రథసప్తమి - About Ratha Saptami in Telugu
రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడు. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరభాను’ అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడువర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు –
1. గాయత్రి,
2. త్రిష్టుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం చేకూరుతుంది.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
-ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.
*☘ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:☘*
*నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః*
*అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!*
*తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!*
*మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!*
*సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!*
ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ -ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తిశ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.
– పి. వెంకట సత్తిరాజు
Source- VSK Telangana
రథసప్తమి సందర్భంగా….
ReplyDeleteశక్తి స్వరూపుడు సూర్యుడు...