పసందైన విందు
భగత్‌సింగ్ 11
‘భక్త బృందం కాలినడకన యాత్రకు వెళుతూ మీ ఊళ్లో ఆగుతుంది. కాస్త వారికి ఆతిథ్యం ఇస్తారా?’
- అని అడిగితే ధార్మిక చింతన గల స్థితిపరులు ఎవరు మాత్రం కాదంటారు?
కాని ఆ బృందం నాయకుడు కర్తార్‌సింగ్ వచ్చి తనను అడిగినప్పుడు కిషన్ సింగ్ కాస్త తటపటాయించాడు.
ధార్మిక చింతన లేకకాదు. ఆతిథ్యం ఇవ్వగల శక్తి కొరవడీ కాదు.
సాగుతున్న ఆ యాత్ర మామూలు తీర్థయాత్ర కాదు.
పంజాబ్ అంతటా తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ, తెల్లదొరతనానికి పట్టపగలే పీడకలలు తెప్పిస్తున్న గొప్ప ఉద్యమమది.
అప్పట్లో సిక్కు పవిత్ర క్షేత్రాలు మహంతులు అనబడే పెద్ద పూజారుల కబ్జాలో ఉండేవి. పూజాదికాల నిర్వహణ నిమిత్తం ఆయా క్షేత్రాలకు ఏనాడో దఖలు పడిన జాగీర్ల మీద వచ్చే అయివేజు, భక్తులు సమర్పించే కానుకలు, ఇతర విధాల రాబడి మొత్తాన్నీ వారే కాజేసేవారు. ధనబలంతో మదించి, తమ అడ్డగోలు పెత్తనాన్ని కాపాడుకోవటానికి ప్రైవేటు సైన్యాన్ని తయారుచేసుకుని, నోరెత్తినవారినల్లా కిరాతకంగా వేటాడుతూండేవారు. అక్రమంగా ఆర్జించిన సొత్తు నుంచి సర్కారు వారికీ భారీగా నజరానాలు సమర్పించి, వారి అండతో పట్టపగ్గాలు లేకుండా పేట్రేగేవారు.
సామాన్య భక్తులు పట్టినంతకాలం ఓపిక పట్టారు. అణగిమణగి ఉన్నారు. పవిత్ర గురుద్వారాలను వాటిలో పీఠం పెట్టిన పెద్దలే పాపపంకిలం చేస్తున్న తీరుకు... మతగురువుల బోధలకు విరుద్ధంగా బరి తెగించి మతాధికారాన్ని దుర్వినియోగపరుస్తున్న దుర్మార్గానికి ఒక దశలో వారి సహనం నశించింది. మహంతుల వంశపారంపర్య అక్రమ పరిపాలనను అంతమొందించి, గురుద్వారాల ఆస్తులను పబ్లిక్ కంట్రోలు కిందికి తెచ్చి, పవిత్ర మందిరాలను ప్రక్షాళన చేయడానికి అకాలీలు ఉద్యమించారు.
అదీ అత్యంత శాంతియుతంగా. సాధారణ భక్తులు ‘జథా’గా ఏర్పడి గురుద్వారా ఎదుట బైఠాయిస్తారు. గురువాణి పాఠాన్ని పారాయణ చేస్తూ గురుద్వారా నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను, అరాచకాలను వౌనంగా నిరసిస్తూ హుందాగా ప్రదర్శన జరుపుతారు.
అదే ప్రకారం ‘నంకానా సాహెబ్’ గురుద్వారా ఎదుటా భక్తుల ఆందోళన మొదలైంది. మహంత్ లందరికంటే అక్కడ ఉన్నవాడు క్రూరుడు. కిరాతకుడు. వీళ్లు తననేమి చేయగలరని అతగాడు మొదట ఉపేక్షించాడు. అరచి అరచి నోరు నెప్పిపుట్టి చివరికి వాళ్లే వెళ్లిపోతారు అని అతడు అనుకుంటే ఆందోళనకారులకు భక్తుల మద్దతు రోజురోజుకూ పెరిగింది.
తమ తైనాతీల మీద ఎదురుతిరిగే వారిని ఉపేక్షిస్తే రేపు తమ మీదా ఎదురుతిరుగుతారు; ప్రమాదకర ధోరణులను మొగ్గలోనే తుంచేయడం మంచిది - అని తలిచి బ్రిటిషు దొరతనం తప్పొప్పులను కానకుండా మహంత్ కొమ్ము కాసింది. అతడిపై తిరగబడిన వారిపై పోలీసులను, అధికారులను ఉసికొలిపి రకరకాల హింసించింది.
ఈ అణచివేత దుశ్చర్యలతో సిక్కుల గుండెలు ఇంకా మండాయి. మత విషయాల్లో వారు మహా కరకు. ఎవరినీ లెక్కచెయ్యరు. అన్నిటికీ తెగించి మహంత్ వ్యతిరేక ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేశారు. మహంత్ మండిపడ్డాడు. నిరాయుధులైన సామాన్య భక్త సమూహం మీదికి తన కిరాయి సేనను ఉసికొల్పాడు. గురుద్వారా నుంచి తుపాకులను ఎక్కుపెట్టించి బయట బారులు తీరిన ఆందోళనకారులను వరసబెట్టి చంపించాడు. అక్కడే ఉన్న బ్రిటిషు పోలీసులు ఆ ఘోరకలిని అడ్డుకోకపోగా నిరాయుధులైన భక్తుల మీద లాఠీలతో, తుపాకులతో తాము సైతం ప్రతాపం చూపించారు.
మొత్తం 139 మంది భక్తులు మహంత్ రక్తదాహానికి బలి అయ్యారు. జలియన్ వాలాబాగ్‌లో డయ్యర్ ఘోరకృత్యంతో పోల్చదగిన ఈ దారుణ దురంతం 1924 మార్చిలో జరిగింది. డయ్యర్ ఘన కార్యంలాగే దీన్నీ తెల్ల దొరతనం సిగ్గులేకుండా ఉపేక్షించింది. సామూహిక హత్యాకాండకు బాధ్యులైన వారిని శిక్షించకపోగా మొదటి ముద్దాయి అయిన మహంత్‌ను కడుపులో పెట్టుకుని కాపాడింది.
మహంత్ దుర్ణయానికి, అతడి కొమ్ముకాస్తున్న సర్కారీ దుర్నీతికి అకాలీలు ఆగ్రహోదగ్రులయ్యారు. మరునాడు సంతాపదినం పాటించి, సంతాపానికీ నిరసనకూ సూచకంగా చేతికి నల్లపట్టీ చుట్టి గురుద్వారా ఎదుట పెద్ద సంఖ్యలో ప్రదర్శన జరపాలని నిర్వాహకులు పిలుపు ఇచ్చారు.
ఆ ప్రకారమే - తెల్లవారి దమననీతికి భయపడకుండా వేల సంఖ్యలో సిక్కులు గురుద్వారా ఎదుట గుమికూడారు. వారిని ఆశ్చర్యంలో ముంచి ఆనందంలో తేల్చిన విషయమేమిటంటే సాక్షాత్తూ నాభా సంస్థానం మహారాజు రిపుదమన్‌సింగే నల్ల తలపాగా చుట్టి, చేతికి నల్ల పట్టీ వేసి, ఉద్యమ శ్రేణిలో కలిసి సర్కారీ దౌష్ట్యానికి వ్యతిరేకంగా గళమెత్తాడు.
ఇది తెల్ల రాకాసులు ఊహించని మలుపు. పంజాబ్‌లో పెద్ద సంస్థానాలైన పాటియాలా, నాభా, కపుర్తల, జింద్, ఫరీద్‌కోట్‌ల సిక్కు ప్రభువులు చిరకాలంగా బ్రిటిషు సామ్రాజ్యానికి వీర విధేయులై, తెల్లవారు ఆడమన్నట్టల్లా ఆడుతున్నారు. యువరాజుగా ఉన్నప్పుడు రిపుదమన్‌సింగ్ తల ఎగరేసినా, సామంత సింహాసనం ఎక్కాక కుర్రచేష్టలు మాని తమ ముందు రివాజు ప్రకారం మోకరిల్లుతాడని ఆంగ్లేయులు భావించారు. కథ అడ్డం తిరిగి సంస్థాన ప్రభువే తమను ధిక్కరించి, ఆందోళనకారుల్లో చేరడంతో వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రిపుదమన్‌ను రాజద్రోహిగా పరిగణించి, ఏదో ఒక వంకతో 1923 జూన్ 8న అతడి రాజ్యాధికారం లాగేసి, అరెస్టు చేసి డెహ్రాడూన్‌లో నిర్బంధించారు.
