జర్నలిస్ట్ బల్వంత్
భగత్‌సింగ్ - 9
==========
అతను పెళ్లి ఇష్టంలేక ఇంటి నుంచి పారిపోయిన రకం కాదు.
దేశసేవకు తాను ఎంచుకున్న ఆత్మార్పణ మార్గంలో సంసారం ఒక లంపటం కనుక...
తాను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏమవుతాడో తెలియక తన కోసం అనుక్షణం తల్లడిల్లే క్షోభను కట్టుకునేదానికి కలుగజేయటం ఇష్టంలేక...
విప్లవ దీక్షతో, నిశ్చల నిబద్ధతతో నిర్భయంగా, నిర్వికారంగా ఇల్లు వదిలిన విముక్తి పోరాట యోధుడాతడు.
చేరింది కూడా సరైన చోటుకే.
కాన్పూర్ ఆ రోజుల్లో విప్లవకారుల రహస్య కేంద్రం. వారికి నాయకుడు శచీంద్రనాథ్ సన్యాల్. పట్టుబట్టి, పురికొల్పి భగత్‌సింగ్‌ని కాన్పూర్‌కి పంపించింది ఆయనే.
పదహారేళ్ల భగత్ 1923 ఆగస్టు - సెప్టెంబరు మధ్యకాలంలో కాన్పూర్ చేరేసరికి విప్లవ కార్యక్రమమేదీ ఊపునందుకోలేదు. ప్రత్యేకంగా ఒక విప్లవ సంస్థ సంస్థాపనా ఇంకా జరగలేదు. కొత్త సంస్థ స్వరూప స్వభావాల, విధి విధానాల గురించి తర్జనభర్జనలయితే ముమ్మరంగా సాగుతున్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఉవ్వెత్తున లేచిన గదర్ విప్లవాన్ని బ్రిటిషు సర్కారు రాక్షసంగా అణచివేసి, ఎక్కడెక్కడి తిరుగుబాటుదారులనూ వెంటాడి వేటాడసాగటంతో చెల్లాచెదురైన దేశభక్తులు కాలూ చెరుూ్య కూడదీసుకోవటానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం మీద ఆశ పెట్టుకుని, విప్లవ కార్యకలాపాలను కట్టిపెట్టి, సత్యాగ్రహ శ్రేణుల్లో చేరినవారు నమ్ముకున్న నాయకుడే జాతీయ ఉద్యమాన్ని హింస మిషతో నట్టేట ముంచటంతో హతాశులయ్యారు. బ్రిటిషు సర్కారుకూ, భూస్వామ్య వర్గాలకూ కొమ్ముగాసే కాంగ్రెసు బోగసు ఉద్యమాలకు భిన్నంగా, రాజీలేని విముక్తి పోరాటం ఒక్కటే శరణ్యమని నమ్మేవారు క్రమక్రమంగా ఏకమవుతున్నారు. లాహోర్‌లో జయచంద్ర విద్యాలంకార్ వంటి ఉపాధ్యాయులు విద్యా సంస్థల్లో తాము సానబట్టిన యువతను విప్లవ శ్రేణుల్లోకి మరలిస్తున్నారు. అలా వివిధ ప్రాంతాల నుంచి నెత్తురు మండే దేశభక్తులు మెల్లిమెల్లిగా కాన్పూర్ చేరుతున్నారు.
గదర్ విప్లవకాలంలో రాస్‌బిహారీ బోసుకు కుడిభుజంగా పనిచేసిన శచీంద్రనాథ్ సన్యాల్ అంటే యువ యోధులకు మహాగురి. 1915లో బెనారస్ కుట్ర కేసులో యావజ్జీవ శిక్షపడి, 1920లో అనుకోకుండా విడుదలయ్యాక ఆయన భగ్నమైన విప్లవాన్ని తిరిగి ముందుకు తీసుకువెళ్లే పనిలో నిమగ్నమయ్యాడు. అందులో భాగంగా కాన్పూర్‌లో నడుస్తున్న రహస్య కేంద్రానికి యోగేశ్‌చంద్ర చటర్జీ, సురేష్‌చంద్ర భట్టాచార్యలు ముఖ్య నిర్వాహకులు. వారికి భగత్‌సింగ్‌ని పరిచయం చేస్తూ సన్యాల్ ఉత్తరం రాసి చేతికిచ్చాడు.
