Breaking News

యోగ సాధన ఒక్క ఆరోగ్యం కోసమేనా ?


నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేనెందుకు ప్రతిరోజు యోగ సాధన చేయాలి ? అని ప్రశ్నిస్తారు కొంతమంది. యోగ సాధన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. యోగ సాధనతో సంపూర్ణ, సమగ్ర వ్యక్తి వికాసం జరుగుతుంది. సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటాడు. యోగసాధనతో, వ్యక్తిలో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం సహజంగా జరిగిపోతుంది.
యోగ సాధన కేవలం ఆరోగ్యం కోసమే అనేది తప్పు. నిత్య యోగ సాధనతో నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సులభంగా సాధించవచ్చు.
యోగ సాధన అంటే కేవలం సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు. యోగ సాధనలో ముఖ్యమైనవి పతంజలి సూచించిన అష్టాంగ యోగ సూత్రాలు. ఈ సూత్రాలు ఎక్కువగా మనస్సుకి సంబంధించినవి. అనగా మనోసాధన అవసరం.
శరీరం, మనస్సుకి ఉన్న మలినాలు, జాడ్యాలు (టాక్సిన్‌) పోవటానికి సరైన జ్ఞానం (ఆత్మజ్ఞానం) మాత్రమే సహాయ పడగలదు. ఇవన్నీ కలిపితేనే సంపూర్ణ యోగసాధన అవుతుంది.
యోగ సాధన – ఫలితాలు
యోగసాధనతో అనేక రకాల ఫలితాలున్నాయి.

శారీరకంగా..
శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది, శారీరక క్షమత పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం కోరుకున్న విధంగా తీగలా వంగుతుంది (ప్లెక్సిబిలిటి).
– శ్వాసక్రియ ఇబ్బందులు లేకుండా సులభంగా జరుగుతుంది.
– ఆక్సిజన్‌తో కూడిన రక్తము శరీరం అంతా బాగా ప్రసరిస్తుంది.
– గ్రంథులన్నీ సహజంగా, సరిపడ హార్మోన్సు విడుదల చేస్తాయి.
– నాడీ వ్యవస్థతో పాటు శరీరమంతా చక్కని విశ్రాంతి పొందుతుంది.
– సరాసరి శ్వాసక్రియల సంఖ్య తగ్గుతుంది.
– యవ్వనం పెరుగుతుంది. ముసలితనం వాయిదా పడుతురది.
– కళ్ళ సమస్యలు, నిద్ర సమస్యలు తగ్గిపోతాయి.
– కొవ్వు నిల్వలు ఎక్కువ, తక్కువ కాకుండా సరిపడినంతగా ఉంటాయి.
– చర్మానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
– సైనస్‌, ఎలర్జీ సమస్యలు తగ్గిపోతాయి.
– తలనొప్పి, మైగ్రేన్‌ (పార్శ్వనొప్పి) తగ్గిపోతాయి.
– స్త్రీల ఋతు సమస్యలు పరిష్కారమవుతాయి.
– జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.
– మోకాళ్ళ నొప్పులు, మెడనొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతాయి.
– సంతాన సాఫల్యం కలుగుతుంది.
– ఎత్తుకి తగినంత బరువు కొనసాగుతుంది.
– ఆరోగ్యం మెరుగవుతూ ఉండటంవలన నెలసరి మందుల ఖర్చు, డాక్టర్‌ ఫీజులు తగ్గిపోతాయి.
మానసికంగా..
– మనస్సు ఆనందంగా, ప్రశాంతంగా,సంతోషంగా ఉంటుంది.
– ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి.
– సకారాత్మాక ధోరణి పెరుగుతుంది.
– ఆత్మవిశ్వాసం అలవడుతుంది.
– స్వీయ క్రమశిక్షణ వస్తుంది.
– స్వయంప్రేరణ కలుగుతుంది.
– భావోద్వేగ నియంత్రణ అలవడుతుంది.
– అర్థం చేసుకొనే సామర్థ్యం వస్తుంది.
– నేర్చుకొనే సామర్థ్యం వస్తుంది.
– సహనం, జాలి, దయ పెరుగుతాయి.
– మానసిక స్థితి, ప్రవర్తనపై మంచి ప్రభావం చూపించే సెరటోనిన్‌ హార్మోన్‌ పెరుగుతుంది.
– భయాలు, బద్ధకాలు వదలిపోతాయి.
– అనవసర ఆలోచనలు అదుపులోకి వస్తాయి.
– చెడు అలవాట్లు తొలగిపోతాయి.
– రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, పరిష్కరించుకొనే సామర్థ్యం, ధైర్యం పెరుగుతాయి.
– వ్యక్తిత్వం స్వచ్ఛమవుతుంది.
– బాధ, దిగులు, విచారం, నకారాత్మకం తగ్గుతాయి
– తోటి మనుషులతో సంబంధ బాంధవ్యాలు సరిగా మెరుగవుతాయి.
– ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతుంది.
– భావావేశం, దూకుడుతనం తగ్గి, నిదానం, సహనం అలవడతాయి.
– ఒత్తిడిని ఎదుర్కోగల, వెంటనే తగ్గించుకోగల మెళకువలు అలవడుతాయి.
సామాజికంగా..
నిత్యం యోగ చేస్తున్న సాధకుడు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. ఈ ప్రభావం వలన అతని కుటుంబంలో శాంతి, సామరస్యం, మంచి సంబంధాలు, సర్దుకుపోవటము, సహాయ సహకారాలు, కలసి పనులు చేసుకోవటం, పెద్దలకు సేవచేయటం, వారిని గౌరవించటం, కుటుంబంలో బాధ్యతను గుర్తించి నెరవేర్చటం సహజంగా జరుగుతుంది.
యోగ సాధన చేస్తున్న కుటుంబాలు సమాజంలో కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ కుటుంబంలోని మంచి గుణాలు గమనించినవారు యోగ గొప్పతనం తెలుసుకొని వారు సాధన చేయటం మొదలు పెడుతారు. సమాజంలో ఆదర్శంగా ఉండటం, సామాజిక కార్యక్రమాలలో ముందుండి సేవ చేయటం, సత్సంబంధాలు కలిగి ఉండటం, సమాజం అభివృద్ధిని, శాంతిని, ఆరోగ్యాన్ని కోరుకోవటం వలన మంచి ఆదర్శవంతమైన, ఆరోగ్యకరమైన సమాజాలు తయారవుతాయి.
ఇటువంటి సమాజాలు పెద్ద ఎత్తున పెరగటం వలన రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం, సమస్త విశ్వంలో శాంతి, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్లివిరుస్తాయి.
ఆధ్యాత్మికంగా..
నిత్య యోగ సాధన, సంపూర్ణ యోగ సాధన (అష్టాంగ యోగ – అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి) తో త్వరగా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చు. ఆధ్యాత్మికుని లక్ష్యం మోక్ష సాధనే. నిత్య యోగసాధనతో మోక్ష సాధన సులువవుతుంది.
మోక్షం అంటే సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ఆత్మానందం, సంతృప్తి, జనన మరణాలు లేకపోవటం, సంపూర్ణ ఏకత్వం లాంటి లక్షణాలు. యోగ సాధనతో మోక్ష సాధనకు అవసరమయిన లక్షణాలన్ని సులభంగా పొందవచ్చు.
యోగ సాధకులు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని విధాలుగా అభివృద్ధిని పొందుతారు అనటంలో అతిశయోక్తి లేదు. అందుకు మన దేశంలో ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు కొనసాగుతున్న మన ఋషి పరంపరే సాక్ష్యం.
సంపూర్ణ యోగసాధనతో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. అసలు సమస్యలే లేని ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. కైవల్యం లేదా మోక్షం సిద్ధిస్తుంది.

