దత్తోపంత్ ఠేంగ్డీజీ జీవిత చరిత్ర - Dattopant Thengadi Life Story in Telugu
దత్తోపంత్‌ఠేంగ్డీజీ దేశమంతా పర్యటిస్తూ కార్యకర్తలకు ఏ విషయాలైతే చెప్పేవారో, వాటిని స్వయంగా ఆచరిస్తూ అందరికి స్ఫూర్తి ప్రేరణని అందించారు. వివిధ రంగాల్లో నైపుణ్యం సంపాదించి అనేక ఉద్యమాలను నడిపించారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది – భారతీయ మజ్దూర్‌సంఘ్. 1955లో శూన్యం నుండి ప్రారంభమైన బీఎంఎస్ ప్రస్థానం దాదాపు 34 సంవత్సరాల్లోనే భారతదేశంలోని అతిపెద్ద కార్మిక సంస్థగా గుర్తింపు పొందడం వరకు సాగింది. ఇది ఎదిగిన తీరు అందరికి ఆశ్చర్యమే. దీని వెనుక ప్రధానమైన కారణం- సమష్టి నాయత్వమనే మూలమంత్రం, అనేక సమావేశాల్లో ఇదే విషయం ఠేంగ్డీజీ చెప్పేవారు. స్థానిక యూనియన్ మొదలుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వరకు సామూహిక నేతృత్వాన్నే నిలబెట్టిన మహనీయులు ఆయన.
తాను నమ్మిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని భారతీయ మజ్దూర్‌సంఘ్ స్థాపించిన రోజు నుండే ఆచరణలోకి తెచ్చారు ఠేంగ్డీ. భోపాల్‌లో ఆ రోజు కొంతమంది కార్యకర్తలతో సమావేశమైనపుడు, కార్మికులకు పూర్తి న్యాయం జరగాలంటే కార్మికక్షేత్రంలో భారతీయ సంస్కృతి, విలువల ఆధారంగా, రాజకీయాల కతీతంగా నడిచే కేంద్ర కార్మిక సంస్థ అవసరముందనీ, దానిపేరు ‘‘భారతీయ శ్రమిక్ సంఘ్’’ అని పేరు నిర్ణయం చేస్తే ఎలా ఉంటుందని చర్చ జరిగింది. అప్పుడు పంజాబు నుండి వచ్చిన కొంతమంది కార్యకర్తలు ‘‘పేరు బాగానే ఉంది. కాని మాలాంటి కార్మికులకు సరిగా ఉచ్ఛరించడం రాదు. ‘శమిక్’ బదులు ‘మజ్దూర్’ (కార్మిక) అంటే బాగుంటుంద న్నారు. మరి ఏ పేరు నిర్ణయిద్దామని అందరి అభిప్రాయాలను ఠేంగ్డీజీ అడిగారు. అక్కడున్న వాళ్లలో అత్యధికులు ‘శ్రామిక్’ బదులు ‘మజ్దూర్’ అంటే పలకడానికి సులభంగా ఉంటుందని చెప్పారు. దాంతో ఠేంగ్డీజీ తన మొదటి ప్రతిపాదనను ఉపసంహరించుకుని, అందరి అభీష్టం మేరకు ‘భారతీయ మజ్దూర్‌సంఘ్’ అని పేరు నిర్ణయించారు.
ఆ తర్వాత ఏ సమావేశంలోనూ ‘ఇది నా నిర్ణయం’ అంటూ కార్యకర్తలపైన బలవంతాన రుద్దలేదు. నేను 1991 నుండి బీఎంఎస్ కేంద్ర కార్యవర్గ సభ్యునిగా గమనించిన విషయమిది. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం తప్పు- సామూహికంగా తీసుకున్న నిర్ణయం ఒప్పు అనేది కూడా కొన్ని సందర్భాల్లో సరైంది కాకపోవచ్చు. కాని సంస్థ బాగోగుల కోసం, అభివృద్ధి కోసం సామూహిక నిర్ణయమే అవసరమని ఆయన చెప్పేవారు. సామూహిక నిర్ణయంవల్ల అందరిలో ‘ఇది నా నిర్ణయం’ అనే అనుభూతి ఉంటుంది. ఒకవేళ సామూహిక నిర్ణయం తప్పని తేలితే, దానిని అందరు కలిసి చర్చించి, సరిదిద్దుకుని తిరిగి తప్పు జరుగకుండా చూసుకోవచ్చు అని చెప్పేవారు.
