ఉపాయం దొరికింది
భగత్‌సింగ్ - 8
===========
చినిగిన చొక్కా అయినా తొడుక్కో
కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో
ఇది అందరికీ తెలిసిన సూక్తి. కాలేజి స్టూడెంటు భగత్‌సింగు దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. కొనుక్కోవలసిన అవసరమూ అతడికి లేదు. లాలాజీ పుణ్యమా అని వెలిసిన ద్వారకాదాస్ గ్రంథాలయంలో అతడికి కావలసిన పుస్తకాలన్నీ దొరికేవి. డిగ్రీ ఇప్పించటం కంటే విద్యార్థిని విజ్ఞానవంతుడిని చేసి, చక్కటి సంస్కారం అలవరచటం ముఖ్యమన్నది లాజపత్‌రాయ్ ఆశయం. కాబట్టి కొత్తగా ఏ మంచి పుస్తకం వచ్చినా వెతికి పట్టుకుని లైబ్రరీకి తెప్పించేవారు. క్లాసులోపలా, బయట కలిసినప్పుడూ అధ్యాపకులు ప్రస్తావించే గ్రంథాలను (ప్రస్తావించని గ్రంథాలను కూడా) లైబ్రరీ నుంచి తీసుకుని చదవడానికి ఎక్కడి సమయమూ భగత్‌కి సరిపోయేది కాదు.
‘‘విప్లవకారుడు కాకుండా ఉంటే భగత్‌సింగ్ పుస్తకాల పురుగుగా మిగిలేవాడు. ఏ యూనివర్సిటీ ప్రొఫెసరో అయ్యేవాడు. ఎప్పుడు చూసినా ఓ నడిచే గ్రంథాలయంలా కనిపించేవాడు. చేతిలో పుస్తకాలు లేకుండా భగత్‌సింగ్‌ని నేను ఒక్కసారి కూడా చూడలేదు. వేసుకునే దుస్తుల మీద అతడికి ధ్యాస ఉండేది కాదు. రెండు కొసలూ భుజాల మీద వదులుగా వేలాడుతూండే చిన్న తలపాగా, మాసిన గడ్డం, చిరిగిన చొక్కా, దాని కింద అందరిలా పైజామా కాక ముతక ధోతి - ఇదీ అతడి వాలకం. చినిగిన దుస్తులే ధరించనీ, భగత్ జేబులో, చేతిలో మాత్రం ఎప్పుడూ ఏదో పుస్తకం ఉండేది’’ అంటారు అతడి సహాధ్యాయులు యశ్‌పాల్, శివవర్మలు.
దేశదేశాల నుంచి లైబ్రరీకి తెప్పించిన చరిత్ర, రాజకీయ శాస్త్రం, సాంఘిక శాస్త్రాల గ్రంథాలు, పత్రికలు, జర్నల్సు, విప్లవ సాహిత్యాన్ని భగత్‌సింగ్ సుఖదేవ్, భగవతి చరణ్ బోహరా, శివవర్మ, రామ్‌కిషన్, యశ్‌పాల్‌లు చదివి వాటిపైనా, ఇండియాలో అనుసరించవలసిన పోరాట మార్గం గురించీ తీవ్రంగా వాదోపవాదాలు చేసుకునేవారు.
అక్కడి లైబ్రేరియన్ రాజారాం శాస్ర్తీ. అతడూ ఆర్యసమాజంవాడే. అనంతర కాలంలో పెద్ద కార్మిక నాయకుడయ్యాడు. భగత్‌సింగ్ అంటే అతడికి మహా ఇష్టం. కాలేజి వదిలి విప్లవ జీవితంలో ప్రవేశించాక కూడా వారి స్నేహం కొనసాగింది. ఉరికంబం ఎక్కేంతవరకూ భగత్‌సింగ్ చదవాలనుకున్న ఎన్నో రకాల గ్రంథాలను రాజారామే ఎలాగైనా సంపాదించి పంపించేవాడు.
