Breaking News

ఆధిపత్యం కోసం చైనా ఆరాటం


ఆసియా ఖండంపై పూర్తి పట్టు సాధించి ప్రపంచ ఆధి పత్యానికి ఆరాటపడుతున్నది చైనా. ఈ నేపథ్యంలో పురాతన సిల్క్‌ రోడ్‌ కార్యక్రమం పునరుద్ధరణ పేరుతో బీజింగ్‌లో చైనా పాలకులు కొన్ని రోజుల క్రితం అట్టహసంగా నిర్వహించిన కార్యక్రమం 'వన్‌బెల్ట్‌ వన్‌ రోడ్‌' ఒక తాజా ఉదాహరణ. చైనా ఆధిపత్యధోరణితో వ్యవహరిస్తూ కొత్త కొత్త వ్యవస్థలను నిర్మాణం చేస్తున్నది. ఈ రోజున ప్రపంచ దేశాలలో పెట్టుబడులు పెట్టే దేశంగా దూకుడుగా ముందుకు వెళ్తున్నది. 
ఆ విషయాలన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భారత్‌ను ఈ దిశలో ఎదగకుండా చేయటం చైనా లక్ష్యంగా కనబడుతున్నది. ఆసియా ఖండంలో ఏ కాలంలోనైన భారత్‌, చైనా ఆర్థికంగా శక్తివంత మైనవి. చైనా భారత్‌తో పోటీ పడుతూ ఉండేది. కాని ప్రస్తుతం చైనా ముందంజలో ఉన్నది, అందునా భారత్‌ను అణగద్రొక్కాలని చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నది. భారత్‌లో అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలకు ఆర్థిక వనరులు ఎరగా వేసి క్రమంగా వాటిని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నది. నేపాల్‌లో నక్సల్స్‌ ఉద్యమాన్ని ప్రేరేపించి ప్రచండతో తిరుగుబాటు చేయించింది. రెండు దశాబ్దాల కాలంలో నేపాల్‌ పరిస్థితులు ఎంతగా మారిపోయాయో మనకు తెలుసు. అట్లాగే శ్రీలంకలో భారత్‌ వ్యతిరేక నిర్మాణం చేయడానికి ప్రయోగాలు కూడా చేస్తున్నది. ఇక పాకిస్తాన్‌ విషమమైతే చెప్పుకోవలసిన పని లేదు. పాకిస్తాన్‌ బలహీనతలను ఉపయోగించుకొని విపరీతమైన రుణాలను ఇచ్చి అవి తీర్చలేని నేపథ్యంలో అక్కడ కబ్జా పెట్టెందుకు వెనుకాడే పరిస్థితి ఉండకపోవచ్చు.
ఆసియా దేశాలపై నాయకత్వం కోసం ప్రారంభించిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టుకు పాక్‌ భూభాగం ప్రధానమైనది. దానికి ప్రతిగా 2003 నుంచి నిరాంతరం ఆర్థిక సహకారం చేస్తున్నది. గడిచిన కొద్ది సం||లలో పాశ్చాత్యదేశాలకు చైనా ఎగుమతులు తగ్గిపోతున్నాయి. దానిని పూరించుకోవటానికి పాకిస్తాన్‌ను ఉపయోగించు కొంటున్నది. చైనా అనుసరిస్తున్న ఈ విధానాల కారణంగా 2030 నాటికి అనేక విధలుగా చైనాకు లోబడి ఉండే పరిస్థితులు రాబోతున్నాయని పాకిస్తాన్‌ మేధవుల ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో జర్మనీ నుంచి గ్రీకు దేశాలకు విపరీతమైన అప్పులు ఇవ్వబడుతున్నాయి.ఆ రుణాలు తిరిగి చెల్లించలేని గ్రీసు వారు చేతులెత్తేసిన సంగతి మన అందరికి తెలుసు. చైనా, పాకిస్తాన్‌ అట్లా వ్యవహరించటానికి ప్రధానకారణం భారత్‌ను నిలువరించడం. పాకిస్తాన్‌, శ్రీలంకలలో నెమ్మదిగా చైనా వ్యతిరేకంగా నిరసనగళం వినబడుతున్నది. శ్రీలంకలో చైనా కంటే భారత్‌తోనే సంబంధాలను ఏర్పారుచుకోవాలని ప్రభుత్వంపై ప్రజల నుంచి వత్తిడి వస్తున్నది.
