Breaking News

జి.ఎస్.మేల్కోటే

జననం :1901 అక్టోబర్ 17- ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం
మరణం :1982 మార్చి 10


జి.ఎస్.మేల్కోటే గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు. వీరు సుబ్బుకృష్ణ దంపతులకు ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం లో 1901 అక్టోబర్ 17 విజయ దశమి రోజున జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎం.ఎస్ పరీక్షలో 1927లో మొదటి తరగతిలో మొదటివారుగా ఉత్తీర్ణులై బంగారు పతకం అందుకున్నారు. దేశీయ వైద్య విధానాన్ని, యోగాసనాల ప్రభావాన్ని జోడించి ఉత్తమ వైద్యులుగా ఖ్యాతిపొందారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాదు అధ్యక్షులుగా పనిచేశారు. వీరు పతంజలి యోగ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు.

వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. 1916లో స్వదేశీ ఉద్యమంలో మొదటిసారిగా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వద్ద మరియు కర్ణాటక రాష్ట్రంలోనూ ఉప్పు తయారుచేసి పోలీసులచే నిర్బంధితులై హింసలకు గురయ్యారు. కరాచీ కాంగ్రెస్ లో హైదరాబాదు ప్రతినిధిగా 1931 లో పాల్గొన్నారు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ సభ్యులై 1942లో క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు. 1947, ఆగష్టు 15 తేదీన జాతీయ స్వాతంత్ర్యం సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని హైదరాబాదులో ఎగురవేయటకు ప్రయత్నించి నిజాం ప్రభుత్వం చేత జైల్లో నిర్బంధించబడ్డారు. పోలీసు చర్య అనంతరం విడుదలయ్యారు.

స్వతంత్ర్య భారతదేశంలో వీరు ఎన్నో బాధ్యతాయుత పదవులు నిర్వహించారు. హైదరాబాదు శాసనసభలో 1952 నుండి 1956 వరకు సభ్యులై మొదట ప్రజా పనుల శాఖలో తర్వాత ఆర్థిక శాఖలో మంత్రి పదవి నిర్వర్తించారు. ఈయన ముషీరాబాదు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో రాయచూరు లోకసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 1962 నుండి 1977 వరకు భారత పార్లమెంటు సభ్యుడిగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వ పతినిధిగా ఆగ్నేయాసియా ప్రాంతీయ ప్రపంచారోగ్య వ్యవస్థా మహాసభ మరియు కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఐ.ఎన్.టి.యు.సి. శాఖకు వీరు అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు.

వీరి భార్య విమలాబాయి కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. వీరి మాతృభాష కన్నడం అయినా వీరు ఆంధ్రదేశానికి చేసిన సేవ గణనీయం. ఈ మహా మనిషి 1982 మార్చి 10 వ తేదీన పరమపదించారు.

1 comment: