Breaking News

మహానేత నేతాజీ (Netaji Subash Chandra Bose)


భారతదేశ చరిత్రపుటల్లో కీర్తికిరీటాల్లా నిలిచిపోయిన కొద్దిమంది నేతల్లో నేతాజీ ప్రముఖుడు. దాస్య శృంఖాలాల్లో మ్రగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి, నూతనోత్తేజాన్ని నింపారు. జాతీయోద్యమం వైపు ప్రజలను ఆకర్షితులను చేసి బ్రిటీష్‌వారికి సింహ స్వప్నమై సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన మహానాయకుడు మన సుభాష్‌ చంద్రబోస్‌. స్వరాజ్య స్థాపనకు ఆయన చేసిన కృషి అసాధారణం, అద్వితీయం. ఆయుధ సంపత్తితో అమాయకపు భారతీయులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆగడాలు సృష్టిస్తున్న ఆంగ్లేయుల ఆటలు కట్టించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు భారత స్వాతంత్య్రోద్యమంలో మరే నాయకుడూ చేయలేదని చెప్పడం సముచితంగా ఉంటుంది. బ్రతుకు దెరువుకు మన గడ్డపై కాలుమోపి మన బ్రతుకులను చిధ్రం చేస్తున్న తెల్లవాళ్లకు అదే పద్ధతిలో బుద్ధిచెప్ప సంకల్పించారు. పరిస్థితులు మానవుల ఆలోచనా విధానాలను మార్చివేస్తాయి. మొదట చంద్రబోస్‌కు బ్రిటీష్‌వారిని సౌమ్యంగా పంపించివేయగలమనే నమ్మకం ఉండేది. కానీ మితవాదుల అతి వినయం, అతి సహనం బోసుకు నచ్చలేదు. అతివాద నాయకుడిగా వివిధ చర్యల ద్వారా బ్రిటీష్‌ వారి గుండెల్లో నిద్రబోయారు. సామ్రాజ్యవాద దోపిడీ ప్రస్తానంలో నేతాజీ కొరకరాని కొయ్యగా మారి ఆంగ్లేయులను గజగజలాడించారు.

