Breaking News

అంతర్జాతీయ యోగ దినోత్సవం-International Yoga Day


అంతర్జాతీయ యోగ దినోత్సవం(జూన్ 21) సందర్భంగా పెద్ద ఎత్తున యోగ ప్రదర్శనలు దేశవిదేశాల్లో నిర్వహిస్తున్నారు. అందరిచూపులు భారత్ వైపే ఉన్నాయి. ఈ సందర్భంగా అసలు సనాతన ధర్మం ప్రకారం యోగ సాధన అంటే ఏమిటి? ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
‘యోగ’ అంటే సమాధి అని అర్థం. యోగాలో ఎనిమిది అంగాలు లేదా భాగాలు ఉన్నాయి. ‘యమ నియమ ఆసన
ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియోష్టావజ్ఞాని’ (పతంజలి యోగసూత్రాలు 2-29). ఒక చెట్టు తీసుకుంటే వేళ్ళు, కాండం, కొమ్మలు, ఆకులు, బెరడు, చెట్టురసం, పువ్వులు, కాయలు దానికి అంగాలు ఎలా అవుతాయో అలాగే యోగాకు కూడా కొన్ని అంగాలు ఉన్నాయి. ఇవి పరిపూర్ణ వికాసానికి తోడ్పడతాయి.

యోగ వృక్షం : 

వేళ్ళు – యమ
కాండం – నియమ
కొమ్మలు – ఆసనాలు
ఆకులు –ప్రాణాయామం
బెరడు- ప్రత్యాహారం
చెట్టురసం – ధారణ
పువ్వులు – ధ్యాన
కాయలు – సమాధి
ఒక చెట్టు సజీవంగా నిలబడటానికి ఎనిమిది అంగాలు ఎంత ముఖ్యమో, ఒక సాధకుడు పూర్ణ యోగాన్ని సాధించడానికి యమ నియమాది అంగాలు కూడా అంతే అవసరం. అందుకే సనాతన ధర్మంలో వృక్షాన్ని సత్పురుషులతో పోల్చారు. చెట్లు తాము ఎండలో నిలబడి ఇతరులకు నీడను ఇస్తాయి. పళ్ళను కూడా ఇతరులకే ఇస్తాయి. అలాగే యోగి తనను తాను మెరుగుపరుచుకుంటూ పరోపకారాన్ని మాత్రమే చేస్తూ ఉంటాడు. ఇంతటి వైశిష్ట్యం కలిగిన యోగ సాధన కేవలం కొన్ని ఆసనాల ద్వారా సాధ్యపడుతుందా? నేడు యోగాసనాల పేరిట మన చూస్తున్న భంగిమల ప్రదర్శనల వల్ల వ్యక్తిలో పరివర్తన కలుగుతుందా? ఆసనాలకు, వ్యాయమాలకు తేడా ఏమీ లేదా? ఒక జిమ్నాస్టిషియన్ ఆసనాలు వేసేవారికంటే బాగా శరీరాన్ని వంచగలుగుతాడు. కానీ అతన్ని యోగి అనగలుగుతామా? ఇలాంటి భంగిమలు, విన్యాసం వల్ల రోగాలు తగ్గుతాయా? యోగా లక్ష్యం రోగాలు తగ్గించడం మాత్రమేనా? క్రమపద్దతిలో చేసే శారీరక వ్యాయామం వల్ల భౌతికవ్యవస్థలు బలపడతాయి. అంటే గుండె బలపడుతుంది. కండరాలు గట్టిపడతాయి. నరాల పటుత్వం పెరుగుతుంది. జీర్ణక్రియ చురుకుగా అవుతుంది. ఇవన్నీ అనేక ఇతర వ్యాయామాల వల్ల కలుగుతుంటే ఆసనాలు ఎందుకు వేయాలి అనే విషయం తెలుసుకోవాలి.
మనిషి శరీరంలోని వంద ట్రిలియన్ కణాల సమూహం, ఇతర అవయవాలు, వాటి కూర్పు మొదలైనవన్నీ అన్నమయ కోశం కిందకి వస్తాయి. ఇదికాక మరో నాలుగు కోశాలు మానవ శరీరంలో ఉన్నాయని యజుర్వేదం చెపుతోంది. అవి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. వీటి గురించిన వివరణ తైత్తరీయోపనిషత్తులో ఉంది.