యోగ సాధనలో ఏవి ముందు? ఏవి వెనుక?

యోగ సాధనలో ఆసన, ప్రాణాయామ, క్రియలు, ముద్రలు వంటి రకరకాల ప్రక్రియలు ఉంటాయి. యోగ సాధకునికి వీటిలో ఏవి ముందు చేయాలి, ఏవి వెనుక చేయాలి అని అనేక రకాలు సందేహాలు ఎదురవుతాయి.
యోగ సాధనకు ముందుగా సాధారణ శ్వాస తీసుకోవాలి. తరువాత ఓంకారం 5 నుండి 11 సార్లు చేయాలి. తరువాత సూక్ష్మ వ్యాయామం (లేదా శిథిలీకరణ వ్యాయామం) చేయాలి. తరువాత
– సూర్యనమస్కారములు, శవాసనం;
– ఆసనాలు, శవాసనం;
– ప్రాణాయామం,
– ధ్యానంతో ముగించాలి.
మధ్య మధ్యలో చేసే శవాసనం అలసటను బట్టి 5 నుండి 10 నిముషాల వరకు వేయవచ్చు.
సూచనలు
ఎటువంటి శారీరక రుగ్మతలు లేనివారు అన్ని రకాల వ్యాయామాలు, ప్రక్రియలు సాధన చేయవచ్చు. ఏమైనా వ్యాధులున్నప్పుడు కొన్ని హద్దులు పాటించవలసి ఉంటుంది. ఈ హద్దులు యోగాచార్యుల దగ్గర తెలుసుకొని పాటించటం వలన త్వరగా వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. హద్దులు పాటించకపోతే ఎప్పటికీ వ్యాధిని నయం చేసుకోలేం. ఇంకా విపరీత అనర్థాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) రావచ్చు.
యోగ సాధనలో కేవలం ఆసనాలు, ప్రాణాయామం వలనే పూర్తి ఫలితాలు రావు. సంపూర్ణ ఫలితం కావాలంటే యమ, నియమాలు పాటిస్తూ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి పాటించాలి. క్రియలు, విశ్రాంతి ప్రక్రియలు చేయటం, సరైన జ్ఞాన ఉపన్యాసాలు వినటం ద్వారా, ఆహార నియమాలు పాటించటం ద్వారా సంతోషంగా, ఆనందంగా ఉండటం, తృప్తిగా జీవించటం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోవటం వలన మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం యోగ సాధకుడు పొందగలుగుతాడు.
గురువు వద్ద శిక్షణ
యోగ సాధన చేయాలనేవారు ముందుగా సరైన యోగ గురువును ఎంచుకుని, అతని దగ్గర శిక్షణ పొందిన తరువాతే వ్యక్తిగతంగా సాధన చేయడం మంచిది. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.

