గుండె సంబంధ రోగాలు – యోగ చికిత్స
మానవ శరీరంలో అత్యంత ప్రముఖ అవయవం ‘హృదయం’. అమ్మ కడుపులో ఉండగానే హృదయం పనిచేయటం మొదలవుతుంది. చివరి శ్వాస వరకు పని చేస్తూనే ఉంటుంది.
ప్రస్తుత కాలంలో మనిషిపై పని ఒత్తిడి పెరిగి హృదయ సంబంధ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. జీవన విధానాలు కొన్ని మార్చుకుంటే మన గుండె ఆరోగ్యంగా నిండు నూరేళ్లు పదిలంగా ఉంటుంది.
గుండె నొప్పి (హార్ట్ ఎటాక్) లక్షణాలు
– విపరీత ఆయాసం
– ఊపిరి సరిగా అందదు
– ఛాతిలో నొప్పి
– కళ్ళు తిరగటం
– ఎడమ చేతికి తిమ్మిర్లు
– పాదాలు, చేతులు చల్లబడిపోవటం
ఈ లక్షణాలు ఉంటే దానిని గుండెనొప్పిగా సందేహించవచ్చు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
1. ఇసిజి (ECG) – ఎలక్ట్రో కార్పియో గ్రామ్
2. టియంటి (TMT) – ట్రేడ్ మిల్ టెస్టు
3. 2డి ఎకో
గుండె రోగాలకు కారణాలు
అనేక రకాల కారణాలు ఉన్నాయి.
– ధూమపానం, మద్యపానం.
– శరీరంలో అధికంగా కొవ్వు
నిల్వలు, జంతు సంబంధ కొవ్వు
– అధిక రక్తపోటు (హై బి.పి.)
– అదుపులో లేని షుగరు వ్యాధి
– మానసిక ఒత్తిడి (Stress)
– తిని కూర్చోవటం, శ్రమలేని జీవన విధానం
– అధిక బరువు
– వంశపారంపర్యం – జాగ్రత్తలతో నియంత్రించవచ్చు.
– మంచి కొవ్వు (HDL) తగ్గటం
– చెడు కొవ్వు (LDL) పెరగటం
– రిఫైరడ్ వంటనూనెలు వాడటం
– శారీరక శ్రమ లేకపోవటం
– జంక్ ఫుడ్స్ తీసుకోవటం
– కారం, మసాలా, రంగులు వంటివి ఎక్కువగా తీసుకోవటం
యోగచికిత్స
యోగ చికిత్స అనగా సమగ్రమైన చికిత్సా విధానం. ఇందులో ఆహారం, వ్యాయామం, శుద్ధ క్రియలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంలతో చికిత్సను పాటించవలసి ఉంటుంది.
ఆహారం
చికిత్సలో మొదటి ప్రాధాన్యం ఆహారానిదే.
– నిత్య జీవితంలో మన శారీరక శ్రమను బట్టి ఆహారాన్ని తీసుకోవాలి.
– జంతు సంబంధ కొవ్వులు తగ్గించాలి. వృక్ష సంబంధ కొవ్వులు (బట్టర్, వెజ్) తీసుకోవాలి.
– గానుగ నూనెలు వాడాలి. రిఫైన్డ్ నూనెలు వాడకూడదు.
– తక్కువ ఫైబర్ కలిగినవి ఆహారంగా తీసుకోవద్దు. (తెల్లటి బియ్యం, పొట్టు తీసిన గోధుమలు)
– ఆకు కూరలు, కూరగాయలు, ధాన్యాలు (తక్కువ పాలిష్), మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి
– నూనెలు తక్కువగా తీసుకోవాలి.
– మంచి నీరు ఎక్కువగా త్రాగుతుండాలి (4 నుంచి 5 లీటర్లు)
– కాఫీ, టీలకి బదులుగా హెర్బల్ టీ అలవాటు చేసుకోవాలి.
