అయ్యదేవర కాళేశ్వరరావు (Ayyadevara Kaleswararao)
జననం: జనవరి 22,1882
మరణం: ఫిబ్రవరి 26,1962
అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్ర - నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.
వీరు కృష్ణా జిల్లా నందిగామ లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.
స్వాతంత్ర్యోద్యమం, సంఘసేవ
రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.
రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు.
1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
మద్రాసు శాసనసభలో
1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రేసు పార్టీ తరఫున విజయవాడ-బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించాడు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మధ్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు. 1946లో విజయవాడ నుంచి శాసనసభకు ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశం పంతులు పక్షం వహించాడు. టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కానీ ఆయన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రి పదవి కాళేశ్వరరావు ప్రభావం వల్ల లభించింది. ఆ ప్రభుత్వం ఏడాది లోపే పడిపోయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాననే ఉన్నాడు. 1947లో కాళేశ్వరరావు శాసనసభలో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టాడు.
స్పీకరుగా
స్వాతంత్ర్యానంతరం1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.
ఇతర విశేషాలు
విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఈయన పేరు మీదుగా నిర్మించారు అదే కాళేశ్వరరావు మార్కెట్.
మూలం: వికీపిడియా
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు.
ReplyDelete