దాంతో అకాలీ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. మహంతుల వ్యవస్థను ఎత్తివేయాలనడంతోబాటు అన్యాయంగా తొలగించిన ప్రభువును నాభా గద్దె మీద తిరిగి ప్రతిష్ఠించాలన్నదీ అకాలీల డిమాండ్లలో చేరింది. మత వ్యవహారాలకు సంబంధించి మొదలైన ప్రజా ఉద్యమం ఇలా రాజకీయ రూపునూ సంతరించుకుంది. సిక్కుల అత్యున్నత మత వ్యవస్థ అయిన శిరోమణి గురుద్వారా కమిటీ పిలుపు ప్రకారం నాభా సంస్థానంలోని చరిత్రాత్మక జైతో గురుద్వారాలో పవిత్ర గ్రంథం అఖండ పాఠ పారాయణం చేస్తున్న భక్త సమూహంపై సాయుధ పోలీసులు దాడి చేసి, పారాయణం చేయిస్తున్న వాడితో సహా మొత్తం అందరినీ అరెస్టు చేశారు. అది సిక్కు విలువలకు, సంప్రదాయాలకు తీరని అపచారమని మత పెద్దలు భావించారు. స్వర్ణ దేవాలయంలోని అకాల్‌తఖ్త్ నేరుగా రంగంలోకి దిగి, ప్రభుత్వం దౌర్జన్యంగా చెదరగొట్టిన అఖండ పాఠ పారాయణాన్ని కొనసాగించడానికి 500 మంది ఒక జథా చొప్పున ఏర్పడి దశదిశల నుంచి జైతోకు తరలి రావలసిందిగా సిక్కు ప్రజానీకాన్ని ఉద్బోధించింది.
అలా మొదలైంది జైతో మోర్చా. 500 మంది వలంటీర్లతో ఒక్కో జథా కాలినడకన బయలుదేరి ముందుగా నిర్దేశించిన మార్గంలో ఎన్నో కష్టాలకు, సమస్యలకు ఓర్చి అంచెలంచెలుగా జైతో గురుద్వారా చేరసాగాయి. ఆ క్రమంలో ఐదవ జథా 1924 ఏప్రిల్ 12న ల్యాల్‌పూర్‌లో బయలుదేరనున్నది. మార్గమధ్యంలో ఫలానా రోజు రాత్రి బంగా గ్రామంలో ఆగినప్పుడు ఆతిథ్యం ఇమ్మని అడగటానికి అకాలీ జథా నాయకులు కిషన్ సింగ్ దగ్గరికి వచ్చారు.
అదీ కథ.
మరి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ముందుండే కిషన్‌సింగ్ ఎందుకు సందేహించాడు?
ఎందుకంటే బ్రిటిషు ప్రభుత్వం ఈ పాదయాత్రల ఉద్యమాన్ని తన పట్ల తీవ్ర ధిక్కారంగా, కుట్రపూరిత విద్రోహ చర్యగా పరిగణించింది. ఎట్టి పరిస్థితిలోనూ దానిని సమర్థించరాదని, పాదయాత్రికులకు ఎటువంటి సహాయమూ చేయరాదని, కనీసం వారికి ఎవరూ సంఘీభావమూ తెలపరాదని ఆయా దారుల పొడవునా ఉన్న జాగిర్దార్లకు, సర్కారీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వాటిని ధిక్కరించి, ఉద్యమకారులకు ఆశ్రయం, ఆతిథ్యం ఇచ్చేవారి మీద, వారితో అంటకాగే వారి మీద కేసులు పెట్టి, ఖైదులో వేయించి, ఆస్తులు జప్తుచేసి వీలైన మేరకు సతాయించాలనీ తెల్లదొరతనం కృతనిశ్చయమైంది. అలా ఇప్పటికే ఎన్నోచోట్ల ఎంతోమందిని పిశాచంలా పీడించసాగింది.