– ప్యాకెట్ ఆహారంలో రసాయనాలు కలుస్తాయి. ఇవి కలపకపోతే ప్యాకెట్‌లోని ఆహారం నిల్వ ఉండదు. కాబట్టి ప్యాకెట్‌లలో నిల్వ ఉంచిన ఆహారాలు, రంగులు కలిపిన ఆహారాలు తీసుకోకూడదు.
– మితాహారం ఎంతో మంచిది.
– ఆహారం తీసుకొనేటప్పుడు మనస్సు ప్రశాంతతో, ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ, బాగా నమిలి తినాలి.
– వయస్సు, శారీరక శ్రమను బట్టి ఆహారం మోతాదు నిర్ణయించుకోవాలి.
– రుచుల కోసమే ఆహారం తీసుకోకూడదు (మసాలాలు, వేపుళ్ళు)
– శారీరక ధృడత్వం, ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవాలి.
మానసిక మార్పు
– నిత్య జీవితంలో తృప్తి, ఆనందంతో జీవించటం అలవాటు చేసుకోవాలి.
– గీతలో చెప్పినట్లుగా ఎవరికైతే మితంగా ఆహారం, పని, వినోదం, నిద్ర, మితంగా ఉంటుందో వారు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలనైనా ఎదుర్కొనగలరు. కాబట్టి మితం (Moderation) పాటించటం అనేది మనశ్శాంతితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
వ్యాయామం
– సూక్ష్మ వ్యాయామం. ఇది వ్యాధి నిరోధకంగానూ, నివారకంగానూ పనిచేస్తుంది.
– సూర్య నమస్కారాలు. వీటిని గుండె సంబంధ సమస్యలు రాముందు మాత్రమే సాధన చేయవచ్చు. గుండె సమస్య వచ్చిన తరువాత చేయరాదు.
సూర్య నమస్కారాలు చేసిన తరువాత రెండు నిమిషాలు శవాసనం చేయాలి. వయస్సు, శక్తిని బట్టి ఎన్ని సార్లు చేయాలో నిర్ణయించుకోవాలి.
– ఆసనాలు
1. అర్థకటి చక్రాసనం
ఇది కూడా నిలబడి చేసే ఆసనమే.
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1. కుడి చేతిని సాచి పైకి ఎత్తాలి. భుజం చెవికి తగులుతూ ఉంటుంది. ఈ స్థితిలో చేయి పైకి లాగి ఉంచాలి.
2. నడుము పై భాగాన్ని నెమ్మదిగా ఎడమవైపుకు వీలైనంత వంచాలి. నడుముతో పాటు పైకి ఎత్తిన చేయి కూడా వంగుతుంది. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. నడుమును సాధారణ స్థితికి తేవాలి. నిటారుగా ఉండే ప్రయత్నం చేయాలి. పైకెత్తిన చేయి అలాగే ఉంటుంది.
4. పైకెత్తిన కుడిచేతిని కిందకు దించుతూ స్థితికి రావాలి. విశ్రాంతి పొందాలి. ఇదే విధంగా ఎడమచేతితో ప్రారంభించి, కుడివైపుకు వంగుతూ చేయాలి.
లాభాలు : కాలేయం ప్లీహముల మీద ఒత్తిడి కలగటంవలన చక్కగా పనిచేస్తాయి. ప్రక్కటెముకలు, ఊపిరి తిత్తులు వ్యాకోచిస్తాయి. అది చాలా మంచిది. వెన్నెముక సాగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది, తుంటి కీళ్ళు బలపడతాయి. నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. మలబద్ధకం వదులుతుంది.
2. త్రికోణాసన్
స్థితి : ఇది నిలబడి చేసే అసనం. నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1. ఎగురుతూ లేదా రెండు పాదాలను రెండు పక్కలకు జరుపుతూ రెండు పాదాల మధ్య ఒక మీటరు దూరము పెంచాలి. రెండు చేతులను ప్రక్కలకు, నేలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు కిందకు.