చైనాలోని జింజియాంగ్‌ రాష్ట్రం ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ముస్లింల ఆగడాలు, వారు ప్రభుత్వంపై చేస్తున్న తిరుగుబాటు తలనెప్పిగా మారాయి. ఆ తిరుగుబాటును మిలటరీ సహకారంతో అణచివేస్తూ చాలా తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నది. అక్కడ వారు ముస్లిం పేర్లు పెట్టుకోకూడదని, సామూహిక ప్రార్థనలు సైతం చేయరాదని నిషేధం విధించింది. తమ దేశంలో ముస్లింల విషయంలో అంత కఠినంగా ఉంటూనే అంతర్జాతీయ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను ఉగ్ర వాదులుగా గుర్తించకుండా ఐక్యరాజ్య సమితిలోని తన వీటో హక్కును ఉపయోగించుకొంటుంది. ఇది కేవలం పాకిస్తాన్‌తో సఖ్యంగా ఉండటానికి మాత్రమే. ఇట్లా ద్వంద్వ నీతిని అనుసరిస్తూ చైనా తన ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నది. వేల సం||లుగా భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న దేశాలపై పట్టు సంపాందించి భారత్‌ను ఒంటరి చేయాలని చూస్తున్నది. ఆసియాపై ఆధిపత్యం తనదేనని చెప్పుకోక చెప్పుకుంటున్నది. ఇంకోప్రక్క ప్రత్యక్షంగానే భారత్‌ను అదుపు చేయటానికి, ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే వేల కిలో మీటర్ల భారత్‌ భూభాగం చైనా బార్డర్‌లో ఉన్నది. అరుణచల్‌ప్రదేశ్‌ పూర్తిగా తమదేనని తెగేసి చెబుతున్నది. ఈ మధ్య బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ సందర్శనలో నానా గొడవ చేసి, తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దానిపై అప్పుడప్పుడు ప్రకటనలు కూడా చేస్తున్నది. ఇంకో ప్రక్క మానస సరోవరం, కైలాస శిఖరం వద్ద మన శ్రద్ధ కేంద్రాలు ఈ రోజున చైనా కబ్జాలో ఉన్న కారణంగా చైనా అనుమతి పత్రాలు పొంది వాటిని సందర్శించుకోవలసిన పరిస్థితి. పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌ భూ భాగంలో సైనిక స్థావరం కోసం అరాటపడుతున్నది. భారత దేశంలోని సుదూర ప్రాంతంలోని అన్ని ప్రధా న పట్టణాలను ధ్వంసం చేయగల క్షిపణులను సిద్ధం చేసుకుంది. భారత్‌ కూడా ఆ శక్తిని కూడా సంపాంది స్తుంటే ఆందోళనలు, ఆక్షేపణలు తెలియజేస్తోంది. భారత్‌ను చక్రబంధంలో పెట్టేందు కు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఇంకొక ప్రక్క చైనా వస్తువులు భారత్‌ మార్కెట్‌ను ఆక్రమించాయి. ప్రపంచంలో మిగతా దేశాల కంటే భారత్‌లో వ్యాపారం చాలా సులభం. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబీకులు తక్కువ ధరలకు ఏ వస్తువులు ఎక్కడ దొరికితే అక్కడ కొంటూంటారు. వారికి స్వ, పర భేదం ఉండదు. దీనిని ఆసరాగా తీసుకుని చైనా నాణ్యత తక్కువగా ఉన్న వస్తువులను అతి తక్కువ ధరకు భారత్‌లో గుమ్మరిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థను బలహీనం చేయటం చైనాతో పాటు మరికొన్ని దేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలో దేశంలో పెద్ద ఎత్తున చైనాపై ఆందోళన వ్యక్తం కావలసి ఉంది. కాని అది ఏమి జరగటం లేదు. ఇది ఇట్లాగే కొనసాగితే మరిన్నీ సమస్యలు భారత్‌కు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. చైనా వస్తువుల వాడకంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మాణం కావాలి.
- లోకహితం.

1 comment:

  1. చైనా వస్తువుల వాడకంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మాణం కావాలి.

    ReplyDelete