ఆ సంగతులన్నీ కిషన్ సింగ్‌కి బాగా తెలుసు. వారి కుటుంబం ఆర్య సమాజ సంప్రదాయానికి చెందినందువల్ల అకాలీలతో మతరీత్యా సంబంధం లేదు. అయినా వారు చేస్తున్న నియమబద్ధ, న్యాయ పోరాటం పట్ల ఆ కుటుంబంలో అందరికీ సానుభూతి ఉంది. తాను మంచిది అనుకున్న పనిని ఎవరు వద్దన్నా, ఎన్ని ఆంక్షలు పెట్టినా వదిలిపెట్టే తత్వం కాదు కిషన్‌సింగ్‌ది. కానీ జథా బంగాలో విడిది చేసే రోజు అతడు ఊళ్లో ఉండటం లేదు. అర్జంటు పని మీద రేపో మాపో బొంబయి పోవలసి ఉంది. మరి ఎలా?
దీర్ఘంగా ఆలోచించి, చివరికి ఒక నిశ్చయానికి వచ్చి-
‘సరే! నేను లేకపోయినా ఫర్వాలేదు. మా అబ్బాయి భగత్‌సింగ్ అన్నీ చూసుకుంటాడు. మీరు రావచ్చు’ అని జథేదారుతో అన్నాడు కిషన్‌సింగ్.
అప్పుడు భగత్ వయసు 17 ఏళ్లు. పల్లెటూళ్లో ఒక్కసారి 500 మందికి విడిది, తిండి ఏర్పాటు చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి ఎంతో కష్టపడాలి. ఎంతో ప్రణాళిక ఉండాలి. దాన్ని అమలు చేయడానికి మందీ మార్బలం కావాలి. అవన్నీ తన కొడుకు వల్ల నెరవేరతాయని తండ్రికి గొప్ప నమ్మకం.
ఆ నమ్మకాన్ని భగత్‌సింగ్ వమ్ము చేయలేదు. ఇదిగో వీడే నా కొడుకు; మీకు కావలసినవన్నీ వీడే ఏర్పాటు చేస్తాడు అంటూ తండ్రి అతడిని చూపించినప్పుడే, రాత్రంతా కూచుని అన్ని విషయాలు మాట్లాడగానే ఈ చలాకీ కుర్రవాడు అంత పనీ చేయగలడన్న నమ్మకం వచ్చిన వారికి కలిగింది.
వ్యవధి ఎంతో లేదు. భగత్‌సింగ్ వెంటనే రంగంలోకి దిగాడు. కాన్పూర్ నుంచి తిరిగొచ్చాక గ్రామగ్రామానా తిరిగి, హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషను సభ్యులుగా అతడు చేర్పించి, విప్లవ తత్వం నూరిపోసి తయారుచేసిన కుర్రకారు అతడికి చేదోడుగా నిలిచారు. లాహోర్‌లో, బంగాలో తానంటే ప్రాణం పెట్టే సావాసగాళ్లూ అతడికి ఎంతోమంది ఉన్నారు. అందరినీ సమీకరించి, సీరియస్‌గా పనిలోకి దిగబోతూండగా... పెద్ద చిక్కు!
భగత్‌సింగ్ తాతకు తమ్ముడి కొడుకైన దిల్బాగ్‌సింగ్ ఆ సమయాన ఆ ప్రాంతానికి జాగీర్దారుగా ఉండి, గౌరవ మేజిస్ట్రేటు హోదాను చలాయిస్తున్నాడు. అతడు తెల్లవాళ్ల తొత్తు. పైనుంచి ఆజ్ఞ వచ్చీరాగానే తన ఇలాఖాలో జథాగాళ్లకు మంచినీళ్లు కూడా పుట్టకుండా చేయాలని అతగాడు కంకణం కట్టుకున్నాడు. వాళ్లకు ఎవరైనా ఆశ్రయమిచ్చినా, తిండి పెట్టినా, నీళ్లు ఇచ్చినా, వారితో మాట్లాడినా సర్కారు వారు దానిని తీవ్ర నేరంగా పరిగణించి కఠినంగా శిక్షించగలరంటూ పోలీసులను పంపించి ఊరూరా చాటింపు వేయించాడు. గోడల మీద నోటీసులు పెట్టించాడు. వచ్చేపోయే బాటసారులు దాహం తీర్చుకోవడానికి వీలుగా ఊరిబావుల దగ్గర రివాజుగా అన్న ఊళ్లలోనూ ఉంచే తాడుకట్టిన చేదలను కూడా తీయించి వేశాడు. తెల్లదొరలు ఎలాంటి రాక్షసులో పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు. బంగా చుట్టుపట్ల గ్రామాల జనమూ ఈ నిషేధాజ్ఞలకు సహజంగా భయపడ్డారు. మనమెందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం; ఆ వచ్చే వాళ్లను అసలు పట్టించుకోకుండా ఉంటే సరి - అని అందరూ నిశ్చయించుకున్నారు.