2. కుడిపక్కకు వంగుతూ కుడిచేతి వేళ్ళను కుడి పాదము వేళ్ళకు తాకించాలి. వంగే సమయంలో ఎడమ చేయి పైకి ఎత్తి, సాచి ఉంచాలి. మెడ, తలను పైకి తిప్పి ఎడమచేతి వేళ్ళను చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. రెండు చేతుల్ని భూమికి సమాంతరంగా తెస్తూ 1వ స్థితికి రావాలి.
4. కాళ్ళు దగ్గరకు, చేతులను క్రిందికి తెచ్చి (స్థితికి) విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా ఎడమ వైపుకు వంగుతూ చేయాలి.
లాభాలు : మొత్తం శరీరం సాగుతుంది, వెన్ను కండరాలు సాగుతాయి. తొడలు, భుజాలు, రొమ్ము, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలకు శక్తి వస్తుంది. పిరుదులు, నడుములోని కొవ్వు తగ్గుతుంది. చక్కెర, బిపి, శ్వాసకోశ, మూత్ర సంబంధ వ్యాధులు, మలబద్ధకం తగ్గుతాయి.
సూచన : మెడ, వెన్ను నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.
3. వృక్షాసన్
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1. ఎడమ పాదం ఎత్తి కుడి తొడ పైన ఉంచాలి.
2. రెండు చేతులు నిటారుగా పైకెత్తాలి. రెండు అరచేతులను సాచి పైకెత్తి నమస్కార స్థితిలో ఉంచాలి. ఒక కాలిపై నిలబడి ఉంటాము. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
4. రెండు చేతులు క్రిందికి దించుతూ 1 వ స్థితికి రావాలి.
5. కుడి తొడపై ఉన్న ఎడమ కాలిని కిందకు తెస్తూ, స్థితికి వచ్చి విశ్రాంతి పొందాలి. ఇదేవిధంగా కుడి కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : చేతి కండరాలు, కాలి కండరాలు బలపడతాయి. పిరుదులలోని, పొట్టలోని కొవ్వు తగ్గుతుంది. మానసిక నిశ్చలత వస్తుంది. బి.పి.కి మంచిది.
4. గరుడాసన్
స్థితి : నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.
1. కుడి తొడను ఎడమ తొడమీదికి ఎక్కించి, కుడి పాదమును ఎడమ పిక్కకు చుట్టాలి.
2. కుడిచేతిని బయటి నుండి ఎడమచేతికి చుట్టి అరిచేతులు రెండూ కలిపి నమస్కారం చేయాలి. దృష్టి ముందుకు. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. చుట్టిన చేయి కిందకు, చుట్టిన కాలు కిందకు తెచ్చి, స్థితికి వచ్చి విశ్రాంతి పొందాలి. ఇలాగే కాలు, చేయి మార్చి చేయాలి.
లాభాలు : కాలి కండరాలు, నరాలు బలిష్టం అవుతాయి.
5. వజ్రాసన్
ఇది కూర్చుని అభ్యాసం చేసే ఆసనం.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడి కాలును మడిచి కుడి తొడ క్రింద ఉంచాలి. మడిమ వెనుకకు చూస్తుంది.
2. ఎడమ కాలును కూడా మడిచి, ఎడమ తొడ క్రిందకు తేవాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళ మడిమలపై కూర్చుంటాము.
3. రెండు చేతులు తొడలపై పెట్టాలి. ఈ స్థితిలో శరీరం నిటారుగా అవుతుంది.
4. ఎడమకాలును ఎడమ తొడ కింద నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి.
5. కుడికాలును కూడా కుడి తొడ నుండి నెమ్మదిగా తీసి ముందుకు చాపాలి. విశ్రాంతి పొందాలి.