ప్రాణమయ కోశం:
యావత్ శరీరాన్ని ఆవరించి ఉన్నది ప్రాణం. గుండెలో 101 ప్రధాన నాడులు ఉన్నాయి. ఈ 101 ప్రధాన నాడులకు వంద చొప్పున నాడీ  భేదాలు ఉన్నాయి. అంటే 101 X 101 =10,100 నాడులు. వీటిని ప్రతిశాఖా నాడులంటారు. ప్రతిశాఖా నాడి ప్రతి ఒక్కటి తిరిగి 72 వేల నాడులుగా విడిపోతున్నది. అంటే 10,100 X 72,000 = 72, 72,00,000. మొత్తం నాడులు 101 +10,100 +72,72,10,201 = 72,72,10,201.  సూర్యుడు ఎలాగైతే తన కోట్లాది కిరణాలతో  దశదిశలా కాంతిని విరజిమ్ముతున్నాడో అలాగే ప్రాణం గుండె నుండి కోటానుకోట్ల నాడుల ద్వారా శరీరమంతటా వ్యాపిస్తోంది. ఈ ప్రాణమే ప్రాణ, అపాన, సమాన, ఉదాన వ్యానములనే పంచప్రాణములుగా, నాగ,కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనే ఉప ప్రాణాలుగా విడివడి జీవక్రియలకు కారణమవుతోంది.