భగత్ ముందుగా సురేష్ భట్టాచార్యని కలిశాడు. సచిన్‌దా ఉత్తరం చూడగానే అతడు భగత్‌ని స్వాగతించి, యోగేశ్ చటర్జీ దగ్గరికి పంపించాడు. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉండమని చెప్పి తానున్న బెంగాలీ మెస్‌లో ఆయన భగత్‌కి బస చూపించాడు.
అసలే అది ఇరుకు కొంప. అందులో ఉన్నవారందరూ బెంగాలీలు. వారి మధ్య కొత్తగా సిక్కు యువకుడు చేరటం చుట్టుపక్కల వారి దృష్టిని సహజంగానే ఆకర్షించింది. అక్కడికీ భగత్‌సింగ్ తనకు కొత్తగా జత కలిసిన బటుకేశ్వర్ దత్‌తో మాట్లాడుతూ, బెంగాలీ నేర్చుకుంటూ ఎక్కువకాలం గదిలోనే గడిపేవాడు.
అయినా ఇబ్బందే. కాన్పూర్‌లో కుర్రకారు కదలికల మీద పోలీసుల నిఘా బాగా ఉంది. ఈ మెస్సు మీదా సి.ఐ.డి.లు ఒక కన్ను వేసే ఉంచారు. ఎక్కువ రోజులు అక్కడ ఉంటే ప్రమాదం.
గదిలో తలుపులు మూసుకుని దాక్కుంటే నోట్లోకి ముద్ద వెళ్లదు. పేరుకు మెస్సేగాని అక్కడ భోజనం అందరికీ సమస్యే. ఆశయాలు, ఆదర్శాలు, పౌరుషాలకయితే కొదవు లేదు. కాని ఎవరి దగ్గరా డబ్బుల్లేవు. కనీసపు అవసరాలకు కూడా జేబులు తడుముకోవలసిందే.
భగత్‌సింగ్‌కి మొదటి నుంచీ భేషజాలు లేవు. ఒళ్లు దాచుకునే రకం కాదు. పొద్దునే బయటికి వెళ్లి ఇల్లిల్లూ తిరిగి వార్తాపత్రికలు బట్వాడా చేసేవాడు. పేపర్ బాయ్ పనితోబాటు ‘బల్వంత్’ పేరుతో చిల్లరమల్లర పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవాడు. ప్రతిఫలంగా ముట్టిన కొద్దిపాటి సొమ్మును మెస్ నిర్వహణకు తన వంతుగా ఇచ్చేవాడు. కొద్దిరోజులకల్లా సి.ఐ.డి.ల డేగకన్ను భగత్ మీదా పడింది. ఆ సంగతి అతడికీ తెలుసు. కాని మకాం ఎక్కడికి మార్చాలి అన్నది సమస్య.
కాన్పూర్‌లో మన్మథ్‌నాథ్ గుప్తా పేరు మీదా సన్యాల్ పరిచయ లేఖ రాసి భగత్‌కి ఇచ్చి ఉన్నాడు. ఒకరోజు భగత్‌సింగ్ అతడిని వెళ్లి కలిశాడు. అప్పట్లో మన్మథ్‌నాథ్ ‘ప్రతాప్’ ప్రెస్‌లో పని చేస్తున్నాడు.