లాభాలు : వెన్నుముకను నిటారుగా చేయడం వలన బద్ధకం వదులుతుంది. మడిమలు, పిక్క కండరాలలో నొప్పులు తగ్గుతాయి. పాదాల కండరాలు వదులయి, పాదాలు వంగలేని స్థితి నివారణ అవుతుంది. తిన్న తరువాత కూడా వేసే ఏకైక ఆసనం వజ్రాసనం. దీర్ఘ శ్వాసలు బాగా చేయటం వలన ఊపిరి తిత్తులు విశాలం అవుతాయి. దానితో వాటి బలం పెరగటంతోపాటు ఆక్సిజన్‌తో కూడిన రక్తం శరీరంలో పెరుగుతుంది.
6. అర్థ ఉష్ట్రాసన్
ఇది కూడా కూర్చుని అభ్యాసం చేసే ఆసనమే.
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడికాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందకి తేవాలి.
2. ఎడమకాలిని వంచి, పాదాన్ని పిరుదుల కిందికి తెచ్చి వజ్రాసన స్థితిలో ఉండాలి.
3. శరీరాన్ని నిటారు చేస్తూ మోకాళ్ళపై నిలబడాలి.
4. శ్వాస వదులుతూ, నెమ్మదిగా వెనక్కి వంగుతూ, అరచేతులతో వెనుక నడుముపై ఉంచాలి. దృష్టి వెనక్కు ఉంటుంది. మోకాళ్ళు దగ్గరగానే ఉండాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో ఒక నిముషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి.
7. వక్రాసన్
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడికాలుని వంచి, కుడిపాదాన్ని చాచివున్న ఎడమ మోకాలి పక్కన ఉంచాలి.
2. శరీరాన్ని కుడివైపు తిప్పుతూ, ఎడమచేతిని కుడి మోకాలి పక్కగా పెట్టి కుడి మోకాలి బొటనవ్రేలు పట్టుకోవాలి. కుడిచేతిని వీపు వెనుక ఉంచి, అరచేతిని నేలకు అదిమి ఉంచాలి, కుడివైపు చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. సాధారణ శ్వాస తీస్తూ ఒక నిమిషం వరకు ఈ స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి.
3. ఎడమ చేతిని వదిలి, మామూలుగా శరీరానికి ఎడమవైపుకు తేవాలి.
4. కుడికాలిని కూడా మామూలుగా తీసుకుని స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా రెండో వైపున చేయాలి.
లాభాలు : వెన్నెముకకూ, కాలేయానికి, చిన్న ప్రేవులకూ, జీర్ణ గ్రంథులకూ శక్తినిస్తుంది. మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్ర పిండాల వ్యాధి, కాలేయానికి సంబంధించిన జబ్బులూ, నడుము కండరాల నొప్పి, తుంటి కీళ్ళ నొప్పులు పోతాయి.
సూచన : హెర్నియా ఉన్న వారు ఈ ఆసనం చేయరాదు.
8. గోముఖాసన్
స్థితి : కూర్చుని రెండు కాళ్ళు చాపాలి, రెండు మడమలూ కలిపి ఉంచాలి, చేతులు నేలపై ఉంచాలి.
1. కుడి కాలిని వంచి ఎడమ తొడకు పక్కన ఉంచాలి.
2. ఎడమ కాలిని వంచి కుడికాలి కింద నుండి తెచ్చి, తొడ ప్రక్కకు పెట్టాలి. అప్పుడు ఎడమ కాలిపై కుడి తొడ వస్తుంది.
3. ఎడమ చేతిని పైనుంచి వీపు మీదకు తీసుకోవాలి.
4. కుడిచేతిని క్రిందనుండి వీపు మీదకు తీసుకొని ఎడమచేతి వ్రేళ్ళతో కుడి చేతి వేళ్ళని కలపాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
5. తరువాత వరుసగా కుడి చేయి, ఎడమ చేయి, ఎడమ కాలు, కుడి కాలు వెనక్కు తెచ్చి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ప్రారంభించి చేయాలి.