యోగ సాధనకు అడ్డంకులు

ఏదైనా మంచి పని చేస్తుంటే అడ్డంకులు రావటం సహజం. అలాగే యోగ సాధనకు కూడా రకరకాల అడ్డంకులు తగిలి సాధన జరగకుండా అంతరాయం ఏర్పడుతుంది. ఈ అడ్డంకులని యోగ మలములని కూడా అంటారు.
ప్రధాన అడ్డంకులు
వ్యాధి : శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు అంటే జ్వరం, దగ్గు, బాగా నీరసం, బాగా తలనొప్పి ఉన్నప్పుడు సాధన చేయలేం.
సంకల్పం లేకపోవటం : యోగ సాధన చేయాలని కోరిక ఉన్నప్పటికి, మనసులో తగిన సంకల్పం లేకపోవటం.
సంశయం : యోగ సాధనలో ప్రతి విషయంలో అనుమానం కలగటం.
అహం : యోగ సాధన నిత్యం జరగాలంటే ఆసనాలు, ప్రాణాయామంతో పాటు యమ, నియమాలు కూడా పాటించాలి. ఇవి పాటించటక పోవటం వలన మానసికంగా అహంభావం పెరగటం, నేనే గొప్ప సాధకుడిని, ఇతరులు అందరూ అజ్ఞానులు అనే భావన పెరగటం వంటి ప్రమాదాలు వస్తాయి, దీనితో మనశ్శాంతి పోతుంది. యోగ సాధనకు ఆటంకం ఏర్పడుతుంది.
ఆలస్యం : సాధన విషయంలో ఆలస్యం, సోమరితనం అడ్డంకులుగా మారుతాయి.
అవిరతి : శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాల్లో అనురాగం కలిగి ఉండటం.
భ్రాంతి దర్శనం : అజ్ఞానం వలన యోగ అనుభూతులను భ్రమగా భావించటం.
వాయిదా వేయటం : సాధనకు మంచి ముహూర్తం అని, టైమ్‌ లేదని, ఏవో సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేయటం.
సెల్‌ ఫోన్‌ : యోగ సాధన సమయంలో ఫోను రావటం వలన సాధనకి అడ్డంకిగా మారుతుంది. అందువలన సాధనకి ముందే ఫోను సైలెంట్‌ మోడ్‌లో ఉంచి సాధన మొదలుపెట్టాలి.
వార్తా పత్రిక లేదా టివి : వార్తా పత్రికకు ప్రాధాన్యమివ్వటం లేదా టివిలో వచ్చే కార్యక్రమాలను చూస్తూ యోగ సాధనను నిర్లక్ష్యం చేయడం.
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ : వీటిలో ఏదో ఒక దానిలో మునిగిపోయి సమయాన్ని వృథా చేయటం, సాధనను నిర్లక్ష్యం చేయడం.
ఇలా రకరకాలుగా యోగ సాధనకు అంతరాయం కలుగుతుంది. ఆ సమయంలో దృఢమైన నిర్ణయం, బలమైన సంకల్పంతో సాధనకు సమయాన్ని వెచ్చించటం అలవాటు చేసుకోవాలి.

తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి పొందడం


కొద్దిమందికి తమ జీవనశైలిలో విశ్రాంతికి సమయం లభించదు, కొద్దిమందికి అతి విశ్రాంతి లభిస్తుంది. ఈ రెండు జీవనశైలులు మంచివి కావు. విశ్రాంతి తగినంత, అవసరం అయినంత మాత్రమే తీసుకోవటం శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఎంతో అవసరం.
అయితే విశ్రాంతికి సమయం లేనివారికి యోగాలో అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలనిచ్చే (దీర్ఘ విశ్రాంతినిచ్చే) ప్రక్రియలు అనేకం ఉన్నాయి. వీటినే యోగనిద్ర లేదా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అని అంటారు.
యోగ నిద్ర ఇలా..

శవాసనంలో ప్రశాంతంగా, హాయిగా పడుకో వాలి. ఆ స్థితిలో దీర్ఘశ్వాసలు తీయాలి. అలా ’30’ శ్వాసలు చేయాలి. తరువాత ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండి విశ్రాంతి అనుభూతి చెందాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడివైపు పొర్లి నెమ్మదిగా లేచి కూర్చోవాలి. నెమ్మదిగా రెండు చేతులు రాపిడి చేస్తూ కళ్ళకి అద్దుకొని అరచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి.
ఫలితం
కేవలం 3 నుండి 5 నిముషాలలో పూర్తయ్యే ఈ చిన్న ప్రక్రియతో శరీరమంతా చాలా తేలికవుతుంది. శరీరంలోని

అన్ని అవయవాలు బాగా విశ్రాంతి పొందుతాయి.
లోతైన విశ్రాంతి ప్రక్రియ
ఈ ప్రక్రియను మరింత ఎక్కువ సేపు చేస్తే లోతైన విశ్రాంతి పొందవచ్చు.

శవాసనంలో ప్రశాంతంగా, హాయిగా రిలాక్స్‌గా పడుకోవాలి.
మొదటి దశ : కాలివేళ్ళ నుండి నడుము వరకు ఒక్కొక్క అంగానికి విశ్రాంతినిస్తూ రావాలి. తరువాత ‘ఆ..’ అని శబ్దం చేస్తూ పైకి ఉచ్ఛరించాలి. ఇలా 2 సార్లు చెప్పాలి.
రెండవ దశ : ఈ దశలో నడుము నుండి మెడవరకు ఒక్కొక్క అంగానికి విశ్రాంతినిచ్చిన తరువాత ‘ఊ..’ అంటూ లయబద్ధంగా పైకి ఉచ్ఛరించాలి. ఇలా 2 సార్లు చెప్పాలి.
మూడవ దశ : మెడ నుండి తల వరకు ఒక్కొక్క అంగానికి విశ్రాంతినిచ్చిన తరువాత ‘మ..’ అని లయబద్ధంగా అంటూ పైకి ఉచ్ఛరించాలి. ఇలా 2 సార్లు చెప్పాలి.
నాలుగవ దశ : కాలివేళ్ళ నుండి తల వరకు శరీరం అంతటకి విశ్రాంతినిస్తూ, విశ్రాంతి అనుభవిస్తూ ‘అ-ఉ-మ’ అని 2 సార్లు లయబద్ధంగా పైకి ఉచ్ఛరించాలి. ఆ తరువాత 1 నిమిషం నిశ్శబ్దంగా ప్రశాంతంగా అలాగే ఉండి తరువాత నెమ్మదిగా కుడివైపు పొర్లి లేచి కూర్చోవాలి. ఆ తరువాత రెండు అరచేతులు రాపిడి చేస్తూ కళ్ళని స్పర్శించి అరచేతులు చూస్తూ కళ్ళు తెరచి ముగించాలి.
సూచన : అధిక రక్తపోటు (హై బి.పి.) ఉన్నవారు ఈ విశ్రాంతి ప్రక్రియను మూడవ దశతో ప్రారంభించి, దశ 2, దశ 1 చేసి, దశ 4తో ముగించాలి.
ఫలితం
కేవలం 5-10 నిముషాల వ్యవధిలో శరీరం అంతా దీర్ఘ విశ్రాంతి పొందుతుంది. 1-2 గంటలు నిద్రపోతే ఎంత విశ్రాంతి అనుభవిస్తామో, కేవలం 5-10 నిముషాలలో అటువంటి లోతైన విశ్రాంతి మన అనుభవంలోకి వస్తుంది.
శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అన్ని అవయవాలు, కండరాలు, ఎముకలు, కణజాలం అంతా ప్రశాంతమైన, దీర్ఘమైన, లోతైన విశ్రాంతిని పొందుతాయి. తద్వారా శరీరంలో జరిగే జీవక్రియలన్నీ సహజంగా, సామరస్యంగా జరుగుతూ శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
– డి. వెంకటరావు, యోగథెరపిలో నిఫుణులు, 9542708262.

1 comment:

  1. యోగ సాధన ఒక్క ఆరోగ్యం కోసమేనా ?

    ReplyDelete