జానకీరాం బోస్‌, ప్రభావతి దేవి దంపతులకు భారత స్వాతంత్య్ర సమరసింహం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 1897 జనవరి 23న కటక్‌లో జన్మిం చారు. మెట్రి క్యులేషన్‌ వరకూ కటక్‌ లోనూ, గ్రాడ్యుయేష న్‌ను తత్వ శాస్త్రంలో కలక త్తాలోనూ పూర్తి చేసి ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం ఇంగ్లాండు వెళ్ళారు. ఆ పరీక్షలో నాల్గవ స్థానం సాధించిన బోసుకు భారతదేశంలో నాడు నెలకొన్న ఉద్యమ జ్వా లలు స్వాతం త్రోద్య మంలో దూకేటట్లు చేశాయి. తన రాజకీయ గురువు దేశబంధు చిత్తరంజన్‌దాస్‌ సూచనల ప్రకారం జాతీయోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1938, 1939లలో వరుసగా రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1939లో మహాత్మాగాంధీతో ఏర్పడిన విభేదాల కారణంగా భారత జాతీయ కాంగ్రెస్‌ నుంచి వైదొలగి బ్రిటీష్‌ వారి చర్యలకు తీవ్ర ప్రతిచర్యలు ఉండాలని యోచించి 1939లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించారు. ఏళ్ల తరబడి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న ప్రజలను ఆ పార్టీ బాగా ఆకర్షించింది. దోపిడీకి రుచి మరిగిన తెల్లవాళ్లకు సత్యం, అహింస, న్యాయం, స్వాతంత్య్రం అనే మాటలు రుచించవని, వారిని యుద్ధంతోనే జయించాలని విశ్వసించిన సుభాష్‌ చంద్రబోస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటీష్‌వారు భారత దేశాన్ని బ్రిటన్‌కు అను కూల యుద్ధ దేశంగా ప్రకటిం చడంతో సుభాష్‌ చంద్ర బోస్‌ ఆగ్రహం కట్టలు తెంచు కుంది. భారత ప్రజల, నాయ కుల అభి ప్రాయా లను పరిగణనలోకి తీసుకోకుండా, కనీసం సంప్రదించకుండా యుద్ధ దేశంగా ప్రకటించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. వారి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం భారత సైనికులను బలి చేయడం పాశవిక చర్యగా అభివర్ణించారు. బాహాటంగా విభేదించిన చంద్రబోస్‌ను జైలులో నిర్బంధించారు. జైలు గోడల మధ్య నిరాహార దీక్ష చేపట్టారు. 11 రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో జైలు నుంచి విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. ఆరోజు 1941 జనవరి 19. సుభాష్‌ చంద్రబోస్‌ గృహ నిర్బంధం నుంచి అదృశ్యమయ్యారు. చాలా రోజుల వరకూ కాపలా అధికారులు గుర్తించలేకపోయారు. వివిధ మార్గాల ద్వారా ఆయన కాబూల్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి అదృశ్యమై 1941 నవంబర్‌లో జర్మనీ రేడియో ద్వారా తన ప్రసంగాన్ని వినిపించి తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించారు. భారత ప్రజల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. మా 'బోసు' విదేశాల మద్దతుతో త్వరలో స్వాతంత్య్రం సిద్ధింపజేస్తారని ఆశించారు. జర్మనీ సహకారంతో ఆజాద్‌ హింద్‌ రేడియోను, మొదటి ప్రపంచ యుద్ధ ఖైదీలతో (భారతీయ) ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించారు. సుభాష్‌ చంద్రబోస్‌ను 'నేతాజీ'గా సైనికులు పిలవసాగారు. సముద్ర మార్గం ద్వారా సుమారు 400 మైళ్లు ప్రయాణించి జపాన్‌ చేరుకుని ఆ దేశ సంపూర్ణ మద్దతును పొందారు. జపాన్‌ సహకారంతో తన అనుచర సైన్యంతో 1942లో అండమాన్‌, నికోబార్‌ దీవులను చేరుకుని బ్రిటీష్‌ వారిని తరిమివేసి వాటికి స్వరాజ్‌ అండ్‌ షహీద్‌ దీవులుగా నామకరణం చేశారు. ఢిల్లీ చలో నినాదంతో తన సైనికులతో బర్మా గుండా కాక్స్‌టౌన్‌ (మణిపూర్‌) చేరుకున్నారు. అలా ముందుకు సేనలను తీసుకువెళ్తున్న సమయంలో అంటే 1945 మేలో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉంది. బ్రిటన్‌ కూటమికి జర్మనీ లొంగిపోయింది. 1945 ఆగస్టు 6న హీరోషిమాపై, ఆగస్టు 9న నాగసాకిలపై అణుబాంబుల దాడితో జపాన్‌ సైన్యం బ్రిటన్‌ కూటమికి లొంగిపోవడంతో ఆజాద్‌ హింద్‌ పౌజ్‌ ఆశలు నీరుగారిపోయాయి. వారి సైన్యాన్ని బ్రిటీష్‌ సైనికులు నిర్బంధించారు. సుభాష్‌ చంద్రబోస్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అది 1945, 18 ఆగస్టు. జపాన్‌కు చెందిన విమానం టోక్యోకు వెళుతున్న క్రమంలో ఫార్మోసా వద్ద కుప్పకూలిపోయింది. మన జాతి రత్నం చంద్రబోస్‌ ఆ విమాన ప్రమాదంలో చనిపోయి ఉండవచ్చని భావి స్తున్నారు. ఒక వీరజవాను, ఒక ప్రణాళికా కర్త, ఒక యోధుడు, ఒక వీరుడు అనుక్షణం అటు ఆంగ్లేయులను ఇబ్బందిపెడుతూ, ఇటు భారతీయులను ఆలోచింపజేసిన ఒక ఉద్యమ ప్రవాహం కనుమరుగయ్యింది. తను కలలు కన్న స్వేచ్ఛా భారతం ఆవిష్కృతం కాకమునుపే ఆకాశ జ్యోతియై ప్రపంచ యోధుల వరసలో చేరారు. భారతీయుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆశయాలు భారతీయుల్లో బలంగా నిలిచిపోయాయి. ఆయన ప్రయత్నాలు జాతీయోద్యమ నాయకులకు ఆలోచనా సందేశాలను అందించాయి. వెరసి స్వాతంత్య్ర పోరాటం సఫలీకృతమైంది. తత్ఫలితంగా స్వరాజ్య సాధన సాకారమైంది.

మాతృదేశ విముక్తి కోసం పాటుపడిన నేతాజీలో ఉన్న తపన కొంత మేరకైనా నేటి నాయకులకు ఉంటే మన దేశం సుసంపన్నం అయ్యేది. స్వార్థంతో, అత్యాశతో ఆస్తులను కూడబెట్టుకుంటున్న క్రూర రాజకీయ నేతలకు, అధికారులకు నేతాజీ జీవితం కనువిప్పు కలిగించాలి. తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన ఆ త్యాగమూర్తిని నేడు స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. 
(నేడు నేతాజీ జయంతి)

- వి. శ్రీనివాసులు.
మూలం: ప్రజాశక్తి దినపత్రిక - జనవరి 23, 2014.

2 comments: