Breaking News

కరొనా తో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోనున్నదా?

కరొనా తో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోనున్నదా ?
మన కర్తవ్యం ఏమిటి? స్వదేశీ కాపాడుతుందా?


కోవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ కాలంలొ ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోయాయి. వ్యాపారాలు నిలిచిపొయాయి. ఇతర రాష్ట్రాల కు చెందిన వేలాది మంది వలస కార్మికులు పరిశ్రమల్లొ పనులు లేక,రవాణా సౌకర్యం లేక కాలి బాట పట్టి, సుమారు 700 కి మి మండుటెండలొ నిద్రాహారాలు మరిచి అలుపెరగక నడుస్తూనే వున్నారు.
దారిలో నిత్యావసర వస్తువులు,భోజనం పెట్టి సేవా సంస్థలు తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నాయి. ఏది ఏమయినా సుమారు రెండు నెలల పాటు దేశమంతా ఆర్థిక,వాణిజ్య, వ్యాపార క్రియా కలాపాలు తాత్కాలికంగా ఆగిపోవటం దేశ చరిత్ర లొనే అసాధారణ విషయం. కేంద్ర ప్రభుత్వం 1లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజి ప్రకటించింది. ఈ 3 నెలల పాటు ఏ ఒక్క పౌరుడు కూడా ఆకలితో అలమటించ రాదని,రైతులు,రైతు కూలీలు, పారిశుద్ద్య కార్మికులు,వైద్య సిబ్బంది, ఫ్యాక్టరీ కార్మికులు ఇలా అన్ని వర్గాల వారికి ఈ పథకం ఫలితాలు అందాలని ప్రభుత్వ ఆశయం.

ఈ లాక్ డౌన్ ని నిర్బంధంగా భావించక,అవకాశంగా మలచుకొని, made in india అనేది కేవలం నినాదాలు, ప్రచారానికి మాత్రమే కాకుండా ప్రజలకు కావాల్సిన ఉత్పత్తులను అందించేందుకు యజమానులు, కార్మికులు,విధాన కర్తలు కృషి చేయాలి.విదేశీ వస్తువులపై ముఖ్యంగా చైనా పై ఆధార పడవద్దని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది.

అయితే స్థానీయ పరిశ్రమలు నడవాలంటే పెట్టుబడికి వడ్డీ వ్యాపారుల నుండి తెచ్చి అధిక వడ్డీ చెల్లించలెక సతమతమవుతున్నారు.ప్రైవేట్ వ్యాపారుల నుండి అప్పు తెచ్చే విషయం లో నియమ నిబంధనలు సరళంగా వుండాలి. పరిశ్రమలకు తక్కువ వడ్డీకి ఇవ్వాలి. పరిశ్రమలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దెల భారం తగ్గించాలి.

కొవిడ్ 19 వల్ల దేశం ఆర్థికంగా పూర్తిగా ఆర్థిక మాంద్యం లో చిక్కుకున్నదంటూ, సోషల్ మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చెసి, కార్మికులను, యువకులను తప్పు దారి పట్టించి సమాజం లో అశాంతిని వ్యాపింప చేసి,అస్థిరతను తెచ్చే శక్తులు పొంచివున్నాయి.ఉద్యోగాలు పోయి,ద్రవ్యోల్బణం, పేదరికం పెరిగి ప్రజలు చాలా అవస్థలు పడతారని,ఈ శక్తులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడి గందరగోళం సృష్టిస్తాయి. అయితే లాక్ డౌన్ అనంతరం ప్రజాజివనం సాధారణ స్థాయికి రావడానికి కొంత సమయం పడుతుంది.వ్యాపారాల్లో సహజంగానే మందకొడితనం వుంటుంది. కొన్ని పరిశ్రమలు ఎక్కువ,మరికొన్ని తక్కువ ఒత్తిడికి గురవుతాయి కూడా..

అంతే కాని మొత్తానికి మొత్తమే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోదు. ప్రజలు కొనడం లేదు కాబట్టి వినిమయం తగ్గి,ఉత్పత్తి కూడా తగ్గుతుంది. లాక్ డౌన్ తరువాత వినిమయం పెరిగి, ఉత్పత్తి పెరిగి,ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో మన ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి,అన్ని రంగాలలో స్వావలంబన సాధించడానికి ఇదొక అవకాశం. లేక పోతే విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా మార్కెట్లో డంపింగ్ అవుతాయి.

కావున విదేశీ కి ప్రత్యామ్నాయ స్వదేశీ వస్తువులను ఎంపిక చేసుకొవాలి.ఆహార ధాన్యాల విషయం లో స్వావలంబన సాధించినట్లుగా, పారిశ్రామిక ఉత్పత్తులలో కూడా స్వావలంబన రావాలంటే ప్రజలు ముఖ్యంగా యువకులు సృజనాత్మక శక్తి తో,వృత్తి నైపుణ్యం పెంచుకుంటూ కష్టపడి పనిచేసి ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలబడాలి. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ప్రామాణికత తో, విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడే విధంగా, విదేశీ వస్తువులతో పోటీ తట్టుకునే విధంగా తెలివితొ, నిరంతరం కృషి చేయాలి.

స్వదేశీ అంటే వస్తువులతో పాటు స్వభాష, సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, దేశభక్తి భావన తో ఉత్తమ పౌరులుగా కర్తవ్యాన్ని నిర్వహించటం.

- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. స్వదేశీ అంటే వస్తువులతో పాటు స్వభాష, సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, దేశభక్తి భావన తో ఉత్తమ పౌరులుగా కర్తవ్యాన్ని నిర్వహించటం.

    ReplyDelete