Breaking News

దత్తోపంత్‌ ఠేంగ్డేజీ - About Dattopant Thengadiji in Telugu

 


వారిని దూరంగా చూడటం, అప్పుడప్పుడూ ప్రక్కన కూర్చొని సందేహాలను నివృత్తి చేసుకోవడం మినహా వారి సాన్నిధ్యంలో పని చేసే అదృష్టం కలగలేదు. ప్రతినిధి సభల్లో, కార్యకారీ మండలి సమావేశాల్లో వేదిక ఎదురుగా మొదటి వరుసలో క్రిందనే కూర్చునేవారు. ఒకే భంగిమలో ఆ వయస్సులో అన్ని రోజులు నిష్ఠతో ఉండటం వారికే చెల్లింది. దగ్గరకు వెళ్లి కదిపితే చిన్న పిల్లాడికి పాఠం చెప్పినట్లుగా వివరించి సందేహానికి తావు లేకుండా విషయాలను స్పష్టం చేసేవారు. కార్యకర్త నిర్మాణంలో వారి శ్రద్ధ అందులో కన్పించేది. సమావేశాల మధ్యలో వారితో గడపటం ఇష్టంగా ఉండేది. అందరూ చాయ్‌ ‌కోసం వెళ్లినా చుట్టూ చూస్తూ కూర్చొనే వారు. మనం చాయ్‌ అం‌దిస్తే చాటంత ముఖంతో ఆనందంతో ధన్యవాదం చెప్పేవారు. సమావేశాల్లో అన్నీ వింటూ అందర్నీ గమనిస్తూ, చర్చలో పాల్గొన్న వారి హావభావాలను కూడా పరిశీలిస్తూ వ్యక్తిత్వాలను అంచనా వేసేవారు. సూక్ష్మదృష్టికోణం వారి బలం.

 

కదిలే నిఘంటువు 

ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని నడక ప్రారంభించేవారు. వారితో కలసి నడుస్తూ ఉంటే వారి జ్ఞాన భాండాగారం నుండి విషయాలు జాలువారుతుండేవి. అన్నీ గుర్తుపెట్టుకుని సమయానికి సరళంగా అందజేయడం ఆశ్చర్యమనిపించేది. జీవన దృష్టికి, జీవన లక్ష్యానికి, జీవన దిశకు అపసరమయ్యే ఆణిముత్యాలు మనకు లభించేవి. అనేక సంఘటనలు వివరిస్తూ ఉంటే వారి అధ్యయనం, విశ్లేషణ, అభివృత్తం, అభిరుచి, కౌశల్యం, సూక్ష్మదృష్టికోణం సాక్షాత్కరించి కదిలే నిఘంటువుగా దర్శనమిచ్చేవారు.

 

గుడిలోవ సమావేశాల్లో 

2000లో ప్రాంత ప్రచారకుల సమావేశాలు గుడిలోవలో నిర్వహించుకున్నాం. ఆరు రోజులు వారిని అతి దగ్గరగా చూసి ప్రేరణపొందే మహద్భాగ్యం లభించింది. ఏదీ అడిగేవారు కాదు. అక్కడ ఉండే ప్రబంధకులంతా పనిలో జోక్యం కల్గించుకొంటుంటే – ‘తర్వాత నేను పిలుస్తానని’ చెప్పి – బట్టలుతకటంతో సహా అన్ని పనులూ వారే చేసుకోవటం మాకు కష్టంగా అనిపించేది. సరళజీవనం, విరళ చింతనం, ప్రామాణికత, ఆదర్శజీవనం, మితప్రసంగం, అవిరళ కృషితో పాటు స్నేహం, ఆత్మీయత, సమదృష్టి, కార్యకర్తలను తీర్చిదిద్దే పద్ధతి మనకందరకూ అనుసరణీయం. ‘గురోస్తు మౌనమ్‌ ‌వ్యాఖ్యానం’ – గురువు గారు మౌనంగా భాషిస్తారనే నానుడికి నిలువెత్తు ఉదాహరణ ఠే•ంగ్డేజీ.