దాని యజమాని గణేశ్ శంకర్ విద్యార్థి. ఆయన గొప్ప దేశభక్తుడు. జాతీయవాది. పట్టుబట్టి గట్టి పోరాటం చేస్తేగానీ స్వాతంత్య్రం రాదని దృఢంగా నమ్మేవాడు. ఆ దిశగా పనిచేసే వారు ఎవరికైనా చేతనైన సహాయం చేసేవాడు. సర్కారీ వ్యతిరేక కరపత్రాలను, పోస్టర్లను తన ప్రెస్సులోనే రహస్యంగా అచ్చువేయించి పెట్టేవాడు. జాతీయ భావాలను ప్రచారం చేయటానికి తన ప్రెస్సు పేరు మీదే ‘ప్రతాప్’ పత్రికను ఆయన నడుపుతున్నాడు.
సన్యాల్‌గారు పంపించిన కొత్త కుర్రవాడి సమస్యను మన్మథ్‌నాథ్ గుప్తా వీలు చూసుకుని విద్యార్థిగారి చెవిన వేశాడు.
‘రేపొకసారి వచ్చి అతడిని నాకు కనిపించమను’ అన్నాడాయన.
మరునాడు తన దగ్గరికి వచ్చిన భగత్‌సింగ్ విద్యార్థికి చూడగానే నచ్చాడు. అతడు ఇతర పత్రికలకు రాసిన వ్యాసాలను చూశాక తెలివైనవాడు, చురుకైన కుర్రాడు అని అర్థమైంది. ఆసక్తి కొద్దీ వివరాలు అడిగాడు.
‘నీ పేరేమిటన్నావ్?’
‘బల్వంత్’
‘ఏం చదివావ్?’
‘బి.ఏ. ఫస్ట్ ఇయర్’
‘ఎందుకు మానేశావ్?’
‘కుటుంబ సమస్యల వల్ల’
‘ఏ భాషలు తెలుసు?’
‘హిందీ, ఇంగ్లిషు, ఉర్దూ’
‘ఎక్కడి నుంచి వచ్చావ్’
‘.. ... ..
గణేశ్ శంకర్ విద్యార్థి కాంగ్రెసులో బాగా తిరిగినవాడే. ఎఐఐసి సభల్లో భగత్ తండ్రి కిషన్ సింగ్‌ను లోగడ ఎరిగినవాడే. అయినా తన ఎదుట ఉన్నవాడు కిషన్‌సింగ్ కొడుకని ఆయనకు తెలియదు. తెలుసేమో, అందుకే గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తున్నాడేమో అని భగత్‌కి సందేహం. ఇక్కడి నుంచి త్వరగా మరలితే మంచిదని తోచి, అతడు ‘వస్తానండీ’ అంటూ ఇబ్బందిగా లేచాడు.
‘ఎక్కడికి? ఇప్పుడు ఎలా వెళతావ్?’ అన్నాడు విద్యార్థిగారు నవ్వుతూ.
భగత్‌కి గాభరా వేసింది. ఈ పెద్దాయన తనను పోల్చుకున్నాడా? తండ్రికి కబురుచేసి తనను ఇంటికి పంపించాలనుకుంటున్నాడా?
కుర్రవాడి మొగంలో కంగారు చూసి విద్యార్థి నవ్వాడు. కుర్చీలోంచి లేచి, భగత్ భుజం తట్టి-
‘మా ఆఫీసు సాయంత్రం దాకా పని చేస్తుంది. అప్పటిదాకా నువ్వూ ఉండాలి కదా? నిన్ను ఈ రోజు నుంచే మా పత్రికలో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను. ఇష్టమేనా?’ అన్నాడు అనునయంగా.
భగత్‌సింగ్‌కి ప్రాణం లేచి వచ్చింది.
‘అంతకంటేనా? అది నా అదృష్టం. కాని నాకు పత్రిక పని తెలియదు కదా?’ అని అడిగాడు.
‘నేను నేర్పిస్తాను’ అన్నాడు విద్యార్థి.