జాతీయ ప్రయోజనాలే మిన్న
వ్యక్తి ప్రయోజనం కంటే సంస్థ ప్రయోజనం ముఖ్యమైంది. సంస్థ ప్రయోజనం కంటే దేశ ప్రయోజనం ప్రముఖమైందని ఠేంగ్డీజీ పదే పదే చెప్పేవారు. అలాగే కార్మిక సంక్షేమం దేశ సంక్షేమం వేర్వేరు కావు అనేవారు. కార్మికుడు బాగుంటే దేశాన్ని పడిపోనివ్వడు. దేశం బలంగా ఉంటే కార్మికుడు పడిపోడు. భారతీయ మజ్దూర్‌సంఘ్ రాజకీయాల కతీతంగా కార్మికుల చేత, కార్మికుల కోసం నడిచే సంస్థ కాబట్టి ప్రభుత్వమేదైనా, దాని విధానాలనుబట్టి మన వైఖరి ఉంటుందనేవారు. కార్మికుల బాగోగులకు అనుగుణంగా ప్రభుత్వ విధానముంటే స్వాగతిస్తాం. హాని కలిగించే విధానముంటే గట్టిగా వ్యతిరేకిస్తాం. దానినే ‘‘ప్రతిస్పందించే సహకారం’’ అనేవారు. అదే విధానాన్ని తన తుదిశ్వాసవరకు ఆచరించారు. ఆయన అంకురార్పణ చేసిన సంస్థలన్నీ ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దా లుగా ఎన్నో ప్రభుత్వాలు ఇటు రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి, పోయాయి. కాని బీఎంఎస్ వైఖరిలో మాత్రం మార్పులేదు.
కార్మిక శక్తిని దేశ సైనిక శక్తిగా మలచిన మహనీయుడు
కార్మిక సంఘమంటే కార్మికుల స్వలాభం కోసం మాత్రమే పనిచేసే సంస్థ. కార్మిక సంఘాలు సామాజిక సమస్యలు, దేశ సమస్యల గురించి పట్టించుకోవు. ఇది సమాజంలో నెలకొన్న సర్వసాధారణ అభిప్రాయం. దీనికి కారణం కమ్యూనిస్టు భావాలతో, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కొన్ని సంస్థలు కార్మికులలో నూరిపోసిన సంకుచిత భావనే. దీనికి భిన్నంగా కార్మికులు, సమాజం వేర్వేరు కాదు. సమాజాభివృద్ధిలోనే కార్మికులు మేలు ఇమిడి ఉందన్న సత్యాన్ని ఠేంగ్డీజీ కార్మిక రంగంలో మొదటిసారిగా వినిపించారు. కార్మికుల ప్రయోజనాలు, పనిచేసే సంస్థ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అవి విడదీయలేని సంబంధాలు అని ఆయన చెప్పేవారు. ఠేంగ్డీజీ మార్గదర్శనంలో, ఆయన స్ఫూర్తితో భారతీయ మజ్దూర్‌సంఘ్ పేద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుంది. మరోవైపు వారిలో సామాజిక స్పృహ, జాతీయ భావాల నిర్మాణం, దేశం కోసం పని చేసే లక్షణం,అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేట్లు కార్మికులను తీర్చిదిద్దుతోంది.