మనోమయకోశం: ఈ కోశంలో మనస్సు త్వక్, చక్షు, ఘ్రాణ, రసన, నేత్రాలనే జ్ఞానేంద్రియాలు, వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలనే కర్మేంద్రియాల ద్వారా తన కార్యకలాపాలు సాగిస్తుంటుంది. దీనివల్లనే ఇష్టాఇష్టాలనే ద్వంద్వ భావాలూ పుడుతుంటాయి. మనస్సు చంచలమైనది. ఇది ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించి, మననం చేసి, అహంకారంతో అభిమానించి, బుద్ది ద్వారా ‘చేస్తానని’ నిర్ణయించి చర్యకు సిద్దమవుతుంది. మంచిచెడులనే విచక్షణను విడచి బుద్దిని కూడా పక్కదోవ పట్టించగలదు మనస్సు. ప్రాణగతిలో కూడా పరివర్తన తేగలదు. అందుకనే ఇది సుఖదు:ఖాలకు కారణమవుతోంది.
విజ్ఞానమయకోశం:
ఇది సమస్త విజ్ఞానానికి కేంద్రం. దీనివల్లనే శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా సాగుతాయి. యుక్తాయుక్త విచక్షణ దీనివల్లనే కలుగుతుంది. ఉదాహరణకు శరీరంలో గుండెకు నిమిషానికి 250 మి.లీ, మెదడుకు 750 మి.లీ, కాలేయానికి 500 మి.లీ, మూత్రపిండాలకు 1200 మి.లీ ల రక్తాన్ని ఎక్కువ, తక్కువ కాకుండా ఎవరు అందించగలుగుతున్నారు?ఇలా ఇంత కచ్చితంగా పని చేసే మేధస్సే అంతరంగికమైన విజ్ఞానం. మన శరీరంలో ఎముకలు ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్తవి ఏర్పడుతుంటాయి. ప్రతి 6 వారాలకు పాత కాలేయం పోయి కొత్తది వస్తుంటుంది. ప్రతినెల మన చర్మం మారిపోతుంటుంది. ప్రతి 4 రోజులకు ఒకసారి మన జీర్ణాశయంలోని లైనింగ్ పొర మారుతుంటుంది. అంతెందుకు నాలుగైదు సంవత్సరాల కాలంలో శరీరం మొత్తం కొత్తగా రూపుదిద్దుకుంటుంది. జీవం లేని పదార్థాన్ని ఆహారంగా తీసుకుని జీవాన్ని నిలుపుతూ పై మార్పులన్నింటికీ కారణమయ్యేది అంతంగికమైన విజ్ఞానమయకోశమే. మనం నిద్రించినప్పుడు శరీర వ్యవస్థలలో ఏర్పడిన లోపాల్ని సరిచేసి మర్నాటికోసం మనల్ని సిద్దం చేసేది కూడా ఈ విజ్ఞానకోశమే. ఎంతకాలం ఈ విజ్ఞానకోశం నిరంతరంగా పని చేస్తుంటుందో అంతవరకు రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. ఈ విజ్ఞానం ప్రసరించకపోవడమే ‘ఆటో ఇమ్యూన్ డిసీజెస్’ కు కారణం.
ఆనందమయకోశం:
ఈ కోశంలో మనిషి సంపూర్ణమైన ఆనందాన్ని సహజంగా కలిగి ఉంటాడు. అయితే అజ్ఞానం వల్ల ఆనందమంటే బయట నుంచి ఎక్కడ నుంచో వస్తుందనుకుని, దానిని తెచ్చిపెడతయనుకునే మార్గాలు, మాధ్యమాల వెంటపడుతుంటాడు. కానీ నిజమైన ఆనందం పొందలేకపోగా దు:ఖం కొని తెచ్చుకుంటాడు. కనుక ఆనందమనేది ఎక్కడ నుంచో తెచ్చుకోగలిగినది కాదు. తెలుసుకుని, అనుభవించగలిగేది. మనసు ఆనందంగా ఉన్నపుడు ఏమవుతుందో గమనిస్తే ఆ ఆనందం వల్ల ప్రశాంతత కలిగి, ఏ ఆలోచన లేని స్థితి అనుభవిస్తాం. ఇంద్రియాలన్నీ లోపలివైపుకు మరలి మనస్సులో లీనమవుతాయి. ఈ స్థితినే ఆదిశంకరులు ‘శాంతం సుఖం అద్వైతం’ అని అన్నారు. వ్యక్తి శరీర, శ్వాస, మనోబుద్దుల నుంచి ఎదిగి తనలో తాను ఒదిగిపోతాడు. బీద, గొప్ప, పెద్ద, చిన్న అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేది ఈ పరిపూర్ణమైన ఆనందస్థితి మాత్రమే. ఎన్ని రకాలైన మార్గాలలోనైనా ప్రతి ఒక్కరూ పొందవలసింది, పొందాలని అప్రయత్నంగా ఆరాటపడేదీ ఈ స్థితినే. ఎందుకంటే సత్ చిత్ ఆనంద స్వరూపమే ఇన్నిరకాలుగా మారింది కనుక. ఈ జ్ఞానం,ఎరుక లేనప్పుడు జీవితమంతా గందరగోళమే.