ఓరోజు భగత్‌సింగ్ లైబ్రరీకి వెళ్లగానే రాజారాం పిలిచి ‘ఇవ్వాళే ఈ కొత్త పుస్తకం వచ్చింది. నీకు బాగా నచ్చుతుంది’ అన్నాడు. భగత్ ఆత్రంగా దాన్ని అందుకుని చూశాడు. అది బాకునిన్ రాసిన Anarchism and other Essays.
‘పుస్తకం పేరే బాగుంది’ అని భగత్ అక్కడికక్కడే దాన్ని చదవడం మొదలెట్టాడు.
మాతృదేశ విముక్తికి ఏదో చెయ్యాలి అని భగత్‌సింగ్‌కి ఎప్పటినుంచో ఉంది. కాని ఏమి చెయ్యాలి? చేసేదేదో కొత్తగా ఉండాలి. ఇంతకుముందు దేశంలో ఎవరూ తలపెట్టనిదై ఉండాలి. దానితో పోల్చదగింది అంటూ ఇంకొకటి ఉండకూడదు. దాన్ని చూసేవాళ్లు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోవాలి. దాని ప్రభావం బ్రహ్మాండంగా ఉండాలి. దేశమంతటినీ ఒక్క ఊపు ఊపేదై ఉండాలి. జాతిజనులకు గొప్ప స్ఫూర్తినిచ్చేదై ఉండాలి. కాని - అది ఏమిటి? ఎన్నో నెలల నుంచీ మహా తీవ్రంగా ఆలోచిస్తున్నా అటువంటి అద్భుత ఉపాయం భగత్‌కి తట్టలేదు.
ఈ పుస్తకంలో అది దొరికింది.
అందులోని -Psychology of violence అనే అధ్యాయంలో ఫ్రెంచి అరాచకవాది వేలన్ వాజ్ఞ్మూలం ఉంది. అరెస్టు చేశాక జడ్జి ముందు ఇచ్చిన స్టేట్‌మెంటు అది. అంతకు ముందు అతడు ఎన్నో కార్మిక సంఘాలు పెట్టి ఎన్నో పోరాటాలు చేశాడు. బహిరంగసభల్లో ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. శాంతియుత ఆందోళనలు ఎన్నో జరిపాడు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కార్మికులను అణచివేసే సంపన్న వర్గాలు ఏమంత పట్టించుకోలేదు. వారిని కదిలించి, ఉలిక్కిపడేట్టు చేయటం కోసమే ఫ్రెంచి అసెంబ్లీలో అతడు బాంబు వేశాడు. ఆ సాహసాన్ని తాను ఏ పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందీ, ఏ ఉద్దేశంతో చేసిందీ వేలన్ తన స్టేట్‌మెంటులో ఉదాత్తంగా వివరించాడు.
అతడి కథనాన్ని చదువుతూంటే భగత్‌సింగ్ ఒళ్లు పులకించింది. మనసంతా ఉద్వేగంతో నిండింది. అతడు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నది దొరికింది.
‘ఔను. ఇదిగో ఇదే. ఎంత బాగుందో! మనమూ ఇలాగే చెయ్యాలి’ అన్నాడు భగత్ ఉండబట్టలేక బిగ్గరగా.
‘్భగత్! ఇది లైబ్రరీ’ అని గుర్తు చేశాడు రాజారాం శాస్ర్తీ. అప్పటికే గ్రంథాలయం రీడింగు రూములో ఉన్నవాళ్లు తలలెత్తి చూస్తున్నారు. చదువుకోవడానికి వచ్చినవాళ్లే కాదు; ఏమి జరుగుతున్నదో, ఎవరు ఏమి చేయబోతున్నారో కనిపెట్టటానికి వచ్చిన రహస్య పోలీసు గూఢచారులూ వారిలో ఉండవచ్చు. లాహోర్‌లో విప్లవకారులు ఎక్కువమంది ఉండటంతో, వారిలో కొందరు ద్వారకాదాస్ లైబ్రరీకి వస్తూ పోతూండటంతో దాని మీద సి.ఐ.డి.ల నిఘా బాగా ఉంది.