[The Life and Times of Bhagat Singh,
Mahesh Sharma, p.57-58]
అలా మొదలైంది జర్నలిస్టుగా ‘బల్వంత్’ కెరీర్.
చురుకైన వాడు కాబట్టి కొద్ది రోజుల్లోనే పత్రికా రచనలో మెలకువలు నేర్చాడు. వృత్తి నైపుణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆ రోజుల్లోనే ఢిల్లీ దర్వాగంజ్‌లో మతకలహాలు చెలరేగాయి. వాటిని కవర్ చేయటానికి ‘ప్రతాప్’ పత్రిక తరపున భగత్‌సింగ్‌ని విలేఖరిగా పంపించారు. అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించి, పూర్వాపరాలను విశ్లేషిస్తూ ‘బల్వంత్’ పేరు మీద భగత్‌సింగ్ రిపోర్టులు పంపాడు. అవి పాఠకులకు బాగా నచ్చాయి.
పేరు చాలా ఉన్నా ‘ప్రతాప్’ ప్రెస్సు స్తోమతా అంతంత మాత్రమే. భగత్‌సింగ్‌కి జీతం నెలకు పది రూపాయలు. అప్పుడున్న పరిస్థితుల్లో అతడికి అదే పదివేలు. ఉండటానికి ప్రెస్సులోనే ఒక గది ఇచ్చారు. అది కాంపౌండు లోపల ఉంటుంది. కాబట్టి బయటివాళ్ల నిఘా ఉండదు.
అందునా, ప్రతాప్ ప్రెస్సు వస్తూ పోయేవారితో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. జాతీయ వాదులు, రహస్య విప్లవకారులు తరచుగా అక్కడ కూడుతూండేవారు. గణేశ్ శంకర్ విద్యార్థి అందరితో సన్నిహితంగా ఉంటూ చేతనైన సహాయాలు చేసేవాడు. చంద్రశేఖర్ ఆజాద్, విజయకుమార్ సిన్హా, అజయ్‌కుమార్ లాంటి విప్లవ యోధులు భగత్‌సింగ్‌కి అక్కడే పరిచయమయ్యారు.
‘ఎప్పుడో 1923లో అనుకుంటా - భగత్‌సింగ్‌ని నేను మొదటిసారి కలిశాను. అప్పుడు నాకు 15 ఏళ్లు. అతడూ నా ఈడువాడే. కాన్పూర్‌లో బి.కె.సింగ్ అతడిని నాకు పరిచయం చేశాడు. పొడవుగా, సన్నగా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ముతక బట్టలు వేశాడు. చలాకీగా లేడు. తన మీద తనకు నమ్మకమూ ఉన్నట్టు తోచలేదు. వట్టి పల్లెటూరి బైతులా తోచాడు’ - అని Bhagat Singh and His Comrades గ్రంథంలో గుర్తు చేసుకున్నాడు కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు అజయ్‌కుమార్ ఘోష్.
ఉన్నది ఆరు నెలలే. అయినా కాన్పూర్‌లో రోజులు భగత్‌కి తెలియకుండానే గడచిపోయాయి. పత్రిక పని చేస్తూనే, తీరిక దొరికినప్పుడల్లా వివిధ దేశాల స్వాతంత్య్ర పోరాటాల గురించి, బోల్షివిక్ విప్లవం తరవాత సోవియట్ రష్యాలో పరిస్థితుల గురించి దొరికిన పుస్తకాన్నల్లా చదువుతూండేవాడు. భారతదేశ బానిసత్వ బంధాలు తెంచేందుకు అనుసరించవలసిన పద్ధతుల గురించి తోటివారితో తీవ్రంగా చర్చిస్తూండేవాడు.
