరిస్థితులను ఎదిరించిన ధీరవనిత ఐలమ్మ.

చాకలి ఐలమ్మగా పిలవబడే చిట్యాల ఐలమ్మ వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టారం గ్రామంలో 1895లో పుట్టింది. ఆ గ్రామానికి దగ్గరలోని పాలకుర్తి నియోజకవర్గమైన మండల కేంద్రం. ఐలమ్మకు 13వ ఏటే పెళ్లి అయింది. వారికి నలుగురు కూమారులు ఒక కుమార్తె ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా కులవృత్తే జీవనాధారం. ఐలమ్మ చిన్నతనం నుండే చురుగ్గా ఉండేది. పుట్టింది పేద రజక కుటుంబంలోనైనా తల్లి దండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. కులవృత్తిలోని మెలకువలన్నీ అత్యంత ఆసక్తితో ఆకలింపు చేసుకుంది. అందరిలో కలిసిమెలసి వుండే ఐలమ్మ విషవలయం లాంటి ఈ కులవృత్తి నుంచి బయటపడాలనుకుంది. ఆ ఆలోచనల నుండి పుట్టిందే వ్యవసాయం చేయాలనే కోరిక. పాలకుర్తి గ్రామం పక్కనే పడివున్న పనికిరాని భూమిని కౌలుకు తీసుకోవాలని దాని స్వంత దారుడైన ముక్తేదార్‌ కొండల్‌రావు వద్దకు (హైదరాబాద్‌కు) వెళ్లి ఆయన అనుమతి పొందింది. ఆ ప్రాంతంలో నలభై గ్రామాలున్న కొండల్‌రావు విన్నూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డికి సన్నిహితుడు.

ఐలమ్మకు వ్యవసాయం అందివచ్చింది. ఆనతి కాలంలోనే ఆసామిగా ఎదిగింది. ఒక భవంతి నిర్మించుకుంది. అణగారిన కులాలకు ఆదర్శమై ఒక పెద్ద దిక్కుగా నిలిచింది. తాత్కాలికంగా వచ్చిన ఈ ఆర్థిక హోదా సాంఘిక హోదా చూసి ఓర్వలేని భూస్వాములు పాలకుర్తికి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న విస్నూర్‌ గ్రామ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి వద్దకు చేరి ఎట్లాగైనా ఐలమ్మను పతనం చేయాలని పథకాలు వేశారు. ఐలమ్మ సాగు చేస్తున్న భూమి సొంతదారు కొండల్‌రావును పిలిపించి ఆ భూమిని తానే కొన్నట్లు దేశ్‌ముఖ్‌ కాగితాలు సృష్టించాడు.

అదను కోసం చూస్తున్న విస్నూర్‌ దొర, ఐలమ్మ పొలంలో పంట చేతికొచ్చే సమయానికి ఆ పంట తనకే చెందుతుందని పండిన పంటను కోసుకురావాల్సిందిగా భూమిపైకి గూండాలను పంపాడు. ఐలమ్మ కోపం కట్టలు తెంచుకుంది. సంఘం నాయకులు ఐలమ్మ పంటను కాపాడటానికి జనాన్ని సమీకరించారు. దీంతో గూండాలు కాలికి బుద్ది చెప్పారు. అది తెలుసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య పాలకుర్తిలోని ఐలమ్మ ఇంటికి చేరుకొని ఆవరణలోనే అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుండి ఐలమ్మ ఇల్లు కుటుంబం అంతా కమ్యునిస్టు పార్టీపరమైంది. ఆ కుటుంబం పార్టీతోనే ఎదుగుతూ వచ్చింది.

భూమి నిలుపుకోవడం కోసం విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ దురాక్రమణకు గురికాకుండా తన భూమిని నిలబెట్టుకునేందుకై ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొట్టమొదట తీవ్రంగా పోరాడింది. జనగామ తాలుకా పాలకుర్తి గ్రామానికి చెందిన చాకలి ఐలమ్మ తన కొడుకులను కూతురును కూడా పార్టీకి అండగా ఎన్ని కష్టాలొచ్చినా సరే నిలబడమని ప్రోత్సహించింది. అది ఆమె స్వార్థం కోసం జరిపిన పోరాటం కాదు. తెలంగాణ రైతు గడ్డ కోసం జరిగిన పోరాటపు తొలిదశకామె చిహ్నం.

ఐలమ్మ ధిక్కారం విస్నూరు దేశ్‌ముఖ్‌ సహించలేకపోయాడు. ఆమెపై అక్రమ కేసులు బనాయించాడు. ఐలమ్మ భర్త కొడుకులను సైతం అకారణంగా జైల్లో పెట్టి చిత్ర హింహలకు గురిచేశాడు. అయినా ఐలమ్మ ధైర్యంగా పోరాడింది. తన ఇంటిని సంఘ కార్యాలయానికి ఇచ్చి సంఘం కార్యకలాపాలకు తోడ్పడింది. యుద్ధ వ్యూహాలు నేర్చిన ఆర్గనైజరైంది. ఆయుధమెత్తిన గెరిల్లానే కాదు, జన సమీకరణ జరిపే నాయకురాలైంది. ఆమె బుర్రకథలు కూడా చెప్పేది. ఎంతోమంది యువతీ యువకులను చైతన్య పరచి కార్యకర్తలుగా వాలంటీర్‌గా తయారు చేసింది.

అదే ప్రాంతంలో పనిచేసిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, కట్కూరి రాంచంద్రారెడ్డి, ఆరుట్ల రాం చంద్రారెడ్డి నల్ల నర్సింహులు, మల్లు స్వరాజ్యం, మద్ది కాయల ఓంకార్‌ లాంటి వాళ్లతో కలిసి ఆమె పార్టీ నిర్మాణానికి పూర్తిగా అంకితమైంది. ఆమె అన్ని పోరాటాల్లో వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగించిన పోరాటమే అత్యంత ప్రధానమైంది. ఐలమ్మ ఏ గడీ మీద ఏ రాత్రి విరుచుకుపడనుందోనని నిద్రలేని రాత్రుళ్లు గడిపారు. ఐలమ్మ పోరాటం ఆ గ్రామంలోని వారిని ఇంకా చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర దర్దాపల్లి వల్మిడి, మల్లపల్లి, ముత్తరం, వారిలాల మొదలైన గ్రామాల్లో ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది. మూడువేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు స్థాపించి 10లక్షల ఎకరాలకు పైగా పేద ప్రజలకు భూమి పంపిణీ చేసిన ఘనత ఆమెకే దక్కింది. ఆ మహత్తర పోరాటానికి తొలిఘట్టం చాకలి ఐలమ్మ పోరాటం. ఆ ధీరవనిత ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న కన్నుమూసింది.

No comments