రాజారాం మందలింపుతో భగత్ ఈ లోకంలోకి వచ్చాడు. ఇంకేం మాట్లాడకుండా ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. మళ్లీమళ్లీ దాన్ని చదివాడు. బోలెడు నోట్సు రాసుకున్నాడు. మొత్తం 64సార్లు ఆ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి అరువు తీసుకున్నాడు. సమయం వచ్చినప్పుడు తానూ వేలన్ మార్గానే్న అనుసరించాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇక అస్తమానం ఆ ధ్యాసలోనే ఉన్నాడు.
ఫ్రెంచి వీరుడిని ఆదర్శంగా తీసుకుని ఏ సాహసం చేయాలా, దేశవాసులను ఎలా మేలుకొలపాలా అని ఇక్కడ భగత్‌సింగ్ ఆలోచిస్తూంటే - అతడిని ఒక ఇంటివాడిని ఎలా చెయ్యాలా అని అక్కడ స్వగ్రామంలో మామ్మ, తాతలు తొందరపడుతున్నారు.
అప్పటికి భగత్‌కి 16 ఏళ్లు వచ్చాయి. ఇంటర్మీడియట్ (ఎఫ్.ఎ) పాసై, బి.ఎ. చదువులోకి వచ్చాడు. ఈడొచ్చింది; ఇక వాడికి పెళ్లి చేసెయ్యాలని ఇంట్లో సణుగుళ్లు అప్పటికే మొదలయ్యాయి. ‘తరవాత చూద్దాంలే. కాస్త ఆగు’ అని తండ్రి చెప్పినా నాయనమ్మ వినలేదు. పెద్ద మనవడంటే ఆమెకు మహా ప్రేమ. తాను ఉండగానే వాడికి పెళ్లి చేసి వంశాంకురాన్ని కళ్లజూడాలని ఆమె తపన. కొడుకు ఆలోచనలు కాస్త తెలుసు కాబట్టి కిషన్‌సింగ్ తటపటాయిస్తూనే ఉన్నాడు. కాని ఇంట్లో ఏ విషయంలో అయినా పెద్దావిడదే చివరిమాట. ఆమె పట్టుబట్టేసరికి కిషన్‌సింగ్ కాదనలేకపోయాడు.
భగత్‌సింగ్‌ది మంచి ఒడ్డూ పొడుగు; స్ఫురద్రూపి; గంభీరమైన కంఠం; చలాకీ కుర్రాడు. దాంతో అతడిని ఎరిగిన వాళ్లంతా సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడ్డారు. వాటిలో మన్నావాలా ఊరి సంబంధం భగత్ కుటుంబానికి నచ్చింది. సంప్రదాయం ప్రకారం పిల్ల తరఫువాళ్లు బంగాలో అర్జున్‌సింగ్ ఇంటికి వచ్చి చూసుకుని సంబంధం విషయం కదిపారు.
ఆ సమయాన భగత్ సెలవలకు వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. అతడి మనసు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏమి చేస్తాడో, వచ్చిన వాళ్లతో ఎంత పెడసరంగా ప్రవర్తిస్తాడో అని తల్లి భయపడింది. కాని - ఆమె ఆశ్చర్యపోయేంతలా భగత్ ఆడ పెళ్లివాళ్లతో సరదాగా మాట్లాడాడు. వెళ్లేటప్పుడు తమ టాంగాలో వారిని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు.