సరిగ్గా భగత్‌సింగ్ కాన్పూర్‌లో ఉన్న సమయంలోనే (1923 చివరిలో) బెంగాల్, యు.పి. విప్లవకారులు కలిసి హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్.ఆర్.ఎ.) పేర విప్లవ పార్టీని ఏర్పాటు చేశారు. శచీంద్ర సన్యాల్ దాని నియమావళిని తయారుచేశాడు. పసుపుపచ్చ కాగితం మీద అచ్చవడంతో అది ‘యెల్లో పేపర్’గా ప్రసిద్ధి చెందింది. పార్టీ ఆశయాలను, ఆలోచనా సరళిని వివరిస్తూ ‘రివల్యూషనరీ’ పేర మేనిఫెస్టోను కూడా వెలువరించారు.
బ్రిటిషు పాలనను అంతమొందించి రాజకీయ స్వాతంత్య్రం మాత్రం సాధిస్తే సరిపోదు. మనిషిని మనిషి దోచుకునేందుకు దోహదిస్తున్న విధానాలను, వ్యవస్థలను సమూలంగా మార్చాలి. రైల్వేలు, ఇతర రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను, భారీ పరిశ్రమలను జాతీయం చేయాలి. ప్రైవేటు వ్యాపారాలకు ప్రత్యామ్నాయంగా సహకార విధానాలను ప్రోత్సహించాలి. అచ్చమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పద్ధతిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా పేర ఫెడరల్ రిపబ్లిక్‌ను ఏర్పాటు చేయాలి. దోపిడిని అంతమొందించి సిసలైన శ్రామిక రాజ్యం స్థాపించటానికి కార్మిక వర్గాన్ని సంఘటితపరచాలి. రైతులను, రైతు కూలీలనూ పోరాటానికి సమీకరించాలి.
స్థూలంగా ఇదీ కొత్త పార్టీ వైఖరి. అహింసాయుతంగానే ఉద్యమం నడపాలన్న చాదస్తపు నియమాన్ని హెచ్.ఆర్.ఎ. పెట్టుకోలేదు. ప్రభుత్వమే తెగబడి బీభత్సానికి పాల్పడుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా ఎదురు బీభత్సానికి దిగడంలో తప్పు లేదు. ప్రభుత్వ దమననీతికి హడలిపోయి, చేష్టలుడిగిన సమాజంలోని అన్ని రంగాల వారినీ కదిలించటానికి, ధైర్యం కలిగించటానికి ప్రతిహింస తప్పనిసరి కూడా - అని హెచ్.ఆర్.ఎ. మానిఫెస్టో తెగేసి చెప్పింది.
జమీందార్లకు, భూస్వాములకు, పెద్ద పరిశ్రమల వారికి, మోతుబరి వ్యాపారులకు మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తూ వారి దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తిన రైతు, కూలీ, సామాన్య వర్గాల గోడును బొత్తిగా పట్టించుకోని కాంగ్రెస్ ఒక్కటే అప్పటిదాకా జాతీయ మహాసంస్థగా చలామణి అవుతున్నది. బ్రిటిషు వారితో పోరాడుతున్నట్టు నటిస్తూ ఆచరణలో బ్రిటిషు తైనాతీగా వ్యవహరిస్తూ, బ్రిటిషు ఏజంట్లకు పొలిటికల్ ఏజంటుగా పని చేస్తున్న భారత జాతీయ కాంగ్రెసు గుత్త్ధాపత్యాన్ని బద్దలుకొట్టే దిశలో హెచ్.ఆర్.ఎ. పెద్ద అడుగు వేసింది. జాతీయ ఉద్యమానికి అది కొత్త రూపు, కొత్త ఊపు ఇచ్చింది. నవజాతి, నవ నాగరికతల నిర్మాణానికి అది సమరశంఖం ఊదింది.
భగత్‌సింగ్ ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్నది కూడా అదే. అందుకే పెట్టీపెట్టగానే కొత్త పార్టీలో చేరాడు. తనకు అప్పగించిన పనినల్లా చేశాడు. కొత్త సంస్థ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోసాగాడు.
జర్నలిస్ట్ బల్వంత్
ReplyDelete