యోగాంగాలు, ముఖ్యంగా ఆసనాలు , ఈ స్థితికి చేరడానికి ఉపయోగపడతాయి. అది ఎలా అన్నది పతంజలి మహర్షి చక్కగా వివరించారు. యోగపు ప్రధాన లక్ష్యం మనస్సు, బుద్ది, అహంకారానికి పట్టిన భ్రమల్ని తొలగించి, ఆనందస్వరూపాన్ని తెలియచెప్పడమే. రోగనివారణ ప్రధాన ఫలితం కాదు, కేవలం అనుబంధమైనది మాత్రమే. మరణం వచ్చే మార్గాల్లో రోగం ఒకటి తప్ప, అదే మరణం కాదు. అలాగే శరీరం జీవికి సాధనం లేదా ఉపాధి తప్ప అదే జీవి కాదు. ఈ విషయం మనస్సులో స్థిరంగా నాటుకోవడానికి ఆసనాల అభ్యాసం చాలా అవసరమని యోగులు గుర్తించారు.
‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అని ధర్మసాధనకి శరీరం ఒక సాధనం కాబట్టి ఒకవైపు దానిని శక్తివంతం చేస్తూ, ప్రాణ, మనో, విజ్ఞాన వీధుల్ని దాటి ఆనందమయ స్వరూపంలో ఎలా లయం కావాలో పతంజలి మహర్షి వివరించారు. కేవలం విషయపరిజ్ఞానం వల్లకాక అనుభూతివల్ల మాత్రమే సరైన జ్ఞానం కలుగుతుంది. ఈ అనుభూతికి శరీరం, మనస్సు రెండూ అవసరమే. కానీ శరీరానికి సహజంగా తామసిక లక్షణం ఎక్కువ. ఈ లక్షణాన్ని తొలగించుకోవాలి. అప్పుడే అది గురుత్వం(భారం) నుంచి లఘుత్వానికి(తేలికతనం)మారుతుంది. మనసు చంచల స్వభావాన్ని కలిగి పరుగులు పెడుతుంది. కనుక శరీరం, మనసులు రెండింటికి ఆసన అభ్యాసంలో నిర్దుష్టమైన స్థితిని పతంజలి సూచించారు. అదే `స్థిర సుఖమాసనమ్’(46వ సూత్రం, రెండవపాదం, పతంజలి యోగసూత్రాలు). ఇక్కడ స్థిరత్వం శరీరానికి, సుఖం మనసుకు సంబంధించినవి. శరీరంలో బద్ధకం పూర్తిగా తొలగి, తేలికపడి స్థిరంగా, స్థాణువులాగా అంటే రాయిలా ఉండడం ఆసనానికి మొదటి లక్షణం. అలాగే మనసులో చంచలత్వం పోయి నిర్దుష్టమైన మార్గంవైపు పయనించి, అనంతంలో లయమవడం రెండవ లక్షణం. ఏ ఆసనానికైనా ఈ రెండు లక్షణాలు లేకపోతే అది యోగాంగం కాదు. ఇలాంటి అభ్యాసం సాధకుడిలో శరీర పటుత్వాన్నేకాక మానసిక పరిపక్వతను కూడా తెస్తుంది. నేడు మనం చేస్తున్న ఆసనాలవల్ల నిజంగా మనలో ఈ మార్పులు కలుగుతున్నాయా, లేదా అన్నది గమనించుకోవాలి. ఈ స్థిరత్వం, సుఖం పొందడానికి అవసరమైన మెళకువల్ని పతంజలి మహర్షి తరువాతి సూత్రంలో వివరించారు. `ప్రయత్ని శైథిలన్ అనన్త సమాపత్తిఖ్యామ్’ (2-47). అంటే తన శరీర సామర్ధ్యాన్ని బట్టి ఆసన స్థితిని చేరాలితప్ప బలవంతంగా ప్రయత్నించకూడదు. శరీరాన్ని బలవంతంగా వంచడం, తిప్పడం వంటివి చేయకూడదు. దీనినే ప్రయత్న శైథిల్యమంటారు. ఇలా మెల్లగా ప్రయత్నించడంవల్ల శరీరం తేలికపడి స్థిరత్వాన్ని పొందుతుంది. ఇక్కడనుంచి మనసు క్రమంగా శరీరం నుంచి శ్వాసపైకి, ఆ తరువాత ప్రాణశక్తికి నిలయమైన అనంత ఆకాశంపైకి మరల్చాలి. ఈ స్థితిలో సాధకుడు శక్తిమేరకు నిలిచిఉండాలి. అప్పుడు శరీరం తేలికపడి స్నాయువులలో ఒత్తిడి దూరమవుతుంది. ప్రాణం చలనం పొంది శరీరమంతటా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే సాధకుడు తన మనసును శరీరం నుంచి వేరుచేసి అనంతంపై నిలుపుతాడో అప్పుడు ప్రాణగతి క్రమబద్ధమై మనసుకు స్థిరత్వం వస్తుంది. అప్పుడే శరీర క్రియల్ని సక్రమంగా నిర్వర్తింపచేసే విజ్ఞానం చైతన్యవంతమవుతుంది. దీనివల్లనే శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నేడు మనం చేసే ఆసనాల్లో ఈ రకమైన అనుభవానికి స్థానం ఉందా? లేదా? అన్నది మనం పరిశీలించుకోవాలి. ఆధునిక