ఆడపిల్ల వాళ్లకు అబ్బాయి నచ్చాడు. మీదే ఆలస్యం అని కబురు పంపారు. ఆ సంగతి తెలిసినా భగత్ మొహం చిట్లించలేదు. పైగా ‘వాళ్లు బాగా డబ్బున్న భూస్వాములట. ఆ ఇంటి పిల్ల మనింటికి వచ్చి మీకు సేవలు చేస్తుందా? అందునా నేనే బండితోలి వాళ్లను దిగబెట్టా కాబట్టి నన్ను టాంగావాలా అనుకుంటుందేమో’ అని తల్లిని, మామ్మను, పిన్నమ్మలను ఆటపట్టించాడు. అది చూసి అబ్బాయికీ ఆ సంబంధం ఇష్టమనే అంతా అనుకున్నారు.
పెళ్లి అనేది పెద్దలు నిర్ణయించేదే తప్ప పిల్లల ఇష్టానిష్టాలు ముందుగా అడిగి చేసేది కాదు. ఆ ప్రకారమే ‘నీకు వివాహం నిశ్చయించడమైనది. ఫలానా తేదీన బయలుదేరి రాగలవు’ అని ఒక రోజు భగత్‌సింగ్‌కు ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది.
‘ఇదెక్కడి గొడవరా బాబూ’ అని భగత్ చిరాకుపడ్డాడు. ఏదో సరదాకి అమ్మ, మామ్మలను మేలమాడాడే గాని పెళ్లి చేసుకునే ఉద్దేశం అతడికి ఎంత మాత్రం లేదు. ఇప్పుడేమి చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు. ప్రిన్సిపాల్ ఛబీల్‌దాస్‌ని సలహా అడిగాడు.
‘పోరాటానికి పెళ్ల్లి అడ్డంకి అని ఎందుకు అనుకోవాలి? ఆ వచ్చే భార్య నీ కార్యకలాపాలకు సహకరించేది అయితే బాగానే ఉంటుంది కదా? సన్‌యట్‌సేన్, కారల్ మార్క్స్, లెనిన్‌ల భార్యలు వారి వెనుక సహధర్మచారిణులుగా నిలబడలేదా?’ అన్నాడు ఛబీల్‌దాస్.
‘గురూజీ! వాదనలో మీకు ఎవరు ఎదురునిలవగలరు?’ అని నవ్వేశాడు భగత్. అతడి నిర్ణయం మాత్రం మారలేదు.
‘ఎందుకంత పట్టుదల?’ అని ఓ రోజు సహాధ్యాయుడు జయదేవ్‌గుప్తా అడిగాడు.
‘నేను ఎంచుకున్నది ముళ్లదారి. అందులో ఎన్నో కష్టాలు పడాలి. నా పినతండ్రులు ఇద్దరూ ఆ తోవనే వెళ్లారు. వారి భార్యల్లో ఒకామె వితంతువు. రెండో ఆమె భర్త ఉండీ అలాంటి బతుకే బతుకుతున్నది. వారు ఎంత క్షోభిస్తున్నారో నాకు బాగా తెలుసు. మళ్లీ అదే క్షోభను నేను ఇంకొకరికి ఎందుకు కలిగించాలి? ఏడుస్తూ బతకమని ఇంకో స్ర్తికి ఎందుకు శాపం పెట్టాలి? ఎవరు ఏమైనా అనుకోనీ! ఏదైనా కానీ! నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు’ అని కరాఖండిగా బదులిచ్చాడు భగత్‌సింగ్.
అయినా - మామ్మ ఏమనుకుంటుందో, తాత నొచ్చుకుంటాడేమో అని మనసులో ఏ మూలో అతడికి గుంజాటన లేకపోలేదు. ఆ కాస్త కూడా తొలగించినవాడు విప్లవయోధుడు శచీంద్రనాథ్ సన్యాల్. అదీ సన్యాల్ మాటల్లోనే వినండి:
భగత్‌సింగ్ తండ్రి అతడికి పెళ్లి తలపెట్టినట్టు నాకు తెలిసింది. పెళ్లాడి నేను చేసిన తప్పు భగత్‌ని చేయించకూడదని నాకు అనిపించింది. ‘అనుభవం మీద చెబుతున్నాను. పెళ్లయితే విప్లవ కార్యకలాపాల్లో మనస్ఫూర్తిగా నిమగ్నం కావటం కష్టం. భవిష్యత్తులో నీకు అప్పగించబోయే బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించలేవు. ఇక్కడే ఉంటే మీవాళ్లు నీకు పెళ్లిచేయక మానరు. ఇల్లు వదిలిపోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు మంచిది. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్పిన చోటికి వెళతావా?’ అని భగత్‌ను నిగ్గదీసి అడిగాను. భగత్ ఏ మాత్రం సందేహించకుండా ‘సరే’ అన్నాడు.