భగత్‌సింగ్ వెళ్లేసరికి ఇదీ పరిస్థితి. ఎవరూ సహకరించకపోతే అన్ని వందల మందికి తిండీ తిప్పలూ ఎలా? ఊరంతా ఇలా బహిష్కరిస్తూ పోతే జథేదారుకు నాన్న ఇచ్చిన మాట ఏమికాను?
17 ఏళ్ల కుర్రవాడికి ఇది బెంబేలెత్తించే గడ్డు సమస్యే. ఆ మాటకొస్తే కొమ్ములు తిరిగిన ఎంతటి మోతుబరులైనా దిక్కుతోచక జుట్టు పీక్కోవలసిన చెడ్డ చిక్కే. కాని భగత్ బెదరలేదు. ఈడుకు మించిన ఒడుపుతో చాలా కూల్‌గా వ్యూహం పన్నాడు. మిలిటరీ ఆపరేషను వలె పకడ్బందీగా కథ నడిపించాడు.
మొదట తానొక్కడే ఇంటింటికీ వెళ్లి మాట్లాడాడు. రేయింబవళ్లూ అదే పని మీద ఉన్నాడు. చిన్నచిన్న గ్రూపు మీటింగులు పెట్టి సంగతి సందర్భాలు వివరించాడు. మేజిస్ట్రేటు హెచ్చరికలకు, పోలీసుల బెదిరింపులకు భయపడి ఊరకుంటే మనకే నష్టం; అకాలీలు ఉద్యమించింది మనందరి క్షేమం కోసం; మన మతాన్ని, మన హక్కులను కాపాడటం కోసం; వారికి అండగా నిలవటం మన ధర్మం; మనం గురుగోవింద్ సింగ్ వారసులం; పిరికితనం మన లక్షణం కాదు. భయం వదిలి కదలండి; ధర్మరక్షణకు లేవండి - అంటూ చక్కగా ఉద్బోధించాడు. అతడు విడమర్చి చెప్పాక జనమందరికీ నీరసం వదిలింది. ఉత్సాహం వచ్చింది. ఆవేశం పొంగింది. ఈ అబ్బాయి చెప్పేది నిజమే; ఏమైతే కానీ - ఇతడు చెప్పినట్టే చేద్దాం అని చిన్నాపెద్దా అంతా నిశ్చయించుకున్నారు.
అంత త్వరలో అంతటి మార్పును తేవటం ఒక అద్భుతం. కాని భగత్‌సింగ్ మాట్లాడే తీరు, అతడి పలుకుల్లోని నీతి, నిజాయతి జనాలను కట్టిపడేశాయి. పైగా అతడు అర్జున్‌సింగ్ మనవడు, కిషన్‌సింగ్ కొడుకు కావటం కూడా ఊరి వాళ్లకు అతడి మీద అభిమానాన్ని, నమ్మకాన్ని కలిగించాయి.
మీ వెంట మేముంటాం అని ఊరి వాళ్లతో అనిపించుకున్నాక భగత్‌సింగ్ పక్క ఊరికి వెళ్లాడు. అలా కొద్ది రోజుల్లోనే చడీచప్పుడు కాకుండా చుట్టుపట్ల గ్రామాలన్నిటినీ ఒక్క తాటి మీదికి తెచ్చాడు. పాపం ‘సర్దార్ బహదూర్’ దిల్బాగ్‌సింగ్‌కి ఈ ఆకస్మిక మార్పు తెలియదు. తన అథార్టీ ధాటికి ఇలాఖాలోని జనమంతా గజగజ వణుకుతున్నారని, పాదయాత్రల వాళ్ల మొగమైనా ఎవరూ చూడరని, గుక్కెడు నీళ్లు కూడా పోయరని, తన ప్రతాపాన్ని, రాజభక్తిని సర్కారు వారు తెగ మెచ్చుకుంటారని సంబరపడుతూ అతడు ఆదమరచి ఉన్నాడు. ఊళ్లలో ఏమవుతోందన్నది పట్టించుకోవటం మానేశాడు.