లాభాలు : నాడీ మండల వ్యవస్థ మీద ప్రభావం ఉండటం వలన మనస్సు ప్రశాంతమవుతుంది. దానితో చక్కటి నిద్ర పడుతుంది. బి.పి. అదుపులో ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణ అలవడుతుంది. మధుమేహం, వీపు నొప్పి, మూత్ర పిండాల వ్యాధి తగ్గుతాయి.
9. శవాసన్ లేదా అమృతాసన్ (10 నిమిషాలు)
ఆసనాలు పూర్తయిన తరువాత శవాసనంలో దీర్ఘ విశ్రాంతి తీసుకోవాలి.
మెత్తటి దుప్పటిపై వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, కాళ్ళు, చేతులూ దూరంగా ఉంచి శవం మాదిరిగా ఉండాలి. తల ఒక పక్కకు వాలి ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలను శిథిలం (స్పర్శ లేని స్థితి) చేయాలి. దీర్ఘ శ్వాస, నిశ్వాసలు చేస్తూ ఉండాలి. నిద్ర పోకూడదు. ఈ ఆసనంలో 10 నుండి 30 నిముషాల వరకు ఉండవచ్చు. అన్ని ఆసనాలు చేసిన తరువాత చివరిలో ఈ ఆసనం వేయాలి.
లాభాలు : శవాసన్ లేదా అమృతాసన్ అని పిలిచే ఈ ఆసనంలో శరీరానికి, మనస్సుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు తేలికవుతాయి. మనస్సు తేలికవుతుంది. రక్తప్రసరణ, గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గుతుంది. అన్ని అవయవాలకు చక్కటి విశ్రాంతి లభించి, కొత్త శక్తిని సంతరించుకుంటాయి. వత్తిడితో వచ్చే అధిక రక్తపోటు, తలపోటు వంటివి ఉపశమిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరానికి అమృతం లభిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈ ఆసనం వేసిన తరువాత అంత హాయిగా, తేలికగా ఉంటుంది. అందుకే దీనిని అమృతాసన్ అని కూడా అంటారు.
సూచన : ఈ ఆసనాన్ని అన్ని వయసుల వారు, చేయవచ్చు.
– ప్రాణాయామం
నాడిశుద్ధి ప్రాణాయామం – 9 సార్లు
శీతలి ప్రాణాయామం – 9 సార్లు
భ్రామరి ప్రాణాయామం – 10 సార్లు
ఉజ్జాయి ప్రాణాయామం – 9 సార్లు
– ధ్యానం
నాద అనుసంధాన
శ్వాస మీద ధ్వాస
ఆవర్తన ధ్యానం
– క్రియలు
జలనేతి
వమన ధౌతి (ఉప్పు వాడకూడదు)
త్రాటక
గమనిక : హృదయ సంబంధ వ్యాధులు లేనివారు అన్ని రకాల యోగ ప్రక్రియలు సాధన చేసి శరీరాన్ని, మనస్సుని ధృడంగా, ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. సమస్యలు ఉన్నవారు అనుభవం కలిగిన యోగాచార్యుని దగ్గర తగిన శిక్షణ, సలహాలు తీసుకొంటూ సాధనతో వ్యాధిని సునాయసంగా అధిగమించవచ్చు.
ముఖ్య సూచన : పైన సూచించిన యోగ సాధన అంతా మొదట యోగ గురువు పర్యవేక్షణలోనే ప్రారంభించాలి. ఇలా నెల లేదా రెండు నెలలు యోగ సాధన చేసిన తరువాత యోగ గురువు అనుమతితో సొంతంగా అభ్యాసం చేయవచ్చు.
మానవ శరీరంలో అత్యంత ప్రముఖ అవయవం ‘హృదయం’. అమ్మ కడుపులో ఉండగానే హృదయం పనిచేయటం మొదలవుతుంది. చివరి శ్వాస వరకు పని చేస్తూనే ఉంటుంది.
ReplyDelete