[Yugadrashta Bhagat Singh (Hindi),
Verinder Sandhu, PP.144-145]
ఇక భగత్‌సింగ్ ఆలస్యం చెయ్యలేథు. బి.ఎ. మొదటి సంవత్సరంలో ఉండగానే కాలేజి చదువుకు గుడ్‌బై చెప్పాడు. సన్యాల్ అతడిని కాన్పూర్ వెళ్లి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనమన్నాడు. భగత్‌కి చాలా ఇష్టుడైన ప్రొఫెసర్ జయచంద్ర విద్యాలంకార్ కాన్పూర్‌లో తనకు బాగా తెలిసిన గణేశ్ శంకర్ విద్యార్థికి అతడిని పరిచయం చేస్తూ ఉత్తరం ఇచ్చాడు-
ఈలోగా ఇంకో సంఘటన. పెళ్లి ఇష్టంలేదు కనుక ఇల్లు వదిలి పోదామనుకుంటున్నట్టు వారితో వీరితో కొడుకు అంటున్నాడని కిషన్‌సింగ్ చెవిన పడింది. అతడికి కోపం వచ్చింది. ‘ఏరా? నేను విన్నది నిజమేనా? కిషన్‌సింగ్ కొడుకునని, అజిత్‌సింగ్ అన్న కొడుకునని చెప్పుకుని బతకగలనని అనుకుంటున్నావేమో. బయటికి వెళితే చాలా కష్టం. తెలుసా?’ అని ఓ రోజు కొడుకును నిలదీశాడు.
ప్రేమగా మందలిస్తున్నానని కిషన్‌సింగ్ అనుకున్నాడు. కాని అతడి ఎత్తిపొడుపుతో భగత్‌సింగ్‌కి పౌరుషం పొడుచుకొచ్చింది. ఇక క్షణం జాగు చేయదలచలేదు. పెట్టేబేడా సర్దుకుని ఎవరికీ చెప్పకుండా 1923 ఆగస్టులో ఒకరోజు కాన్పూర్ బండి ఎక్కేశాడు. బయలుదేరే ముందు తండ్రి రోజూ వాడే సొరుగులో ఈ ఉత్తరం పెట్టాడు:
Respected Father
My life has been committed to a noble cause - the cause of the freedom of India. For that reason, comforts and worldly desires have no attraction in my life.
You might remember that at the time of my sacred thread ceremony, when I was quite young, Bapuji had declared that I was being pledged for the service of the country. I am therefore honouring the pledge of that time.
I hope you will excuse me
Yours Obediently
Bhagat Singh
(గౌరవనీయులైన తంఢ్రిగారికి
నా జీవితం భారతదేశ స్వాతంత్య్రం అనే గొప్ప ఆశయానికి అంకితమైంది. అందువల్ల ప్రాపంచిక కోరికలూ, సుఖాలు నన్ను ఆకర్షించలేవు.
మీకు జ్ఞాపకం ఉండొచ్చు. నాకు చాలా చిన్నవయసులో, నా ఉపనయన సందర్భంలో నన్ను దేశసేవకు అర్పిస్తున్నట్టు తాతగారు ప్రకటించారు. ఆ మాటనే నేను మన్నిస్తున్నాను.
మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను
మీ విధేయుడు
భగత్‌సింగ్)
ఉపాయం దొరికింది
ReplyDelete