 

సామాజిక సమరసత

మన సమాజశిల్పులైన రుషులు, సాధువులు, సంతులు, మునులు, శ్రేష్ఠ కర్మయోగులు, మనసమాజం సమరసత, ఏకరసతతో కలియడానికి ఒక చక్కని వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరాయి పాలనలో ఆ వ్యవస్థల్లో వచ్చిన వికృతుల కారణంగా సమాజంలో అనేక సమస్యలు, సంక్లిష్టతలు, అసమానతలు, విషమతలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ తొలగించి సామాజిక సమరసతను పున:ప్రతిష్ఠించడమే మన కర్తవ్యం. దానికోసం చట్టాలు, ప్రభుత్వాలు చేసేది అతిస్వల్పమే. సామాజిక పరివర్తన కోసం పరితపించే సామాజిక కార్యకర్తల నిర్మాణం, సామాజిక నేతృత్వం, సామాజిక మార్పుకు అనుగుణమైన మానసిక స్థితిని సమాజంలో నిర్మాణం చేయడం అతి ముఖ్యం. దానివలననే సమాజం బలోపేతం అవుతుంది. వర్ణ, కులాలకతీతంగా ‘మనమందరం హిందువులం – బంధువులం’ అని భావించటమే నిజమైన సామాజిక సమరసత. ఈ దిశగా దత్తోపంత్‌జీ సామాజిక సమరసతా మంచ్‌ ‌ద్వారా విశేష కృషి చేశారు. వారు అనేక మంది ప్రముఖులను, సంస్కర్తలను, చింతకులను, నేతలను, కలసి ఈ సమస్త విషయాలను లోతుగా చర్చించారు, ఒప్పించారు కూడా. ఈ పనిని జీవన వ్రతంగా స్వీకరించి ముందుకు సాగే సామాజిక కార్యకర్తల బృందాన్ని నిర్మించిన శిల్పి దత్తోపంత్‌జీ.

 

లోకహితం మమ కరణీయం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యాన్ని దర్శించడానికి, దాని ప్రభావాన్ని గ్రహించడానికి సరైన సాధనం కార్యకర్త. సమాజంలో తిరుగుతూ అందరికీ కన్పించేవాడు స్వయంసేవక్‌. ‌సంఘ భవ్య, దివ్య, ధ్యేయం అలాగే విశిష్ట కార్యపద్ధతికి అనుగుణంగా కార్యకర్త వ్యక్తిత్వం, కర్తవ్య నిష్ఠ, వ్యవహారశైలి ఉండాలని తరచూ దత్తోపంత్‌జీ చెబుతుండేవారు. భగవంతుని దర్శనం భక్తుడనే మార్గంద్వారా జరగాల్సి వచ్చినపుడు భక్తుడెలా ఉండాలో అలా కార్యకర్త ఉండాలని ‘కార్యకర్త’ పుస్తకంలో సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను వివరించారు. ఆ పుస్తకానికి ప్రస్తావనా వాక్యాలు రాస్తూ మా.గో. వైద్య గారు ఇది ప్రత్యక్షానుభవంతో లభించిన మేలిమి జ్ఞానంతో నిండి ఉన్న ఒక ఉపనిషత్తు అన్నారు. నిజంగా ఇది సంఘోపనిషత్తు. కార్యకర్తలందరకూ సందర్భ గ్రంథం. మనందరం స్వార్థాన్ని తగ్గించుకుని లోకహితమే మనహితంగా భావించి సమాజసేవలో పునీతం కావాలని హితవు పలికారు దత్తోపంత్‌జీ. సమాజంలో వినమ్ర నేతృత్వానికి ప్రతీకగా కార్యకర్త ఉండాలనేది వారి అభిలాష.

హిందూ ఆలోచనా విధానం, పరంపరలోనే ప్రాపంచిక చింతన ఉంది. మనం విశాల విశ్వంలో ఒక భాగంగా భావించి దాన్ని సంకల్పరూపంలో కూడా చెప్పుకుంటాం. ప్రపంచమంతా ఒక కుటుంబమనేది మన ప్రేరణా వాక్యం – ‘వసుధైక కుటుంబకమ్‌’. ఇప్పుడు కనిపిస్తున్న వినిపిస్తున్న వైశ్వీకరణ అంటే పెట్టుబడిదారీ విధానం, అత్యాశ, దోపిడీ, పీడన, స్వార్థ చింతన, ఇతర ఆర్ధికవ్యవస్థల పైన పెత్తనం. కాని పరస్పర సహకారం, సహయం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో కూడిన వసుధైక కుటుంబకం భారతీయ ఆలోచనా విధానంగా దత్తోపంత్‌జీ చెబుతుండేవారు. ఇదే ప్రపంచ శాంతికి, సౌభాగ్యానికి పరిష్కారమని ప్రపంచ దేశాలు కూడా విశ్వసిస్తున్నాయి.

 

స్వదేశీ – ఆత్మనిర్భర భారత్‌

‌దేశభక్తి నిజజీవితంలో ప్రకటించడం, ఆవిష్కరించడం స్వదేశీ. ‘జాతీయ భావంతో మనం ఇతర దేశాలపైన ఆధారపడటం తగ్గించి స్వదేశీ భావంతో మెలగడం ఆత్మనిర్భర భారత్‌కు నాంది’ అనే దత్తోపంత్‌జీ మాటలను ప్రస్తుత ప్రధాని ఆచరణలో పెడుతున్నారు. స్థానీయ ఉత్పత్తుల గూర్చి, విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలన్నీ ఈ దిశగా ముందుకు సాగే అడుగులు మాత్రమే. స్వదేశీ అనేది కేవలం ఆర్థిక నినాదం కాదు. సమాజంలో అన్ని రంగాలను ప్రభావితం చేసే తారకమంత్రంగా దత్తోపంత్‌జీ అభిలాషించారు. స్వదేశీ భావానికి పరాకాష్ట అంటే మన శాశ్వత జీవన లక్ష్యం, సమాజ ప్రవృత్తి, ప్రకృతులు, సామాజిక , ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల సందర్భంలో మనదైన ప్రతిభ, కౌశలాలు, సంపదలు, ఇతర వనరుల ఆధారంగా అవగాహన, వికాసం దిశగా ప్రయాణం – అలాగే జాతీయ సర్వతోముఖాభివృద్ధిని ఆవిష్కరించుకోవడం.

అనేక ఆర్థిక అంశాలపై వారి ఆలోచన దేశానికి మార్గదర్శకం. ఆయనొక• జ్ఞానఖని, సామాజిక శిల్పి, నిర్ధిష్ట ఆలోచన, దార్శికతతో సిద్ధాంతం-ఆచరణల మధ్య సమతౌల్యం కోసం కృషిచేసిన వ్యక్తిగా సదా ప్రాత:స్మరణీయులు. వారి జ్ఞాన సముద్రంలో కొన్ని బిందువులను మాత్రమే ప్రస్తావించాను. ఠేంగ్డేజీ జన్మశతాబ్ది సంవత్సరంలో ఆయన జీవితంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆచరిద్దాం.

 

దూసి రామకృష్ణ : ఆర్‌ఎస్‌ఎస్‌, ‌దక్షిణమధ్య క్షేత్ర సహ సంఘచాలక్‌

‌విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు, విశాఖ

 

జాగృతి వారపత్రిక సౌజన్యంతో..

 

జాగృతి వారపత్రికకు చందాదారులుగా చేరండి...


1 comment:

  1. అనేక సంఘటనలు వివరిస్తూ ఉంటే వారి అధ్యయనం, విశ్లేషణ, అభివృత్తం, అభిరుచి, కౌశల్యం, సూక్ష్మదృష్టికోణం సాక్షాత్కరించి కదిలే నిఘంటువుగా దర్శనమిచ్చేవారు.

    ReplyDelete