అదే భగత్‌సింగ్ కావలసింది. హెచ్.ఆర్.ఎ. జతగాళ్లను, ఊరి కుర్రాళ్లను వెంటేసుకుని మెరపులా కదిలాడు. చూస్తూండగానే ఊరి బయట కాస్త పెడగా ఉండే పొలాల్లో అనువైన స్థలాన్ని చదును చేసి డేరాలు వేశారు. నీళ్ల డ్రమ్ములను, పాత్ర సామగ్రిని, విడిదికి కావలసిన సామాన్లను హుటాహుటిన సేకరించారు. ఊరి జనం ఎవరు ఇవ్వగలిగిన వంట సంభారాలను వారు బంగాలోని అర్జున్‌సింగ్ ఇంటికి చాటుమాటున చేరవేశారు. బస్తాలను బండ్లకెక్కించి రాత్రివేళ రహస్యంగా గుడారానికి తరలించారు. ఆడామగా కష్టపడి పూలదండలు గుచ్చారు. తోరణాలు కట్టారు. యాత్రికులు ఊళ్లోకి వచ్చేలోపే అన్ని ఏర్పాట్లూ జరిగాయి. గ్రామస్థులు ఎదురువెళ్లి ఉద్యమకారులను మేళతాళాలతో స్వాగతించారు. వారి మర్యాదలను, ఆతిథ్యం ఏర్పాట్లను చూసి వచ్చినవారు ఆశ్చర్యపోయారు.
అతిథులు సేదతీరి, వేడి పాలు తాగుతూండగానే కార్యకర్తలు గాడిపొయ్యిలను అంటించారు. చుట్టుపక్కల ఊళ్ల వాళ్లూ వచ్చి వంటలకు తలా ఒక చెయ్యి వేశారు. వంటలు అవుతూండగా బయట మోర్చా బృందానికి స్వాగత సభ జరిగింది. అందులో మళ్లీ భగతే ప్రత్యేకాకర్షణ. మహంత్‌ల ఘాతుకాలను, వారికి వత్తాసునిస్తున్న సర్కారీ దుర్ణయాలను, వాటిని సమష్టిగా ఎదుర్కోవలసిన అవసరాన్ని, అమరవీరుల బలిదానాలను ఉగ్గడిస్తూ అతడు ఉత్తేజభరితంగా చేసిన ప్రసంగాన్ని యావన్మందీ చెవులొగ్గి విన్నారు.
సభా కార్యక్రమం కాగానే షడ్రసోపేతమైన విందు. అందరూ లొట్టలేస్తూ తిన్నారు.
రాత్రి భోజనాలు అయ్యాక ఎవరూ ఊహించని కొసమెరపు. అది భగత్‌సింగ్ మాత్రమే చేయగలిగిన సాహసం.
ఎక్కడి నుంచి ఎప్పుడు పట్టుకొచ్చారో తెలియదు. భగత్ సైగ చేయగానే కుర్రాళ్లు పెద్దఎత్తున బాణాసంచి సామగ్రి బయటికి తీశారు. మతాబాల వెలుగులతో, టపాకాయల చప్పుళ్లతో పరిసరాలు మారుమోగాయి. తారాజువ్వలు ఏకధాటిగా నింగికెగిశాయి. ఆ సంబరాల మోతలు, వెలుగులు పక్క ఊళ్ల వాళ్లకు కూడా వినబడ్డాయి. కనపడ్డాయి.
దగ్గర్లోని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వాళ్లు పరుగుపెడుతూ యాత్రా శిబిరానికి చేరుకున్నా వేల సంఖ్యలో అక్కడ పోగయిన జనాన్ని చూసి ఏమీ చేయలేక వెనక్కిపోయారు. హాయిగా రాత్రంతా విశ్రమించి ఉదయానే్న జథావారు ముందుకు కదిలివెళ్లారు.... ఇటువంటి ఆతిథ్యం, ఇంతటి స్వాగతం తాము కలనైనా ఊహించలేదని ఊరినీ, ఊరి కుర్రాడినీ తెగమెచ్చుకుంటూ.
లాజ్ఖ్ లయే... భగత్‌సింగ్ ప్యారేనే లాజ్ రఖ్ లయే అని పాడుకుంటూ.
పసందైన విందు
ReplyDelete