వైద్య పద్దతి ప్రకారం `నెర్వ్ ఇంపల్స్ ట్రావలింగ్ రేట్’ ను బట్టి సాధకుడి శరీర స్థితిని అంచనా వేయవచ్చును. పతంజలి సూత్రాల ప్రకారం అభ్యాసం చేసినవారిలో ఈ రేట్ తక్కువగా ఉంటుంది. ఇలా శరీర భావన నుంచి బయటకు వచ్చి మనసుని అనంతునిపై నిలిపి అభ్యాసం చేస్తుంటే క్రమంగా ఈ శరీరం నేనుకాదు అనే భావం బలపడి ఆంతరంగిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఏ ఆనందాన్ని పొందడానికి అనేక రకాలుగా పాట్లుపడుతుంటామో దానిని సాధకుడు ఆసన అబ్యాసంలో అనుభవించగలుగుతాడు. ఇలా సాధకుడిలో అనేక మార్పులు కలిగి చక్కని వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఇందుకు సనాతన ఆసన అభ్యాసమే మార్గం. ఈ అభ్యాసం కేవలం ధ్యానానికి సంబంధించినది మాత్రమేకాదు శరీర ధర్మ పోషణకు ఉపయోగిస్తుంది కూడా.
శరీరంలో ఒక్కొక్క అవయవానికి దాని ప్రత్యేక లక్షణం ఉంది. దీనినే సనాతన పద్దతిలో `శరీర ధర్మం’ అని చెప్పారు. `ధర్మ ఏవ హతోహన్తి, ధర్మో రక్షతి రక్షితః’ అన్నట్లుగా ధర్మాన్ని అతిక్రమిస్తే ఆ అవయవానికి జబ్బు చేస్తుంది. మన ప్రవర్తన లోపాలవల్ల శరీర అవయవాలు ధర్మాన్ని అతిక్రమిస్తే రోగం కలుగుతుంది. దానిని మళ్ళీ దారిలో పెట్టడానికి ఉపకరించేవే ఆసనాలు. హఠయోగం ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినవే ఈ ఆసనాలు. సృష్టిలోని ప్రతిజీవికి దాని ప్రత్యేకత ఉంటుంది. మనిషికి ఉన్న యుక్తాయుక్త విచక్షణా శక్తే అతన్ని ఇతర జీవులకంటే ఉన్నతుడిగా నిలుపుతోంది. కొందరు దానిని మరచిపోయి పాపకార్యాలకు పాల్పడి రోగాలబారిన పడుతున్నారని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. యోగమార్గం ద్వారా అలాంటివాళ్లు తిరిగి ధర్మ మార్గాన్ని అవలంబించవచ్చని మహర్షులు సూచించారు. ప్రకృతిలోని వివిధ జీవరాసులకు సంబంధించిన ఆసనాల్ని అభ్యసించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చును. అందుకనే మనిషి జీవరాశులపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దీనినే భూతయజ్ఞమని సనాతన ధర్మం చెపుతోంది. కుక్కుట(కోడి), మయూర(నెమలి), హంస, వృశ్చిక(తేలు), శలభ(మిడత) మొదలైన ఆసనాలు ఇలాంటివే.
సనాతన పద్దతి ప్రకారం చేసే ఆసన అభ్యాసం సాధకునితోపాటు అతని చుట్టుపక్కల ప్రభావాన్ని చూపుతుంది. హింస, అసత్యాలను పెరగనీయదు. ఇంద్రియభోగాలకు దారితీయకుండా నిజమైన ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రకృతిపట్ల కృతజ్ఞతను కలగజేసి అహంకారాన్ని పెరగనివ్వదు. భోగలాలసతకు అలవాటుపడినవారికి, ముఖ్యంగా దానికి నిలయమైన పాశ్చాత్య దేశాల్లో ఈ యోగాభ్యాసం ఎంతో అవసరం. దీనివల్ల అక్కడ పెరుగుతున్న నేరాలు, హింస వంటివి తగ్గి వాళ్ళు కూడా ప్రశాంతమైన మనసుతో ఆనందాన్ని అనుభవించడానికి వీలు కలుగుతుంది. అటువంటి విద్యను ప్రపంచానికి అందించినందుకు భారతీయులుగా మనమందరం గర్వించాలి.
జి.వి. రమణ
Source - VSK Telangana

1 comment:

  1. అంతర్జాతీయ యోగ దినోత్సవం(జూన్ 21) సందర్భంగా పెద్ద ఎత్తున యోగ ప్రదర్శనలు దేశవిదేశాల్లో నిర్వహిస్తున్నారు. అందరిచూపులు భారత్ వైపే ఉన్నాయి. ఈ సందర్భంగా అసలు సనాతన ధర్మం ప్రకారం యోగ సాధన అంటే ఏమిటి? ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

    ReplyDelete