కార్మికులు స్వార్థపరులు తమ జీతభత్యాల గురించి మాత్రమే ఆలోచిస్తారని సమాజంలో నెలకొన్న అభిప్రాయం సరైంది కాదని 1993లో జరిగిన సంఘటన రుజువు చేస్తుంది. ఆ రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యం, ఆర్థిక, ఎగుమతి- దిగుమతి రంగాల్లో పశ్చిమ దేశాలదే పైచేయి. ప్రత్యేకించి అమెరికాదే గుత్తాధిపత్యం. పేద దేశాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం, బహుళజాతి సంస్థల కోసం పశ్చిమ దేశాలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) లాంటి సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని శోషణచేసే కుట్రలు పన్నేవి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మన దేశ ఆర్థిక విధానాల్లో జోక్యం చేసుకుంటూ పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు మారేటట్లు ప్రయత్నాలు జరిగేవి. దురదృష్టవశాత్తు స్వాభిమానం, స్వావలంబన లేని అప్పటి ప్రభుత్వం ఆ సంస్థల చెప్పుచేతుల్లో నడిచేది. పశ్చిమ దేశాల్లో జనాభా తక్కువ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువమందితో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తుల కోసం మార్కెట్లేమో పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండడంవల్ల, పశ్చిమ దేశాల ఉత్పత్తుల ఎగుమతులకు అనుగుణంగా డంకెల్ డ్రాఫ్ట్ పేరిట అంతర్జాతీయ ముసాయిదాగా ఒప్పందాన్ని తయారుచేశారు. ఆ ఒప్పందం మీద సంతకాలు చేయడానికి భారత్ సహా మిగతా దేశాల మీద కూడా ఒత్తిడి తేవడం ఆరంభమైంది.
దీన్ని గమనించిన ఠేంగ్డీజీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ, కార్మికులలో, సమాజంలో చైతన్యాన్ని కలిగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత ప్రభుత్వం ‘డంకెల్ డ్రాఫ్టు’ను అంగీకరించకుండా ఉండేందుకు ఉద్యమాన్ని కొనసాగించారు. దీంట్లో భాగంగా, మన దేశ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడడం కోసం అమెరికా దాదాగిరీకి ప్రత్యేకించి ‘డంకెల్ డ్రాఫ్టు’కు వ్యతిరేకంగా ‘ఛలో ఢిల్లీ’ అంటూ భారతీయ మజ్దూర్‌సంఘ్ ఆధ్వర్యంలో 1993 ఏఫ్రిల్ 20న ఎర్రకోట వరకు చారిత్రాత్మక ర్యాలీ జరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు లక్షకుపైగా కార్మికులు అనేక వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని అత్యంత ఉత్సాహంతో ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ కార్మికుల జీతభత్యాల ఊసేలేదు. కేవలం దేశ ప్రయోజనాలను కాపాడడం మాత్రమే ఆ ర్యాలీ లక్ష్యం. ఆ భవ్యమైన ర్యాలీ దేశ సమస్యల పట్ల పేద కార్మికుల సహజమైన స్పందనను సూచిస్తుంది. అయితే మరుసటి సంవత్సరం (1994)లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘డంకెల్ డ్రాఫ్ట్’ను అంగీకరిస్తూ సంతకం చేసింది. ఆ తర్వాత ఆ డ్రాఫ్టు ఆధారంగానే ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) 1995 జనవరి 1న ఆవిర్భవించింది.
శ్రామిక గౌరవానికి నాంది – నిరాడంబరత
సాధారణంగా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు వెనుక సీట్లో కూర్చోవాలని కోరుకుంటారు. ఇది VIP సంస్కృతి. డ్రైవరు ప్రక్కన కూర్చుంటే తమ గౌరవం తగ్గుతుందని చాలామంది అనుకోవడం చూస్తూనే ఉంటాం. అట్లాగే తల వెంట్రుకలు కత్తిరించడానికి, గడ్డం తీయడానికి పెద్ద క్షౌరశాలకు వెళ్లి డబ్బులు ఎక్కువ ఖర్చుపెట్టి చేయించుకుంటే పెద్ద గొప్ప అని కొందరు భావిస్తారు.
కాని కారు నడిపే డ్రైవరు, క్షురకవృత్తి చేసే వ్యక్తి కూడా మనుషులే – శ్రామికులే అనే భావనతో వారి శ్రమకు తగిన గౌరవమివ్వాలనే ఉద్దేశంతో ఠేంగ్డీజీ కారులో డ్రైవరు ప్రక్కనే కూర్చునేవారు. తాను భోజనం చేస్తుంటే డ్రైవరుకు కూడా భోజన ఏర్పాటు చేశారా లేదా అని అడిగి తెలుసుకునేవారు. అట్లాగే ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలో తానుండే క్వార్టరుకు దగ్గరలోని సాధారణ క్షురకుని పిలిపించుకుని కటింగ్ చేయించుకునేవారు.
ఢిల్లీ వాతావరణం ఎట్లుంటుందో చాలామందికి తెలిసిందే. చలికాలంలో విపరీతమైన చలి, ఎండా కాలంలో విపరీతమైన వేడి. కాబట్టి చలికాలంలో హీటర్లు, ఎండాకాలంలో కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వాడడం మామూలే. కాని ఠేంగ్డీజీ తాను ఉండే క్వార్టర్స్‌లో కూలరు కాని, ఎయిర్ కండిషనర్లు కాని పెట్టించుకోలేదు. అత్యున్నత స్థాయిలో ఉంటూ కూడా అవి లేకుండానే సాధారణ వ్యక్తిగానే జీవితాన్ని గడిపి ఆదర్శవంతులయ్యారు. ఢిల్లీలో తిరగడానికి కారు కొనిస్తామని ఎంతోమంది ముందుకు వచ్చినా వద్దనే వారు. అవసరమైనపుడు ట్యాక్సీని పిలిపించుకొని వెళ్లేవారు. ఆయన చూపిన బాటలోనే నడుస్తూ, నేటికీ ఢిల్లీలోని బీఎంఎస్ కేంద్ర కార్యాలయం కోసం సొంత కారు కొనలేదు. ఎండా కాలంలో ఎంతో వేడి ఉన్నా ఎయిర్ కండిషనర్లు పెట్టించలేదు.
సైకిల్ రిక్షాలో, ఆటో రిక్షాలో ఠేంగ్డీజీ ప్రయాణించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ సహచర బృందం కూడా ఆ రోజుల్లో రైళ్లలో రెండవతరగతి సాధారణ భోగిలో ప్రయాణించేవారు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేస్తూ, సంస్థకు డబ్బు ఆదా చేసేవారు.
దత్తోపంత్ ఠేంగ్డీజీ తరచుగా చెప్పే ఈ క్రింది విషయాలు ఎల్లవేళలా అన్ని సంస్థలకు కార్యకర్తలకు వర్తిస్తాయి.
– అతివృష్టి, అనావృష్టి ఏ విధంగా మంచిది కాదో, అదే విధంగా సంస్థ వద్ద ఎక్కువ ఆస్తులు, ఎక్కువ ధనం ఉండడం శ్రేయస్కరం కాదు. అవసరాలకు తగిన విధంగా ఉండాలి.
– మిగతా పేద ప్రజల ఉన్నతి కోసం, ధనవంతులు బాధలను భరించాలి.
(The best should suffer, so that the rest could prosper)
– చెడ్డ కొడుకు కంటే కొడుకు లేకపోవడమే మేలు.
(No son is better than a bad son)
– బుద్ధిజీవుల కోసం / నిపుణుల కోసం అన్వేషించాలి.
(Hunt for Talent)
– కార్యకర్తలు సుఖాలు కోరుకునే తత్వం (comfort loving) స్థాయి గురించిన అహంభావం (status consciousness) వస్తే సంస్థ నాశనం కావడం ఖాయం.
– దేశ పునర్మిర్మాణ కార్యంలో Now or Never అనడం సరైంది కాదు. మనం అంకిత భావంతో లక్ష్య సాధన కోసం నిరంతరం పనిచేస్తూ ముందుకు సాగాలి.
– కొత్తకాపు లక్ష్మారెడ్డి : బీఎంఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు, భాగ్యనగర్
జాగృతి వారపత్రిక సౌజన్యంతో..
ఇటువంటి మరిన్ని వ్యాసాలు కొరకు "జాగృతి వారపత్రికకు" చందాదారులుగా చేరండి...
దేశ హితం.. జాతి హితం.. కార్మిక హితం..
ReplyDelete